
సాధారణంగా మనం ఇన్సూరెన్స్ అంటే ఎవరో చెప్పారని, ఏదో ఒకటి తీసేసుకుందాం అనుకుంటాం. కానీ ఇన్సూరెన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు టర్మ్ ఇన్సురెన్స్, ఎండోమెంట్ పాలసీల అంటే ఏమిటో ఓ సారి తెలుసుకుందాం. ఏది బెస్ట్ అనే దానికి సరైన సమాధానం మనం చెప్పలేం, కానీ దేని ఉపయోగాలు దానికి ఉంటాయి.
ఇన్సూరెన్స్ ప్రధాన ఉద్దేశం జీవితానికి భరోసా ఇవ్వడం. మన భవిష్యత్తులో రాబోయే విపత్తులను దృష్టిలో ఉంచుకుని ముందునుంచి జాగ్రత్త పడడం. వీటిని ఎంచుకునే ముందు మన అవసరాలు ఏంటి, జీవితానికి ఎంత రావాలని కోరుకుంటున్నామో ఓసారి లెక్క వేసుకోవాలి. దానిపై ఓ క్లారిటీ వచ్చాక అప్పుడు నిర్ణయం తీసుకోవాలి.
మనం కుటుంబ భద్రత కోసం..
ఇన్సురెన్స్ లో ప్రధానంగా ఉండేవి ఎండోమెంట్, టర్మ్ పాలసీలు ఉంటాయి. వీటిలో ఏది ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో చూద్దాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఖచ్చితంగా మనం ఊహించలేం. మార్కెట్లలోని వివిధ ఆర్థిక సాధనాలు పెట్టుబడుదారులకు పెట్టుబడి, సేవింగ్స్ మార్గాలను అందించడం ద్వారా భవిష్యత్తులో భద్రతను ఇస్తాయి. మనకు ఆర్థిక ఇబ్బందులలో ఇది ఉపయోగపడుతుంది. కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే అందించేవి కొన్ని, ఇన్సూరెన్స్‌తో పాటు అదనపు ఆర్థిక ప్రయోజనం అందించేవి కొన్ని ఉంటాయి.
టర్మ్ ఇన్సురెన్స్…
టర్మ్ ఇన్సురెన్స్ అనేది నిర్దిష్టకాలం పాటు రక్షణ కవరేజీని అందించే ఆర్థిక రక్షణ సాధనం. ఈ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని అతని డెత్ సర్టిఫికెట్ ఆధారంగా అతని కుటుంబ సభ్యులు పొందడానికి అర్హులు. తర్వాత ఎలాంటి సర్వైవల్ బెనిఫిట్స్ లేదా రాబడి ఉండదు. కాబట్టి ఇదో లైఫ్ కవరేజీ కోసం తీసుకునే బీమా సాధనం. ఇందులో మనం టర్ముల వారీగా ప్రీమియం కట్టుకుంటూ పోవాలి. మనం కట్టిన నెల లేదా సంవత్సరంలో మాత్రమే బీమా ప్రయోజనం ఉంటుంది. ఒక వేళ మనం ఆ నెల ఆపేస్తే అక్కడితో అది ఆగిపోతుంది. ఈ తరహా ఇన్సూరెన్స్ లో తక్కువ ప్రీమియం ఉండి ఎక్కువ కవరేజీ ఉంటుంది. అంటే నెలకు రూ. 500 చెల్లిస్తూ మనకు ఏదైనా జరిగి చనిపోతే సుమారు 50 లక్షల వరకూ కవరేజీ పొందవచ్చు. మనకు ఏమీ జరగకపోతే మనం చెల్లించిన ప్రమీయంలలో రూపాయి కూడా వెనక్కు రాదు.
ఎండోమెంట్ పాలసీ అంటే..
ఎండోమెంట్ పాలసీ అంటే ఆర్థిక సంక్షోభ సమయాల్లో రక్షణ, పెట్టుబడి పెట్టిన డబ్బు సకాలంలో వృద్ధి రెండింటినీ అందించే బీమా కమ్ పెట్టుబడి సాధనం. ఈ పాలసీలో నిర్ణీత కాలపరిమితికి ప్రీమియం చెల్లించాలి. కాలపరిమితి తర్వాత బీమా తీసుకున్న వ్యక్తి జీవించి ఉంటే ఏకమొత్తం కవరేజీ చేతికి వస్తుంది. ఒక వేళ వ్యక్తి చనిపోతే బీమా కవరేజీ మొత్తం లేదా సమ్ అస్యూర్డ్, బోనస్ సహా డెత్ బెనిఫిట్ కింద నామినీకి ఇస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎండోమెంట్ పాలసీల మీద రాబడి ఉంటుంది. లైఫ్ కవరేజీతో పాటు బోనస్ రూపంలో సొమ్ము వస్తుంది. మృతి చెందితే కుటుంబాన్ని ఆదుకుంటుంది. కాబట్టి కుటుంబ అవసరాలు, ఆదాయాలకు అనుగుణంగా వీటిని ఎంచుకోవాలి. కాకపోతే ఇందులో ఏ ఒక్కటీ సరిపడినంత ఉండదు. ఇన్సూరెన్స్ కవరేజీ తక్కువ ఉంటుంది, ఆర్థిక రాబడి కూడా తక్కువగానే ఉంటుంది.