ఆదాయపు పన్ను వ్యవస్థను సరళతరం చేయాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం (New Tax Regime) కాలక్రమంలో కీలక మార్పులకు లోనైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత పన్ను విధానంలో అనేక మినహాయింపులు, డిడక్షన్లు, సంక్లిష్టమైన నిబంధనలు ఉండటంతో సాధారణ పన్ను చెల్లింపుదారులు అయోమయంలో పడేవారు. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో కొత్త విధానానికి రూపకల్పన జరిగింది. మినహాయింపులు లేకుండా, తక్కువ శ్లాబులతో, సులువుగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసుకునే విధంగా ఈ విధానాన్ని రూపొందించారు. మినహాయింపులు, డిడక్షన్లు లేకుండా సులభంగా రిటర్నులు దాఖలు చేసుకునేలా రూపొందించిన ఈ విధానాన్ని తొలుత ఐచ్ఛికంగా అమలు చేయగా, అనంతరం డిఫాల్ట్‌గా మార్చారు. ముఖ్యంగా 2025-26 బడ్జెట్లో తీసుకొచ్చిన సంస్కరణలు కొత్త పన్ను విధానాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకువచ్చాయి. గతేడాది (2025-26) కేంద్ర బడ్జెట్లో రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు కల్పించడంతో మధ్యతరగతికి పెద్ద ఊరట లభించింది. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపితే రూ.12.75 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం రిబేట్‌ను పెంచింది. దీంతో కొత్త పన్ను విధానంవైపు పన్ను చెల్లింపుదారుల ఆసక్తి గణనీయంగా పెరిగింది. కొత్త పన్ను విధానం ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు కాలక్రమంలో జరిగిన మార్పులు, వాటి ప్రభావం, పన్ను చెల్లింపుదారులకు కలిగిన లాభాలను ఒకసారి సమగ్రంగా పరిశీలిద్దాం.
2020-21 బడ్జెట్: కొత్త పన్ను విధానానికి శ్రీకారం .. 2020–21 Budget: Launch of the New Tax Regime
2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా కొత్త పన్ను విధానాన్ని (New Tax Regime) ప్రకటించారు. అప్పటివరకు అమలులో ఉన్న పాత పన్ను విధానానికి ప్రత్యామ్నాయంగా ఈ విధానాన్ని రూపొందించారు. ఈ కొత్త విధానాన్ని పూర్తిగా ఐచ్ఛికంగా ప్రవేశపెట్టారు. అంటే, పన్ను చెల్లింపుదారులు పాత విధానం లేదా కొత్త విధానం – ఏదైనా ఒకదాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, ఈ కొత్త విధానంలో ముఖ్యమైన మార్పు ఏమిటంటే… పన్ను మినహాయింపులు, డిడక్షన్లు పూర్తిగా తొలగించారు.
అప్పట్లో ప్రకటించిన పన్ను శ్లాబులు ఇలా ఉన్నాయి..
రూ.5 లక్షల వరకు ఆదాయంపై రిబేట్‌తో కలిపి పన్ను శూన్యం.
రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10 శాతం పన్ను.
రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతం పన్ను.
రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం పన్ను.
రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం పన్ను.
రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను… ఈ విధానంతో శ్లాబులు ఎక్కువగా ఉండటం, డిడక్షన్లు లేకపోవడం వల్ల మొదట్లో పెద్దగా ఆదరణ లభించలేదు. ముఖ్యంగా హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), 80C, 80D వంటి మినహాయింపులను వినియోగించుకునే మధ్యతరగతి వర్గాలు పాత విధానానికే ప్రాధాన్యం ఇచ్చాయి.
2021-22 బడ్జెట్: మార్పుల్లేని సంవత్సరం.. 2021–22 Budget: A Year with No Changes
2021-22 బడ్జెట్లో ఆదాయపు పన్ను (Tax Regime) శ్లాబులకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, సీనియర్ సిటిజన్లకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 75 ఏళ్లు దాటిన వృద్ధులు, పింఛను ఆదాయం , ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఒకే బ్యాంకు నుంచి పొందుతున్నట్లయితే, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన వాంగ్మూల పత్రాలను ఐటీ విభాగం నోటిఫై చేసింది. ఈ నిర్ణయం వల్ల వృద్ధులకు రిటర్నుల దాఖలులో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గాయి. అయితే, పన్ను శ్లాబుల పరంగా మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
2022-23 బడ్జెట్: స్థిరత్వం కొనసాగింపు.. 2022–23 Budget: Continuation of Stability
2022-23 బడ్జెట్లోనూ ఆదాయపు పన్నుకు (Tax Regime) సంబంధించి పెద్దగా మార్పులేమీ చేయలేదు. కొత్త పన్ను విధానం అప్పటికీ ఐచ్ఛికంగానే కొనసాగింది. దీంతో చాలా మంది పన్ను చెల్లింపుదారులు పాత విధానాన్నే కొనసాగించారు. ఈ దశలో ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రజలకు అలవాటు చేయడంపైనే దృష్టి పెట్టినట్లు కనిపించింది. పెద్ద సంస్కరణలకు బదులుగా స్థిరత్వాన్ని కొనసాగించింది.
2023-24 బడ్జెట్: కీలక మలుపు… 2023–24 Budget: A Crucial Turning Point
2023-24 బడ్జెట్లో కొత్త పన్ను విధానానికి (New Tax Regime) సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది నుంచే కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ విధానంగా ప్రకటించారు. అంటే, ప్రత్యేకంగా పాత విధానాన్ని ఎంచుకోనంత వరకు, పన్ను చెల్లింపుదారులకు కొత్త విధానమే అమలవుతుంది. పన్ను శ్లాబులు ఇలా..
రూ.0 నుంచి రూ.3 లక్షల వరకు – పన్ను లేదు.
రూ.3 నుంచి రూ.6 లక్షల వరకు – 5 శాతం.
రూ.6 నుంచి రూ.9 లక్షల వరకు – 10 శాతం.
రూ.9 నుంచి రూ.12 లక్షల వరకు – 15 శాతం.
రూ.12 నుంచి రూ.15 లక్షల వరకు – 20 శాతం.
రూ.15 లక్షలు దాటితే – 30 శాతం. ఇదే బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50 వేలుగా ప్రకటించారు. ఇది ఉద్యోగులు, పెన్షనర్లకు కొంత ఊరట ఇచ్చింది. అలాగే సెక్షన్ 87ఏ కింద లభించే రిబేట్‌ను పెంచి, రూ.7 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మార్పులతో కొత్త పన్ను విధానంపై ఆసక్తి క్రమంగా పెరిగింది.
2024-25 బడ్జెట్: మధ్యతరగతికి మరింత ఊరట.. 2024–25 Budget: Greater Relief for the Middle Class
2024-25 బడ్జెట్లో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75 వేలుకు పెంచింది. ఇది ఉద్యోగులు, పెన్షనర్లకు మరింత ప్రయోజనకరంగా మారింది.
పన్ను శ్లాబుల సవరణ ఇలా..
రూ.3 లక్షల వరకు – పన్ను లేదు.
రూ.3 నుంచి రూ.7 లక్షల వరకు – 5 శాతం.
రూ.7 నుంచి రూ.10 లక్షల వరకు – 10 శాతం.
రూ.10 నుంచి రూ.12 లక్షల వరకు – 15 శాతం.
రూ.12 నుంచి రూ.15 లక్షల వరకు – 20 శాతం.
రూ.15 లక్షలు దాటితే – 30 శాతం. ఈ మార్పులతో కొత్త పన్ను విధానం పాత విధానంతో పోలిస్తే మరింత పోటీగా మారింది.
2025-26 బడ్జెట్: విప్లవాత్మక మార్పులు.. 2025–26 Budget: Revolutionary Changes
కొత్త పన్ను (New Tax Regime)విధాన చరిత్రలో 2025-26 బడ్జెట్‌ను కీలక మలుపుగా చెప్పవచ్చు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలు కొత్త పన్ను విధానాన్ని పూర్తిగా ప్రజానీకానికి దగ్గర చేశాయి. ఈ బడ్జెట్లో రూ.12 లక్షల వరకు ఆదాయంపై పూర్తిగా పన్ను మినహాయింపు కల్పించారు. స్టాండర్డ్ డిడక్షన్‌ను కలుపుకుంటే రూ.12.75 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్‌ను పెంచారు.
పన్ను శ్లాబుల సరవణ ఇలా..
రూ.4 లక్షల వరకు – పన్ను లేదు.
రూ.4 నుంచి రూ.8 లక్షల వరకు – 5 శాతం.
రూ.8 నుంచి రూ.12 లక్షల వరకు – 10 శాతం.
రూ.12 నుంచి రూ.16 లక్షల వరకు – 15 శాతం.
రూ.16 నుంచి రూ.20 లక్షల వరకు – 20 శాతం.
రూ.20 నుంచి రూ.24 లక్షల వరకు – 25 శాతం.
రూ.24 లక్షలు దాటితే – 30 శాతం.
మధ్యతరగతిపై ప్రభావం.. Impact on the Middle Class
కొత్త పన్ను విధానంలో (New Tax Regime) తీసుకొచ్చిన ఈ మార్పులు ముఖ్యంగా మధ్యతరగతి వర్గానికి ఊరటనిచ్చాయి. తక్కువ ఆదాయం ఉన్న వారికి పన్ను భారం పూర్తిగా తొలగిపోవడంతో వినియోగ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, పన్ను వ్యవస్థ సరళంగా మారడంతో రిటర్నుల దాఖలులో పారదర్శకత పెరిగింది. పన్ను ఎగవేతకు అవకాశం తగ్గడంతో ప్రభుత్వానికి ఆదాయ వసూళ్లు కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్త పన్ను విధానం ప్రవేశించిన మొదట్లో ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోయినా, క్రమంగా చేసిన మార్పులతో ఇది ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా మారింది. ముఖ్యంగా 2025-26 బడ్జెట్లో తీసుకొచ్చిన సంస్కరణలు ఈ విధానాన్ని పూర్తిగా మలుపుతిప్పాయి. సరళత, తక్కువ పన్ను భారం, స్పష్టమైన శ్లాబులతో కొత్త పన్ను విధానం భవిష్యత్తులో మరింత విస్తృతంగా అమలవుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి.
