ఏ కుటుంబానికైనా ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్యం అత్యంత కీలకమైన అంశం. ఆదాయం ఎంత ఉన్నా, పొదుపు ఎంత బలంగా ఉన్నా, ఒక్కసారిగా వచ్చే అనారోగ్యం మొత్తం ఆర్థిక సమతుల్యతను దెబ్బతీయగలదు. అనారోగ్యం ఎప్పుడు వస్తుందో, దాని ఖర్చు ఎంత అవుతుందో ముందుగా అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు. పైగా ఒకేసారి భారీ నగదు మొత్తాన్ని సమకూర్చుకోవడం కూడా చాలా కుటుంబాలకు కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమా , అత్యవసర నిధి కుటుంబానికి రెండు బలమైన ఆర్థిక కవచాలుగా నిలుస్తాయి. అయితే చాలామందిలో ఒక సందేహం ఉంటుంది . “ఆరోగ్య బీమా ఉంటే అత్యవసర నిధి అవసరమా?” లేదా “అత్యవసర నిధి బలంగా ఉంటే బీమా ఎందుకు?” ఈ రెండు మధ్య తేడా ఏమిటి? ఏది ఎక్కువ అవసరం? ఏది ముందు ఉండాలి? రెండూ ఎందుకు అవసరం?
అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యం – ఆర్థిక ప్రణాళికకు పునాది.. Health: The Foundation of Financial Planning
ఇల్లు, పిల్లల చదువు, పెళ్లి, రిటైర్మెంట్… ఇవన్నీ ఆర్థిక ప్రణాళికలో ముఖ్యమైన లక్ష్యాలే. కానీ ఇవన్నిటికీ మించిన ప్రాధాన్యత ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటేనే ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం కొనసాగుతుంది. అదే ఆరోగ్యం దెబ్బతింటే, ఆదాయం ఆగిపోవడమే కాకుండా, ఖర్చులు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇప్పటి వైద్య వ్యయాలు చిన్నవేమీ కావు. సాధారణంగా కనిపించే అనారోగ్యమే లక్షల రూపాయల ఖర్చుకు దారి తీస్తోంది. ఒక శస్త్రచికిత్స, ఐసీయూ చికిత్స, దీర్ఘకాల చికిత్సలు కుటుంబ ఆర్థిక వ్యవస్థనే కుదిపేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు ప్రణాళిక లేకపోతే అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది.
ఆరోగ్య బీమా అంటే ఏమిటి? What Is Health Insurance?
ఆరోగ్య బీమా అనేది ఒక ఆర్థిక రక్షణ వ్యవస్థ. మీరు ప్రతి సంవత్సరం లేదా నెలవారీగా ఒక నిర్ధారిత ప్రీమియం చెల్లిస్తే, అనారోగ్యం వచ్చినప్పుడు ఆసుపత్రి ఖర్చులను బీమా సంస్థ భరిస్తుంది. ఆసుపత్రిలో చేరడం (Hospitalization), శస్త్రచికిత్సలు, డే-కేర్ విధానాలు, ఐసీయూ చికిత్సలు, అంబులెన్స్ ఖర్చులు తదితరమైనవి ఆరోగ్య బీమా కవరేజ్‌లో ఉంటాయి. ఆసుపత్రిలో చేరే ముందు, తర్వాత కొంతకాలం వైద్య ఖర్చులు. మీరు ఎంచుకున్న సమ్ ఇన్సూర్డ్ (Sum Insured) ఆధారంగా రూ.5 లక్షలు, రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చును కూడా బీమా కవర్ చేయగలదు.
పన్ను ప్రయోజనం (Tax Benefit)
ఆరోగ్య బీమా ప్రీమియంపై ఆదాయపన్ను చట్టం కింద 80D సెక్షన్ ప్రకారం పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అంటే ఆరోగ్య రక్షణతో పాటు పన్ను ఆదా కూడా.
అత్యవసర నిధి అంటే ఏమిటి? What Is an Emergency Fund?
అత్యవసర నిధి అనేది మీరు స్వయంగా సమకూర్చుకున్న నగదు నిల్వ. అనుకోని పరిస్థితుల్లో – ఉద్యోగం పోవడం, అనారోగ్యం, కుటుంబ అత్యవసరం – వెంటనే ఉపయోగించుకునేలా ఈ నిధిని ఉంచుకుంటారు. ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం.. కనీసం 3 నుంచి 6 నెలల జీవన వ్యయాలకు సరిపడా నిధి అత్యవసర నిధిగా ఉండాలి. అయితే ఆరోగ్య ఖర్చులు ఎక్కువగా ఉండే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, చాలామంది దీనిని 6–9 నెలల వ్యయాలకు కూడా పెంచుకుంటున్నారు.
బీమా ఉన్నా అదనపు ఖర్చులు ఎందుకు వస్తాయి? Why Do Extra Expenses Arise Even with Insurance?
చాలామంది భావించేది – “బీమా ఉంది కదా, అన్ని ఖర్చులు కవర్ అవుతాయి” అని. కానీ వాస్తవం అంత సులువు కాదు. కొన్ని ప్రత్యేక చికిత్సలు, ప్రత్యామ్నాయ చికిత్సలు, పాలసీ కింద లేని పరీక్షలు, నెట్‌వర్క్ ఆసుపత్రుల వెలుపల చికిత్స వంటివి బీమాలో పూర్తిగా కవర్ కావు. ఇలాంటి సందర్భాల్లో ముందుగా డబ్బు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం వేచి ఉండాల్సి వస్తుంది. అప్పుడే అత్యవసర నిధి ప్రాముఖ్యత తెలుస్తుంది.
అత్యవసర నిధి – తాత్కాలిక ఊరట.. Emergency Fund as a Temporary Relief
ఆసుపత్రిలో చేరిన సమయంలో అనేక చిన్న కానీ తప్పనిసరి ఖర్చులు ఉంటాయి. మందులు, అదనపు పరీక్షలు, సహాయకుల ఖర్చులు, ప్రయాణ వ్యయం.. ఇవన్నీ బీమా కవర్ చేయకపోవచ్చు. అప్పుడు చేతిలో ఉన్న అత్యవసర నిధి కుటుంబానికి తాత్కాలిక ఊరటనిస్తుంది.
చిన్న క్లెయింలు – బీమాకు మంచిదా? Small Claims: Should You Use Insurance?
చిన్న జ్వరం, సాధారణ చికిత్సలకు కూడా బీమా క్లెయిం చేయడం చాలామందిలో అలవాటు. కానీ ఇది దీర్ఘకాలంలో నష్టమే. చిన్న క్లెయింల వల్ల అనేక నష్టాలు ఉంటాయి. ప్రధానంగా బోనస్/రెస్టోరేషన్ ప్రయోజనాలు కోల్పోవడం, భవిష్యత్తులో ప్రీమియం పెరగడం, క్లెయిం హిస్టరీ ప్రభావం ఉంటుంది. కాబట్టి తక్కువ ఖర్చు గల చికిత్సలకు అత్యవసర నిధిని ఉపయోగించడం మేలైన మార్గం.
కేవలం అత్యవసర నిధిపై ఆధారపడితే? What If You Rely Only on an Emergency Fund?
కొన్ని కుటుంబాలు బీమా అవసరం లేదని భావించి, పెద్ద మొత్తంలో నగదు నిల్వ ఉంచుతాయి. కానీ ఇది ప్రమాదకరం. ఒక్క పెద్ద ఆసుపత్రి చికిత్సే నిధిని ఖాళీ చేయవచ్చు. నిధి తగ్గితే తిరిగి సమకూర్చుకోవడం కష్టం. కాలక్రమేణా వైద్య ఖర్చులు పెరుగుతాయి. లిక్విడ్ నిధి ఇతర అవసరాలకు ఖర్చయ్యే ప్రమాదం. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లకు ఇది మరింత ప్రమాదం. తరచూ ఆసుపత్రిలో చేరే అవకాశం ఉండటం, ఆదాయం లేకపోవడం వల్ల అత్యవసర నిధి మాత్రమే సరిపోదు.
సీనియర్ సిటిజన్లకు ఏది ముఖ్యము? What Matters More for Senior Citizens?
వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు సహజం. పదే పదే ఆసుపత్రి ఖర్చులు రావచ్చు. ఈ సమయంలో కేవలం అత్యవసర నిధి సరిపోదు. బలమైన ఆరోగ్య బీమా అవసరం అధిక కవరేజ్, తక్కువ కో-పేమెంట్ ఉండాలి. అత్యవసర నిధి ఉండటం మంచిదే కానీ అది బీమాకు ప్రత్యామ్నాయం కాదు.
ఆరోగ్య బీమా – మొదటి రక్షణ మార్గం.. Health Insurance: The First Line of Defense
ఎలా చూసినా, పెద్ద వైద్య ఖర్చుల నుంచి కుటుంబాన్ని కాపాడేది ఆరోగ్య బీమానే. ఇది లేకుండా ఆర్థిక ప్రణాళిక అసంపూర్ణమే. పెద్ద ఖర్చులకు భద్రత, పన్ను ఆదా, కుటుంబానికి మానసిక భరోసా, అత్యవసర నిధి చిన్న, తాత్కాలిక ఖర్చులకు మాత్రమే. ఏదేమైనా ఆరోగ్య బీమా Vs అత్యవసర నిధి అనే ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటంటే… రెండూ అవసరమే. ఆరోగ్య బీమా మీ కుటుంబానికి పెద్ద వైద్య ఖర్చుల నుంచి బలమైన కవచం. అత్యవసర నిధి చిన్న, అనుకోని ఖర్చులకు తాత్కాలిక అండ. మీ ఆదాయం, కుటుంబ అవసరాలు, వయసును బట్టి రెండింటినీ సమతుల్యంగా ఏర్పరుచుకుంటే, ఊహించని ఆరోగ్య సమస్యలకైనా ఆర్థికంగా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అదే నిజమైన ఆర్థిక భద్రత.
