60 ఏళ్ళ వారికి నెల నెలా ఆదాయం..

regular income plans to old people

జీవిత చివ‌రి ద‌శ‌లో ఎవరిపైనా ఆధారపడకుండా బ‌త‌కాల‌నే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకునేదే పదవీ విరమణ నిధి. రిటైర్‌మెంట్ అయ్యాక వ‌చ్చే మొత్తాన్ని ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం పొదుపు చేసి వాటి నుంచి క్ర‌మంగా నెల‌వారీ ఆదాయం పొంద‌డం చాలా అవ‌స‌రం. అందుకు చాలా ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. మ‌న అవ‌స‌రాలు, ఆదాయ మార్గాలను ఆధారంగా చేసుకుని ఆయా ప‌థ‌కాల ఎంపిక‌లో మ‌నం జాగ్ర‌త్త‌లు పాటించాలి. రిస్స్‌తో కూడుకున్న తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు చేయ‌కూడ‌దు. విరమణ‌ చేసిన వ్యక్తులు పెట్టుబడుల ప్రణాళిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి వ్యక్తి అవసరాలు, నష్టభయం వేరువేరుగా ఉంటాయి. దీనికి అనుగుణంగా కేటాయింపులు ఉండాలి. కొంత సొమ్మును అత్య‌వ‌సరాల‌కు, మ‌రి కొంత సొమ్మును అధిక ఆదాయం పొందే చోట ఇన్‌వెస్ట్ చేయాలి. సీనియ‌ర్ సిటిజ‌న్స్ కు ఉద్దేశించిన ప‌థ‌కాల‌లో కొన్ని ప్ర‌ధాన‌మైన‌వి కింద తెలుసుకుందాం.

* పోస్టాఫీస్ నెల‌వారీ ఆదాయ ప‌థ‌కంలో గ‌రిష్ఠంగా రూ.4.50 లక్షలు, జీవిత భాగస్వామితో కలిసి రూ.9 లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 6.60 శాతం. నెల నెలా వడ్డీ చెల్లిస్తారు. కనీస వ్యవధి 5 ఏళ్ళు. ఈ పథ‌కంలోనూ ముందస్తు విత్ డ్రాలను అనుమతిస్తారు. కానీ పెనాల్టీ ఉంటుంది.

what is senior citizen saving scheme

* సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ( ఎస్ సీ ఎస్ ఎస్‌)
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీంలో కనీసం రూ.1,000 నుంచి రూ.15 లక్షల వరకూ మదుపు చేయొచ్చు. జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ ఖాతాను నిర్వహించవచ్చు. ప్రస్తుతం ఇందులో 7.40 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. ఖాతా ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్ళ కాలపరిమితి వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రీ-మెచ్యూర్ విత్ డ్రాలకు అవకాశం ఉంటుంది.
ఇందులో పెట్టుబడి పెట్టిన సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ ప్రకారం రూ.80సీ కింద 1.50 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. భారత్ లోని ఏదైనా అధీకృత బ్యాంకులో గానీ, పోస్టాఫీసులో గానీ ఎస్ సీఎస్ఎస్ ఖాతాను తెరవొచ్చు.

* ఆర్ బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్‌.. ఇందులో వడ్డీ రేటును ఆర్ బీఐ ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ బాండ్లపై 7.15 శాతం వరకూ రాబడి వస్తోంది. ఏటా జనవరి, జులైలో వడ్డీని చెల్లిస్తారు. ఈ బాండ్లలో కనీసం ఏడేళ్లపాటు కొనసాగాల్సి ఉంటుంది. అయితే, మదుపరుల వయస్సును బట్టి, నిర్ణీత కాలం తర్వాత ముందస్తుగా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది.

what is pradhan mantri vaya vandana yojana

* మ‌రో చ‌క్క‌ని ప‌థ‌కం ప్రధానమంత్రి వయ వందన యోజన. దీన్ని లైఫ్‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) నిర్వహిస్తుంది. పెట్టుబడులకు భద్రత, రాబడికి హామీ ఉంటుంది. 10 ఏళ్ళ కాలానికి ఈ పథ‌కం వర్తిస్తుంది. ఇందులో కనీసం రూ.1.50 లక్షలు.. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు మదుపు చేయొచ్చు. ఈ పథ‌కంలో ప్రస్తుతం 7.40 శాతం వార్షిక వడ్డీ వస్తోంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి వడ్డీ తీసుకోవచ్చు. ముందస్తు విత్ డ్రాలను అనుమతిస్తారు. కానీ 2 శాతం వరకూ పెనాల్టీ వర్తిస్తుంది. ఒక ల‌క్ష రూపాయ‌లు పెడితే నెల‌కు సుమారు 615 రూపాయ‌ల‌ వ‌డ్డీ వ‌స్తుంది.

అత్య‌వ‌స‌రాల‌కు..
అత్యవసరాలకు కొంత మొత్తాన్ని పక్కన పెట్టాలి. సీనియర్ సిటిజన్లకు వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇలా అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినా లేదా అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే తీసుకోగలిగేలా కొంత మొత్తాన్ని ఉంచుకోవాలి. కనీసం 3-4 సంవత్సరాలకు సరిపోయే మొత్తాన్ని లిక్విడిటీ రూపంలో ఉంచుకోవాలి. ఇందుకోసం కొంత మొత్తాన్ని బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్ల లోనూ మరికొంత మొత్తాన్ని పొదుపు ఖాతాలోనూ ఉంచ‌వచ్చు. చాలా వరకు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటు కంటే సీనియర్ సిటిజన్లకు కొంత అదనంగా వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. వీటితో పాటు లిక్విడ్ ఫండ్స్‌లోనూ డబ్బులు పెట్టుకోవ‌డం కొంచెం ఉత్త‌మ‌మే. ఇందులో మిగిలిన‌వాటితో పోలిస్తే కొంచెం అధికంగా రాబ‌డి వ‌స్తుంది. ఒక‌టి లేదా రెండురోజుల్లో డ‌బ్బులు తీసుకోవ‌చ్చు.

equity is best to get high income

అధిక రాబ‌డ‌ల‌కు ఈక్విటీ త‌ప్పనిస‌రి..
వృద్ధి కోసం పెట్టుబడిదారులు ..ఈక్విటీ ఫండ్స్ వంటి మార్కెట్ అనుసంధాన ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టాలి. ఇవి ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి ఇవ్వడంలో సహాయపడతాయి. కానీ నష్టభయం ఎక్కువ‌గా ఉంటుంది. ఈ కారణం చేతనే చాలామంది పదవీ విరమణ తర్వాత పెట్టుబడులకు ఈక్విటీ సిఫార్సు చేయరు. మంచి రాబడిని కోరుకునేవారు ఈక్విటీ ఫండ్స్ ను ఎంచుకోవచ్చు. ఇవి దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తాయి. మొత్తం పెట్టుబడి విలువలో ఇది ఎక్కువ శాతం మించకుండా చూసుకోవాలి. ఒక ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. ఒకేసారి కాకుండా 8-12 నెలల పాటు సిప్ ద్వారా మదుపు చేయడం మేలు. కొన్నేళ్ల తర్వాత పెట్టుబడి పెట్టిన మొత్తం నుంచి ఏటా 4 శాతం వరకూ వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు.

Author photo
Publication date:
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *