
మనిషి జీవనగమనాన్ని మార్చి, ఆర్థిక ఎదుగుదలను ప్రోత్సహించేది చదువు. ఒక తరం మారాలన్నా, ఒక అనామకుడు ప్రపంచ చరిత్రను మార్చాలన్నా చదువుతోనే సాధ్యం. ఎంతోమంది పేద కుటుంబాలనుంచి, కుగ్రామాలనుంచి వచ్చి, చదువుకుని, ఎక్కడో ఉన్నత విద్యలు చదివి కుటుంబాల తలరాతలు మార్చుతున్నారు. ఎంతో శ్రద్ధ, పట్టుదలతో చదువుకుంటే జీవితాలు మారుతాయనడంలో సందేహం లేదు. కానీ కొందరికి ఉన్నత చదువులు సాగించాలని ఉన్నా అందుకు తగిన వసతులు, సదుపాయాలు, ఆర్థిక సహకారం దొరకదు. అలా ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. ఇలాంటి పరిస్థితిని దాటి చదువుకోవాలంటే ఉన్న ఒకే ఒక్క అవకాశం విద్యారుణం. చదువుకోవాలనుకునే వారికి బ్యాంకులు అందించే విద్యారుణం గురించి మనలో చాలా మందికి పూర్తి అవగాహన ఉండదు. అయితే దానికి ఉండాల్సిన అర్హతలు, పరిమితులు తదితర వాటి గురించి తెలుసుకుందాం.
సాధారణంగా చదువుకోవడానికి ప్రాథమిక విద్యకు పెద్దకు ఖర్చులుండవు. కానీ ఉన్నత చదువులకు వెళ్లే సరికి అవసరాలు పెరుగుతాయి. కాలేజీ ఫీజులు, రవాణా చార్జీలు అధికంగా ఉంటాయి. మధ్యతరగతి వారికి వీటిని భరించే శక్తి ఉండదు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నత చదువులకోసం బ్యాంకులు విద్యారుణాన్ని అందిస్తున్నాయి. కొన్ని షరతులు, కొన్ని అర్హతలతో ఈ రుణాన్ని సులభంగా పొందవచ్చు.
how much amount we get as education loan
రూ. 4 లక్షల వరకూ ఎటువంటి పూచికత్తు అవసరం లేకుండానే విద్యార్థికి అవసరమయ్యే ఆర్థిక వనరులను అందించడం విద్యారుణ పథకం ఉద్దేశం. ఉన్నత విద్యకోసం రుణాలు అవసరమైనవాళ్ళు ఏదైనా జాతీయ బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. చదవాలనుకుంటున్న కోర్సు, విద్యా రుణ పథకం పరిధిలోకి వస్తుందో చూసుకోవాలి. తర్వాత కింది రుణ ప్రక్రియను పాటించాలి.
కోర్సు ఎంపిక, కళాశాల ఎంపిక పూర్తయ్యాక ప్రవేశ పత్రంతో బ్యాంకుకు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* భారతదేశంలో చదువుకునేందుకు రూ.10 లక్షల వరకు రుణం ఇస్తారు. విదేశాల్లో విద్యకోసం రూ.20 లక్షల వరకూ రుణం మంజూరు చేస్తారు.
* కోర్సు రుసుము, విద్యార్థి హాస్టల్ రుసుము, పరీక్షఫీజు, లైబ్రరీ ఫీజు, ప్రయోగశాల ఫీజు, పుస్తకాలు, కంప్యూటర్ ఖర్చులు, కాషన్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్కులకయ్యే ఖర్చులు, విదేశాల్లో చదివే వారికి ప్రయాణ ఖర్చులన్నీ విద్యారుణంలో వర్తిస్తాయి.
* కోర్సు పూర్తయిన సంవత్సరం నుంచి లేదా ఉద్యోగం వచ్చిన ఆరు నెలల సమయం నుంచి రుణ వాయిదాలను చెల్లించాలి.
* చెల్లించే వడ్డీకీ పన్ను మినహాయింపు (సెక్షన్80(ఈ)) వర్తిస్తుంది.
what is the rules to get education loan
* అర్హత పరీక్ష మార్కుల పత్రం, కళాశాల లేదా కోర్సు గుర్తింపు కార్డు, ఫీజులు, ఇతరత్రా ఖర్చుల అంచనా, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, కే వై సీ గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.
* రూ. 4 లక్షల వరకూ ఎటువంటి పూచికత్తు అవసరం లేదు.
* రూ.4 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకూ థర్డ్ పార్టీ హామీగా ఉండాలి. తల్లిదండ్రులు ఉమ్మడి రుణ గ్రహీతలుగా ఉండాలి.
* రూ.7.5 లక్షలకు మించిన స్తిరాస్థిని తనఖా పెట్టాల్సి ఉంటుంది.
* 7 నుంచి 10 సంవత్సరాల లోపు విద్యారుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
* వివిధ బ్యాంకులు విద్యారుణాన్ని అందిస్తాయి. అయితే వడ్డీ రేట్లలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఇక్కడ ఈ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు కొంత గడువు ఉంటుంది. వెంటనే చెల్లించుకునే వెసులుబాటు సదుపాయాన్ని కూడా ఎంచుకోవచ్చు.
* విద్యారుణానికి వెళ్లే ముందు మన ప్రాంతంలో ఎడ్యుకేషన్ కోసం స్కాలరషిప్‌లు ఇచ్చే సంస్థలు ఏమైనా ఉంటే తెలుసుకోవడం చాలా అవసరం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నత విద్యకు సహకారం అందిస్తుంటాయి. మంచి చురుకైన విద్యార్థులకైతే పూర్తి ఉచితంగా చదివిస్తాయి.
* కొన్ని పెద్దపెద్ద వ్యాపార సంస్థలు మెరిట్ పరీక్షలు పెట్టి ఎంపికైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఇస్తాయి. వీటితో పాటు తమే చదివించి అదే సంస్థలు ఉన్నత ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తాయి. ఈ విషయాలపైన కూడా అవగాహన కలిగి ఉండడం చాలా మంచిది.