భారత దేశంలో ఉన్నది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ప్రవేటు, ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది. దీంతో అన్ని రంగాలు, అన్ని వ్యాపారాల్లోనూ ప్రభుత్వ ప్రమేయం ఉండేది. ఇది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కొత్త పరిశ్రమలు ఏర్పడడం కష్టంగా మారింది. ఉన్నవి సైతం స్వేచ్ఛగా పనిచేయలేకపోయేవి. దీంతో లాభాలు కూడా మృగ్యమే. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతుండేది. కఠినతరమైన ట్యాక్స్ విధానంతో పెట్టుబడిదారులు ఇబ్బంది పడుతుండేవారు. దీంతో ఇండియాలో వ్యాపారమంటే విదేశీయులు భయపడిపోయేవారు. స్వదేశీయులు సైతం ముందుకొచ్చేవారు కాదు. అనుమతులు కూడా త్వరగా వచ్చేవి కాదు. ఏళ్ల తరబడి తిరిగితే కానీ నూతన పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పచ్చజండా చూడగలిగేవారు కాదు. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. కనీస అవసరాలైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి కూడా కావాల్సిన నిధులు మన దగ్గర లేని పరిస్థితి వచ్చింది. సరిగ్గా అలాంటి సమయంలోనే దేశ ఆర్థిక రంగంలో పెను మార్పు వచ్చింది. పారిశ్రామిక విధానాల్లో స్వేచ్ఛాపూరిత వాతావరణం చోటుచేసుకుంది. పరిశ్రమల ఏర్పాటుకు దేశమంతటా పచ్చతివాచీ పరిచినట్టయింది. ఈ మహాద్భుతమైన మార్పునకు కారణం మన్మోహన్ సింగ్. దేశ ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టి, పదునైన సంస్కరణలతో చురుకైన వ్యవస్థను ఏర్పాటు చేసి దేశ ఆర్థికాన్ని పరుగులు పెట్టించారు. భారతదేశం ఎదుగుతోంది అని ప్రపంచం గుర్తిస్తోందంటే దానికి బాటలు వేసింది మన్మోహన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉంటారనడంలో సందేహం లేదు. ఆర్‌బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. దేశ గతిని మార్చిన సంస్కరణ శీలి మన్మోహన్.
దేశంలో ఉన్న ఎన్నో అనిశ్చితుల మధ్య 1991లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. భారతదేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టం అది.
ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆర్థికమంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్‌ను భారత దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా చెబుతారు. మన దేశాన్ని పదేళ్ల పాటు పరిపాలించిన ప్రధానమంత్రుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. భారత తొలి ప్రధాని నెహ్రూ తర్వాత రెండోసారి ప్రధానిగా ఎన్నికైన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుంది. ఆ తర్వాత నరేంద్ర మోదీ వరసగా మూడుసార్లు ప్రధాని అయ్యారు. కాగా దేశ ప్రధానిగా పదవి చేపట్టిన తొలి సిక్కు నేత కూడా మన్మోహన్ సింగే..
కేంబ్రిడ్జ్ లో మాస్టర్స్ డిగ్రీ .. ఆక్స్‌ఫర్డ్‌లో డాక్టరేట్
Master’s degree at Cambridge… Doctorate at Oxford
మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజ్య భారత దేశంలోని పంజాబ్ లో పుట్టారు. ఇప్పడు ఈ ప్రాంతం పాకిస్థాన్లో ఉంది. అప్పట్లో ఈ ప్రాంతం బాగా వెనుకబడి ఉండేది. అలాంటి చోటు నుంచి వచ్చని ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయంలో విద్య పూర్తి చేసుకున్న తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్. వీరికి ముగ్గురు కుమార్తెలు.
ఆర్థిక సంస్కరణలు
Economic reforms
మన్మోహన్ సింగ్ 1991లో కేంద్ర ఆర్థికమంత్రి అయిన తర్వాత రాజకీయంగా ఆయనకు మరింత గుర్తింపు పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలో ఉన్నప్పుడు వచ్చిన ఆయన ఎంతో చాణక్యంతో వ్యవహరించారు. అనూహ్యంగా వచ్చిన పదవి అయినప్పటికీ చాలా పకడ్బంధీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ ప్రతిభే ఆయనను చాలా కాలం రాజకీయాల్లో కొనసాగేలా చేసింది. అంతకు ముందు సివిల్ సర్వెంట్‌గా, ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా పని చేసిన ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు.
* 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నమన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను లిబరలైజ్ చేసి అంతర్జాతీయ వాణిజ్యానికి దారులు తెరిచారు. దిగుమతుల పరిమితులను తగ్గించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు. అనేక నియంత్రణలను తొలగించారు.
* విదేశీ మారక నిల్వల కొరత వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో పడినపుడు సింగ్ IMF సహాయంతో కొత్త విధానాలను ప్రవేశపెట్టారు.
* పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను తొలగించారు. అనుమతులను తొందరగా ఇచ్చేందుకు వెసులుబాట్లు కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టారు.
* సులభతరమైన లైసెన్సింగ్ విధానం, పెట్టుబడిదారులకు ప్రత్యేక అనుమతులు, సింపుల్ ట్యాక్స్.. ఇలా పలు రకాల నూతన విధానాలను తీసుకువచ్చి దేశ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశారు.
* ప్రైవేటు పరిశ్రమల్లో ప్రభుత్వానికి ఉన్న మితిమీరిన చొరవ, ఆజమాయిషీని తగ్గించి, పూర్తి స్వేచ్ఛను ఇచ్చేలా విధానాలను మిలిచారు. దీంతో కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. విదేశీ పరిశ్రమలు ఉత్సాహంగా ముందుకొచ్చాయి.
* ప్రైవేటీకరణ ద్వారా పరిశ్రమలకు కొత్త అవకాశాలను అందించారు. దీంతో దేశంలో నిరుద్యోగం కొంత వరకు తగ్గింది.
ప్రధాన మంత్రిగా ఉన్నసమయంలో
During the time as Prime Minister
* మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి గా ఉన్న సమయంలో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు సగటున 7-8% వరకూ ఉండేది. ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలోనూ ఇది నిలకడగా కొనసాగింది.
* గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతగానో దోహదపడింది.
* రోడ్లు, రైల్వేలు, విద్యుత్ వంటి మౌలిక వనరుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
* ఆరోగ్య బీమా పథకాలు, విద్యలో చట్టసంబంధ హక్కులను ప్రవేశపెట్టారు.
* ప్రపంచవ్యాప్తంగా పెరిగిన పసిడి, చమురు ధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టినా, సరైన విధానాలతో సమర్థంగా నడిపించారు.
* పన్నుల్ని తగ్గించారు. రూపాయి విలువ నిలబెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు.
* పారిశ్రామిక రంగం ముందడుగు వేసింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. వృద్ధిరేటు స్థిరంగా కొనసాగింది.
* మన్మోహన్ ప్రధానిగా ఉన్న తొలి ఐదేళ్లకాలంలో అతిపెద్ద విజయం అమెరికాతో అణు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం.
* పాకిస్తాన్‌తో శాంతిసంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ 2008 నవంబరులో ఉగ్రవాదులు ముంబైలో జరిపిన దాడులతో ఈ విధానం మళ్లీ ప్రశ్నార్థకం అయింది. ఈ దాడులు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినవే అన్న ఆరోపణలొచ్చాయి.
* చైనాతో సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు మన్మోహన్ సింగ్ ప్రయత్నించారు. స్నేహపూర్వక వాతావరణం కోసం చైనాతో కొత్త ఒప్పందాలు చేసుకున్నారు.
* అఫ్గానిస్తాన్‌కు ఆర్థిక సాయం పెంచారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని అఫ్గానిస్తాన్‌ను సందర్శించడం ఓ విశేషమే.
వివాదాలు .. విమర్శలు.. Controversies… Criticisms
* 2జీ స్పెక్ట్రమ్ స్కాం, కామన్వెల్త్ గేమ్స్ స్కాం వంటి అవినీతి ఆరోపణలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై భారీగా ఒత్తిడి తెచ్చాయి.
* నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో ఆర్థిక వ్యవస్థ స్తబ్దతకు కారణమైందనే విమర్శలు వచ్చాయి.
* UPA-II సమయంలో పాలనలో తీరిక లేకపోవడం, ముఖ్యమైన నిర్ణయాల్లో జాప్యం అనే విమర్శలు ఎదుర్కొన్నారు.
* మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు వేలకోట్ల రూపాయల కుంభకోణాల్లో చిక్కుకున్నారు. ప్రతిపక్షం పార్లమెంట్‌ను స్తంభింపచేసింది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన విఫలమవడంతో ఆర్థిక వ్యవస్థ మందగించింది. దేశం తిరోగమన బాటలో సాగిందనే ఆరోపణలు మూటకట్టుకోవలసి వచ్చింది.
* ప్రస్తుత మీడియా, విపక్షాల కన్నా చరిత్ర నా పట్ల దయతో వ్యవహరిస్తుందని నిజాయతీగా నమ్ముతున్నా. ప్రభుత్వ వ్యవస్థలోని విషయాలన్నీ బయటకు చెప్పలేను కానీ, సంకీర్ణ రాజకీయాల అనివార్యతల దృష్టిలో పెట్టుకొని, ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో సరిగ్గా అలాగే వ్యవహరించా అని ఆయన ఒక సందర్భంలో చెప్పారు.