ట్రేడింగ్‌లో (Traders)కొన్ని ప్రాథమిక విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. కొన్నింటికి దూరంగా ఉండాలి. అప్పుడే నష్టాలను నియంత్రించుకుంటూ లాభాల వైపు సాగేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడింగ్‌లో ముందస్తు ప్రణాళిక ఎంతో కీలకం. ఏ స్టాక్‌లో ట్రేడ్ చేయాలి.. ఎంత మొత్తంతో పొజిషన్ తీసుకోవాలి.. ఎంత నష్టం వస్తే బయటకు రావాలి.. ఎంత లాభం వచ్చినప్పుడు ఎగ్జిట్ కావాలి అన్నది ముందే నిర్ణయించుకోవాలి. మార్కెట్ తెరుచుకున్న తర్వాతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే భావోద్వేగాలకు లోనై తప్పులు చేసే అవకాశం ఎక్కువ.
ముందస్తు ప్రణాళికే కీలకం.. Planning Before Trading Matters
షేర్ మార్కెట్లో (Traders) ట్రేడింగ్ అంటే కేవలం ఒక స్టాక్‌ను కొనడం.. ధర పెరిగినప్పుడు అమ్మడం మాత్రమే కాదు. అందులో ఎన్నో అంశాలను పరిశీలించాలి. ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవారు మార్కెట్ ప్రారంభానికి ముందే తమ ట్రేడింగ్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలి. ఏ స్టాక్స్ కదలికలో ఉన్నాయి.. వాటికి సంబంధించిన వార్తలు ఏమిటి.. మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది.. ఏ స్థాయిలో కొనాలి.. ఎక్కడ స్టాప్‌లాస్ పెట్టాలి.. ఎక్కడ లాభాలను తీసుకోవాలి వంటి అంశాలపై ముందుగానే స్పష్టత ఉండాలి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారిగా స్టాక్ ధర కదలడం మొదలైతే చాలామంది ఆలోచించకుండా ట్రేడ్‌లోకి ప్రవేశిస్తుంటారు. కొద్దిసేపట్లోనే ధర మరింత పెరుగుతుందని భావించి కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత ధర తగ్గితే ఆందోళన మొదలవుతుంది. చివరకు ఒక నిర్ణయం తీసుకోలేక నష్టాలను పెంచుకుంటారు. అందుకే ట్రేడింగ్‌లో మొదటి నియమం.. ముందుగా ప్లాన్ చేసుకోవడం.. ఆ ప్లాన్‌కు కట్టుబడి ఉండటం.
ఓవర్ ట్రేడింగ్ వద్దు.. Avoid Overtrading
ట్రేడర్లను (Traders)ఎక్కువగా నష్టాల బాట పట్టించే అంశాల్లో ఓవర్ ట్రేడింగ్ ఒకటి. మార్కెట్లో మంచి అవకాశాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయని భావించి పదేపదే ట్రేడ్లు చేయడం సరైన పద్ధతి కాదు. ఒక ట్రేడ్‌లో నష్టం వచ్చిన వెంటనే దాన్ని పూడ్చుకోవాలని మరో ట్రేడ్ చేయడం.. అది కూడా నష్టపోతే ఇంకో ట్రేడ్‌లోకి వెళ్లడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు రోజుకు ఒక పరిమితిని పెట్టుకోవడం మంచిది. ఉదాహరణకు రూ.లక్ష పెట్టుబడితో ఒక పొజిషన్ తీసుకున్నామని అనుకుందాం. మన ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం గరిష్ఠంగా రూ.5,000 నష్టాన్ని భరించగలమని ముందే నిర్ణయించుకోవచ్చు. అదే సమయంలో రూ.10,000 లాభం వస్తే బయటకు రావాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఈ రెండు స్థాయిల్లో ఏది ముందుగా చేరితే దాని ప్రకారం ట్రేడ్‌ను ముగించాలి. ఇలా ముందుగానే నష్ట పరిమితి, లాభ లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం వల్ల మార్కెట్ కదలికలకు అనుగుణంగా భావోద్వేగ నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది. అయితే ప్రతి ట్రేడర్ పెట్టుబడి, రిస్క్ సామర్థ్యం, వ్యూహానికి అనుగుణంగా పరిమితులను నిర్ణయించుకోవాలి.
ఏవరేజింగ్.. ప్రమాదకరం.. Why Averaging Can Be Risky
ట్రేడింగ్‌లో (Traders)చాలామంది చేసే మరో తప్పు ఏవరేజింగ్. ఒక స్టాక్‌ను రూ.1,000 వద్ద కొనుగోలు చేశారని అనుకుందాం. ఆ తర్వాత అది రూ.990కి పడిపోయింది. మరింత తగ్గి రూ.980కి వచ్చింది. అప్పుడు ధర తక్కువగా ఉందని భావించి మరిన్ని షేర్లు కొనుగోలు చేయడం మొదలుపెడతారు. దీంతో కొనుగోలు సగటు ధర తగ్గుతుంది. తిరిగి స్టాక్ రూ.1,000కు చేరితే లాభపడతామని భావిస్తారు. కానీ ట్రేడింగ్‌లో సమస్య ఇక్కడే ఉంటుంది. స్టాక్ రూ.980 వద్ద ఆగిపోతుందన్న హామీ లేదు. అది రూ.950.. రూ.900.. ఇంకా దిగువకు కూడా వెళ్లవచ్చు. అప్పుడు నష్టంలో ఉన్న పొజిషన్ మరింత పెద్దదవుతుంది. మొదట చిన్నదిగా ఉన్న నష్టం, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల పెద్ద నష్టంగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇంట్రాడే ట్రేడింగ్‌లో కేవలం ధర పడిపోయిందనే కారణంతో అదే స్టాక్‌లో మళ్లీ మళ్లీ కొనుగోలు చేయడం ప్రమాదకరం. ఒక ట్రేడ్ మన అంచనాలకు అనుగుణంగా సాగకపోతే ముందుగా నిర్ణయించిన స్టాప్‌లాస్ ప్రకారం బయటకు రావడం మంచిది. తర్వాత మార్కెట్లో మరో మంచి అవకాశం కోసం ఎదురుచూడవచ్చు.
ఒకే స్టాక్‌పై ఆధారపడొద్దు.. Keep Position Size Under Control
ట్రేడింగ్‌లో (Traders) పొజిషన్ సైజ్ కూడా చాలా ముఖ్యమైనది. ఒకే స్టాక్‌లో ఎక్కువ మొత్తాన్ని పెట్టి మొత్తం ట్రేడింగ్ మూలధనాన్ని ఒకే లావాదేవీకి కట్టిపడేయకూడదు. ఆ స్టాక్ మన అంచనాలకు విరుద్ధంగా కదిలితే నష్టం కూడా భారీగా ఉండొచ్చు. అందుకే రిస్క్‌ను నియంత్రించేందుకు పొజిషన్ సైజ్‌ను పరిమితిలో ఉంచాలి. ఒకే స్టాక్‌పై ఎక్కువ ఆశ పెట్టుకోకుండా, అవకాశాలను పరిశీలించి తగిన విధంగా మూలధనాన్ని నిర్వహించాలి. డైవర్సిఫికేషన్ అనేది ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించిన వ్యూహం అయినప్పటికీ, ట్రేడింగ్‌లోనూ ఒకే స్టాక్‌పై అధిక ఎక్స్పోజర్ తీసుకోకుండా ఉండటం రిస్క్ నియంత్రణలో సహాయపడుతుంది. అలాగే లాభం విషయంలోనూ అత్యాశ వద్దు. ఒక ట్రేడ్‌లో కొంత లాభం వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం ముఖ్యం. స్టాక్ ఇంకా పెరుగుతుందని భావిస్తూ మొత్తం లాభాన్ని తిరిగి మార్కెట్లో వదిలేయడం వల్ల వచ్చిన లాభం కరిగిపోవచ్చు. అందుకే లాభ లక్ష్యం, ఎగ్జిట్ వ్యూహం ముందుగానే ఉండాలి.
స్టాప్‌లాస్.. తప్పనిసరి రక్షణజ.. Stop Loss Is Your Safety Net
ట్రేడింగ్‌లో (Traders) చాలామంది ఇష్టపడని పదం ‘స్టాప్‌లాస్’. నష్టంలోనే ఎందుకు అమ్మాలి.. కొద్దిసేపు ఆగితే ధర పెరగొచ్చు.. ఇప్పుడు కాకపోతే రేపు పెరగొచ్చు.. అంటూ స్టాప్‌లాస్‌ను పట్టించుకోకుండా ఉండేవారు చాలామంది. కానీ ట్రేడింగ్‌లో ఇదే అలవాటు భారీ నష్టాలకు కారణమవుతుంది. స్టాప్‌లాస్ అంటే ఒక నిర్దిష్ట ధర స్థాయిలో నష్టం పరిమితం చేసుకుని ట్రేడ్ నుంచి బయటకు రావడానికి ముందే నిర్ణయించుకునే స్థాయి. ఉదాహరణకు ఒక స్టాక్‌ను కొనుగోలు చేసినప్పుడు అది మన అంచనాకు విరుద్ధంగా కదిలితే ఎంత వరకు నష్టాన్ని భరించగలమో నిర్ణయించుకోవాలి. ఆ స్థాయికి చేరుకున్నప్పుడు ట్రేడ్‌ను ముగించాలి. ‘తిరిగి పెరుగుతుంది’ అనే ఆశతో నష్టపోతున్న పొజిషన్‌ను పట్టుకుని ఉండటం ట్రేడింగ్ కాదు. అది ఆశపై ఆధారపడిన నిర్ణయం. మార్కెట్ మన అభిప్రాయాన్ని గౌరవించదు. ధర కదలికలు మార్కెట్ పరిస్థితులు, కంపెనీకి సంబంధించిన పరిణామాలు, రంగం పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.
చార్ట్స్ చూడాలి.. తొందర వద్దు.. Read the Charts, Avoid Impulsive Trades
ట్రేడింగ్ (Traders)చేసేవారు చార్ట్స్‌ను అర్థం చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. కేవలం ఎవరో చెప్పారని.. సోషల్ మీడియాలో చూసామని.. ఒక స్టాక్ బాగా పెరుగుతోందని విన్నామని ట్రేడ్ చేయడం సరికాదు. ధర కదలిక, ట్రెండ్, వాల్యూమ్, ముఖ్యమైన సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే ప్రతి కదలికను అవకాశంగా భావించకూడదు. కొన్ని సందర్భాల్లో మొదటి కొన్ని నిమిషాల్లో ధరలు వేగంగా కదులుతాయి. ఆ సమయంలో తొందరపడి ఎంట్రీ తీసుకుంటే అస్థిరత కారణంగా నష్టం రావచ్చు. పరిస్థితి స్పష్టంగా కనిపించిన తర్వాతే ట్రేడ్ చేయడం మంచిది. ట్రేడింగ్‌లో ‘ఏదో ఒక ట్రేడ్ చేయాలి’ అనే ఆలోచన ఉండకూడదు. మంచి అవకాశం కనిపించకపోతే ట్రేడ్ చేయకుండా ఉండటమూ ఒక నిర్ణయమే. మార్కెట్లో అవకాశాలు ఒక్క రోజుతో ముగిసిపోవు.
మనసును అదుపులో ఉంచాలి.. Control Emotions, Control Trading
ట్రేడింగ్‌లో (Traders)సాంకేతిక పరిజ్ఞానం ఎంత ముఖ్యమో మానసిక నియంత్రణ కూడా అంతే ముఖ్యం. లాభం వచ్చినప్పుడు అత్యాశ.. నష్టం వచ్చినప్పుడు భయం.. గత నష్టాన్ని పూడ్చుకోవాలనే తొందర.. ఇవన్నీ ట్రేడర్ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఒకసారి నష్టం వచ్చిందని వెంటనే పెద్ద పొజిషన్ తీసుకుని దాన్ని పూడ్చుకోవాలని ప్రయత్నించకూడదు. అలాగే వరుసగా కొన్ని ట్రేడ్లు లాభం ఇచ్చాయని రిస్క్‌ను పెంచకూడదు. మార్కెట్ ఎప్పుడైనా పరిస్థితిని మార్చగలదు. అందుకే ప్రతి ట్రేడ్‌ను కొత్త ట్రేడ్‌గా చూడాలి.
లాభం కంటే ముందు రిస్క్.. Think Risk Before Profit
షేర్ మార్కెట్లో (Traders) లాభాలు పొందాలని ప్రతి ట్రేడర్ కోరుకుంటాడు. కానీ లాభం కోసం పరుగెత్తే ముందు రిస్క్‌ను అర్థం చేసుకోవాలి. ఎంత సంపాదించవచ్చో మాత్రమే కాకుండా.. ఎంత నష్టాన్ని భరించగలమో కూడా తెలుసుకోవాలి. పెట్టుబడి సామర్థ్యానికి మించి ట్రేడింగ్ చేయకూడదు. ముఖ్యంగా అప్పు చేసి లేదా అత్యవసర అవసరాలకు ఉంచిన డబ్బుతో ట్రేడింగ్ చేయడం ప్రమాదకరం. ట్రేడింగ్ అనేది నష్టాలు లేని వ్యవస్థ కాదు. కాబట్టి ప్రతి ట్రేడ్‌లోనూ రిస్క్ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలి. మొత్తంగా చూస్తే ట్రేడింగ్‌లో విజయానికి ఒక్క సూత్రం ఉండదు. సరైన స్టాక్‌ను ఎంచుకోవడం మాత్రమే కాదు.. సరైన సమయంలో ఎంట్రీ, సరైన పొజిషన్ సైజ్, ముందుగా నిర్ణయించిన స్టాప్‌లాస్, లాభాల వద్ద ఎగ్జిట్, ఓవర్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం, భావోద్వేగాలను అదుపులో ఉంచడం వంటి అంశాలన్నీ కలిసి పనిచేస్తాయి. మార్కెట్‌ను ఓడించాలనే ఆలోచన కంటే.. ముందుగా మన రిస్క్‌ను నియంత్రించుకోవాలనే ఆలోచనతో ట్రేడింగ్ చేస్తే నష్టాలను కట్టడి చేసుకునే అవకాశం ఉంటుంది.
