ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే ఈ వ్యాధులు, ఇప్పుడు ముప్పై నుండి నలభై ఏళ్ల వయసు వారికే వచ్చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య ఖర్చులు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా (health insurance) తప్పనిసరిగా మారింది. అయితే, చాలామందిలో ఒక అనుమానం ఉంటుంది. నాకు ఇప్పటికే ఒక ఆరోగ్య సమస్య ఉంది, నాకు బీమా కంపెనీలు పాలసీ ఇస్తాయా? ఒకవేళ ఇచ్చినా క్లెయిమ్ సజావుగా అందుతుందా? అని. దీనికి సమాధానం.. ఖచ్చితంగా ఇస్తాయి. కానీ, కొన్ని నియమాలు, షరతులను తెలుసుకోవడం ముఖ్యం.
ముందుగా ఉన్న వ్యాధులు (Pre-Existing Diseases)
బీమా పరిభాషలో పాలసీ తీసుకునే సమయానికే ఒక వ్యక్తికి ఉన్న ఆరోగ్య సమస్యలను ‘ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజెస్’ అంటారు. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఆస్తమా లాంటివి ఈ జాబితాలోకి వస్తాయి. మీకు ఇలాంటి సమస్యలు ఉన్నంత మాత్రాన బీమా కంపెనీలు పాలసీని పూర్తిగా తిరస్కరించవు. మీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి తీవ్రతను బట్టి, రిస్క్ అసెస్మెంట్ ఆధారంగా పాలసీని మంజూరు చేస్తాయి.
నిజాయితీగా వివరాలు చెప్పడం ముఖ్యం! (Non-Disclosure Risk)
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు చాలామంది చేసే పెద్ద పొరపాటు.. తమకు ఉన్న అనారోగ్య సమస్యలను దాచడం. ప్రీమియం ఎక్కువవుతుందనో లేదా పాలసీ రిజెక్ట్ అవుతుందనో వివరాలు దాస్తే, భవిష్యత్తులో క్లెయిమ్ సెటిల్మెంట్ (Claim Settlement) చేసుకునేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
హాస్పిటల్లో చేరినప్పుడు, సదరు వ్యాధి పాతదే అని బీమా సంస్థకు తెలిస్తే క్లెయిమ్‌ను పూర్తిగా తిరస్కరిస్తారు. మోసం చేసినట్లు భావించి పాలసీని రద్దు చేసే హక్కు కూడా బీమా సంస్థలకు ఉంటుంది. ముందుగా ఉన్న వ్యాధుల గురించి నిజాయితీగా చెబితే, కంపెనీ కొంత అదనపు ప్రీమియం వసూలు చేసి పాలసీని జారీ చేస్తుంది. దీనిని లోడింగ్ చార్జీలు అంటారు.
ఇలా లభించిన పాలసీ ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యాష్‌లెస్ (Cashless Hospitalization) లేదా రీఇంబర్స్మెంట్ సొమ్ము అందుతుందని నిశ్చింతగా ఉండొచ్చు.
మెడికల్ టెస్టులు ఎందుకు అవసరం?
వయసు పైబడిన వారు, ముఖ్యంగా అరవై ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ (Senior Citizens) లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలసీ తీసుకునేటప్పుడు బీమా సంస్థలు కొన్ని ఉచిత లేదా రాయితీ వైద్య పరీక్షలను (Pre-Policy Medical Check-up) సూచిస్తాయి.
కంపెనీ సూచించిన నెట్వర్క్ ల్యాబ్‌లలోనే ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఈ రిపోర్టుల ఆధారంగానే మీకు ఎంత రిస్క్ ఉందో కంపెనీ అంచనా వేస్తుంది. పరీక్షలు పూర్తయ్యాక కంపెనీ పాలసీ ఇస్తే, భవిష్యత్తులో మీరు వ్యాధిని దాచారు అని కంపెనీ బ్లేమ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి మెడికల్ టెస్టులు చేయించుకుని పాలసీ పొందడమే అత్యంత సురక్షితమైన మార్గం.
వెయిటింగ్ పీరియడ్ అంటే ఏమిటి?
మీకు ముందుగా ఉన్న వ్యాధులకు పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే కవరేజ్ లభించదు. దీనికోసం కంపెనీలు ఒక సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల వరకు ‘వెయిటింగ్ పీరియడ్’ (Waiting Period) విధిస్తాయి.
ఈ కాల పరిమితి ముగిసిన తర్వాతే ఆ పాత వ్యాధులకు సంబంధించిన చికిత్స ఖర్చులను కంపెనీ భరిస్తుంది. ప్రమాదాల వల్ల జరిగే ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్కు మాత్రం మొదటి రోజు నుంచే కవరేజ్ (Accidental Coverage) ఉంటుంది.
బ్యాంక్ పాలసీలు వర్సెస్ వ్యక్తిగత పాలసీలు
(Group Health Insurance vs Retail Health Insurance)
ఖాతాదారుల కోసం బ్యాంకులు వివిధ బీమా సంస్థలతో టైఅప్ అయి తక్కువ ప్రీమియానికే బృంద ఆరోగ్య బీమా (Group Health Insurance) అందిస్తుంటాయి. వయసు పైబడిన వారికి, వ్యాధులు ఉన్నవారికి ఇవి ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగిస్తాయి. అయితే వీటిని తీసుకునేటప్పుడు కొన్ని పరిమితులను గమనించాలి. బ్యాంకు అందించే గ్రూప్ ఇన్సూరెన్స్‌లో ప్రీమియం ధర చాలా తక్కువగా ఉంటుంది.
వ్యక్తిగత రిటైల్ పాలసీలో (Retail Health Policy) వయసు, వ్యాధులను బట్టి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. బ్యాంకు పాలసీలలో రూమ్ రెంట్ పరంగా తక్కువ సబ్-లిమిట్స్ (Sub-limits) ఉంటాయి. వ్యక్తిగత పాలసీలలో వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది.
* అన్నింటికంటే ముఖ్యంగా బృంద బీమాలో కో-పేమెంట్ (Co-payment) నిబంధనలు ఉండే అవకాశం ఉంది. అంటే క్లెయిమ్ మొత్తంలో కొంత శాతం డబ్బును సొంతంగా జేబులోంచి పెట్టుకోవాల్సి రావచ్చు. వ్యక్తిగత పాలసీలలో నో కో-పేమెంట్ (No Co-payment) ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. బ్యాంకుతో సదరు బీమా సంస్థ ఒప్పందం రద్దయినా, మీ అకౌంట్ క్లోజ్ అయినా బ్యాంకు పాలసీ నిలిచిపోతుంది. అదే సొంత పాలసీ అయితే లైఫ్ టైమ్ రెన్యూవల్(Lifetime Renewability) గ్యారెంటీ ఉంటుంది.
* మీకు వెసులుబాటు ఉండి, ప్రీమియం భారం కాదు అనుకుంటే.. అన్ని రకాల నిబంధనలు చూసుకుని సొంతంగా ఒక సమగ్ర వ్యక్తిగత పాలసీ(Comprehensive Health Insurance) తీసుకోవడమే దీర్ఘకాలంలో అత్యుత్తమమైన మార్గం. ఆర్థిక ఇబ్బందుల వల్ల సొంత పాలసీ తీసుకోలేని పక్షంలో, అసలు బీమా(health insurance) లేకపోవడం కంటే బ్యాంకు పాలసీని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడం మంచిదే.
ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ నేడు మార్కెట్లో ఎన్నో ప్రత్యేకమైన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. డయాబెటిక్ కేర్ ప్లాన్స్, కార్డియాక్ కేర్ ప్లాన్స్ లాంటివి ఇందుకు ఉదాహరణ. పాలసీ తీసుకునేటప్పుడు నిబంధనలు, షరతులు, కో-పేమెంట్ వివరాలు, రూమ్ రెంట్ క్యాపింగ్స్ క్షుణ్ణంగా చదివి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్య సమాచారాన్ని దాచకుండా పాలసీని కొనుగోలు చేసి, మీ కుటుంబ ఆర్థిక భద్రతను కాపాడుకోండి.
స్రవంతి అతికం
ఇన్సూరెన్స్ అడ్వైజర్
9440012834
