* మార్చి నాటికి 13.63 లక్షల కోట్లకు చేరిక
దేశం ఆర్థిక అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది. కొత్త కొత్త ఆర్థిక సంస్కరణలు, కార్పొరేట్ కు ఊతమిచ్చే చర్యలతో పారిశ్రామిక, వాణిజ్య రంగం అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఇందుకు సాక్ష్యమే పెరుగుతున్న పన్ను వసూళ్లు. గత మూడేళ్లుగా పన్ను రాబడి క్రమంగా పెరుగుతూ వస్తోంది.
వ్యక్తుల ఆదాయంపై పన్ను, కంపెనీల లాభాలపై కార్పొరేట్ పన్ను, స్థిరాస్తి పన్ను, వారసత్వపు పన్ను, బహుమతి పన్ను.. వీటిని ప్రత్యక్ష పన్నులుగా వ్యవహరిస్తారు. కొవిడ్-19కి ముందు అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో వసూళ్లతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం పన్ను ఆదాయం పెరిగింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ( 2021-2022) ఇప్పటివరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 48.41 శాతం వరకు పెరిగాయి. ముందస్తు పన్ను చెల్లింపుల్లోనూ 41 శాతం వృద్ధి ఉంది. కొవిడ్-19 రెండు, మూడు విడతల వ్యాప్తి పరిణామాలు ప్రభావం చూపినా, ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుందని చెప్పడానికి ఈ వసూళ్ళే నిదర్శనం. 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 16 వరకు నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు రూ.13.63 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాకముందు అంచనా వేసిన రూ.11.08 లక్షల కోట్లు, 2022-23 బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలిపిన సవరించిన అంచనా రూ.12.50 లక్షల కోట్లను ఇప్పటికే అధిగమించాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ వసూళ్లు రూ.9.18 లక్షల కోట్లు మాత్రమే.
మార్చి 15 నాటికి ముందస్తు పన్నుల వసూళ్ళు 40.75 శాతం పెరిగి రూ.6.62 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.87 లక్షల కోట్లను రిఫండ్లుగా ఆదాయపు పన్ను విభాగం జారీ చేసింది.
మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో కార్పొరేట్ పన్నుల వాటా 53 శాతం కాగా.. వ్యక్తుల ఆదాయపు పన్ను వాటా 47 శాతంగా (షేర్లపై విధించే సెక్యూరిటీల లావాదేవీ పన్నుతో కలిపి) ఉంది. కార్పొరేట్ పన్నుల నికర వసూళ్ళు రూ.7,19,035 కోట్లుగాను, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్ళు రూ.6, 40, 588.30 కోట్లుగాను నమోదయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో స్థూల పరోక్ష పన్నుల వసూళ్ళు (మార్చి 16 నాటికి) రూ.15,50,364.20 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇనిరూ.11,20,638.60 కోట్లుగా ఉన్నాయి.
* దేశం నుంచి వస్తువుల ఎగుమతులు ఈ నెల 14 నాటికి 39,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.29.25 లక్షల కోట్లు) గా నమోదయ్యాయని కేంద్రం వాణిజ్య, పరిశ్రమ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంమీద 40,000 కోట్ల డాలర్లను అధిగమిస్తాయని అంచనా వేశారు. వాహన విడిభాగాల పరిశ్రమ తొలిసారిగా వాణిజ్య మిగులులోకి (60 కోట్ల డాలర్లు) రావడం అభినందనీయమని పేర్కొన్నారు. వాహన తయారీ సంస్థలు దిగుమతుల్ని ఆపేసి, స్థానిక ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తే బాగుంటుందన్నారు.
* 2021-22లో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు రూ.13.63 లక్షల కోట్లుగా నమోదుకావడం.. ఆదాయపు పన్ను విభాగం చరిత్రలోనే అత్యధికమని సీబీడీటీ ఛైర్మన్ జె.బి.మొహపాత్ర అన్నారు. అంతకుముందు గరిష్ఠ స్థాయి కంటే కూడా ఈ సారి వసూళ్ళు సుమారు రూ.2.5 లక్షల కోట్లు ఎక్కువని తెలిపారు. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్ళు రూ.15 లక్షల మించడం కూడా రికార్డేనన్నారు.