సంపద అనేది (How to Build Wealth) ఒక్క లోన్‌తో నిర్మించేది కాదు… ఒక్క ఆస్తితో నిలబడేది కాదు. అది సరైన ఆలోచనలతో, క్రమశిక్షణతో నిర్మించే దీర్ఘకాల ప్రయాణం. అప్పులు మనల్ని సేవ్ చేయాలి… మనం అప్పులకు బానిస కావద్దు. సంపద అనేది అదృష్టం కాదు… అలవాటు. ప్రతి నెల తీసుకునే చిన్న నిర్ణయాలే భవిష్యత్తులో పెద్ద ఫలితాలుగా మారతాయి. తెలివైన లోన్లు, క్రమబద్ధమైన ఆస్తి ప్రణాళిక, దీర్ఘకాల ఆలోచన – ఇవే నిజమైన సంపదకు మూలాలు. అసలు అప్పులు లేకుండా ఆస్తులు సృష్టించడం సాధ్యమేనా? లోన్ తీసుకుంటే సంపద పెరుగుతుందా… లేక భారం అవుతుందా? వడ్డీ రేట్లు, పెట్టుబడి రాబడులు, రియల్ ఎస్టేట్, హోమ్ లోన్ టాప్‌అప్, క్రెడిట్ కార్డుల మాయాజాలం … ఈ అన్నింటిపై ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
సరైన నిర్ణయాలే కీలకం.. Right Decisions Are the Key
(How to Build Wealth) జీతం వస్తూనే ఖర్చైపోతుందా? లోన్లు భారంగా మారుతున్నాయా? ఆస్తులు ఉన్నా మనశ్శాంతి లేదా? సంపాదన కన్నా సరైన ప్రణాళికే నిజమైన సంపదకు మార్గం. అయితే మనలో చాలామంది ఎక్కువ సంపాదిస్తేనే సంపన్నులవుతామని భావిస్తారు. కానీ వాస్తవం వేరు. నెలకు లక్షలు సంపాదించే వారు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే… పరిమిత ఆదాయంతోనూ భద్రంగా, సంపన్నంగా జీవించే వారు ఉన్నారు. కారణం ఒక్కటే – ఆర్థిక ఆలోచన విధానం.సంపద అనేది ఒక్కరోజులో ఏర్పడేది కాదు. అది ఒక దీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణంలో సరైన నిర్ణయాలు తీసుకుంటేనే గమ్యం చేరుకోగలం.
అప్పు అంటేనే భయమా? Is Debt Always Bad?
(How to Build Wealth) ‘లోన్’ అనే పదం వినగానే చాలా మందికి భయం మొదలవుతుంది. అప్పు అంటే జీవితాంతం కట్టుబడి ఉండాల్సిన భారం అనే భావన మన సమాజంలో బలంగా ఉంది. కానీ వాస్తవానికి, అప్పు చెడ్డదా… లేక మనం వాడే విధానం చెడ్డదా అన్న ప్రశ్న ముందుగా వేసుకోవాలి. ఎంత వడ్డీకి లోన్ తీసుకుంటున్నాం? ఆ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం? ఆ పెట్టుబడి ఎంత వృద్ధి (గ్రోత్) ఇస్తుంది? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం లేకుండా లోన్ తీసుకుంటే, అది సంపద సృష్టికి కాదు… సమస్యలకు దారి తీస్తుంది.
వడ్డీ రేటు Vs వృద్ధి రేటు.. Interest Cost vs Growth Rate
సాధారణంగా మనం లోన్ తీసుకునే సమయంలో వడ్డీ రేటు ఎంత అని మాత్రమే చూస్తాం. కానీ ఆ డబ్బుతో పెట్టుబడి చేసే ఆస్తి ఎంత వృద్ధి ఇస్తుందో చాలామంది పట్టించుకోం. ఉదాహరణకు 12% వడ్డీతో లోన్ తీసుకుని 8% రాబడి ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టడం పూర్తిగా నష్టమే. అదే 7% వడ్డీతో లోన్ తీసుకుని 12–14% రాబడి వచ్చే ఆస్తిలో పెట్టితే, అది మంచి ఫైనాన్షియల్ నిర్ణయం అవుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. 12% కంటే ఎక్కువ రాబడిని రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్లు ఇవ్వవు. అంటే గ్యారెంటీగా ఎక్కువ రాబడులు వస్తాయని ఎవరు చెప్పినా జాగ్రత్తగా ఉండాలి.
అప్పులు లేకుండా ఆస్తి సృష్టి – నిజమా? Can You Build Wealth Without Loans?
(How to Build Wealth) అప్పులు లేకుండా ఆస్తులు సృష్టించడం సాధ్యం కాదని చాలామంది భావిస్తారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. అప్పులు లేకుండా ఆస్తులు సృష్టించడం ఒక నెమ్మదైన, క్రమబద్ధమైన ప్రక్రియ. ఒక్కసారిగా కోట్లు సంపాదించాలన్న ఆశతో అప్పులు చేస్తే, ఆస్తులు కాదు… అప్పులే పెరుగుతాయి. దీర్ఘకాలంలో స్థిరమైన సంపద కావాలంటే, అప్పుల మీద ఆధారపడకుండా ప్లాన్ చేయాల్సిందే.
బ్యాంకర్లు ఎలా ఆలోచిస్తారు? How Banks Actually Work
బ్యాంకులో మీరు రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, బ్యాంకు మీకు సుమారు 7% వడ్డీ ఇస్తుంది. అదే డబ్బును బ్యాంకు మరొకరికి 14–16% వడ్డీకి అప్పుగా ఇస్తుంది. ఇక్కడే బ్యాంకు లాభం ఉంటుంది. డిపాజిటర్లకు వడ్డీ వస్తుంది. ఆపరేషనల్ ఖర్చులు, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ (NIM) అర్థం చేసుకోకుండా బ్యాంకులను తప్పుబట్టడం సరైంది కాదు. బ్యాంకర్లు ఎప్పుడూ తమ నిబంధనల ప్రకారమే పని చేస్తారు.
మంచి లోన్లు – చెడ్డ లోన్లు Good Loans vs Bad Loans
మంచి లోన్లు (Good Loans): హోమ్ లోన్ – తక్కువ వడ్డీ, ఆస్తి విలువ పెరుగుతుంది. హోమ్ లోన్ టాప్‌అప్ – అవసరాలకు తక్కువ వడ్డీతో నిధులు లభ్యమవుతాయి. గోల్డ్ లోన్ – తక్కువ రిస్క్ ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ – ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
చెడ్డ లోన్లు (Bad Loans): క్రెడిట్ కార్డ్ లోన్లు, పర్సనల్ లోన్లు, అధిక వడ్డీతో తక్షణ లోన్లు, 12% కంటే ఎక్కువ వడ్డీ ఉన్న లోన్లు సాధారణంగా ప్రమాదకరమైనవే.
హోమ్ లోన్ – నిజంగా మంచి లోనా? Home Loan – A Smart Debt?
హోమ్ లోన్ ను ఒక మంచి లోన్‌గా పరిగణించవచ్చు. సిబిల్ స్కోర్ బాగుంటే 7.25%–7.35% వడ్డీకి హోమ్ లోన్ లభిస్తుంది. ఒక కోటి రూపాయల హోమ్ లోన్‌ను 20 ఏళ్లకు తీసుకుంటే, నెలకు సుమారు రూ.78,000 ఈఎంఐ ఉంటుంది. అదే ఆ ప్రాపర్టీని రెంటుకు ఇస్తే 3–4% రెంటల్ యీల్డ్ , 10–15 ఏళ్లలో ప్రాపర్టీ విలువ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అందుకే, సరైన ప్లానింగ్‌తో తీసుకున్న హోమ్ లోన్ మంచి అప్పుగా మారుతుంది.
క్రెడిట్ కార్డుల మాయ The Credit Card Trap
క్రెడిట్ కార్డులు సౌకర్యంగా కనిపించినా, అవి అత్యంత ప్రమాదకరమైన అప్పులలో ఒకటి. వడ్డీ రేట్లు 30–40% వరకు ఉంటాయి. ఒక్కసారి బకాయి పెరిగితే, ఆ చక్రం నుంచి బయటపడటం చాలా కష్టం. అందుకే క్రెడిట్ కార్డులను లోన్‌గా ఉపయోగించకూడదు.
హోమ్ లోన్ టాప్‌అప్ – ఎంత వరకు సురక్షితం? Home Loan Top-Up – Opportunity or Risk?
(How to Build Wealth) హోమ్ లోన్ టాప్ అప్ తీసుకుని ప్లాట్లు కొనడం ఇప్పుడు సాధారణమైంది. కానీ దీనిలో ఉన్న రిస్కులు చాలామందికి తెలియవు. ప్లాట్ ఎక్కడ ఉంది? ఎంత కాలంలో వృద్ధి అవుతుంది? అవసరమైనప్పుడు అమ్మగలమా? అమ్మితే డబ్బు వెంటనే ఖాతాలోకి వస్తుందా? టాక్స్ ప్రభావం ఏమిటి?.. ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండా టాప్‌అప్ వాడితే, అది లోన్ ట్రాప్‌గా మారుతుంది. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఒక అపార్ట్‌మెంట్ ఉన్న వ్యక్తికి నెలకు రూ.18,000 రెంట్ వస్తోంది. అతనికి రూ.19 లక్షల ఫ్లెక్సీ లోన్ ఉంది.
ప్లాట్ కొనడానికి పర్సనల్ లోన్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు అప్పుల భారం ఎక్కువై, ఆ అపార్ట్‌మెంట్ అమ్మాలని అనుకుంటున్నాడు. కానీ లిటిగేషన్ కారణంగా అమ్మడం కష్టంగా మారింది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి.. అప్పులు ఉన్నప్పుడు ఆస్తులు మనవి కావు.
రియల్ ఎస్టేట్ – ఎంత వరకు? Real Estate Allocation
రియల్ ఎస్టేట్ మంచి ఆస్తే. కానీ మొత్తం సంపదలో 50% కంటే ఎక్కువ రియల్ ఎస్టేట్‌లో పెట్టకూడదు. మిగిలిన భాగాన్ని ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి విభాగాల్లో విభజించాలి.
తక్కువ ఆదాయం – ముందు ఏం చేయాలి? Low Income: Invest or Increase Earnings?
నెలకు రూ.20–25 వేల జీతం ఉన్నవారు ముందుగా ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన వదిలి, ఆదాయం పెంచే దిశగా దృష్టి పెట్టాలి. స్కిల్ అప్‌గ్రేడ్, కొత్త ఇండస్ట్రీలలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఆదాయం పెరగకుండా ఇన్వెస్ట్ చేస్తే, జీవనశైలి తగ్గిపోతుంది.
లోన్ ట్రాప్ నుంచి బయటపడటం ఎలా? How to Escape the Loan Trap
అధిక వడ్డీ లోన్లు ముందుగా క్లోజ్ చేయాలి. హోమ్ లోన్ టాప్‌అప్‌తో పర్సనల్ లోన్లు క్లోజ్ చేయవచ్చు. కొత్త లోన్లు అవసరమైతేనే తీసుకోవాలి. EMIలు టేక్ హోమ్ సాలరీలో 50% దాటకూడదు.

