దేశ ఆర్థిక వ్యవస్థకు ( Indian Economy) మరింత వేగం తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ ప్రాధాన్యం ఇచ్చింది. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతుల నిర్మాణానికి గాను రూ. 12.21 లక్షల కోట్లను కేటాయిస్తూ బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది గతంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ పెట్టుబడుల ఆధారిత వృద్ధి నమూనా స్పష్టమైన ఫలితాలను ఇస్తోంది. ఈ దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ మూలధన వ్యయాన్ని మరింత పెంచుతూ ఆర్థిక వృద్ధికి కొత్త ఊపునిచ్చే ప్రయత్నం చేసింది. మౌలిక సదుపాయాల ఆస్తుల సృష్టినే ప్రధాన లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తోంది.
రూ. 12.21 లక్షల కోట్లకు చేరిన మూలధన వ్యయం.. Capital Expenditure at an All-Time High
2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రభావవంతమైన మూలధన వ్యయాన్ని (Capital Expenditure) రూ. 12.21 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఇది మొత్తం బడ్జెట్ పరిమాణం రూ. 53.47 లక్షల కోట్లలో దాదాపు 22 శాతానికి సమానం. 2025–26 సవరించిన అంచనాలైన రూ. 10.95 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 11.5 శాతం పెరుగుదల కావడం గమనార్హం. పెట్టుబడుల ద్వారా వృద్ధిని ముందుకు నడిపించాలన్న ప్రభుత్వ వ్యూహం ఈ సంఖ్యల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.
అభివృద్ధికి ఇంధనంగా మౌలిక వసతులు.. Infrastructure as the Engine of Growth
ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో మౌలిక సదుపాయాలు (Infrastructure) కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ‘క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్’పై మరింత దృష్టి సారించింది. కొత్త రహదారుల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణ, హైస్పీడ్ రైళ్ల అభివృద్ధి, లాజిస్టిక్స్ వ్యవస్థ బలోపేతం వంటి రంగాలకు ఈ నిధులు ఉపయోగించనున్నారు. దీని వల్ల పరిశ్రమలకు అవసరమైన కనెక్టివిటీ మెరుగుపడనుంది.
ఉపాధి అవకాశాలకు ఊతం.. Boost to Jobs and Livelihoods
మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెరిగితే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిర్మాణ రంగం ద్వారా నేరుగా, అనుబంధ రంగాల ద్వారా పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనివేళలు పెరగడంతో ప్రజల ఆదాయాలు మెరుగయ్యే పరిస్థితి ఏర్పడనుంది.
రాష్ట్రాలకు ప్రయోజనం.. States to Gain from Capital Investment
కేంద్రం ప్రకటించిన ఈ భారీ (Budget ) కేటాయింపులు రాష్ట్రాలకు కూడా ప్రయోజనకరంగా మారనున్నాయి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకంగా ఉండటంతో కేంద్ర సహకారం మరింత పెరుగనుంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో రహదారులు, నీటి సరఫరా, పట్టణ వసతుల అభివృద్ధికి ఈ నిధులు దోహదపడనున్నాయి.
పెట్టుబడిదారులకు సానుకూల సంకేతం.. Positive Signal to Investors
బడ్జెట్ (Budget )లో మౌలిక రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచే అంశంగా మారింది. దీర్ఘకాలిక అభివృద్ధిపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతాన్ని ఈ కేటాయింపులు ఇస్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడు తున్నారు. దీని ప్రభావంతో భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా మరింత బలపడనుందని అంచనా వేస్తున్నారు.
2014తో పోలిస్తే ఆరు రెట్లు పెరుగుదల.. Six-Fold Jump in Capex Since 2014
పార్లమెంటులో బడ్జెట్ (Budget ) ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పెరుగుదలపై కీలక వివరాలు వెల్లడించారు. 2014–15లో కేవలం రూ. 2 లక్షల కోట్లుగా ఉన్న మూలధన వ్యయం, 2025–26 నాటికి రూ. 11.2 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. 2026–27లో దీన్ని రూ. 12.2 లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యయం ద్రోత్‌రూపంలో పెరుగుతూ 2022–23లో రూ. 7.4 లక్షల కోట్ల నుంచి 2023–24లో రూ. 9.5 లక్షల కోట్లకు, 2024–25లో రూ. 10.5 లక్షల కోట్లకు, 2025–26 సవరించిన అంచనాల్లో రూ. 11 లక్షల కోట్లకు చేరిందని వివరించారు.
రోడ్లు, రైల్వేలకే ప్రధాన వాటా.. Roads and Railways Take the Lead
ప్రభుత్వ పెట్టుబడుల్లో ప్రధాన భాగం రోడ్లు–రహదారులు, రైల్వేలు వంటి కీలక మౌలిక రంగాలకే దక్కుతోంది. 2026–27లో రైల్వే మంత్రిత్వ శాఖకు రూ. 2.92 లక్షల కోట్లను కేటాయించారు. ఇది 2025–26 సవరించిన అంచనాలతో పోలిస్తే దాదాపు 10 శాతం పెరుగుదల. అలాగే రోడ్డు రవాణా, రహదారుల రంగానికి రూ. 3.09 లక్షల కోట్లను కేటాయించారు. ఇది 7.6 శాతం వృద్ధిని సూచిస్తోంది. మౌలిక సదుపాయాలకు బలమైన మద్దతు ఇవ్వడమే ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి నిలబెట్టే మార్గమని నిర్మలమ్మ స్పష్టం చేశారు.
కొత్త కార్యక్రమాలు, ఆధునిక సాంకేతికతలపై దృష్టి.. New Initiatives to Strengthen Infrastructure
2026–27లో కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనుంది. అధిక విలువ కలిగిన నిర్మాణ పరికరాల దేశీయ తయారీకి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న 200 పాత పారిశ్రామిక సమూహాల్లో మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయనుంది. గత దశాబ్దంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు, NIIF, NABFID వంటి నిధి వ్యవస్థలు ప్రభుత్వ పెట్టుబడులకు బలమైన ఆధారంగా నిలిచినట్లు మంత్రి పేర్కొన్నారు.
పట్టణాలు, కొత్త రంగాలకు ఊతం.. Focus on Cities and Future Sectors
ఐదు లక్షలకుపైగా జనాభా ఉన్న మధ్యతరహా నగరాలు, చిన్న పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో అణుశక్తి, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, కార్బన్ సంగ్రహణ–వినియోగం–నిల్వ వంటి భవిష్యత్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే ప్రణాళికలు రూపొందించింది. అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన వస్తువులపై 2035 వరకు కస్టమ్స్ సుంకం మినహాయింపును పొడిగించింది. విద్యుత్, ఉక్కు, సిమెంట్, శుద్ధి, రసాయన రంగాల్లో CCUS సాంకేతికతల అమలుకు రూ. 20,000 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించడం మరో కీలక నిర్ణయం.
వృద్ధికి నిరంతర బలం.. Sustaining Long-Term Economic Growth
మొత్తంగా చూస్తే 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ మూలధన వ్యయాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వడం, కొత్త సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిని నిరంతరంగా వేగవంతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది.
‘ఆరెంజ్ ఎకానమీ’కి బూస్ట్.. Big Push to Creative Economy in Union Budget
సృజనాత్మకత ఉన్న యువతే దేశానికి అసలైన ఆస్తి అన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆరెంజ్ ఎకానమీ’పై ప్రత్యేక దృష్టి సారించింది. కంటెంట్ క్రియేటర్లు, క్రియేటివ్ రంగాల్లో పనిచేసే యువతను ప్రోత్సహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా, 2026 కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చోటుచేసుకున్నాయి. సృజనాత్మక రంగాలే భవిష్యత్ ఉపాధి అవకాశాలకు కేంద్రబిందువుగా మారనున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాలు కలిగిన యువతను తీర్చిదిద్దే లక్ష్యంతో దేశవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (IICT) నేతృత్వంలో ఈ కార్యక్రమం అమలు కానుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 15వేల పాఠశాలలు, 500 కాలేజీల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా చిన్న వయసులోనే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
ఏవీజీసీ రంగంలో భారీ డిమాండ్.. 20 Lakh Professionals Needed by 2030
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ వంటి ఏవీజీసీ రంగం వేగంగా విస్తరిస్తోంది. 2030 నాటికి ఈ రంగానికి దాదాపు 20 లక్షల మంది నిపుణులు అవసరమవుతారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శిక్షణ, మౌలిక వసతులు, పరిశ్రమలతో అనుసంధానం పెంచేలా బడ్జెట్‌లో చర్యలు చేపట్టారు. దీని వల్ల దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత యువతకు అవకాశాలు పెరగనున్నాయి.
స్టార్టప్‌లకు ఊతం.. డిజైన్‌కు కొత్త దిశ.. Boost to Startups and Design Ecosystem
కంటెంట్ క్రియేషన్, డిజిటల్ మీడియా, క్రియేటివ్ టెక్నాలజీల్లో స్టార్టప్‌లను ప్రోత్సహించడం ద్వారా కొత్తతరం సృష్టికర్తలను పెంపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ క్రమంలో తూర్పు భారతంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID)ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. దేశంలో డిజైన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, శిక్షణ పొందిన డిజైనర్ల కొరత ఉందని ఆమె పేర్కొన్నారు. కొత్త సంస్థలతో ఆ లోటును భర్తీ చేయాలని కేంద్రం భావిస్తోంది. మొత్తంగా చూస్తే, ‘ఆరెంజ్ ఎకానమీ’కి బడ్జెట్‌లో ఇచ్చిన ప్రాధాన్యం యువతకు కొత్త అవకాశాల తలుపులు తెరవనుంది. సృజనాత్మకత, సాంకేతికత, నైపుణ్యాలను మేళవించి ఉపాధి అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్రం వేసిన ఈ అడుగులు రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని అందించనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
