
ఏ వస్తువు కొన్నా, ఏ షాపింగ్ మాల్ కి వెళ్లినా, ఒక టీ తాగినా.. రూపాయి నుంచి లక్షరూపాయల వరకూ నగదు బదిలీలన్నింటినీ ఒక్క క్షణంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించి మనం చేసేస్తున్నాం. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమేజాన్ పే.. ఇలా ఎన్నో మొబైల్ పేమెంట్ యాప్స్‌తో నగదు బదిలీ చాలా సులభం అయిపోయింది. నోట్లు, చిల్లర వాడకం బాగా తగ్గిపోయింది. ఈ తరం యువతకు, పట్టణ ప్రజలకు, స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు డిజిటల్ పేమెంట్ చాలా ఈజీ.. మరి గ్రామీణ ప్రాంత ప్రజలు, ఇంటర్‌నెట్ సదుపాయం లేని వారు, కీపేడ్ ఫోన్లు వాడే వారికి ఇది సాధ్యమయ్యే పని కాదు. సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చింది. కీ పేడ్ మొబైల్ నుంచి కూడా ఇకపై యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.
how to transfer money through keypad mobile
మీకు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఈ రెండు లేకపోయినప్పటికీ మనీ ట్రాన్సాక్షన్ నిర్వహించవచ్చు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) యూపీఐ ఆధారిత `UPI123 పే` ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు కేవలం స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు, అదీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వారికే యూపీఐ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ అందుబాటులో ఉంది.
కానీ ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ యూపీఐ123 పే లాంచ్ చేశారు. దీంతో దేశంలోని దాదాపు 40 కోట్లమంది ఫీచర్ పోన్ కస్టమర్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు సురక్షితంగా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.
ఇంటర్నెట్ లేకపోయినా
UPI123Pay డిజిటల్ చెల్లింపుల కోసం హెల్ప్ లైన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం స్కాన్ అండ్ పే మినహాయించి, UPI123Pay ఫీచర్ ఫోన్ కస్టమర్లకు అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫీచర్ ఫోన్ యూజర్లు ఇందుకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు. కస్టమర్లు తమ బ్యాంకు అకౌంట్‌ను ఫీచర్ ఫోన్ ను లింక్ చేసుకుంటే చాలు. గ్రామీణ ప్రాంతంలోని వారు ఫీచర్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. వారిని ఉద్దేశించి ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. ఫిజికల్ ట్రాన్సాక్షన్స్ తగ్గించేందుకు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచేందుకు గత మూడేళ్ళలో ఆర్బీఐ అనేక చర్యలు చేపట్టిందన్నారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
బ్యాంకులో నమోదైన రిజిష్టర్ మొబైల్ నుంచి *99# డయల్ చేసి బ్యాంకు ఖాతాను ఎంచుకోవాలి.
మీ డెబిట్ కార్డులోని చివరి ఆరు అంకెలను ఎంటర్ చేయాలి.
ఎక్స్ పైరీ డేట్, యూపీఐ పిన్ ఎంటర్ చేసి ధృవీకరించాలి. ఆ తర్వాత మీ సేవలను ఉపయోగించుకోవచ్చు.
మీ రిజిష్టర్ మొబైల్ నుంచి డయల్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ బ్యాంకు ఖాతా నెంబర్ సహా ఇతర వివరాలు కనిపించాలి. లేదంటే ముందుకు వెళ్ళవద్దు.
steps in money transfer through keypad mobile
— మొదట రిజిష్టర్ మొబైల్ నుంచి *99# డయల్ చేయాలి.
— స్క్రీన్ పైన డబ్బు పంపించడం కోసం సెండ్ మనీ ఆప్షన్ ఉంటుంది. దానిని ఎంచుకోవాలి. ఇందుకు 1 పైన క్లిక్ చేయాలి. మనీ రిక్వెస్ట్ కోసం అయితే 2, బ్యాలెన్స్ చెకింగ్ అయితే 3, ప్రొఫైల్ కోసం 4, పెండింగ్ రిక్వెస్ట్ ల కోసం 5, ట్రాన్సాక్షన్స్ వివరాల కోసం 6, యూపీఐ పిన్ కోసం 7 సెండ్ చేయాలి.
— నగదు పంపించడం కోసం ఆప్షన్ ఎంచుకున్నాక మొబైల్ నెంబర్ అయితే 1, యూపీఐ ఐడీ అయితే 3, సేవ్ చేసిన లబ్దిదారుని కోసం అయితే 4, IFSC కోడ్, అకౌంట్ నంబర్ అయితే 5 క్లిక్ చేయాలి. మీరు దేని ద్వారా పంపించాలనుకుంటే ఆ ఆప్షన్ ఎంచుకోవాలి.
— తర్వాత పంపించాలనుకునే వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. వారి వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. అవి ధృవీకరించాక ముందుకు సాగాలి.
— వివరాలు సరైనవి అయితే మీరు పంపించాలనుకునే మొత్తాన్ని ఎంటర్ చేయాలి.
అప్పుడు మీ ట్రాన్సాక్షన్ వివరాలు కనిపిస్తాయి. వాటిని ధృవీకరించి, యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. డబ్బు బదిలీ తర్వాత మొబైల్ నెంబర్ కు సందేశం వస్తుంది. ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోవాలి.