
ఇప్పటికే మార్కెట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఎల్ఐసీ ఐపీవోలో ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ రానుంది. ఐపీవో సైజ్ను 65 వేల కోట్లు గా నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం రూ. 21 వేలకే పరిమితం చేయాలని చూస్తోంది.
ఐపీవోను గత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావించినా, రష్యా – ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల కారణంగా వాయిదా వేసింది. పబ్లిక్ ఇష్యూ కోసం సెబీ ఇచ్చిన అనుమతులు మే 12 వరకు వర్తిస్తాయి. ఆ గడువు దాటితే మళ్ళీ కొత్తగా సెబీకి ఐపీవో ముసాయిదా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మే 2న ఐపీవోకి వచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కానీ, స్టాక్ మార్కెట్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో మదుపర్ల ఆసక్తి తగ్గిందని ప్రభుత్వం భావిస్తోంది.
కొంచెం కొంచెంగా..
ఐపీవోని రూ. 21,000 కోట్లకే పరిమితం చేయడం ద్వారా LIC మార్కెట్ విలువను రూ.6 లక్షల కోట్లకు తగ్గించే అవకాశం ఉంది. అలాగే మరో రూ. 9,000 కోట్ల విలువ చేసే షేర్లను గ్రీన్ షూ ఆప్సన్ కింద జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. రూ.21,000 కోట్లతో వచ్చినా భారత్ లో ఇదే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ అవుతుంది . ఈ మార్కెట్ ఒడుదొడుకుల్లో ఐపీవో ప్రక్రియ సాఫీగా సాగాలంటే పరిమాణాన్ని తగ్గించడమే మేలైన మార్గమని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. తద్వారా మదుపర్లు మంచి లాభాలను అందిపుచ్చుకొనే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఎక్కువ మంది పబ్లిక్ ఇష్యూ లో పాల్గొంటారు.
lic ipo size will be increase
స్పందన బాగుంటే మరిన్ని షేర్లు..
దేశీయంగా ఐపీవోలో కొత్తరకం పద్ధతిని ఎల్ ఐసీ పాటించనుంది. అంటే LIC ముందుగానే మరిన్ని అదనపు షేర్ల జారీకి సెబీ నుంచి అనుమతి తీసుకుంటుంది. ఒకవేళ మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉండి, సబ్స్క్రిప్షన్ ఊహించిన దానికంటే మించితే…ఆ అదనపు షేర్లను కేటాయిస్తారు. ఈ విధానాన్నే గ్రీన్ షూ ఆప్షన్ అంటారు. అలా LIC మరో రూ.9,000 కోట్లు విలువ చేసే షేర్లను ఐపీవో సబ్స్క్రిప్షన్ గడువు ముగిసిన తర్వాత కూడా మదుపర్లకు కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. అంటే అప్పుడు పబ్లిక్ ఇష్యూ విలువ రూ.30,000 కోట్లకు చేరుతుంది.
ఇప్పుడు గనక LIC ఐపీవోకు వెళ్లకుంటే ఆగష్టు-సెప్టెంబర్ వరకు ఐపీవో కుదరకపోవచ్చు. తాజా త్రైమాసిక ఫలితాలతో సెబీకి మళ్లీ ఐపీవో ముసాయిదా పత్రాలను సమర్పించి, ఆమోదం పొందాల్సి ఉంటుంది.