హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఎంత ఉందో కరోనా తర్వాత చాలా మందికి తెలిసింది. మన నిత్య జీవితంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోవాలంటే అయ్యే ఖర్చు ఈ రోజుల్లో ఇంతా అంతా కాదు. కొన్ని సందర్భాల్లో అప్పులు చేయడమే కాకుండా ఆస్తులు అమ్ముకున్న పరిస్థిలను మనం చూస్తున్నాం. అధునాతన వైద్య సేవలకోసం ఏదైనా పెద్ద కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే అక్కడి బిల్లులు చెల్లించాక శారీరక ఆరోగ్యం మెరుగుపడినా, ఆర్థిక అనారోగ్యం పట్టుకుంటుంది.
why should we take health insurance
మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగ వ్యాపారాలు, చెడు వ్యసనాల వల్ల మనుషుల ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఎటువంటి చిన్న అనారోగ్యమైనా లేని వ్యక్తిని చూపించమంటే కనిపెట్టడం చాలా కష్టమే. అటువంటి అనారోగ్య పరిస్థితుల్లో మనమంతా ఇప్పడు ఉన్నాం. ఇలాంటప్పడు ఏదైనా అస్వస్థతకు గురైతే చికిత్స తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. మరి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తే అక్కడ అందే వైద్యం ఉచితం కాదు కదా. అందుకోసం మనం కొంత వెచ్చించాల్సిందే. చిన్న చిన్న చికిత్సలైతే మనం భరించగలుగుతాం. కానీ పెద్ద అనారోగ్యం, ఖరీదైన వైద్యం అయితే మనం ఎంతవరకు వెచ్చించగలం అనేది ఆలోచించుకోవాల్సిందే. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే ఇక్కడ మనకు కావాల్సింది ఇన్సూరెన్స్ . ముందుగానే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం.
ఈ రోజుల్లో అనారోగ్యం అనేది సర్వసాధారణం.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రకమైన జబ్బులు నిత్యం వేధిస్తునే ఉన్నాయి. వీటితో పాటు దీర్ఘకాల రోగాలు సదా మామూలే. అయితే మరి అలాంటప్పడు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, రోగాలకు చికిత్స చేయించుకోవడం గురించి మనం ముందస్తు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆస్పత్రిలో చేరేటప్పడల్లా డబ్బుల కోసం ఎవరో ఒకరి దగ్గర చేయి చాపడం, లేదంటే అప్పలు తీసుకోవడం అనేది చాలా కష్టమైన పని. చికిత్స కాలం మొత్తానికి డబ్బు సమకూరక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక నిపుణులు, శ్రేయోభిలాషులు ఆరోగ్య బీమాను తప్పనిసరిగా చేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ ఆరోగ్య బీమా ఎంత ఉండాలి.. ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయంపై మనం అవగాహన కలిగి ఉండాలి.
don`t touch the savings
పొదుపును కదపకూడదు
భవిష్యత్తులో మెరుగైన రాబడుల కోసం మనం పొదుపు చేస్తాం. ఈ పొదుపు సొమ్మును భవిష్యత్తు అవసరాల కోసం దీర్ఘకాల లక్ష్యంతో పెట్టుబడి పెడతాం. అనారోగ్యం వచ్చినప్పుడు ఈ డబ్బును తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. ఆరోగ్య బీమాయే దీనికి సరైన పరిష్కారం. క్యాన్సర్, బీపీ వల్ల కలిగే వ్యాధులు ఇప్పటికే మొదటి 2 అత్యధిక ఆరోగ్య బీమా క్లెయిమ్ లలో ఉండగా..
జీర్ణాశయ, శ్వాసకోశ వ్యాదులు తర్వాత స్థానంలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలా బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మన ఆరోగ్య అవసరాల నిమిత్తం, మన రాబడిని దృష్టిలో పెట్టుకుని పాలసీలను ఎంచుకోవాలి. పాలసీ ద్వారా మనకు ఎంతవరకు సాయం అందుతుంతో చూసుకోవాలి. చికిత్సకు ఆసుపత్రిలో చేరిన సమయంలో అయ్యే ఖర్చులకు మాత్రమే కాకుండా ముందుగా చేయించుకునే మెడికల్ చెకప్ లు, డాక్టర్ ఫీజులు, డాక్టర్ సూచించిన మందుల వంటి అనేక అంతర్లీన ఖర్చులు తరచుగా మీ హాస్పిటలైజేషన్ ఛార్జీలను కూడా మనం భరించాల్సి ఉంటుంది. సమాంతరంగా రోగ నిర్థారణ పరీక్షలు, పోస్ట్-సర్జికల్ లేదా ఆపరేటివ్ కేర్ లు ఉంటాయి.
వీటికి అటెండెంట్ 2 వారాలు లేక నెల పాటు పేషెంట్ ను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.
పైన తెలిపిన అంశాలన్నింటినీ కలిపి పెరుగుతున్న వైద్య ఖర్చులను బట్టి పాలసీలో మొత్తాన్ని ఎంచుకోవాలి.
health insurance coverage
వీటిని కవర్ చేయాల్సిందే
ఆరోగ్య బీమా పథకాలు అనేక రకాల అనారోగ్యాలు, పరిస్థితులను కవర్ చేస్తాయి. మీ హాస్పిటలైజేషన్ కు సంబంధించిన అనేక అంశాలకు చెందిన పాలసీలు ఉన్నాయి. ప్రీ లేదా పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జీలు, మందులు, మెడికల్ చెకప్ లు మరెన్నో ఖర్చులకు సరిపోయేలా ఆరోగ్య బీమా పాలసీలు ఉన్నాయి. ఆరోగ్య బీమాను ఎంపిక చేసుకునేటప్పుడు మీ అవసరాలకు తగినట్లుగా ప్రణాళిక వేసుకోవాలి. తగినంత ఆరోగ్య బీమా రక్షణను కలిగి ఉండటం ప్రతి ఒక్కరి ఎజెండాలో ఉండాలి. సమగ్ర ఆరోగ్య బీమా కవర్ మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులను కాపాడుతుంది. ఆరోగ్య బీమా నిపుణులు కనీసం రూ.10 లక్షల బీమాతో ఒక వ్యక్తిలేదా కుటుంబ పాలసీని కలిగి ఉండాలని సలహా ఇస్తున్నారు.
ఒక వ్యక్తి ఆదాయంలో 3-4 శాతం ఆరోగ్య బీమాకి ఖర్చు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని పాలసీలు ఏవైనా ఆకస్మిక వైద్య అవసరాలతో పాటు అంబులెన్స్ ఖర్చు, ఆసుపత్రికి వెళ్లే ముందు పోస్ట్ ఛార్జీలు మొదలైన ఖర్చులను బీమా సంస్థలు భరిస్తాయి. ఇవి ఆసుపత్రి ప్రక్రియను మరింత సులభంగా చేసి మానసిక, ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ముందుగా బీమా గురించి ఆలోచించాలని ఇన్సూరెన్స్ నిపుణులు చెబుతున్నారు. మీ పై ఆధారిపడే వారు ఎవరూ లేకుంటే జీవిత బీమాను తీసుకోవడం మానివేయవచ్చేమోగానీ, ఆరోగ్య బీమా తీసుకోవడాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదు.