ఒకప్పుడు బ్యాంక్‌లో డబ్బు జమ చేస్తే, తీసుకుంటే… అవి మనకే తెలిసేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. డిజిటలైజేషన్, డేటా అనాలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… ఇవన్నీ కలిసి ఆదాయపు పన్ను శాఖకు ఒక డిజిటల్ కన్ను ఇచ్చాయి. మనం పెద్ద మొత్తంలో లావాదేవీ చేస్తే, అది ఐటీఆర్‌లో చూపించినా చూపించకపోయినా, సంబంధిత సంస్థల ద్వారా ఆదాయపు పన్ను శాఖకు ఆటోమేటిక్‌గా సమాచారం చేరిపోతుంది. ఈ సమాచార మార్పిడికి ప్రధాన ఆయుధం – Statement of Financial Transactions (SFT). బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, రిజిస్ట్రార్ కార్యాలయాలు, మ్యూచువల్ ఫండ్ హౌసులు, స్టాక్ బ్రోకర్లు… ఇలా అనేక సంస్థలు తమ వద్ద జరిగే పెద్ద లావాదేవీల వివరాలను క్రమం తప్పకుండా Income Tax Department కు పంపిస్తాయి. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు. “క్యాష్‌లో చేశాం కదా… ఎవరికీ తెలియదు” అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే – పెద్ద మొత్తాల్లో జరిగే క్యాష్, నాన్-క్యాష్ లావాదేవీలు రెండూ కూడా ట్రాక్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు ఈ 16 రకాల లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
స్టేట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమిటి? (What Is Statement of Financial Transactions – SFT?)
SFT అనేది ఒక రిపోర్టింగ్ వ్యవస్థ. ఆదాయపు పన్ను చట్టం కింద నిర్దిష్ట పరిమితిని మించిన లావాదేవీలు జరిగితే, వాటిని తప్పనిసరిగా ఐటీ శాఖకు తెలియజేయాలి. ఈ బాధ్యత మీపై కాదు, బ్యాంక్ లేదా ఆ లావాదేవీ జరిగిన సంస్థపై ఉంటుంది. కానీ సమాచారం వెళ్లాక, వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం మీకే వస్తుంది.అంటే మీరు ఐటీఆర్‌లో చెప్పినా చెప్పకపోయినా… డేటా మాత్రం ఐటీ శాఖ దగ్గర ఉంటుంది. అక్కడే మ్యాచ్ చేస్తారు. తేడా కనిపిస్తే నోటీసు ఖాయం.
బ్యాంకింగ్ లావాదేవీల్లో వచ్చే ప్రమాద గంట (High-Value Banking Transactions Under Scanner)
బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే కొన్ని లావాదేవీలు నేరుగా ఐటీ శాఖ దృష్టికి వెళ్తాయి. ముఖ్యంగా నగదు లావాదేవీలపై గట్టి నిఘా ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తే, అది సాధారణ ఆదాయంతో సరిపోలకపోతే వెంటనే అనుమానం వస్తుంది. అదే విధంగా కరెంట్ అకౌంట్లలో భారీగా నగదు జమలు లేదా ఉపసంహరణలు జరిగితే, అవి వ్యాపార ఆదాయానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలిస్తారు. చాలామంది “ఇది నా డబ్బే” అని అనుకుంటారు. కానీ ఐటీ శాఖ ప్రశ్న ఒక్కటే – ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దానికి సరైన ఆధారాలు ఉంటే భయం లేదు. లేకపోతే సమస్య మొదలవుతుంది. సేవింగ్స్ అకౌంట్ లేదా ఇతర సాధారణ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేస్తే, బ్యాంకులు ఆ సమాచారాన్ని ఐటీ శాఖకు పంపిస్తాయి. డబ్బు చెల్లుబాటు అయ్యేదే అయినా, మూలం ఏమిటో అడిగే అవకాశం ఉంటుంది.
కార్డులు, డ్రాఫ్టులు, డిపాజిట్లు (Cards, Drafts and Deposits Under Watch)
బ్యాంక్ డ్రాఫ్ట్‌లు, పే ఆర్డర్లు, బ్యాంకర్స్ చెక్‌లు… ఇవన్నీ ఒకప్పుడు పెద్దగా పట్టించుకోనివి. ఇప్పుడు మాత్రం పెద్ద మొత్తాల్లో నగదు చెల్లించి ఇవి కొనుగోలు చేస్తే, అది కూడా రిపోర్ట్ అవుతుంది. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్లు. ఒకేసారి పెద్ద మొత్తంలో కొత్తగా ఎఫ్‌డీ పెట్టితే, అది మీ ఆదాయానికి సరిపోతుందా లేదా అన్నది చెక్ చేస్తారు. క్రెడిట్ కార్డ్ లావాదేవీల విషయంలో కూడా ఇదే పరిస్థితి. క్యాష్ ద్వారా కార్డ్ బిల్లు చెల్లిస్తే ఒక పరిమితి దాటిన వెంటనే ఆ సమాచారం ఐటీ శాఖకు వెళ్తుంది. నాన్-క్యాష్ చెల్లింపులు అయినా సరే, మొత్తం ఎక్కువైతే ట్రాక్ తప్పదు. కొత్తగా ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టినప్పుడు (రిన్యూవల్స్ కాకుండా) మొత్తం రూ.10 లక్షలు లేదా ఎక్కువ ఉంటే, ఆ లావాదేవీ కూడా ఐటీ శాఖ రికార్డుల్లోకి వెళ్తుంది. మీరు బ్యాంక్ డ్రాఫ్ట్, పే ఆర్డర్ లేదా బ్యాంకర్స్ చెక్ కొనుగోలు చేయడానికి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు చెల్లిస్తే, ఆ లావాదేవీ ఐటీ శాఖకు వెళ్తుంది. ఒకేసారి కాకపోయినా, ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం కలిపి ఈ పరిమితిని దాటితే కూడా ఇదే వర్తిస్తుంది. క్రెడిట్ కార్డ్‌కు సంబంధించి కూడా పరిమితులు ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ బిల్లుకు నగదు రూపంలో రూ.1 లక్ష లేదా ఎక్కువ చెల్లిస్తే నగదు కాకుండా ఇతర మార్గాల ద్వారా (బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, చెక్ మొదలైనవి) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా ఎక్కువ చెల్లిస్తే ఈ వివరాలన్నీ రిపోర్ట్ అవుతాయి.
పెట్టుబడులపై ప్రత్యేక నిఘా (Investments Are Closely Monitored)
షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, డిబెంచర్లు… ఇవన్నీ సంపద సృష్టించే మార్గాలే. కానీ ఒక ఆర్థిక సంవత్సరంలో వీటిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే, అది మీ ప్రకటించిన ఆదాయంతో సరిపోలాలి. లేదంటే ప్రశ్నలు తప్పవు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం – పెట్టుబడి చేయడం తప్పు కాదు. కానీ ఆ పెట్టుబడికి డబ్బు ఎలా వచ్చింది అన్నదే కీలకం. జీతం, వ్యాపార ఆదాయం, పాత పొదుపులు, అప్పులు… ఇవన్నీ సరైన పత్రాలతో చూపగలిగితే సమస్య ఉండదు.
ఇల్లు, భూమి – పెద్ద లావాదేవీల కేంద్రం (Property Deals: Biggest Red Flag Area)
స్థిరాస్తి లావాదేవీలు ఎప్పుడూ ఐటీ శాఖ దృష్టిలోనే ఉంటాయి. ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ విలువ, స్టాంప్ డ్యూటీ విలువ… ఇవన్నీ ఒక నిర్దిష్ట పరిమితి దాటితే, ఆ వివరాలు నేరుగా ఐటీ శాఖకు చేరతాయి. ఇక్కడ క్యాష్ అంశం చాలా కీలకం. అధికారికంగా చూపించిన విలువకు, నిజంగా చెల్లించిన మొత్తానికి తేడా ఉంటే… అదే పెద్ద సమస్య. ఈ రంగంలోనే ఎక్కువ నోటీసులు వెళ్తుంటాయి. స్థిరాస్తి లావాదేవీలపై ఐటీ శాఖకు ప్రత్యేక నిఘా ఉంటుంది. ఇల్లు లేదా భూమి కొనుగోలు లేదా అమ్మకం చేసినప్పుడు, ఆస్తి విలువ లేదా స్టాంప్ డ్యూటీ విలువ రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ వివరాలు తప్పనిసరిగా పన్ను శాఖకు చేరతాయి. కొత్త డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం 2026 ఏప్రిల్ నుంచి ఈ పరిమితి రూ.45 లక్షలకు పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
విదేశీ ఖర్చులు కూడా తప్పించుకోవు (Foreign Transactions Are Also Reported)
విదేశీ కరెన్సీ కొనుగోలు, ఫారెక్స్ కార్డులు, విదేశాల్లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఖర్చులు… ఇవన్నీ ఒక పరిమితి దాటితే ఆటోమేటిక్‌గా రిపోర్ట్ అవుతాయి. విదేశీ ప్రయాణాలు, చదువు, వైద్య చికిత్స కోసం ఖర్చు చేసినా సరే – ఆదాయానికి సరిపోలాలి. విదేశీ కరెన్సీ లేదా ఫారెక్స్ కార్డ్ అమ్మకానికి సంబంధించిన రసీదు రూ.10 లక్షలు లేదా ఎక్కువ ఉంటే, లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్, ట్రావెలర్స్ చెక్‌లతో విదేశాల్లో ఖర్చు రూ.10 లక్షలు లేదా ఎక్కువ అయితే కూడా అవి రిపోర్ట్ అవుతాయి.
నోటీసు ఎందుకు వస్తుంది? (Why Do Income Tax Notices Come?)
నోటీసు రావడం అంటే మీరు తప్పు చేశారనే కాదు. చాలా సందర్భాల్లో ఇది వివరణ కోరడం మాత్రమే. కానీ మీరు సరైన పత్రాలు చూపించలేకపోతే, అది సమస్యగా మారుతుంది. అందుకే ముందుగానే జాగ్రత్త అవసరం.
జాగ్రత్తలే భద్రత (Precaution Is Protection)
పెద్ద లావాదేవీలు చేయడం తప్పు కాదు. కానీ అవి మీ ఆదాయానికి అనుగుణంగా ఉండాలి. క్యాష్ లావాదేవీలను వీలైనంత తగ్గించి, బ్యాంకింగ్ మార్గాల్లో చేయడం మంచిది. ప్రతి ముఖ్యమైన లావాదేవీకి సంబంధించిన రసీదులు, ఒప్పందాలు, స్టేట్‌మెంట్‌లు భద్రంగా ఉంచుకోవాలి. అవసరమైతే ట్యాక్స్ నిపుణుల సలహా తీసుకోవడం కూడా మంచి అలవాటు. ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద నోటీసుగా మారే అవకాశం ఉంది.
డబ్బు మీది, వివరణ కూడా మీదే.. (Money Is Yours, Explanation Is Also Yours)
ఈ రోజుల్లో ఆదాయపు పన్ను శాఖకు తెలియకుండా పెద్ద లావాదేవీలు చేయడం దాదాపు అసాధ్యం. సిస్టమ్ తెలివిగా మారింది. మనం కూడా తెలివిగా మారాల్సిన సమయం ఇది. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన విధంగా చూపించడం కూడా అంతే ముఖ్యం. అప్పుడు మాత్రమే ప్రశాంతమైన నిద్ర సాధ్యం.
ప్రీ-పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్.. Prepaid Instruments
Reserve Bank of India నియంత్రణలో జారీ అయ్యే ప్రీ-పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (వాలెట్లు, కొన్ని రకాల కార్డులు) కొనుగోలు చేయడానికి రూ.10 లక్షలు లేదా ఎక్కువ నగదు చెల్లిస్తే, అది కూడా రిపోర్టబుల్ ట్రాన్సాక్షన్ అవుతుంది.
కరెంట్ అకౌంట్లలో భారీ నగదు… Heavy Cash in Current Accounts
కరెంట్ అకౌంట్లలో నగదు లావాదేవీలపై పరిమితి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో .. కరెంట్ అకౌంట్లో నగదు జమ రూ.50 లక్షలు లేదా ఎక్కువ అయితే, కరెంట్ అకౌంట్ నుంచి నగదు ఉపసంహరణ రూ.50 లక్షలు లేదా ఎక్కువ అయితే ఈ రెండింటి వివరాలు ఐటీ శాఖకు తప్పనిసరిగా చేరతాయి.
వస్తువులు, సేవలకు నగదు చెల్లింపులు.. Cash Payments for Goods & Services
వస్తువులు లేదా సేవల కొనుగోలుకు రూ.2 లక్షలు దాటిన నగదు చెల్లింపు చేయడం చట్టపరంగా అనుమతించదు. అలా చెల్లిస్తే అది నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఇటువంటి లావాదేవీలపై కూడా పన్ను శాఖ దృష్టి ఉంటుంది.
షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు.. Shares, Mutual Funds & Bonds
ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో కూడా ఇదే నిబంధన. షేర్లు కొనుగోలు చేయడానికి రూ.10 లక్షలు లేదా ఎక్కువ షేర్ల బైబ్యాక్ (ఓపెన్ మార్కెట్ కాకుండా) రూ.10 లక్షలు లేదా ఎక్కువ. మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కోసం రూ.10 లక్షలు లేదా ఎక్కువ. బాండ్లు లేదా డిబెంచర్లు కొనుగోలు చేయడానికి రూ.10 లక్షలు లేదా ఎక్కువ.. ఈ లావాదేవీలన్నీ ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగితే, వాటి వివరాలు ఆటోమేటిక్‌గా రిపోర్ట్ అవుతాయి.
