
what is the need of emergency fund
కరోనా కాలంలో మనం చాలా విపత్కర పరిస్థితులను చూశాం. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడ్డారు. ఉన్నట్టుండి పని కోల్పోయి ఆదాయం ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితిలో కనీస అవసరాలకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ పస్తులుండాల్సిన పరిస్థితులు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఇది కేవలం కరోనా కాలానికే కాదు, ఎటువంటి అత్యవసర పరిస్థితిలోనైనా ఉన్న ఫలంగా డబ్బులు కావాలంటే మనం వెతుక్కోవాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలకి పరిష్కారమే అత్యవసర నిధి.
why emergency fund important
మనకు అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అవసరం వచ్చినపుడు చూసుకుందాం అని అంటే అన్ని సందర్భాల్లో కుదరదు. మనకి అనారోగ్య కారణంగా ఆసుపత్రి చేరడమే అత్యవసర పరిస్థితి అనుకుంటాం. అది ఒక్కటే కాదు. దీంతో పాటు ఎన్నో ఇతర ఆర్థిక అవసరాలు ఉంటాయి. వాటిని తట్టుకునేందుకూ మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇంట్లో ఏవైనా వస్తువులు అనుకోకుండా పాడైపోవచ్చు లేదా అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రాంతానికి వెళ్లాల్సిన పని పడొచ్చు. కొంతకాలం ఆదాయం ఆగిపోవచ్చు. ఇలాంటి టైమ్ లో మన దగ్గర డబ్బులు అందుబాటులో పెట్టుకోవాల్సిందే. డబ్బు అవసరం ఉంటే … స్నేహితులు, బంధువుల నుంచి తీసుకుంటాం అని అనుకుంటారు. కానీ ఇది అన్నీ సందర్భాల్లో సరికాదు. దీని వల్ల ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవలిసి వస్తుంది. మానసికంగానూ ఒత్తిడి ఏర్పడుతుంది. అప్పటికప్పుడు క్రెడిట్ కార్డ్ పై రుణం తీసుకున్నా ఎక్కువ వడ్డీ ఉంటుంది.
పొదుపును కదప కూడదు…
మనం పెట్టుబడులను వెనక్కి తీసుకొని డబ్బు అవసరం తీర్చుకోవచ్చు. మన పెట్టుబడులు షేర్లలో ఉంటే మనకి అవసరమైనపుడు మార్కెట్ ధర తగ్గితే అప్పుడు మనం నష్టానికి అమ్ముకోవాల్సిందే. దీనివలన మనం అనుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోలేం.
అందువల్ల కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును మనం దాచుకోవాలి. గృహ రుణం, ఇతర రుణాల ఈఎంఐలనూ లెక్కలోకి తీసుకోవాలి. సిప్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఆదాయం ఆగిపోయినపుడల్లా ఆ పెట్టుబడులను కొనసాగిస్తామా లేదా అని నిర్ణయించుకోవాలి. దానిని బట్టి మన డబ్బులను దాచుకోవాలి. వీలైనంత వరకూ కొనసాగించేందుకే నిర్ణయం తీసుకోవాలి.
how to accumulate emergency fund
క్రమంగా పోగు చేసుకోవాలి..
ఒకేసారి మొత్తం డబ్బును మనం పోగు చేయలేం. అందుకే కొన్ని నెలలపాటు దీన్ని జమ చేయాలి. బోనస్ లు, ఇతర ప్రయోజనాలు లభించినపుడు కొన్నాళ్ళపాటు ఈ నిధి కోసం పక్కన పెట్టాలి.
అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం ఒక్కటే కాదు. దాన్ని సులభంగా వెనక్కి తీసుకునే ఏర్పాటు ఉండాలి. కేవలం మన ఒక్కరికే దాని గురించి తెలియడం వల్ల ఉపయోగం ఉండదు. మన జీవిత భాగస్వామి, పిల్లలు,తల్లిదండ్రూలకూ దీని గురించి వివరాలు తెలియాలి. లేకపోతే అత్యవసరం వచ్చినపుడు ఏం చేయాలో తెలియకపోవచ్చు. దీని వల్ల మొత్తం ప్రయోజనం దెబ్బతింటుంది.