ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు పెద్దలు. కానీ, అనారోగ్యం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. చిన్న చికిత్సకే వేలల్లో ఖర్చవుతున్న ఈ రోజుల్లో ఆరోగ్య బీమా (Health Insurance) ప్రతి కుటుంబానికి తప్పనిసరి అవసరంగా మారింది. అయితే, బీమా పాలసీ తీసుకునే ముందు దానికి సంబంధించిన నిబంధనలు, పదాలు సరిగా అర్థం కాకపోతే అవసర సమయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. చాలా మంది పాలసీ తీసుకునేటప్పుడు కేవలం ప్రీమియం ఎంత? బీమా మొత్తం ఎంత? అనే విషయాలకే పరిమితమవుతున్నారు. కానీ, పాలసీలో ఉపయోగించే కీలక పదాల అర్థం తెలియకపోవడం వల్ల క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే, ఆరోగ్య బీమాకు సంబంధించిన ప్రాముఖ్యమైన టర్మ్స్ (Terms) ఏంటో, అవి ఏం సూచిస్తాయో తెలుసుకోవడం చాలా అవసరం. వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే మీరు సరైన పాలసీని ఎంచుకుని, అవసరమైన సమయంలో పూర్తిస్థాయిలో ప్రయోజనం పొందగలుగుతారు. ఇప్పుడు ఆరోగ్య బీమాలో తరచూ వినిపించే ముఖ్యమైన పదాలను తెలుసుకుందాం..
1. ప్రీమియం (Premium)
బీమా పాలసీ కొనసాగాలంటే మీరు ప్రతి నెల లేదా సంవత్సరానికి చెల్లించే మొత్తమే ప్రీమియం. ప్రీమియం తక్కువగా ఉందని మాత్రమే పాలసీ ఎంచుకోకూడదు. కవరేజ్, నిబంధనలు కూడా చూడాలి. అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా పాలసీ కవరేజీని విస్తరించుకునే అవకాశమే రైడర్. సాధారణంగా క్రిటికల్ ఇల్నెస్ కవర్, వ్యక్తిగత ప్రమాద బీమా, ప్రసూతి రైడర్ వంటి వాటిని ఎక్కువ మంది ఎంచుకుంటారు. గర్భధారణ, ప్రసవం, శిశు జననానికి సంబంధించిన ఖర్చులను కవర్ చేసే సౌకర్యాన్నే ప్రసూతి కవర్ అంటారు. ఇది ప్రత్యేక పాలసీగా లేదా ప్రధాన పాలసీకి అదనపు రైడర్‌గా తీసుకునే అవకాశం ఉంటుంది. వీటిని యాడ్-ఆన్ కవర్లుగా కూడా పిలుస్తారు.
2. సమ్ ఇన్స్యూర్డ్ / కవరేజ్ (Sum Insured)
బీమా కంపెనీ గరిష్టంగా చెల్లించే మొత్తమే సమ్ ఇన్స్యూర్డ్. ఉదాహరణకు మీ పాలసీ కవరేజ్ రూ.5 లక్షలైతే, ఒక పాలసీ సంవత్సరంలో గరిష్టంగా అంత వరకు ఖర్చు భరిస్తుంది. IRDAI మార్గదర్శకాల ప్రకారం ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాల చికిత్సలకు కూడా బీమా కవరేజ్ అందుబాటులో ఉంది. ఈ చికిత్సలను ఆయుష్ చికిత్సలుగా పిలుస్తారు. అనేక పాలసీల్లో ఇవి కూడా క్లెయిం పరిధిలోకి వస్తున్నాయి. అయితే, చికిత్స తీసుకునే ఆసుపత్రి, ఖర్చు పరిమితులపై నిబంధనలు ఉండవచ్చు.
3. పాలసీ పీరియడ్ (Policy Period)
పాలసీ అమల్లో ఉండే కాలవ్యవధి. సాధారణంగా 1 సంవత్సరం లేదా 2–3 సంవత్సరాలుగా ఉంటుంది.
4. వేటింగ్ పీరియడ్ (Waiting Period)
పాలసీ ప్రారంభమైన వెంటనే అన్ని వ్యాధులకు క్లెయిమ్ చేయలేరు. కొన్ని వ్యాధులకు 30 రోజులు, 90 రోజులు లేదా 2–4 సంవత్సరాల వేటింగ్ పీరియడ్ ఉంటుంది.
5. ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజ్ (Pre-existing Disease)
పాలసీ తీసుకునే ముందు నుంచే ఉన్న వ్యాధులను ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజ్‌లు అంటారు. షుగర్, బీపీ వంటి వ్యాధులకు సాధారణంగా 2–4 సంవత్సరాల తర్వాతే కవరేజ్ ఉంటుంది.
6. డిడక్టిబుల్ (Deductible)
క్లెయిమ్ సమయంలో మీరు ముందుగా చెల్లించాల్సిన ఖర్చు భాగమే డిడక్టిబుల్. ఇది ఎక్కువగా ఉంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది.
7. కో-పేమెంట్ (Co-payment)
మొత్తం చికిత్స ఖర్చులో బీమా కంపెనీతో పాటు మీరు కూడా భరించాల్సిన శాతం. ఉదాహరణకు 10% కో-పే ఉంటే, రూ.1 లక్ష ఖర్చులో రూ.10 వేల మీరే చెల్లించాలి. కొన్ని పాలసీల్లో సహ-చెల్లింపు నిబంధన ఉంటుంది. అంటే వైద్య చికిత్స ఖర్చులో కొంత శాతాన్ని పాలసీదారుడే భరించాలి. దీనినే కో-పే అంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల పాలసీల్లో ఈ నిబంధన ఎక్కువగా ఉంటుంది. కో-పే ఉన్న పాలసీలకు సాధారణంగా ప్రీమియం తక్కువగా ఉండటం గమనార్హం.
8. క్యాష్‌లెస్ చికిత్స (Cashless Treatment)
నెట్వర్క్ ఆసుపత్రుల్లో ముందుగా డబ్బులు చెల్లించకుండా చికిత్స పొందే సదుపాయం. బిల్లులను బీమా కంపెనీ నేరుగా ఆసుపత్రికే చెల్లిస్తుంది. నగదు రహిత ఆసుపత్రి సౌకర్యం ఆరోగ్య బీమాలో అత్యంత కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. బీమా సంస్థతో ఒప్పందం ఉన్న నెట్వర్క్ ఆసుపత్రుల్లో పాలసీదారుడు ముందుగా డబ్బులు చెల్లించకుండా చికిత్స పొందే వెసులుబాటునే నగదు రహిత సదుపాయం అంటారు. ఆసుపత్రిలో చేరే ముందు బీమా సంస్థకు సమాచారం అందించాలి. అనుమతి లభించిన తరువాత, బీమా పరిమితి వరకు ఆసుపత్రి బిల్లులను బీమా సంస్థ నేరుగా ఆసుపత్రికే చెల్లిస్తుంది.
9. నెట్వర్క్ హాస్పిటల్స్ (Network Hospitals)
బీమా కంపెనీతో ఒప్పందం చేసుకున్న ఆసుపత్రుల జాబితానే నెట్వర్క్ హాస్పిటల్స్.
10. క్లెయిమ్ (Claim)
చికిత్స ఖర్చుల కోసం బీమా కంపెనీకి మీరు చేసే అభ్యర్థననే క్లెయిమ్ అంటారు. క్లెయిం దాఖలు చేయాలంటే పాలసీదారుడు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాలి. సరిగ్గా పూరించిన క్లెయిం ఫారం, డాక్టర్ ఇచ్చిన వైద్య నివేదికలు (Diagnosis Reports), ఆసుపత్రి బిల్లులు, రసీదులు, డిశ్చార్జ్ సమరీ, ప్రిస్క్రిప్షన్లు వంటి ఇతర అవసరమైన పత్రాలు పొందుపర్చాలి. ఈ పత్రాలను బీమా కంపెనీ నిర్దేశించిన గడువు లోపల సమర్పించడం చాలా ముఖ్యం. ఆలస్యం జరిగితే క్లెయిం తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఆరోగ్య బీమాలో ప్రధానంగా రెండు రకాల క్లెయిమ్‌లు ఉంటాయి. క్యాష్‌లెస్ క్లెయిం – నెట్వర్క్ ఆసుపత్రిలో ముందుగా డబ్బులు చెల్లించకుండా చికిత్స పొందే సౌకర్యం. రియింబర్స్‌మెంట్ క్లెయిం – చికిత్స ఖర్చులను ముందుగా మనమే చెల్లించి, తరువాత బీమా కంపెనీ నుంచి తిరిగి పొందడం. క్లెయిం దాఖలు చేసే సమయంలో పాలసీ నిబంధనలు జాగ్రత్తగా చదవాలి. అవసరమైన పత్రాలన్నీ పూర్తిగా సమర్పించాలి. అలాగే వేటింగ్ పీరియడ్, కో-పేమెంట్, ఎక్స్‌క్లూజన్స్ వంటి అంశాలను ముందే తెలుసుకుంటే క్లెయిం సమయంలో ఇబ్బందులు తలెత్తవు. మొత్తంగా…ఆరోగ్య బీమా పాలసీ ప్రయోజనం పూర్తిగా పొందాలంటే క్లెయిం ప్రక్రియపై స్పష్టమైన అవగాహన అవసరం. సరైన సమయంలో, సరైన పత్రాలతో క్లెయిం దాఖలు చేస్తే చికిత్స ఖర్చుల భారం తగ్గి, కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది.
11. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ (Reimbursement Claim)
నెట్వర్క్ కాకుండా ఇతర ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని, ఖర్చు చేసిన మొత్తాన్ని తర్వాత తిరిగి పొందడం.
12. రూమ్ రెంట్ లిమిట్ (Room Rent Limit)
ఆసుపత్రిలో గది అద్దెకు బీమా కంపెనీ చెల్లించే గరిష్ట పరిమితి. ఇది దాటితే మిగతా ఖర్చు మీ భాద్యత.
13. డే కేర్ ప్రొసీజర్స్ (Day Care Procedures)
24 గంటల అడ్మిషన్ అవసరం లేకుండా జరిగే చికిత్సలు. లేజర్ సర్జరీలు, డయాలసిస్ వంటి చికిత్సలు. కొన్ని వైద్య చికిత్సలకు 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉండదు. రోగిని అదే రోజున డిశ్చార్జ్ చేస్తే వాటిని డే కేర్ చికిత్సలుగా పరిగణిస్తారు. డయాలిసిస్, కీమోథెరపీ, కంటిశుక్లం శస్త్రచికిత్స వంటి చికిత్సలు దీనిలోకి వస్తాయి. గతంలో ఇవి కవర్ కాకపోయినా, ప్రస్తుతం చాలా పాలసీల్లో డే కేర్ చికిత్సలకు కవరేజ్ ఉంది.
14. నో క్లెయిమ్ బోనస్ (No Claim Bonus – NCB)
పాలసీ సంవత్సరంలో క్లెయిమ్ చేయకపోతే, తదుపరి సంవత్సరంలో అదనపు కవరేజ్ లేదా ప్రీమియం తగ్గింపు లభిస్తుంది. నో-క్లెయిం బోనస్‌ను క్యుములేటివ్ బోనస్ అని కూడా అంటారు. పాలసీ సంవత్సరంలో ఎటువంటి క్లెయిం చేయకుండా ఉంటే, అదనపు ప్రీమియం లేకుండానే బీమా మొత్తం పెరుగుతుంది. కొన్ని కంపెనీలు రెన్యువల్ సమయంలో ప్రీమియంలో రాయితీ కూడా ఇస్తాయి. దీని వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ కవరేజ్ లభిస్తుంది.
15. ఎక్స్‌క్లూజన్స్ (Exclusions)
బీమా కవరేజ్ వర్తించని వ్యాధులు లేదా ఖర్చుల జాబితా. కాస్మెటిక్ సర్జరీలు, కొన్ని ప్రత్యేక చికిత్సలు ఇందులో ఉండొచ్చు.
16. అంబులెన్స్ ఖర్చు.. Ambulance Charges
అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చినప్పుడు అంబులెన్స్ ఖర్చు తప్పనిసరిగా వస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులు, అంబులెన్స్ సేవలు దీనికి ప్రత్యేకంగా ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చాలా ఆరోగ్య బీమా కంపెనీలు తమ పాలసీల్లో భాగంగా అంబులెన్స్ కవర్‌ను అందిస్తున్నాయి. అయితే, ఈ ఖర్చును పూర్తిగా కాకుండా ఒక నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే భరిస్తుంటాయి. కాబట్టి పాలసీ తీసుకునే ముందు అంబులెన్స్ కవర్ ఎంత వరకు వర్తిస్తుందో తెలుసుకోవడం అవసరం.
17. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ.. Critical Illness Policy
తీవ్రమైన, ప్రాణాంతకమైన వ్యాధులకు ప్రత్యేకంగా రూపొందించినదే క్రిటికల్ ఇల్నెస్ పాలసీ. క్యాన్సర్, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వ్యాధులకు చికిత్స ఖర్చు భారీగా ఉండటంతో పాటు, దీర్ఘకాలిక వైద్యం అవసరం అవుతుంది. ఈ పాలసీలో ఆసుపత్రి బిల్లుల ఆధారంగా కాకుండా, బీమా చేసిన మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లిస్తారు. ఇది ప్రధాన పాలసీకి రైడర్‌గా లేదా ప్రత్యేక పాలసీగా తీసుకోవచ్చు.
18.బీమా కవరేజ్ కి వర్తించనవి… Exclusions from Insurance Coverage
ప్రతి ఆరోగ్య బీమా పాలసీలో కొన్ని మినహాయింపులు తప్పనిసరిగా ఉంటాయి. అంటే బీమా కవరేజ్ వర్తించని వ్యాధులు లేదా చికిత్సలు. కాస్మెటిక్ సర్జరీలు, HIV/AIDS చికిత్స, సాధారణ పంటి చికిత్సలు, స్వీయ హాని వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, మాదకద్రవ్య దుర్వినియోగానికి సంబంధించిన చికిత్సలు వంటి వాటికి సాధారణంగా బీమా వర్తించదు.
19. పోర్టబిలిటీ… Insurance Portability
పాలసీదారుడు తన ప్రస్తుత బీమా సంస్థ సేవలతో సంతృప్తిగా లేకపోయినా, లేదా మరొక కంపెనీ తక్కువ ప్రీమియంతో మెరుగైన కవరేజ్ ఇస్తున్నా, పాలసీ ప్రయోజనాలను కోల్పోకుండా బీమా సంస్థను మార్చుకునే వెసులుబాటు ఉంది. దీన్నే పోర్టబిలిటీ అంటారు. వేటింగ్ పీరియడ్ వంటి ప్రయోజనాలు కూడా కొత్త పాలసీలో కొనసాగుతాయి.
