ఈ రోజుల్లో మనం హాస్పిటల్‌కి వెళ్తే ఆ ఖర్చులు భరించడం మన వల్ల కాదు. బిల్లు చూస్తేనే మనం ఘొల్లు మనాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నుంచి ఉపసమనం పొందడానికే మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. అప్పుడు ఆ కంపెనీయే మన హాస్పటిల్ ఖర్చులన్నింటినీ భరిస్తుంది.
కరోనా వచ్చిన దగ్గరి నుంచి చూస్తే ప్రజల్లో హెల్త్ ఇన్సూరన్స్ ప్రాధాన్యం పెరిగిందని చెప్పుకోవచ్చు. చాలా మంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. నిపుణులు కూడా ఇన్సూరెన్స్ పాలసీని (Health Insurance Plans) తీసుకోవడం ఉత్తమం అని సిఫార్సు చేస్తున్నారు. అయితే మనలో చాలా మందికి దీనిపై సరైన అవగాహన లేదు. మరికొంతమంది క్రిటికల్ హెల్త్ సమస్యలు రావని భావిస్తూ ఉంటారు. అలాగే ఇంకొంత మంది ఇప్పటికే సమస్యలు వచ్చి పోయాయని, ఇప్పుడు పాలసీ తీసుకోవడం వల్ల ఖర్చే తప్ప పెద్ద ప్రయోజనం ఉండదని అనుకుంటూ ఉంటారు. అందుకే హెల్త్ పాలసీ తీసుకోరు. అయితే కోవిడ్ 19 (Covid 19 Pandemic) వంటి సంక్షోభాలను గుర్తించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా ఈ ప్రభావం కనిపిస్తోందనేది కాదనలేని వాస్తవం.
సంపాదించిన డబ్బులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు. ఓ ప్రముఖ పుస్తకం *రిచ్ డాడ్ పూర్ డాడ్* లో చెప్పినట్లు పూర్ మైండ్ సెట్ ఉన్నవారు షార్ట్ టర్మ్ గురించి ఆలోచిస్తారు. రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు మత్రమే లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తారు. దీని ప్రకారం చూస్తే భవిష్యత్ లో ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం. అసలు ఆరోగ్య బీమా పాలసీని ఎప్పుడైనా తీసుకోవచ్చు. కుటుంబం, ఆదాయం, ఆరోగ్యం వంటి పలు అంశాలు ప్రాతిపదికన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పాలసీ కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా కొన్ని విషయాలను గమనించాలి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.
WHAT IS WAITING PERIOD IN INSURANCE
వెయిటింగ్ పీరియడ్
సాధారణంగా మనం పాలసీ తీసుకున్న వెంటనే కవరేజీ అనేది అమల్లోకి రాదు. మనం తీసుకున్న కవరేజీ పూర్తిగా పొందగలగాలి అనుకుంటే కొంత సమయం పడుతుంది. కొంత కాలం తర్వాతే ఆ కవరేజీ పొందడానికి మనం అర్హులమవుతాం. దీనినే వెయిటింగ్ పీరియడ్ అంటారు. కొన్ని పాలసీల్లో కొన్ని వ్యాధుల కోసం నిర్దిష్టమైన వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే కొన్ని పాలసీలు ఏడాది లేదా రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్ తర్వాత ముందుగా ఉన్న వ్యాధులకు కవరేజ్ అందిస్తూ ఉంటాయి. మరికొన్ని ప్లాన్స్ మాత్రం నాలుగేళ్ల తర్వాతనే కొన్నివ్యాధులకు కవరేజ్ ఆఫర్ చేస్తుంటాయి. అందువల్ల తక్కువ వెయిటింగ్ పీరియడ్ కలిగిన సమగ్రమైన ఆరోగ్య బీమా కవరేజ్ అందించే పాలసీని ఎంచుకోవాలి. ఈ విషయాలను పాలసీ తీసుకునే ముందే పూర్తిగా అవగాహన చేసుకోవాలి.
KNOW THE TERMS OF INSURANCE POLICY
పాలసీ నిబంధనలు తెలుసుకోవాలి
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో నియమ నిబంధనలను కచ్చితంగా తెలుసుకోవాలి. అవసరాలకు అనువైన పాలసీ ఎంచుకోవాలి. పాలసీ తీసుకునే సమయంలో రూల్స్ తెలుసుకోకపోతే క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంకా బీమా మొత్తాన్ని కరెక్ట్‌గా ఎంచుకోవాలి. కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా పాలసీ ఉండాలి. ప్రాణాంతక వ్యాధులకు కూడా పాలసీ వర్తించాలి. అలాగే టెలీమెడిసిన్, హోమ్ కేర్, డేకేర్ వంటివి కూడా పాలసీలో కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఉద్యోగం, కుటుంబం, మెడికల్ ఇన్సురెన్స్ అనేది అందరికీ ఒకేలా ఉండవు. వాటిన్నింటినీ గమనించుకోవాలి.
తప్పులు ఏమిటో తెలుసుకుంటే..
హెల్త్ ఇన్సురెన్స్ చేయించుకుంటే ప్రశాంతంగా ఉండవచ్చు. మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినపుడు ఏ హాస్పిటల్ కి వెళ్లాలి.. ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అని భయపడనవసరం లేదు. కానీ ప్రాక్టికల్ గా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి కారణం మాత్రం మనం చేస్తున్న చిన్నచిన్న తప్పులే. కొన్ని తప్పులు పాలసీ తీసుకోకముందు చేస్తుంటారు. కొన్ని తప్పులు పాలసీ తీసుకున్న తర్వాత చేస్తుంటారు. ఆ తప్పులు ఏమిటో తెలిస్తే మన ఆరోగ్యం పట్ల, మన కుటుంబం ఆరోగ్యం పట్ల మనశ్శాంతిగా ఉండవచ్చు. ప్రతి వ్యక్తి జీవితంలో హెల్త్ ఇన్సురెన్స్ అనేది అతిపెద్ద నిర్ణయం, అతి ముఖ్యమైన కూడానూ.
WHAT IS PORTABILITY IN INSURANCE
ఇన్సూరెన్స్‌లో పోర్టబులిటీ ఉండేలా చూసుకోవాలి
మనకు ఇది వరకే ఒక కంపెనీకి చెందిన ఆరోగ్య బీమా పాలసీ ఉందనుకుందాం. ఇప్పడు అంతే మొత్తానికి, అదే రకమైన పాలసీని మరిన్ని అదనపు సౌకర్యాలతో మరో కంపెనీ అందిస్తుంటే, వెంటనే మనం మన పాలసీని ఆ కంపెనీలోకి మార్చుకోవచ్చు. దీనినే పోర్టబులిటీ అంటాం. మనం ఉద్యోగం చేస్తున్న మొదట్లో హెల్త్ పాలసీ తీసుకుంటాం. అప్పుడు మనకి కొన్ని విషయాలు తెలియవు. కానీ పాలసీ రెన్యువల్ కి వచ్చినపుడు మనకి ఆ పాలసీ అనుకూలంగా లేకపోతే వేరే కంపెనీ పాలసీ తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సురెన్స్ ఆప్షన్ లో కూడా పోర్టబులిటీ ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా పాలసీదారులు వినియోగించుకోవచ్చు. చాలాకాలం సొంత డబ్బులతో బీమా కట్టిన తర్వాత క్లెయిమ్ చేసే సమయంలో ఎక్కువ శాతం మందికి సగం డబ్బులు కూడా రాకపోవచ్చు. ఇటువంటి పరిస్థితి మనకు ఎదురవకముందే మేలుకోవడం ఉత్తమం. ముందస్తుగానే పాలసీ ఆప్షన్స్‌లో పోర్ట్ బులిటీని ఎంచుకోవడం శ్రేయస్కరం.
According to World Health Organization statistics
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం
వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం. కానీ మారిన కాలమాన పరిస్థితుల్లో చిన్న వయసులో ఉన్న యువత జీవన శైలితో రుగ్మతలు, మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ప్రపపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం హృదయ సంబంధిత వ్యాధుల కారణంగా కలుగుతున్న మరణాల్లో అయిదో వంతు భారతీయ యువకులే ఉండడం బాధ కలిగించే అంశం. షుగర్‌తో బాధపడుతున్న వారు ఏడు కోట్ల మందికి పైగా ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఏ అనారోగ్యం బారిన పడతారన్నది ఎవరూ చెప్పలేరు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడే భవిష్యత్ కు ఆర్థిక భద్రత ఉండేలా ఒక ఆరోగ్య బీమా పాలసీ ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
DONT THINK OF INSURANCE IS A WESTE
దండగ అని భావించొద్దు
హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవడం దండగ అని ఎందుకు అనుకుంటారంటే మనం కట్టిన డబ్బులు తిరిగిరావు కాబట్టి. కాని మనం పాలసీ తీసుకున్న తర్వాత లాంగ్ టర్మ్ లో చూస్తే మన మెడికల్ బిల్ ఎలా సేవ్ అవుతుందో తెలుస్తుంది.
* ఒకసారి అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరితే రూ.లక్షలు ఖర్చవుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. చాలామంది తాము ఆరోగ్యంగానే ఉన్నామని, తమకు ఆరోగ్య బీమా అవసరం లేదని అనుకుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆర్థిక ప్రణాళిక అనేది మొదటి బీమా పాలసీతోనే ప్రారంభం కావాలి.
* చిన్నవయసులో ఉన్నప్పుడు బీమా తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో చిక్కులు లేకుండా చేసుకోవచ్చు.
* 30 ఏళ్ల లోపే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా తక్కువ ధరకే పాలసీ లభిస్తుంది.
* తక్కువ వయసులో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉండవు కాబట్టి సంస్థలు బోనస్ లు, ఇతర ప్రయోజనాల రూపంలో ప్రోత్సాహకాలను పొందగలుగుతారు. ఒక్కోసారి మనం కొన్ని సంవత్సరాలు క్లెయిమ్ చేసుకోలేకపోవచ్చు. అప్పుడు మనకి నో క్లెయిమ్ బోనస్ బీమా ను కంపెనీలు అందిస్తాయి.
* థైరాయిడ్, ఆస్తమా వంటి ముందుగా ఉన్న వ్యాధుల చికిత్స కోసం ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న తర్వాత కొంతకాలం వేచి చూడాలి. బీమా సంస్థలను బట్టి ఇది ఏడాది నుంచి మూడేళ్ల వరకూ ఉంటుంది. 30ఏళ్ల లోపు వారికి ఈ తరహా వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి నిరీక్షణ, వ్యవధి గురించి చింతించాల్సిన అవసరం ఉండదు.
* పాలసీ తీసుకున్న తర్వాత అనుకోకుండా వ్యాధుల బారిన పడినా చికిత్సకు ఏ ఇబ్బందీ ఉండదు. ఒకసారి అనారోగ్యం పాలైన తర్వాత పాలసీని తీసుకున్నా కొన్ని మినహాయింపులతో పాలసీని ఇస్తారు.
* సమగ్ర బీమా పాలసీని ఎంచుకున్నప్పుడు కొన్నిసార్లు కచ్చితమైన మినహాయింపులు, తగ్గింపులు ఉండే అవకాశం ఉంది. చికిత్స మొత్తంలో కొంత మొత్తాన్ని పాలసీదారుడు భరించాల్సి ఉంటుంది. మిగతాదాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. లేదా చికిత్స ఖర్చు నిర్ణీత పరిమితికి మించినప్పుడు, ఆ పై మొత్తానికే పరిహారం ఇస్తుంది.
ఇప్పుడొద్దులే అనకూడదు..
దేశంలో నిత్యావసర సరుకులు, ఇతరత్రా వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏటా వాటి పెరుగుదల 7 నుంచి 8 శాతం వరకూ ఉంది. అయితే వాటికి తగ్గట్టుగా మన జీతాలు పెరగడం లేదు. ఏదో స్వల్ప మొత్తంలోనే జీతాలు పెరుగుతున్నాయి. కానీ మెడికల్ ఇన్సురెన్స్ మాత్రం ఏటా 14 శాతం పెరుగుతుంది. దీనికి కారణం లేకపోలేదు. నిత్యావసర సరుకుల ధరల లాగానే ఏటా మందులు, ఔషధాలు, ఇతర వైద్య సంబంధిత వస్తువులు, ముడిసరుకుల ధరలు పెరుగుతాయి. అందుకే వాటికి తగ్గట్టుగానే మెడికల్ ఇన్సురెన్స్ పాలసీ ప్రీమియం బిల్స్ కూడా పెరుగుతున్నాయి. అదే వెంటనే తీసుకుంటే తక్కువ ప్రీమియంతో కట్టవచ్చు. దాదాపు అదే కంటిన్యూ అవుతుంది. దీనిని పాలసీదారులు గుర్తించాలి. ఈ విషయంలో తాత్సారం చేయడం తగదు.
* జీతం తక్కువ అనే కారణం, లేదా జీతం పెరిగిన తర్వాత పాలసీ తీసుకుంటాను అనుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మొదట మనకి జీతం రాగానే చేయవలిసిన పని హెల్త్ ఇన్సురెన్స్, లైఫ్ ఇన్సురెన్స్ తీసుకోవడం. పెళ్ళి కాకపోతే సింగల్ గా పాలసీ తీసుకోవచ్చు. పెళ్లైన తర్వాత ఫ్యామిలీ మొత్తానికి తీసుకోవాలి. పిల్లలు పుట్టిన తర్వాత ఒక్కక్కరినీ యాడ్ చేసుకోవచ్చు.
తెల్ల రేషన్ కార్డ్ ఉన్నా ఇన్సూరెన్స్ తీసుకోండి
చాలామంది ఆరోగ్యశ్రీ, లేదా తెలుపు రేషన్ కార్డు ఉందనే భావనతో ఆరోగ్య బీమాపై దృష్టి పెట్టరు. ఉచితంగా ఆసుపత్రుల్లో ట్రీట్‌మెంట్ జరుగుతున్నప్పుడు హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవడం ఎందుకని అనుకుంటారు. కానీ తీవ్రమైన జబ్బులు వస్తే ట్రీట్ మెంట్ చేసే హాస్పిటల్స్ కనిపించవు. ఆరోగ్యశ్రీ, వైట్ రేషన్ కార్డ్స్ కి లిమిట్ అనేది రూ. 5 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రైవేటు హాస్పిటల్స్ మనల్ని అడ్మిట్ చేసుకునే రిస్క్ తీసుకోవు. ఇంకొంతమంది వ్యాధులు వచ్చినపుడు లేదా మంచం పట్టినప్పుడు, రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు ఇన్సురెన్స్ తీసుకుందాం అని అనుకుంటారు. కానీ క్యాన్సర్, హార్ట్ ఎటాక్ లాంటి తీవ్రమైన జబ్బులు వచ్చినపుడు ఏ కంపెనీ ఇన్సురెన్స్ ఇవ్వదు. ESI అన్ని హాస్పిటల్స్ కి పనిచేయవు. ముఖ్యంగా కార్పోరేట్ హాస్పిటల్స్ కి పనిచేయవు. అటువంటప్పుడు మనం మొదట హాస్పిటల్లో డబ్బులు కట్టి తర్వాత బిల్స్ క్లెయిమ్ చేసుకోవలిసి ఉంటుంది.
మనకి కంపెనీ ఇచ్చిన మెడికల్ ఇన్సురెన్స్ మనం ఆ కంపెనీలో ఉన్నంతవరకు మాత్రమే పనిచేస్తుంది. వేరే కంపెనీకి మారితే పనిచేయదు. మన కంపెనీలో మన స్థాయిని బట్టి మాత్రమే ఇన్సురెన్స్ ని నిర్ణయిస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ ముందస్తుగా హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవడం మంచిది.
How much amount to take the policy
ఎంత అమౌంట్ కు పాలసీ తీసుకోవాలంటే
ఎంత మొత్తానికి పాలసీని తీసుకోవాలన్నది మనలో చాలామందికి తెలియదు. అందుకే మనకి దగ్గర్లో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఒక్కరోజు ట్రీట్ మెంట్ కి ఎంత బిల్లు ఇస్తారో కనుక్కోవాలి. ఆ తర్వాత ప్రీమియం కాలిక్యులేటర్ ఉపయోగించినపుడు, కస్టమర్ కేర్ తో మాట్లాడినపుడు ఇన్సురెన్స్ అమౌంట్ ఎక్కువగా ఉన్న ప్రీమియం అడగాలి. కొన్ని తీవ్రమైన జబ్బులకు లక్షలు సరిపోవు. కోటి రూపాయలు కూడా అవ్వవచ్చు. అలాంటప్పుడు మనం చేయాల్సిన ఉత్తమమైన పని కోటి రూపాయలకు టాప్ అప్ పాలసీ తీసుకోవడం.
what is Super Top up Policy
సూపర్ టాపప్ పాలసీ అంటే
సూపర్ టాపప్ పాలసీలో ఏడాదిలో మినహాయింపు పరిమితిని లెక్కించి, బీమా సంస్థలు పరిహారాన్ని చెల్లిస్తాయి.
ఉదాహరణకు మీరు రూ.3 లక్షల విలువైన ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నారనుకుందాం. టాపప్ పాలసీ రూ.3 లక్షలు ఖర్చయినప్పుడు వర్తించేలా తీసుకున్నారు. ఒక పాలసీలో ఏడాదిలో రూ.2లక్షల విలువైన రెండు క్లెయిమ్‌లు చేశారు. ఇప్పుడు మీ ప్రాథమిక పాలసీ మొదటిసారి క్లెయిమ్‌కు రూ.2 లక్షలు పాలసీ చెల్లిస్తుంది. మరో క్లెయిమ్‌కు రూ.లక్ష చెల్లిస్తుంది.
సూపర్ టాపప్ పాలసీ ఉందనకుంటే.. మొదటి క్లెయిమ్‌కు రూ.2లక్షలు ప్రాథమిక పాలసీ చెల్లిస్తుంది. రెండోసారి రూ.లక్ష ప్రాథమిక పాలసీ భరిస్తే.. మరో రూ.లక్ష సూపర్ టాపప్ పాలసీ చెల్లిస్తుంది. మినహాయింపుల వల్ల కొన్నిసార్లు ఆర్థిక భారం పడినప్పటికీ.. చిన్న మొత్తాలకూ ఆరోగ్య బీమా క్లెయిమ్ చేసుకోకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా నో క్లెయిం బోనస్ ద్వారా పాలసీ విలువ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. క్లెయిమ్ చేసుకున్నప్పుడు కొన్ని బీమా సంస్థలు అదనపు ప్రీమియాన్ని వసూలు చేస్తుంటాయి. దీన్ని నివారించేందుకూ మినహాయింపులు ఉపయోగపడతాయి.
PRE – EXISTING DISEASES
ముందుగా ఉన్న వ్యాధులను చెప్పాలి
మనం పాలసీ తీసుకున్నప్పుడు మనకి ఇంతకు ముందు ఉన్న జబ్బులు కచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే తర్వాత ఏదైనా జరిగినపుడు ఈ జబ్బులు బయటపడితే మన ప్రీమియం పెంచే అవకాశం ఉంటుంది. మన మెడికల్ హిస్టరీ పూర్తిగా బీమా కంపెనీ వాళ్ళకి తెలియజేయాలి. మనకి వాళ్ళు పాలసీ ఇష్యూ చేసిన తర్వాత మనకి ఇంతకుముందు ఉన్న జబ్బుల ట్రీట్ మెంట్ పై వెయిటింగ్ టైమ్ ఇస్తారు. అప్పటికీ మనకి ఏమీ కాకపోతే ముందు ఉన్న డిసీజస్ ని కూడా యాడ్ చేస్తారు. మనం ఏ పాలసీలో తక్కువ వెయింటింగ్ పీరియడ్ ఉందో చూసుకోవాలి.
ఒకేసారి ప్రీమియం కట్టలేనప్పుడు చాలామంది తక్కువ ఇన్సురెన్స్ తీసుకుంటారు. అయితే కొన్ని కంపెనీలు ఈఎమ్ఐ సౌకర్యం కూడా కల్పిస్తాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకోవచ్చు.
చాలాకంపెనీలు బేసిక్ కవరేజీ ఉన్న స్టాండర్డ్ పాలసీలను మాత్రమే అందిస్తాయి. అందులో కొన్ని జబ్బులు, కొన్ని ప్రత్యేక సందర్భాలను కలపరు. అటువంటి వాటిని ముందస్తుగా మనం గమనించాలి.
* మన ఇన్సురెన్స్ కవరేజీలో 1శాతాన్ని రూమ్ రెంట్ కవరేజీగా నిర్ణయిస్తున్నారా లేదా అని చూసుకోవాలి.
* చాలామంది ప్రీమియం తక్కువ ఉందికదా అని CO-PAYMENT CLAUSE ని తీసుకుంటారు. పాలసీ తీసుకున్నప్పుడు కో పేమెంట్ తక్కువ ఉన్నది తీసుకోవాలి. లేదా కో పేమెంట్ లేనిది తీసుకోవాలి.
What is Claim Settlement Ratio
క్లెయిమ్ సెటిల్ మెంట్ రేషియో
హెల్త్ ఇన్సురెన్స్ ఏ కంపెనీలో తీసుకోవాలో మనకి తెలియాలంటే మనం చూడవలిసిన అతి ముఖ్యమైన విషయం క్లెయిమ్ సెటిల్ మెంట్ రేషియో. అయితే కంపెనీల ప్రాతిపదికన ఈ విషయంలో మార్పులు ఉండొచ్చు. అంటే కొన్ని కంపెనీలు సులభంగానే క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేస్తుంటాయి. మరికొన్ని కంపెనీల్లో క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ కష్టంగా ఉండొచ్చు. అందువల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఎలా ఉందో గమనించాలి. ఇది ఎక్కువగా ఉంటేనే మంచిదని గుర్తించుకోవాలి.
* క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో 95 శాతం కంటే ఎంత ఎక్కువగా ఉంటేనే మంచిదిగా పరిగణించాలి. అంటే ఒక కంపెనీ సెటిల్ చేయాల్సిన క్లెయింలు వంద ఉన్నాయనుకుంటే అందులో సుమారు 95 క్లెయింలను సెటిల్ చేసి, ఏవో కారణాల చేత కేవలం ఆ మిగిలిన ఐదింటిని మాత్రం తిరస్కరించి ఉండాలి. ఈ విధంగా సెటిల్ మెంట్ ఉంటేనే ఆ కంపెనీలను మనం నమ్మవచ్చు.
* కొన్ని కంపెనీలు వంద క్లెయింలకు 50 లేదా 60 మాత్రం సెటిల్ చేసి, మిగిలిన వాటన్నింటినీ ఏవో కారణాలు చెప్పి తిరస్కరించినట్టయితే అలాంటి కంపెనీలను పూర్తిగా దూరం పెట్టాలి.
* మనం ఇన్సురెన్స్ కంపెనీల క్లెయిమ్ సెటిల్ మెంట్ టైమ్ చూడడం కూడా చాలా ముఖ్యం. అంటే మనం సమస్య వచ్చినప్పుడే బీమాను పొందగలగాలి. అలా వస్తేనే మనకు న్యాయం జరిగినట్టు.
* మామూలుగా ఇన్సురెన్స్ అమౌంట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు నిరభ్యంతరంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం పాలసీ తీసుకున్నప్పుడు మన దగ్గర్లో క్యాష్ లెస్ హాస్పిటల్స్ లేదా నెట్ వర్క్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఏ కంపెనీకి ఎక్కువ హాస్పటల్స్ ఉంటాయో ఆ కంపెనీ పాలసీ తీసుకోవడం మంచిది.

