బ్యాంక్ అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, కస్టమర్లకు అవసరం లేకున్నా ఆర్థిక ఉత్పత్తులు, సేవలను అంటగట్టే మిస్సెల్లింగ్ (Bank Mis-selling)కు ఇక చెల్లెలు పడనుంది. బ్యాంకుల విక్రయ విధానాల్లో దాగి ఉన్న లోపాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి కొరడా ఝుళిపించింది. మిస్‌సెల్లింగ్‌కు దారితీసే ప్రోత్సాహకాలు, ఒత్తిళ్లు, తప్పుదారి పట్టించే ప్రచారాలకు చెక్ పెట్టే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. తన పరిధిలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అనుసరించాల్సిన ఆర్థిక ఉత్పత్తులు, సేవల ప్రచారం, మార్కెటింగ్, విక్రయాల మార్గదర్శకాల సవరణ ముసాయిదాను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ ముసాయిదా కేవలం సాంకేతిక మార్పులకే పరిమితం కాదు. బ్యాంకింగ్ వ్యవస్థలో నమ్మకాన్ని పునరుద్ధరించే ప్రయత్నంగా భావిస్తున్నారు నిపుణులు.
సేవ పేరుతో సాగుతున్న వ్యాపారానికి కళ్లెం.. Reining in Sales in the Name of Service
గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్ రంగం సేవా రంగం నుంచి సేల్స్ రంగంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాతా తెరవడానికి వెళ్లిన కస్టమర్‌కు అనవసర బీమా పాలసీలు, డిపాజిట్ కోసం వచ్చిన వారికి మ్యూచువల్ ఫండ్లు, రుణాల కోసం వచ్చిన వారికి అదనపు సేవలు అంటగట్టడం సాధారణమైపోయింది. బ్యాంకు ఉద్యోగులపై విధించే టార్గెట్లు, ప్రోత్సాహకాలు ఈ మిస్సెల్లింగ్ (Bank Mis-selling)కు ప్రధాన కారణంగా మారాయి. ‘ఎన్ని పాలసీలు అమ్మారు?’, ‘ఎన్ని కార్డులు ఇచ్చారు?’ అన్న ప్రశ్నలే ఉద్యోగుల పనితీరు ప్రమాణాలుగా మారడంతో, కస్టమర్ అవసరాల కంటే విక్రయాలే ముఖ్యమయ్యాయి. ఈ ధోరణికి బ్రేక్ వేయడమే తాజా ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం.
మిస్సెల్లింగ్ అంటే? What Exactly Is Mis-selling?
కస్టమర్‌కు అవసరం లేకున్నా, అతడి ఆర్థిక పరిస్థితికి సరిపోకున్నా, పూర్తి సమాచారం ఇవ్వకుండా లేదా తప్పుదారి పట్టించే విధంగా ఆర్థిక ఉత్పత్తులు, సేవలను విక్రయించడాన్నే మిస్సెల్లింగ్ (Bank Mis-selling)గా ఆర్బీఐ నిర్వచిస్తోంది. ఇందులో బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్లు, క్రెడిట్ కార్డులు, పెట్టుబడి సాధనాలు, అదనపు బ్యాంకింగ్ సేవలన్నీ వస్తాయి. కస్టమర్ అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకోవడం, నమ్మకాన్ని వాడుకోవడం ఇందులో ప్రధాన లక్షణాలు.
ప్రోత్సాహకాలకే మొదటి కత్తెర.. Ban on Incentives That Encourage Mis-selling
మిస్సెల్లింగ్ (Bank Mis-selling)కు దారితీసే ప్రోత్సాహకాలను బ్యాంకులు ప్రకటించరాదని ఆర్బీఐ స్పష్టంగా ప్రతిపాదించింది. అంటే ఏదైనా ఉత్పత్తి లేదా సేవను ఎక్కువగా అమ్మినందుకు నగదు బహుమతులు, అదనపు ప్రయోజనాలు, ప్రమోషన్లను కేవలం విక్రయాల ఆధారంగా ఇవ్వడం ఇక కుదరదు. విక్రయాలే లక్ష్యంగా ఉద్యోగులను నడిపించే విధానాలను పునఃసమీక్షించాలని ఆర్బీఐ సూచించింది. ఉద్యోగుల పనితీరును అంచనా వేయడంలో సేవా ప్రమాణాలు, కస్టమర్ సంతృప్తి కీలకంగా ఉండాలని తెలిపింది.
అనుమతి లేకుండా ఫోన్ కాల్ నిషేధం.. No More Unsolicited Calls
బ్యాంకుల నుంచి వచ్చే అనవసర ఫోన్ కాల్స్‌పై కస్టమర్లకు తీవ్ర అసహనం ఉంది. ఉదయం నుంచి రాత్రివరకు వివిధ ఉత్పత్తుల పేరుతో వచ్చే కాల్స్ కస్టమర్లను విసిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల నుంచి ముందుగా స్పష్టమైన సమ్మతి (కన్సెంట్) లభించాకే బ్యాంకులు వారిని ఫోన్ ద్వారా సంప్రదించాలి. అంతేకాదు, పనివేళ్లలో లేదా అనుచిత సమయాల్లో కాల్ చేయరాదని కూడా నిర్దేశించింది. ఈ నిబంధన డిజిటల్ మార్కెటింగ్, టెలీమార్కెటింగ్ రంగాల్లో పెద్ద మార్పుకు దారితీయనుంది.
బలవంతపు ‘బండిలింగ్’కు చెక్.. No Forced Bundling of Products
ఒక బ్యాంకు తన ఆర్థిక సాధనం లేదా సేవలతో పాటు థర్డ్ పార్టీ ఉత్పత్తులను కలిపి విక్రయించడానికి వీల్లేదని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. ఉదాహరణకు, రుణంతో పాటు ఒక నిర్దిష్ట బీమా కంపెనీ పాలసీ తీసుకోవాల్సిందేనని బలవంతం చేయడం ఇక నిషేధం. కస్టమర్‌కు తనకు నచ్చిన కంపెనీ ఆర్థిక సాధనం, ఉత్పత్తి లేదా సేవను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ఆర్బీఐ ఆదేశించింది. ఇది కస్టమర్ ఎంపిక హక్కును బలోపేతం చేసే నిర్ణయంగా భావిస్తున్నారు.
మిస్సెల్లింగ్ జరిగితే… రీఫండ్ తప్పదు.. Refund and Compensation Made Mandatory
మిస్సెల్లింగ్ (Bank Mis-selling)జరిగితే బ్యాంకులు కస్టమర్ చెల్లించిన మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాల్సిందేనని ఆర్బీఐ ప్రతిపాదించింది. అంతేకాదు, కస్టమర్‌కు కలిగిన నష్టానికి పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కేవలం నైతిక బాధ్యత కాదు… చట్టబద్ధమైన బాధ్యతగా మారనుంది. ఈ నిబంధన బ్యాంకులపై బాధ్యతను గణనీయంగా పెంచుతుంది.
కస్టమర్ సమ్మతికి కొత్త అర్థం.. Redefining Customer Consent
ఇకపై కస్టమర్ సమ్మతి అంటే కేవలం ఒక సంతకం కాదు. ఉత్పత్తి వివరాలు, రిస్క్ అంశాలు, ఖర్చులు, నిబంధనలు అన్నింటినీ స్పష్టంగా అర్థమయ్యేలా వివరించిన తర్వాతే సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది. సాంకేతిక భాషలో కాకుండా, సాధారణ కస్టమర్‌కు అర్థమయ్యే రీతిలో సమాచారం ఇవ్వాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
మార్గదర్శకాలపై ప్రజాభిప్రాయాల ఆహ్వానం.. Public Feedback Invited
ఈ సవరణ ముసాయిదాలోని ప్రతిపాదనలపై మార్చి 4లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆర్బీఐ ప్రజలను కోరింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మాత్రమే కాదు… సాధారణ కస్టమర్లు కూడా తమ అనుభవాలు, సూచనలు ఇవ్వొచ్చని తెలిపింది. ప్రజాభిప్రాయాల ఆధారంగా తుది మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
జూలై 1 నుంచి అమలు.. Implementation from July 1
అన్ని ప్రక్రియలు పూర్తైన తర్వాత ఈ కొత్త మార్గదర్శకాలు(Bank Mis-selling) ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే బ్యాంకులకు తమ విధానాలను సవరించుకునేందుకు కొన్ని నెలల గడువు ఇచ్చినట్లవుతుంది. ఈలోగా బ్యాంకులు తమ సేల్స్, మార్కెటింగ్ విధానాలను పునఃపరిశీలించాల్సి ఉంటుంది.
ఎందుకు ఈ నిర్ణయం కీలకం? Why This RBI Move Matters
(Bank Mis-selling)ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలో కస్టమర్ కేంద్రిత సంస్కృతిని తీసుకురావాలన్న ఆర్బీఐ ప్రయత్నానికి నిదర్శనం. మిస్సెల్లింగ్ వల్ల నష్టపోయిన లక్షలాది కస్టమర్లకు ఇది ఊరటనిస్తుంది. బ్యాంకులపై నమ్మకం తిరిగి నెలకొనాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బ్యాంకింగ్‌లో నమ్మకానికి పునాది.. Restoring Trust in Banking
బ్యాంకింగ్ వ్యవస్థ నమ్మకంపైనే నిలబడింది. ఆ నమ్మకాన్ని దెబ్బతీసిన మిస్‌సెల్లింగ్‌కు చెక్ పెట్టడమే తాజా ఆర్బీఐ ముసాయిదా లక్ష్యం. నిబంధనలు కాగితాలకే పరిమితం కాకుండా అమలులోకి వస్తే, కస్టమర్–బ్యాంక్ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
లక్ష్యాల ఒత్తిడి మేరకు.. Under Pressure to Meet Targets
ప్రైవేట్ బ్యాంకులైనా, ప్రభుత్వ రంగ బ్యాంకులైనా, చిన్న బ్యాంకులైనా, పెద్ద బ్యాంకులైనా లక్ష్యాల ఒత్తిడి ఉన్నచోట మిస్సెల్లింగ్ అవకాశముంటుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో టార్గెట్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, క్రెడిట్ కార్డుల మిస్సెల్లింగ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకులు పూర్తిగా ఇందుకు మినహాయింపు అని చెప్పలేం. ఇటీవలి కాలంలో అక్కడ కూడా బీమా పాలసీలు, పెన్షన్ స్కీముల పేరుతో మిస్సెల్లింగ్ ఫిర్యాదులు పెరిగాయి. అంటే సమస్య బ్యాంక్ పేరులో కాదు. విక్రయ విధానంలో ఉంది. కాగా మిస్సెల్లింగ్లో ఎక్కువగా నష్టపోతున్నవారు వృద్ధులే. చాలామందికి మిస్సెల్లింగ్ జరుగుతోందని అప్పటికి అర్థం కాదు. కానీ కొన్ని సంకేతాలు ఉంటాయి. “ఉద్యోగి తొందరపెడితే.. డాక్యుమెంట్లు చదవనివ్వకుండా సంతకం పెట్టమంటే.. “ఇది తప్పనిసరి” అని చెప్పినా రాతపూర్వకంగా చూపించకపోతే.. రిస్క్ గురించి మాట్లాడకుండా లాభాలే చెబితే… ” ఇవన్నీ మిస్‌సెల్లింగ్‌కు హెచ్చరిక సంకేతాలు.
మిస్సెల్లింగ్ జరిగితే ఏమి చేయాలి? What to Do If You Are Mis-sold
మిస్సెల్లింగ్ జరిగిందని అనిపిస్తే ముందుగా బ్యాంక్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేయాలి. అక్కడ పరిష్కారం లభించకపోతే బ్యాంక్ గ్రీవెన్స్ సెల్‌ను సంప్రదించాలి. అయినా న్యాయం జరగకపోతే బ్యాంకింగ్ ఒంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. ఆర్బీఐ ఈ విషయంలో కస్టమర్లకు పూర్తి రక్షణ కల్పిస్తోంది.
ఎలా జాగ్రత్త పడాలంటే? How Can Protect Themselves
బ్యాంక్ నుంచి ఏదైనా ఆర్థిక ఉత్పత్తి తీసుకునే ముందు తొందరపడకూడదు. “ఇప్పుడే తీసుకోకపోతే అవకాశం పోతుంది” అన్న మాటలకు లొంగకూడదు. ముందుగా ఇది నిజంగా అవసరమా అని ఆలోచించాలి. మన ఆదాయం, వయస్సు, కుటుంబ అవసరాలకు ఇది సరిపోతుందా అని చూసుకోవాలి. ఏ ఉత్పత్తైనా తీసుకునే ముందు రాతపూర్వక వివరాలు అడగాలి. రిస్క్‌లు ఏమిటి? ఎంతకాలం పెట్టుబడి ఉండాలి? మధ్యలో డబ్బు తీసుకుంటే ఎంత నష్టం? ఇవన్నీ స్పష్టంగా తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. బ్యాంకుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ చాలా సందర్భాల్లో మిస్‌సెల్లింగ్‌కు మొదటి అడుగు. ఫోన్లో చెప్పిన మాటలకే నమ్మి నిర్ణయం తీసుకోవద్దు. ఏ ఉత్పత్తైనా రాతపూర్వకంగా ఇవ్వమని అడగాలి. “ఫ్రీ”, “గ్యారెంటీ” వంటి మాటలు వినిపిస్తే మరింత జాగ్రత్త పడాలి. లోన్ తీసుకుంటే ఇన్సూరెన్స్ తప్పనిసరి అన్న మాట నిజం కాదు. బ్యాంకు ఉద్యోగి బలవంతం చేస్తే స్పష్టంగా ప్రశ్నించాలి. అది ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఐచ్చికమేనని తెలుసుకోవాలి.
