
ఇటీవల కాలంలో కార్పోరేట్ సంస్థలు ప్రజల చేత మరిన్ని వస్తువులను కొనిపించేందుకు వాళ్లకు రుణాలను ఎరగా వేస్తున్నాయి. క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే డిస్కౌంట్ ఇవ్వడం, స్మాల్ ఫైనాన్స్ కంపెనీల చేత వడ్డీలేని ఈఎంఐల ద్వారా చెల్లించుకునే వెసులుబాట్లు ఇవ్వడం, లేదా ఇప్పడు కొని తర్వాత చెల్లించండి అంటూ ప్రచారం చేస్తు వినియోగదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. వీటి మాయలో పడిన సగటు మధ్యతరగతి ప్రజలు ఈ వస్తువులను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే వీటిని కొనేటప్పడు బాగానే ఉన్నా, తర్వాత కొన్ని రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.
మనం ఎప్పడూ రుణం తీసుకోలేదు.. ఎక్కడా ఎటువంటి ఈఎంఐలు కూడా బాకీ లేము.. కానీ ఉన్నట్టుండి క్రెడిట్ స్కోర్ తగ్గిపోయింది అనుకుందాం. అప్పడు ఎలా..? ఇలాంటి పరిస్థితి ఇటీవల కొద్ది మంది ఎదుర్కొంటున్నారు. బీఎన్‌పీఎల్ రుణాలకు సైనప్ చేసుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ కామర్స్ సైట్స్‌లో మనం లాగిన్ అయి ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు ఇప్పుడు కొని తరువాత చెల్లించేందుకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. బాగుంది కదా అని మనం అక్కడ క్లిక్ చేసి సైనప్ అవుతాం. కానీ అక్కడ మనం రుణం తీసుకోలేదు, వస్తువు కొనలేదు. కానీ అది రుణం తీసుకున్నట్లుగా సిస్టంలో అప్‌డేట్ అవుతుంది. రుణం తీసుకోకపోవడం వల్ల మనం తీర్చలేము. కాబట్టి ఇది క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితికి పరిష్కారమేమిటంటే ఇటువంటి రుణాలను తీసుకునే ముందు పూర్తిగా అధ్యయనం చేయడమే. అన్నింటికీ పర్మిషన్ ఇవ్వకుండా ఉండడమే.
ఒక్క రూపాయి కట్టక్కర్లేదు.. వడ్డీ కూడా లేదు. ఇప్పుడే వస్తువు తీసుకోండి, తర్వాత డబ్బులు ఇవ్వండి. ఇదే ` బై నౌ పే లేటర్` విధానం. ఇలాంటి ఆపర్లు ఇప్పుడు తరుచూ వినిపిస్తున్నాయి. ఆన్‌లైన్ అంతా ఇదే మోత. ఆకర్షనీయం, లాభదాయకమే అయినా ఇందులో ఉండే లొసుగులు మనల్ని నిండా ముంచేస్తాయి. జాగ్రత్తగా లేకుంటే అంతే సంగతులు.
WHAT IS BNPL LOANS
మన బ్యాంక్ ఖాతాలో రూపాయి లేకపోయినా మన కొనుగోళ్ళకు వీలు కల్పించేది క్రెడిట్ కార్డ్. ఇప్పటికే మన దేశంలో క్రెడిట్ కార్డ్ విస్తరణ చాలా ఎక్కువగా ఉంది. దీనినే అవకాశంగా తీసుకుని ఫిన్ టెక్ సంస్థలు బీఎన్ పీఎల్ రూపంలో మార్కెట్లోకి వస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ పై వచ్చేది రుణమే. బై నౌ పే లేటర్ రూపంలో వచ్చేది కూడా రుణమే. రెండింటిపై వడ్డీ ఉండదు. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకునేటప్పడు ఈ కామర్స్ సంస్థలు సైతం ఈ తరహా వెలుసుబాటు ఇస్తున్నాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ మధ్య పోటీ వల్ల పుట్టుకొచ్చిన కొత్త సాధనమే ఈ బీఎన్‌పీఎల్. బీఎస్ఎన్ఎల్ రూపంలో లభించే క్రెడిట్ తక్కువ మొత్తమే కాని అది మనం సరిగ్గా నిర్వహించకపోతే తెలియకుండానే మన దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు పోతాయి. ఇందులో 15-30 రోజుల వరకు వడ్డీ ఉండదు. ఒకవేళ మనం మర్చిపోతే వారు విధించే వడ్డీల భారం భరించలేం. ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
how much high charges on BNPL loans
సకాలంలో చెల్లించకపోతే చార్జీల మోతే
ఇచ్చిన గడువులోపు ఇచ్చిన రుణాన్ని చెల్లించకపోతే తర్వాత భారాన్ని మోయల్సి రావచ్చు. గడువు దాటితే మిగిలిన బ్యాలెన్స్ మొత్తం పై 10-30 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. గడువు తర్వాత చెల్లించేవారు వడ్డీకి అదనంగా లేట్ ఫీజు కట్టాలి. కన్వీనియన్స్ ఫీజు పేరుతో నెలవారీ ఖర్చుపై 1-3 శాతం మధ్య వసూలు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. ఓలా పోస్ట్ పెయిడ్, జెస్ట్ మనీ, ప్లిప్ కార్ట్, అమెజాన్ పే లేటర్, యూని, పేటీఎం పోస్ట్ పెయిడ్, స్లైస్, యూనికార్డ్స్ ఇలా ఎన్నో సంస్థలు బై నౌ పే లేటర్ పేరుతో క్రెడిట్ ను ఆఫర్ చేస్తున్నాయి.
రుణ సదుపాయం
ఆన్ లైన్ లో వస్తువుల కోసం బీఎన్ పీఎల్ తో ఆర్డర్ చేయవచ్చు. నిర్ణీతకాలంలో వడ్డీ లేకుండా తీర్చేయాలి. ఇది ఆన్ లైన్ రుణం. దీంతో ఆన్ లైన్ లో ఈ సదుపాయాన్ని వినియెగించినవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. క్రెడిట్ కార్డ్ పై రూ.లక్షల రుణ సదుపాయం లభిస్తుంది. కానీ బీఎన్ పీఎల్ అలా కాదు. ఇవి చిన్న రుణాలు. ఎక్కువగా రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య రుణం సదుపాయం ఉంటుంది. వీటిని స్మాల్ టికెట్ లోన్స్ గా అంటారు.
* పేమెంట్ ఆప్షన్ పేజీలో బీఎన్ పీఎల్ ఫీచర్ కనిపిస్తుంది. ఈ సదుపాయం కోసం కస్టమర్ ఆయా ప్లాట్ పామ్ లపై ముందుగానే రిజిష్టర్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి యాక్టివేట్ అయితే అది మన క్రెడిట్ రిపోర్ట్ లో రుణంగానే ఉంటుంది. ఇందులో రుణం ఒక్కసారిగా తీర్చలేకపోతే ఈఎమ్ఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ సెక్యూరిటీ లేని రుణం గడువులోపు తీర్చేయడం మంచిది. లేదంటే క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. కొన్ని సంస్థలు ఎటువంటి వడ్డీ లేకుండా బిల్లు మొత్తాన్ని 3,4 నెలల సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. కస్టమర్ రిజిస్టర్ చేసుకున్న ఒక రుణం కింద వారి క్రెడిట్ రిపోర్ట్ లో చేరుతుంది. కొద్ది బ్యాలెన్స్ కోసం బీఎన్ పీఎల్ ను వాడేసుకుని మర్చిపోయారనుకోండి. ఇలా ఒకటికి మించిన రుణ సదుపాయాలు అన్నీ కలసి తలనొప్పిగా మారొచ్చు. క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. దీనికంటే క్రెడిట్ కార్డ్ మంచి సాధనం అవుతుంది. 30-45 రోజుల క్రెడిట్ పీరియడ్ తో వస్తుంది. కావాలంటే ఈఎంఐ కిందకు బ్యాలెన్స్ను మార్చుకోవచ్చు. రుణ పరిమితి అధికంగా ఉంటుంది.
అయితే ఇలాంటి కొనుగోళ్ల విషయాల్లో మధ్యతరగతి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఇక్కడ మనం పొదుపు పాటించకపోతే నష్టపోతాం. కనిపించిన ప్రతి వస్తువును కొనాలనుకుని ఎగబడితే మనం కార్పొరేట్ల మాయలో పడినట్టే. మనల్ని పూర్తిగా దోచుకుని అవసరం లేని వస్తువులను కూడా మనకు కట్టబెడతారు. అందుకే మనం ఆచీతూచి, అవసరమైన వస్తువులను మత్రమే కొనుగోలు చేయాలి. అందుకు మన బడ్జెట్‌కు తగ్గట్టుగానే ఖర్చుపెట్టాలి. లేదా సులువైన రుణ సాధనాలను మాత్రమే ఎంచుకోవాలి. లేదంటే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.