భగభగమండిన బంగారం ధరలు (Gold Prices)…రెండు రోజులుగా కాస్త చల్లబడుతున్నాయి. పసిడి అంటేనే భద్రత. సంక్షోభకాలంలో అందరూ ఆశ్రయించే పెట్టుబడి. అయితే అదే పసిడి ఇప్పుడు ఎటు వైపు పరుగెడుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియా యుద్ధ భయాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ కదలికలు… అన్నీ కలిసి బంగారం ధరల్ని ఊయలలాగా ఊపుతున్నాయి. గత కొన్ని వారాలుగా నిప్పులు కురిపించిన బంగారం ధరలు…మంగళవారం నాడు దేశీయ మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టాయి.సామాన్యులకు ఇది కాస్త ఊరటే అయినప్పటికీ, భవిష్యత్‌పై స్పష్టత మాత్రం రావడం లేదు.
యుద్ధమే కారణమా… ధరల ఊగిసలాటకు? West Asia Tensions and Safe Haven Rush
పశ్చిమాసియా ప్రాంతం మళ్లీ అగ్నిగోళంలా మారింది. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. యుద్ధం అంటేనే భయం. భయం ఉంటే పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోరు. రిస్క్ తీసుకోని సమయంలో… వారు పరుగులు పెట్టేది ఒకే దారి – Safe Haven Assets. అందులో మొదటిది బంగారం. వెండి కూడా అదే దారిలో ప్రయాణిస్తోంది. ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. అయితే ఇదే సమయంలో అమెరికన్ డాలర్ విలువ పుంజుకోవడం మరో కీలక మలుపు. డాలర్ బలపడితే… బంగారం ధరలపై ఒత్తిడి పడుతుంది. అదే ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యం.
దేశీయ మార్కెట్లో తగ్గిన పసిడి రేట్లు.. Gold Prices in India on March 3
దేశవ్యాప్తంగా మంగళవారం బంగారం ధరలు(Gold Prices) తగ్గాయి.ఈ తగ్గుదల గ్రాము స్థాయిలో కనిపించినా, పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వారికి ఇది గమనించదగ్గ మార్పే. 24 క్యారట్ల బంగారం గ్రాము ధర రూ.49 తగ్గి రూ.17,002 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.45 తగ్గి రూ.15,585కి చేరింది. 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.36 తగ్గి రూ.12,752గా నమోదైంది. అదే విధంగా 100 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.4,900 తగ్గి రూ.17,00,200గా ఉంది. 22 క్యారట్ల 100 గ్రాముల ధర రూ.4,500 తగ్గి రూ.15,58,500 వద్ద ట్రేడవుతోంది. 18 క్యారట్ల 100 గ్రాముల బంగారం ధర రూ.3,600 తగ్గి రూ.12,75,200కి వచ్చింది. ఈ గణాంకాలు చూస్తే…రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయన్న విషయం స్పష్టమవుతోంది.
విజయవాడ, హైదరాబాద్‌లో పరిస్థితి ఇదే..City-wise Gold Rates
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన నగరాల్లో (Gold Prices)కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. విజయవాడ నగరంలో… 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.490 తగ్గి రూ.1,70,020గా ఉంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ.450 తగ్గి రూ.1,55,850 పలుకుతోంది. 18 క్యారట్ల బంగారం ధర రూ.360 తగ్గి రూ.1,27,520గా నమోదైంది. హైదరాబాద్‌లోనూ ..విజయవాడతో సమానంగానే ధరలు కొనసాగుతున్నాయి.
వెండి మాత్రం మళ్లీ భగ్గుమంది.. Silver Steals the Spotlight
బంగారం(Gold Prices) కాస్త వెనక్కి తగ్గితే… వెండి మాత్రం మళ్లీ పరుగులు పెట్టింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్కరోజులోనే ఏకంగా రూ.32,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది. ఇది దాదాపు 12 శాతం పెరుగుదల. అంతర్జాతీయ మార్కెట్లోనూ వెండి ధరలు కొత్త ఎత్తులకు చేరాయి. ఔన్స్ వెండి ధర 97 డాలర్లకు చేరడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. సంక్షోభ సమయాల్లో బంగారంతో పాటు వెండికీ డిమాండ్ పెరుగుతుందన్నది మరోసారి రుజువైంది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి జోరు.. Gold Crosses Record Levels Globally
ఇంటర్నేషనల్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర ఒక దశలో 5,400 డాలర్లు దాటింది.
ఇది చరిత్రలోనే అత్యధిక స్థాయిల్లో ఒకటిగా బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. వెండి కూడా అదే బాటలో ప్రయాణిస్తోంది. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం – యుద్ధ భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల పాలసీలపై అనిశ్చితి.
6,000 డాలర్లకు గోల్డ్? Wells Fargo’s Bold Prediction
యుద్ధం ఇంకా కొనసాగితే…బంగారం ధరలు మరింత ఎగసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం Wells Fargo చేసిన అంచనాలు మార్కెట్‌ను మరింత ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ బంగారం ధర 6,000 డాలర్లకు చేరే అవకాశాలున్నాయని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఈ అంచనాలు నిజమైతే…దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షలకు చేరినా ఆశ్చర్యం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
పెట్టుబడిదారులకు అయోమయం… Buy Now or Wait?
బంగారం, వెండిని ఇప్పుడే కొనాలా? లేదా వేచి చూడాలా? అనే ఆలోచనలో పెట్టుబడిదారులు ఉన్నారు. ధరలు తగ్గుతున్నాయంటే కొనాలి అనిపిస్తుంది. కానీ యుద్ధం పొడవుగా సాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే నిపుణులు ఒక మాట చెబుతున్నారు . “బంగారం షార్ట్‌టర్మ్ ట్రేడింగ్‌కు కాదు. ఇది లాంగ్‌టర్మ్ రక్షణ కవచం.” సామాన్యులకు ప్రస్తుతం కనిపిస్తున్న ఈ తగ్గుదల ఒక చిన్న ఊరట మాత్రమే. ముందు రోజుల్లో మళ్లీ మంటలు చెలరేగే అవకాశం ఉందన్న హెచ్చరికలు కూడా అంతే బలంగా ఉన్నాయి.
నేడు మార్కెట్లకు సెలవు.. Markets Closed for Holi
‘హోలీ’ పండుగ సందర్భంగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈతో పాటు కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు కూడా పనిచేయడం లేదు. బుధవారం నుంచి మార్కెట్లు యధావిధిగా ప్రారంభమవుతాయి. అప్పటివరకు అంతర్జాతీయ పరిణామాలే ధరల దిశను నిర్ణయించనున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం బంగారం మార్కెట్‌లో స్పష్టత లేదు. యుద్ధం… రాజకీయాలు… డాలర్… వడ్డీ రేట్లు… అన్నీ కలిసి పసిడిని ఊపేస్తున్నాయి. ఈ రోజు తగ్గితే… రేపు ధర పెరిగే అవకాశం ఉంది. అందుకే భయంతో కాదు… అవగాహనతో పెట్టుబడులు పెట్టాలి. అయితే పసిడి ఎప్పుడూ భద్రమే. కానీ దాని దారి మాత్రం ఇప్పుడిప్పుడే అర్థం కానిదిగా మారుతోంది.

