తక్కువ జీతంతో సర్దుకుపోవాలా..? లేదా కెరీర్‌లో ఎత్తుకు చేరాలా..? అన్నది ప్రతి ఉద్యోగి మనసులో ఉండే ప్రశ్న. అయితే నిపుణులు చెబుతున్నట్లు కొన్ని చిన్న మార్పులు మీ జీతాన్ని నాలుగు రెట్లు పెంచేంత శక్తివంతంగా మారవచ్చు. “స్మార్ట్‌గా నేర్చుకోండి, స్మార్ట్‌గా పనిచేయండి…”ఈ విధానంతో మీ జీతం నాలుగు రెట్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు..
నైపుణ్యాలే మూలధనం .. Skills Are the Real Capital
డిజిటల్ ప్రపపంచంలో కేవలం డిగ్రీ సరిపోదు. మార్కెట్ డిమాండ్ ఉన్న కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అత్యవసరం. డిజిటల్ మార్కెటింగ్, డేటా అనాలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో శిక్షణ తీసుకుంటే ఉద్యోగ అవకాశాలు, జీతాలు రెండూ గణనీయంగా పెరుగుతాయి.
సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. Make the Best Use of Time
రోజుకు రెండు గంటలు స్వీయ అభ్యాసానికి కేటాయిస్తే… ఆ పెట్టుబడి భవిష్యత్తులో 400 శాతం లాభాలను తెచ్చిపెడుతుంది. నిపుణుల ప్రకారం “సమయమే పెద్ద పెట్టుబడి” అంటారు.
నెట్‌వర్క్ పెంచండి.. Expand Your Network
మీ ప్రొఫెషనల్ పరిచయాలు ఎంత బలంగా ఉంటే, అవకాశాలు అంతగా మీవైపునకు వస్తాయి. సెమినార్లు, ఆన్‌లైన్ వర్క్‌షాపులు, ఇండస్ట్రీ ఈవెంట్స్‌లో పాల్గొని సంబంధాలు పెంపొందించుకోవాలి.
ఫీడ్‌బ్యాక్ తప్పనిసరి.. Feedback Is Essential
తప్పులనుంచి నేర్చుకోవడం, మార్పు స్వీకరించడం వృద్ధికి బాట వేస్తాయి. బాస్ లేదా సహచరులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను విమర్శగా కాకుండా మెరుగుదల సాధనంగా తీసుకుంటే కెరీర్ దూసుకుపోతుంది.
సైడ్ స్కిల్.. అదనపు ఆదాయం.. Side Skill.. Extra Income
ఒకే రంగంలో కాకుండా ఇతర నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా ఫ్రీలాన్స్ లేదా కన్సల్టింగ్ అవకాశాలు వస్తాయి. ఇది మొత్తం ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది.
25-15-50-10 రూల్! The 25-15-50-10 Rule!
నెల జీతం వస్తే… మొదటి వారం ఉత్సాహం, చివరి వారం టెన్షన్! ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువవుతున్నాయంటే మీరు ఆర్థిక ప్రణాళిక తప్పినట్టే. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం “25-15-50-10 రూల్” పాటిస్తే.. జీతం ఎంతైనా సరే, డబ్బు కొరత అనేది ఉండదు . ఉదాహరణకు మీకు రూ.50,000 జీతం అనుకుందాం. ఇందులో ₹12,500ని పొదుపులకు కేటాయించాలి. ₹7,500 భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలి. ₹25,000 ఇంటి అద్దె, విద్యుత్ బిల్లు, రేషన్, ట్రాన్స్‌పోర్ట్, పిల్లల ఫీజులుకు కేటాయించాలి. ₹5,000 వినోదం, సినిమా, ట్రావెల్, చిన్న షాపింగ్ కోసం వాడుకోవచ్చు.
25% – సేవింగ్స్ తప్పనిసరి! 25% – Savings Are a Must!
జీతం వచ్చిన వెంటనే కనీసం 25 శాతం మొత్తాన్ని పొదుపులకు కేటాయించాలి. బ్యాంక్ RDలు, SIPలు, మ్యూచువల్ ఫండ్‌లు వంటి పెట్టుబడుల్లో పెట్టడం మంచిది. “ముందుగా సేవ్ చేయి, తరువాత ఖర్చు చెయ్యి” అనేది ఈ నియమానికి మూల సూత్రం.
15% – ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ .. 15% – Investment Fund
భవిష్యత్తు భద్రత కోసం జీతంలోని 15 శాతం పెట్టుబడులకు కేటాయించాలి. దీర్ఘకాలిక లాభాలు ఇచ్చే ఈక్విటీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, రిటైర్మెంట్ ప్లాన్‌లలో పెట్టడం మంచిది. డబ్బు పెరుగుతుంది, ట్యాక్స్ కూడా తగ్గుతుంది.
50% – అవసరాల కోసం.. 50% – For Essentials
ఇంటి అద్దె, కరెంట్, బిల్లులు, రేషన్, పిల్లల ఫీజులు లాంటి అత్యవసర ఖర్చులకు సగం జీతాన్ని వినియోగించుకోవచ్చు. దీని కంటే ఎక్కువైతే బడ్జెట్‌లో లోటు తప్పదు.
10% – వ్యక్తిగత ఖర్చులకు.. 10% – For Personal Expenses
జీవితాన్ని ఆస్వాదించకపోతే పొదుపు పనికిరాదు కదా! అందుకే 10 శాతం మొత్తాన్ని వ్యక్తిగత ఖర్చులకు, వినోదం, ట్రావెల్, షాపింగ్ కోసం వాడుకోవచ్చు. అయితే పరిమితి దాటకూడదు. ఈ 25-15-50-10 సూత్రం పాటిస్తే… జీతం చిన్నదైనా, భవిష్యత్తు పెద్దదవుతుంది. డబ్బు సంపాదించడం కళ కాదు… దాన్ని సరిగ్గా వినియోగించుకోవడమే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
సరైన వ్యాపారం ఎంచుకోవాలి.. Choose the Right Business
వ్యాపారం మొదలు పెట్టాలనుకునే ప్రతి ఒక్కరూ “ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది?” అని ఆలోచిస్టుంటారు. అయితే నిపుణులు చెబుతున్నట్లుగా.. ఏ రంగం పెద్దది, ఏ రంగం లాభదాయకమన్నదానికంటే, మనకు సరిపోయే వ్యాపారం ఎంచుకోవడమే విజయానికి మొదటి అడుగు. మీకు ఇష్టం లేని వ్యాపారం ఎప్పటికీ స్థిరంగా సాగదు. వంట ఇష్టం ఉంటే ఫుడ్ బిజినెస్, టెక్నాలజీ ఇష్టం ఉంటే డిజిటల్ సర్వీసెస్ ..ఇలా ఆసక్తి ఉన్న రంగంలో అడుగు పెట్టడం మంచిదని వ్యాపార నిపుణులు సూచిస్తున్నారు. “మనం చేయాలనుకున్నది ప్రజలు కొనాలనుకుం టున్నారా?” అనే ప్రశ్నకు సమాధానం దొరికితేనే ఆ వ్యాపారం విజయవంతం అవుతుంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్, కస్టమర్ అవసరాలు, పోటీదారుల వ్యూహాలు ముందుగానే తెలుసుకోవాలి. ప్రతి పెద్ద కంపెనీకి మొదలు చిన్నదే. మొదట తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, అనుభవం పెరిగేకొద్దీ విస్తరించాలి. ఇది రిస్క్ తగ్గించి నమ్మకం పెంచుతుంది. నేటి వ్యాపార ప్రపంచంలో ఆన్‌లైన్ ఉనికి లేకుంటే కస్టమర్ చేరువ కష్టం. సోషల్ మీడియా మార్కెటింగ్, వెబ్‌సైట్, ఆన్‌లైన్ ఆర్డర్ సిస్టమ్ అనేవి మీ వ్యాపారాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బిజినెస్ మొదలుపెట్టే ముందు ఖర్చులు, లాభం, తిరిగి వచ్చే డబ్బు సమయాన్ని అంచనా వేయాలి. లాభం మొదలయ్యే వరకు కనీసం ఆరు నెలల ఖర్చు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.
సరైన మేనేజర్ ఎంచుకోవాలి.. Choose the Right Manager
ఒక సంస్థ ఎంత పెద్దదైనా, దాన్ని నడిపేది ఒక నాయకుడి దిశ. అదే టీమ్‌ను ముందుకు నడిపించే వ్యక్తి మేనేజర్! కానీ ప్రతి మేనేజర్ నాయకుడు కాదు. నిపుణులు చెబుతున్నట్లు, సంస్థ ఎదుగుదలలో సరైన మేనేజర్ ఎంపికే కీలకం. మేనేజర్ కేవలం టార్గెట్లు సాధించే యంత్రం కాదు. ఉద్యోగుల సమస్యలు వినగలిగే మనసు, సానుకూల దృక్పథం కూడా ఉండాలి. “సంస్థ విజయం, సిబ్బంది సంతృప్తి రెండూ కలిసే సాగాలి” అని హెచ్‌ఆర్ నిపుణులు అంటున్నారు. ఒక మంచి మేనేజర్ మాట్లాడే ప్రతి మాట ప్రేరణ కావాలి. స్పష్టంగా ఆలోచనలు చెప్పగలగడం, టీమ్‌లో నమ్మకం కల్పించడం ముఖ్యం. కొంతమంది ఆదేశిస్తారు, కొంతమంది ప్రేరేపిస్తారు. రెండో వర్గమే టీమ్ నుంచి ఉత్తమ ఫలితాలు తీసుకుంటారు. ఉద్యోగులను నిందించడం కాదు, ప్రోత్సహించడం నేర్చుకున్న మేనేజర్ ఎప్పుడూ గెలుస్తాడు. టీమ్‌లో సమస్యలు తప్పవు. కానీ వాటిని ఎలా పరిష్కరిస్తామన్నదే మేనేజర్ నాణ్యతను చెబుతుంది. సహనం, సహకారం, స్పష్టత ఈ మూడు లక్షణాలు ఉన్నవారే సక్సెస్‌ఫుల్ లీడర్లు. “సరైన మేనేజర్‌ను ఎంపిక చేస్తే, అతను పదిమంది ఉద్యోగులను కాదు, పదింతల ఫలితాలను తెస్తాడు!” అని నిపుణులు అంటున్నారు.
రిస్క్‌లు… సవాళ్లు… అవకాశాలు .. Risks… Challenges… Opportunities
ఏ రంగమైనా, ఎదుగుదల మార్గంలో అడుగుపెడితే ఎదుర్కొవాల్సింది మూడు అంశాలు . అవే రిస్క్‌లు, సవాళ్లు, అవకాశాలు. వీటిని తప్పించుకోవడం కాదు.. ఎదుర్కోవడం నేర్చుకోవడమే విజయానికి మూలమంత్రం అంటున్నారు నిపుణులు.
రిస్క్ లేకుండా రివార్డ్ ఉండదు.. No Reward Without Risk
వ్యాపారం, కెరీర్, పెట్టుబడి .. ఏదైనా చేయాలంటే రిస్క్ తప్పదు. కానీ అది అజాగ్రత్త తో కాదు.. ఆలోచించి తీసుకున్న సాహసం కావాలి. “క్యాలిక్యులేటెడ్ రిస్క్” తీసుకునే వారు సాధారణంగా విజయాన్ని చేరతారు. “భయం కాదు, భవిష్యత్తు చూడగల దృష్టి ఉండాలి” అని నిపుణులు సూచిస్తున్నారు.
సవాళ్లతో కొత్త పాఠం..A New Lesson Through Challenges
ప్రతీ సవాలు కొత్త పాఠం నేర్పుతుంది. పని ఒత్తిడి, మార్కెట్ పోటీ, మారుతున్న టెక్నాలజీ ఇవన్నీ అడ్డంకులు కాదు, అభివృద్ధికి మెట్లు. ప్రతిసారీ పడిపోతే లేచే ధైర్యం ఉంటే ఎవరూ ఆపలేరు.
అవకాశాలు గుర్తించడం ఒక కళ! Identifying Opportunities Is an Art!
ఒకే పరిస్థితిలో కొందరు అవకాశాలు చూస్తారు. మరికొందరు సమస్యలు మాత్రమే చూస్తారు. పరిశ్రమలో మార్పులు, కొత్త టెక్నాలజీలు, వినియోగదారుల అభిరుచులు ఇవన్నీ కొత్త అవకాశాలే. వాటిని ముందుగానే గుర్తించే వారు ముందుంటారు.
నిరంతర అభ్యాసమే రక్షణ కవచం .. Continuous Learning Is the Shield of Success
రిస్క్ తగ్గించాలంటే నేర్చుకోవడం ఆపకూడదు. కొత్త ట్రెండ్‌లపై అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవగాహన ఇవే భవిష్యత్తు సవాళ్లకు సమాధానం. “రిస్క్ తీసుకోని వ్యక్తి స్థిరంగా ఉండొచ్చు కానీ ఎదగలేడు. సవాళ్లను స్వీకరించే వాడే నాయకుడు అవుతాడు!” అని వ్యాపార విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
రుణం అవసరమా? Do You Really Need a Loan?
కాలం మారింది… జీవనశైలి వేగం పెరిగింది. జీతం రాకముందే ఖర్చులు ముంచెత్తుతున్నాయి. ఇల్లు, వాహనం, మొబైల్, హాలిడే అన్నింటికీ ఈఎంఐల కాలం! ఒకప్పుడు “రుణం” అంటే భయం… ఇప్పుడు “క్రెడిట్” అంటే ఫ్యాషన్! అయితే రుణం సరైన విధంగా వాడకపోతే, అది భారమవుతుంది. పెద్ద లక్ష్యాల కోసం, విలువ పెరుగే వస్తువుల కోసం తీసుకునే రుణం మంచిదే. ఉదాహరణకు ఇల్లు, విద్య, వ్యాపారం వంటి రంగాల్లో పెట్టుబడి రూపంలో తీసుకుంటే అది “స్మార్ట్ డెబ్ట్”. కానీ షాపింగ్, పార్టీల కోసం తీసుకున్న అప్పు మాత్రం “డేంజరస్ డెబ్ట్”!రుణం తీసుకున్నవారు ఎక్కువగా చేసే పొరపాటు — “మెల్లగా చెల్లిస్తే ఏముంది?” అనేది. కానీ వడ్డీ మీకన్నా వేగంగా పరుగెడుతుంది. కనీసం 2–3 సంవత్సరాల్లో అప్పు తేల్చాలనే లక్ష్యంతో ముందుకు సాగాలి. నెలవారీ ఆదాయంలో 40% కంటే ఎక్కువ ఈఎంఐలుగా వెళ్తే ఆర్థిక ఒత్తిడి తప్పదు. “సేవింగ్స్ 25%, ఈఎంఐ 40%, మిగతా 35% ఖర్చులు” అనే బడ్జెట్ పాటిస్తే సురక్షితం. అప్పులు సమయానికి చెల్లించకపోతే, భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టమవుతుంది. కాబట్టి ప్రతి చెల్లింపు తేదీని జాగ్రత్తగా పాటించాలి.ఒక రుణం ఇంకా చెల్లింపులో ఉండగానే కొత్త రుణం తీసుకోవడం ప్రమాదకరం. అవసరం ఉన్నప్పుడు మాత్రమే, తిరిగి చెల్లించే శక్తి ఉన్నప్పుడే రుణం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
