
మనం పది వేల రూపాయల లోన్ అడిగితే వంద ఎంక్వైరీలు చేస్తారు.. ఎన్నో పత్రాలు అడుగుతారు. వేల సంతకాలు చేయించుకుంటారు.. సాక్ష్యులు కావాలి, హామీలు ఉండాలి అంటూ లక్ష వంకలు పెడతారు. అన్నీ సక్రమంగా ఉన్నా అడిగినంత అప్పు ఇవ్వరు. ఇదీ బ్యాంకుల తీరు. ఇంత ఖచ్చితంగా ఉన్నప్పటికీ బ్యాంకులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నాయట. ఇది ఎలా సాధ్యం..? అంటే అది సాధ్యమే అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
కంపెనీలు పెడతామని, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నామని చెప్పి బోర్డులు తిప్పేసిన సంస్థలెన్నింటికో బ్యాంకులు అప్పులు ఇస్తాయి. తప్పుడు పత్రాలతో, నకిలీ హామీలతో వచ్చిన వారికి కోట్లలో ముట్టజెబుతాయి. వ్యాపారాభివృద్ధికి రుణం కావాలంటూ వచ్చిన బడా నాయకుల కంపెనీలకు అడ్డులేకుండా అప్పులిచ్చి తీరా కంపెనీ నష్టపోయాక కాళ్ల బేరానికి వెళ్తాయి బ్యాంకులు. ఇది ఏటా జరిగేదే అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు.
100 crores loss per month due to bank frauds
నెలకు వంద కోట్ల నష్టం..
బ్యాంకుల్లో మోసాలు, అక్రమాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మోసగాళ్ళు ఆగడాలు ఆగడం లేదు. దీంతో దేశీయ బ్యాంకులు రోజుకు ఎంత లేదన్నా సగటున రూ.100 కోట్ల వరకు నష్టపోతున్నాయి. సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయాలు వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో మొత్తం 27 షెడ్యూలు వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో ఈ 96 గోల్ మాల్ కేసులు బయటపడ్డాయి. ఈ సమయంలో మోసగాళ్ళు మొత్తం రూ.34,097 కోట్లు కొల్లగొట్టారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.4,820 కోట్ల విలువైన మోసాలు జరిగినట్టు ఆర్‌బీఐ తెలిపింది.
షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలలో ఏప్రిల్- డిసెంబర్ మద్య ఈ మోసాలు జరిగాయి. ఆర్ బీఐ జారీ చేసిన ఆదేశాలతో పాటు మోసగాళ్ళను నిరోధించడానికి అనేక చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ మంత్రి తెలిపారు. మన దేశంలో 2015 ఏప్రిల్ 1 నుంచి గత ఏడాది డిసెంబర్ వరకు బ్యాంకుల్లో రూ.2.5 లక్షల కోట్ల విలువైన గోల్ మాల్ కేసులు వెలుగులోకి వచ్చాయి.