ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చివరిదైన ఆరో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయాలను (RBI Announces) ప్రకటించింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, దేశీయ ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయన్న అంచనాతో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాదారులు, చిన్న పరిశ్రమలు, ఎన్‌బీఎఫ్‌సీలు, రియల్ ఎస్టేట్ రంగం వంటి విభాగాలకు గణనీయమైన ఊరట కలిగించే ప్రకటనలు చేసింది.
డిజిటల్ మోసాల బాధితులకు పరిహారం .. Compensation for Victims of Digital Fraud
డిజిటల్ మోసాల బారిన పడిన బ్యాంకు వినియోగదారులకు రూ.25,000 వరకు పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించడం ఈ సమీక్షలో అత్యంత కీలకాంశంగా నిలిచింది. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎమ్‌ఈ) హామీ లేకుండా ఇచ్చే రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ పారిశ్రామిక వర్గాలకు పెద్ద భరోసా ఇచ్చింది. చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు కూడా ఆర్‌బీ ((RBI ) స్పష్టం చేసింది.
రెపో రేటు 5.25 శాతం వద్దే.. Repo Rate Kept Unchanged at 5.25%
బ్యాంకులకు ఆర్‌బీఐ((RBI ) ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు అయిన రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించాలని ఆరుగురు సభ్యులతో కూడిన పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల వల్ల వృద్ధిపై ఉన్న భయాలు తగ్గడం, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండటం ఇందుకు ప్రధాన కారణాలుగా ఆర్‌బీఐ పేర్కొంది. విధాన ధోరణిని ‘తటస్థం’గా కొనసాగించడంతో, కీలక రేట్లు ప్రస్తుతం ఉన్న తక్కువ స్థాయిల్లోనే కొనసాగుతాయన్న సంకేతాలను కేంద్ర బ్యాంకు ఇచ్చింది. 2025 ఫిబ్రవరి తర్వాత ఇప్పటివరకు మొత్తం 1.25 శాతం మేర వడ్డీ రేట్లను ఆర్‌బీఐ తగ్గించిన సంగతి తెలిసిందే. డిసెంబరు సమీక్షలో 25 బేసిస్ పాయింట్ల కోత వేశారు. ఈ కోతల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై క్రమంగా కనిపిస్తున్నట్లు ఆర్‌బీఐ అభిప్రాయపడింది.
ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాల్లో స్వల్ప పెంపు.. Slight Upward Revision in Inflation and Growth Projections
– ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను ఆర్‌బీఐ 2 శాతం నుంచి 2.1 శాతానికి సవరించింది. అయినప్పటికీ ఇది ఆర్‌బీఐ లక్ష్యంగా నిర్దేశించిన 4 శాతం కంటే చాలా తక్కువగానే ఉందని స్పష్టం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4 శాతం, రెండో త్రైమాసికంలో 4.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.
– ఆర్థిక వృద్ధి విషయంలోనూ సానుకూల సంకేతాలే ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి వృద్ధి అంచనాను 6.75 శాతం నుంచి 6.95 శాతానికి పెంచింది. 2026–27 తొలి త్రైమాసికంలో వృద్ధి 6.7 శాతం, రెండో త్రైమాసికంలో 6.8 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. సవరించిన జీడీపీ ప్రాతిపదిక సిరీస్ విడుదల అనంతరం, ఏప్రిల్ సమావేశంలో పూర్తి సంవత్సర అంచనాలు ప్రకటిస్తామని తెలిపింది.
ఓటీపీ చెప్పి మోసపోయినా పరిహారం… Compensation Even If OTP Is Shared
– డిజిటల్ ఆర్థిక మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, బ్యాంకింగ్ వినియోగదారులకు ఆర్‌బీఐ((RBI ) చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఒక మోసపూరిత లావాదేవీకి గరిష్ఠంగా రూ.25,000 వరకు పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించింది. మోసగాళ్లకు వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) చెప్పడం వల్ల డబ్బులు పోగొట్టుకున్న సందర్భాల్లో కూడా ఈ పరిహారం వర్తిస్తుందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. రూ.85,000 కోట్ల డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (డీఈఏ) ఫండ్ నుంచి ఈ పరిహారాన్ని చెల్లించనున్నారు. మోసపోయిన వ్యక్తి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ సాయం అందుతుంది. మోసం దురుద్దేశంతో జరగలేదని నిరూపించాల్సి ఉంటుంది.
– ఒకవేళ మోసమైన మొత్తం రూ.25,000లోపే ఉంటే, అందులో 15 శాతం మొత్తాన్ని బాధితుడే భరించాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ మొత్తంలో మోసపోయిన వారికి మాత్రమే గరిష్ఠ పరిహారం అందుతుంది. త్వరలోనే దీనిపై ప్రజాభిప్రాయాల కోసం ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. మోసాలను అరికట్టేందుకు అదనపు భద్రతా టూల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు అదనపు అథెంటికేషన్ విధానాన్ని తీసుకురానున్నట్లు గవర్నర్ తెలిపారు.
మిస్‌సెల్లింగ్‌పై కఠిన వైఖరి..Tough Stance on Mis-Selling
– ఆర్థిక ఉత్పత్తులు, సేవలను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కాకుండా అనైతిక పద్ధతుల్లో విక్రయించడం వల్ల వినియోగదారులతో పాటు సంస్థలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బ్యాంకు కౌంటర్ల వద్ద విక్రయించే థర్డ్‌పార్టీ ఉత్పత్తులు వినియోగదారుల రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా ఉండాలని గవర్నర్ పేర్కొన్నారు.
– ఆర్థిక ఉత్పత్తులు, సేవల ప్రకటనలు, మార్కెటింగ్, విక్రయాలపై నియంత్రిత సంస్థలకు విస్తృత స్థాయిలో నిబంధనలు తీసుకురానున్నట్లు చెప్పారు. రికవరీ ఏజెంట్ల వ్యవహారంపైనా సమీక్ష చేపట్టి, దీనికీ ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఎంఎస్‌ఎమ్‌ఈలకు రెట్టింపు రుణ పరిమితి.. MSME Loan Limit Doubled
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెద్ద ఊరటగా, ఎంఎస్‌ఎమ్‌ఈలకు హామీ లేకుండా ఇచ్చే రుణ పరిమితిని ప్రస్తుత రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. 2026 ఏప్రిల్ 1 తర్వాత మంజూరయ్యే లేదా పునరుద్ధరించబడే అన్ని రుణాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇది చిన్న పరిశ్రమలకు పెట్టుబడుల లభ్యతను పెంచి, ఉపాధి సృష్టికి దోహదపడుతుందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.
బిజినెస్ కరెస్పాండెంట్లపై దృష్టి.. Focus on Business Correspondents
గ్రామీణ, అర్ధపట్టణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను అందించడంలో కీలకంగా ఉన్న బిజినెస్ కరెస్పాండెంట్ల కార్యకలాపాలపై సమగ్ర సమీక్ష చేపట్టేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక సేవల విభాగం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, నాబార్డ్ అధికారులతో కూడిన ఈ కమిటీ సూచనల ఆధారంగా సవరించిన మార్గదర్శకాలను త్వరలో ప్రజాభిప్రాయాల కోసం విడుదల చేయనుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ నిబంధనల సవరణపైనా ముసాయిదా రానుంది.
చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు సడలింపులు.. Relaxations for Small NBFCs
రూ.1,000 కోట్ల కంటే తక్కువ ఆస్తులు ఉండి, ప్రజల నిధులు వినియోగించని చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు తప్పనిసరి రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. వీటికి వ్యవస్థాగత నష్టభయం తక్కువగా ఉండటంతో నియంత్రణల్లో సడలింపులు ఇస్తున్నట్లు తెలిపింది. 1,000 కంటే ఎక్కువ శాఖలు తెరవడానికి అవసరమైన ముందస్తు అనుమతి నిబంధనను కూడా తొలగించనున్నారు.
రీట్స్‌కు బ్యాంకు రుణాలపై ప్రతిపాదన.. Proposal to Allow Bank Loans to REITs
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (రీట్స్)కు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా అనుమతించాలన్న ప్రతిపాదనను ఆర్‌బీఐ ముందుకు తెచ్చింది. దీని ద్వారా స్థిరాస్తి రంగానికి నగదు సరఫరా మరింత బలోపేతం కానుంది. ప్రస్తుతం దేశంలో బ్రూక్‌ఫీల్డ్, ఎంబసీ, మైండ్‌స్పేస్, నెక్సస్, నాలెడ్జ్ రియాల్టీ వంటి ఐదు లిస్టెడ్ రీట్స్ ఉన్నాయి.
పసిడి రుణాలపై ఆందోళన లేదన్న ఆర్‌బీఐ.. RBI Says No Concern Over Gold Loans
పసిడి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నా, పసిడి తనఖా రుణాల విషయంలో ఎటువంటి ఆందోళన లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. లోన్ టు వేల్యూ నిష్పత్తి పరిశ్రమ ప్రమాణాల కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. డిసెంబరుతో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని, వృద్ధి దిశగా ముందడుగు పడిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు కీలక వడ్డీ రేట్లు తక్కువ స్థాయుల్లోనే కొనసాగుతాయని, అవసరమైతే మరింత తగ్గే అవకాశమూ ఉందని తెలిపారు. అయితే తుది నిర్ణయం ఎమ్‌పీసీ చేతుల్లోనే ఉంటుందన్నారు.
