జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రధానంగా ఆరోగ్యం చెడిపోవడం ఎవరి చేతుల్లో ఉండదు. కానీ వ్యాధి వచ్చినప్పుడు చికిత్స ఖర్చులు మాత్రం ఊహించని భారంగా మారుతాయి. ఇలాంటి సమయంలో మనకు ఆర్థిక రక్షణనిచ్చేది ఆరోగ్య బీమా (Health Insurance) మాత్రమే. అయితే బీమా పాలసీ తీసుకోవడం ఒక్కటే కాదు సరైనది ఎంచుకోవడం, సరిగ్గా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్య బీమా అంటే కేవలం పాలసీ పేపర్ కాదు . అది జీవిత రక్షణ చిహ్నం. సరిగ్గా ఎంచుకుంటే, సరైన సమయానికి ఉపయోగిస్తే అది కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునే భరోసా అవుతుంది.
వయసు, కుటుంబం ఆధారంగా పాలసీ ఎంచుకోండి
Choose the Policy Based on Age and Family Needs
ఒకే విధమైన పాలసీ అందరికీ సరిపోదు. ఒంటరి వ్యక్తులైతే ₹5–₹10 లక్షల వ్యక్తిగత పాలసీ సరిపోతుంది. కుటుంబం ఉన్నవారు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవడం మంచిది. ఈ ఒక్క పాలసీతో కుటుంబ సభ్యులందరికీ రక్షణ ఇస్తుంది. వయోవృద్ధులు సీనియర్ సిటిజన్ పాలసీల్లో ఎక్కువ కవరేజ్, తక్కువ ఎక్స్క్లూజన్స్ ఉండే పథకం ఎంచుకోవాలి.
కవరేజ్ పరిమాణం సరిపడా ఉండాలి.. Ensure Adequate Coverage Amount
ప్రస్తుత వైద్య ఖర్చులు దృష్టిలో ఉంచుకుని కనీసం ₹10–₹15 లక్షల వరకు కవరేజ్ అవసరం.
పెద్ద నగరాల్లో (హైదరాబాద్, విశాఖ, విజయవాడ) ఒక్క ఆసుపత్రి బిల్లే ₹3–₹5 లక్షలకు చేరుతోంది.
కాబట్టి “చిన్న ప్రీమియం కట్టాలి” అనుకునే పొరపాటు చేయవద్దు. తగిన కవరేజ్ లేకపోతే పాలసీ ఉన్నా ఉపయోగం ఉండదు.
పాలసీ డాక్యుమెంట్స్ పూర్తిగా చదవాలి.. Read the Policy Documents Thoroughly
చాలామంది పాలసీ తీసుకున్న తర్వాత నిబంధనలు చదవరు. దాంతో క్లెయిమ్ సమయంలో అనేక ఇబ్బందులు వస్తాయి. “వైటింగ్ పీరియడ్”, “ప్రి ఎగ్జిస్టింగ్ డిసీజ్” వంటి నిబంధనలు స్పష్టంగా తెలుసుకోవాలి. ఎలాంటి వ్యాధులు కవర్‌లో లేవో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సంతకం చేయకముందే పాలసీ డాక్యుమెంట్ ఒక్కో పేజీ చదవాలి. అప్పుడు మాత్రమే పూర్తి రక్షణ పొందే వీలుంది.
క్యాష్‌లెస్ ఆసుపత్రులు పరిశీలించాలి.. Check for Cashless Hospitals
బీమా కంపెనీతో టై-అప్ ఉన్న ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం లభిస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో డబ్బు తడబాటు లేకుండా చికిత్స ప్రారంభించవచ్చు. కాబట్టి పాలసీ తీసుకునే ముందు, మీ ప్రాంతంలో ఉన్న నెట్‌వర్క్ హాస్పిటల్స్ జాబితా చూడాలి.
కుటుంబ సభ్యుల వివరాలు నిజాయితీగా ఇవ్వాలి .. Provide Accurate Details of Family Members
బీమా ఫారం నింపేటప్పుడు వయసు, వ్యాధి చరిత్ర, లైఫ్‌స్టైల్ వివరాలు తప్పనిసరిగా సరైనవి ఇవ్వాలి.
తప్పు సమాచారం ఇచ్చితే, క్లెయిమ్ సమయంలో పాలసీ రద్దు కావచ్చు.
పాలసీ రిన్యూవల్ ఆలస్యం చేయకూడదు .. Don’t Delay Policy Renewal
పాలసీ గడువు ముగిసిన తర్వాత 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో కూడా రిన్యూవల్ చేయకపోతే కవరేజ్ నిలిచిపోతుంది. కాబట్టి ఆటో రిన్యూవల్ సదుపాయం ఎంచుకోవడం ఉత్తమం.
టాప్-అప్ పాలసీతో అదనపు భద్రత Extra Protection with a Top-Up Policy
ప్రాథమిక పాలసీతో పాటు సూపర్ టాప్-అప్ ప్లాన్ తీసుకుంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ పొందవచ్చు. ఉదాహరణకు, ₹5 లక్షల బేసిక్ పాలసీకి ₹10 లక్షల టాప్-అప్ జోడిస్తే, మొత్తం ₹15 లక్షల రక్షణ లభిస్తుంది. ఒక్క ఆసుపత్రి ప్రవేశం ఖర్చు సగటుగా ₹1.5 లక్షలు. ఒక్కసారి బీమా లేకుండా చికిత్స చేయించుకోవడం అంటే, ఐదేళ్ల ప్రీమియానికి సమానమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
20 ఏళ్లలో ఆరోగ్య బీమా తీసుకోవచ్చా? Can You Get Health Insurance in Your 20s?
ఇది జీవితంలో మార్పుల దశ. చదువు పూర్తయి, కెరీర్ ఆరంభ దశలోకి అడుగుపెడతారు చాలామంది. ఈ వయసులో తీసుకునే నిర్ణయాలే భవిష్యత్ దిశను నిర్ణయిస్తాయి. కాబట్టి “ఇరవై” అంటే కేవలం సంఖ్య కాదు… జీవితం ప్రారంభం అవుతున్న కొత్త అధ్యాయం! జీవితానికి గ్యారంటీ ఎప్పుడూ ఉండదు. చిన్న ప్రీమియంతోనే మంచి కవర్ ఇచ్చే పాలసీలు మార్కెట్‌లో ఉన్నాయి. ఇరవైలలో కొనుగోలు చేస్తే ప్రీమియం తక్కువ, కవరేజ్ ఎక్కువ! భవిష్యత్తులో అనారోగ్యం లేదా ఎమర్జెన్సీ ఖర్చులు తలనొప్పిగా మారవు.
ముప్పై ఏళ్ల లో.. In Your Thirties…
ముప్పై ఏళ్లు జీవితంలో స్థిరత్వానికి సంకేతం! ఇది కెరీర్‌లోనూ, కుటుంబ జీవితంలోనూ కీలక దశ. ఈ వయసులో చాలామంది ఉద్యోగంలో స్థిరపడతారు, వివాహ జీవితం మొదలవుతుంది, పిల్లల భవిష్యత్తుపై ఆలోచనలు మొదలవుతాయి. అంటే… బాధ్యతల దశ ఇదే. ముప్పైల వయసులో ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి. “జాబ్ ప్రెషర్” పేరుతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ కవరేజ్ కుటుంబానికి భరోసా ఇస్తాయి.
నలభైలో.. In Your Forties…
నలభై వయసు – జీవితానికి కొత్త మలుపు. ఇప్పటికే కెరీర్ స్థిరంగా ఉంటుంది. కుటుంబం స్థిరపడుతుంది. పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువ అవుతాయి. కానీ ఈ దశలో మనం చేయాల్సింది ఒక్కటే . మన విలువ పెంచుకోవడం! ఇప్పటికే కొంత పొదుపు, పెట్టుబడులు ఉన్నవారు వాటిని సమీక్షించుకోవాలి. ఎక్కడ లాభం తక్కువగా వస్తోందో, ఎక్కడ రిస్క్ ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవాలి. అవసరమైతే కొత్త ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేయాలి. రిటైర్మెంట్ ఫండ్, పెన్షన్ ప్లాన్‌లు, లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఇప్పుడు తప్పనిసరి. నలభైల వయసులో శరీరం సిగ్నల్స్ ఇవ్వడం మొదలవుతుంది. కాబట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్, సరైన ఆహారం, వ్యాయామం తప్పనిసరి. “ఇప్పుడు ఏం అవుతుందిలే” అనే నిర్లక్ష్యం రేపటి రోజున ఖరీదుగా మారుతుంది. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆరోగ్యం, కుటుంబ స్థిరత్వం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. సరైన ఇన్సూరెన్స్ కవర్లు ఉండేలా చూసుకోవాలి.
యాభై ఏళ్లకు… By the Age of Fifty…
యాభై ఏళ్లు జీవితం అర్థాంతరానికి చేరిన వయసు కాదు. సంతోషం, స్థిరత్వం, గౌరవం కలిసే దశ!
ఇప్పటివరకు కష్టపడి సాధించినదాన్ని ఆస్వాదించాల్సిన సమయం ఇది. కానీ అదే సమయంలో భవిష్యత్ సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన దశ కూడా ఇదే. ఇప్పటికే రిటైర్మెంట్ సమయం దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇక పెట్టుబడులు “సేఫ్” మోడ్‌లోకి మార్చుకోవాలి. యాభైలలో ఆరోగ్య సమస్యలు సహజం. ఈ దశలో మెడికల్ ఎమర్జెన్సీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద మొత్తంలో హెల్త్ కవర్ ఉండాలి. ప్రీమియం ఎక్కువైనా, కవరేజ్ బలంగా ఉండటం అత్యవసరం
పదవీ విరమణ తర్వాత… After Retirement…
పదవీ విరమణ తర్వాత కొత్త జీవితం ప్రారంభమవుతుంది. నిజమైన స్వేచ్ఛా జీవితం అప్పుడే మొదలవుతుంది. ఉదయం ఆఫీస్ టైం లేదు, ప్రెషర్ లేదు, ఫైళ్ళ భారం లేదు — ఇప్పుడు సమయం మొత్తం మీదే! రిటైర్మెంట్ తర్వాత ప్రధాన ఆదాయం పెన్షన్ లేదా సేవింగ్స్. కాబట్టి, వాటిని సరిగ్గా వినియోగించుకోవడం అత్యంత ముఖ్యం. నెలవారీ ఖర్చులను లెక్కపెట్టి, ఒక ఫిక్స్‌డ్ బడ్జెట్ సిద్ధం చేయాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించి, వైద్య ఖర్చులకు ప్రాధాన్యం ఇవ్వాలి. పదవీ విరమణ తర్వాత శరీరంలో మార్పులు సహజం. క్రమం తప్పని వ్యాయామం, హెల్తీ డైట్, రెగ్యులర్ చెకప్ — ఇవే బలమైన ఆయుధాలు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం కూడా మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం.
జీఎస్టీ తొలగింపు తర్వాత… After GST Removal…
ఇటీవల ప్రభుత్వం ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ (GST) తొలగింంచింది. ఇప్పటివరకు ఇన్సూరెన్స్ ప్రీమియంపై 18 శాతం వరకు జీఎస్టీ విధించబడుతుండేది. ఈ భారాన్ని తొలగించడం వల్ల మధ్యతరగతి, వృద్ధులు, ఉద్యోగ వర్గాలకు ఊరట లభించింది. ఉదాహరణకు ₹25,000 ప్రీమియం ఉన్న పాలసీపై ముందుగా ₹4,500 వరకు జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు అది పూర్తిగా మినహాయించబడడంతో అదే పాలసీ ₹25,000కే లభిస్తుంది. అంటే, సుమారు 15–18 శాతం వరకూ నేరుగా ఆదా అవుతోంది. వృద్ధులు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుండేది. ఒక ఏడాదికి ₹50,000 ప్రీమియం ఉన్న పాలసీపై ముందు ₹9,000 వరకు జీఎస్టీ ఉండేది. ఇప్పుడీ భారమంతా తొలగిపోయింది. ఫలితంగా ఎక్కువ కవరేజ్ తీసుకోవడం సులభమైంది. జీఎస్టీ తొలగింపుతో ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉత్సాహంగా ఉన్నాయి. కొత్త కస్టమర్లు పెరుగుతారని అంచనా. ఇప్పటివరకు “ప్రీమియం ఎక్కువ” అనే కారణంతో వెనుకడుగు వేసిన వారు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఆరోగ్య బీమాపై ఆసక్తి చూపిస్తున్నారు.
