ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు కాస్త గందరగోళంగా ఉన్నాయి. దేశీయంగా స్టాక్ మార్కెట్ వాతావరణం వేగంగా మారుతోంది. డాలర్ బలపడుతుండగా, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఎగబాకుతున్నాయి. అదే సమయంలో దేశీయ షేర్ మార్కెట్లో కూడా చలనం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు ఇప్పుడు దేనిలో పెట్టుబడి పెట్టాలి? అన్న ఆలోచనలో ఉన్నారు. షేర్ మార్కెట్ నుంచి క్రిప్టో, బంగారం, రియల్ ఎస్టేట్ వరకు పెట్టుబడి అవకాశాలు విస్తరించినా… ప్రతి దానిలో రిస్క్ కూడా ఉంది. లాభాల ఆశతో ముందుకు దూసుకెళ్లే చాలా మంది ఇన్వెస్టర్లు చివరికి నష్టపోతున్నారు. దీర్ఘకాల దృష్టి లేకుండా త్వరగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నం ఎప్పుడూ ప్రమాదకరమే. అందుకే పెట్టుబడి కంటే ముందు జాగ్రత్తే అసలైన లాభం. అని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం.. భద్రతకే ప్రాధాన్యం…Gold… Safety Comes First
బంగారం ఎప్పుడూ సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ద్రవ్యోల్బణం పెరిగినా, మార్కెట్లో అనిశ్చితి ఉన్నా బంగారం విలువ క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,000లకు చేరింది. మరింత పెరుగుదలకు అవకాశం ఉన్నా.. ఇప్పుడు బల్క్‌గా కొనుగోలు చేయకూడదు. ప్రతి సారి చిన్న మొత్తాలుగా కొనడం ఉత్తమం. అనినిపుణులు చెబుతున్నారు.
వెండి.. దీర్ఘకాలిక లాభాల దిశగా.. Silver… Focus on Long-Term Gains
వెండి ధరలు కూడా ఇటీవల పెరిగినా, ఇంకా ఆకర్షణీయ స్థాయిలోనే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. పరిశ్రమలలో సైతం వెండి వినియోగం పెరుగుతుండటంతో దీర్ఘకాలంలో దీని విలువ మరింతగా పెరగవచ్చని అంచనా. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2లక్షలకు చేరువలో ఉంది. కాగా రానున్న 2 లేదా 3 ఏళ్ల ప్రణాళికతో వెండిలో పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలు రావచ్చు. అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు..
షేర్ మార్కెట్.. రిస్క్ ఉన్నా రిటర్న్ ఎక్కువ..Silver… Toward Long-Term Gains
బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సూచీలు రికార్డు స్థాయిల్లో ఉన్నాయి. అయితే మార్కెట్ వాల్యుయేషన్లు కాస్త ఎక్కువగా ఉన్నందున కొత్తగా ప్రవేశించే వారికి జాగ్రత్త అవసరం.మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. బ్లూ చిప్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయని నిపుణుల అభిప్రాయం. పెట్టుబడులను విభజించడం ఉత్తమ వ్యూహం. నగదు మొత్తాన్ని ఒకే రంగంలో పెట్టకుండా బంగారం, షేర్లు, వెండి, బ్యాంకు డిపాజిట్లు ఇలా విభజించాలి. దీర్ఘకాలిక లాభాలు పొందాలంటే ప్లాన్డ్గా ముందుకు వెళ్లాలి. తక్షణ భద్రత కోసం బంగారంలో, దీర్ఘకాలిక రిటర్న్స్ కోసం వెండిలో, మంచి రాబడి ఆశించే వారు షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
షేర్ మార్కెట్ వెనుకబడింది ఎందుకు..? Why Has the Stock Market Fallen Behind?
దేశీయ స్టాక్ మార్కెట్ గత కొన్ని వారాలుగా ఊపుమీద నడిచినా.. తాజాగా కాస్త వెనుకంజ వేసింది. పెట్టుబడిదారులకు ఆశించినంత రాబడి అందకపోవడంతో మార్కెట్లో జోరు తగ్గింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు కొంతమేర క్షీణించాయి. ఇదే పరిస్థితి మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలోనూ కనిపించింది.
విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ..Withdrawal of Foreign Investments
అమెరికా, యూరప్ వడ్డీ రేట్లు తగ్గించే సూచనలు ఇవ్వకపోవడంతో విదేశీ పెట్టుబడిదారులు (FIIs) తమ నిధులను భారత మార్కెట్ నుంచి తీసుకుంటున్నారు. డాలర్ బలపడటంతో ఇతర మార్కెట్లలో కూడా పెట్టుబడుల మైగ్రేషన్ మొదలైంది. దీంతో భారత మార్కెట్ మీద ఒత్తిడి పెరిగింది. అని విశ్లేషకులు చెబుతున్నారు.
లాభాల స్వీకరణ ప్రభావం.. Impact of Profit Booking
ఇటీవల కాలంలో మార్కెట్ గరిష్ట స్థాయిలకు చేరడంతో అనేక మంది ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు అమ్మకాలు ప్రారంభించారు. ఈ “ప్రాఫిట్ బుకింగ్” కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.
దీర్ఘకాలిక దృష్టితో కొనసాగాలి.. Should Continue with a Long-Term Perspective
ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పు చేయకపోవడం, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం తగ్గకపోవడం వల్ల పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఐటీ, బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్లు కాస్త వెనుకబడ్డాయి. త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు తగ్గట్లు రాకపోవడం కూడా షేర్ మార్కెట్‌కు దెబ్బతీసింది. కొన్ని కంపెనీలు మునుపటి లాభాలను కొనసాగించలేకపోవడంతో పెట్టుబడిదారుల విశ్వాసం కొంత తగ్గింది. మార్కెట్ కరెక్షన్ అనేది తప్పనిసరి దశ. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యకరమైన పరిణామం. పెట్టుబడిదారులు భయపడకుండా, నాణ్యమైన కంపెనీల్లో దీర్ఘకాలిక దృష్టితో కొనసాగాలి.
ఇప్పుడు బంగారం, వెండి కొనవచ్చా.. Is It the Right Time to Buy Gold and Silver Now?
ఒక్కసారిగా బంగారం, వెండి కొనుగోలు చేయరాదని నిపుణులు చెబుతున్నారు. బంగారం ETF లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్ పరిగణనలోకి తీసుకోవాలి. మూడు నుంచి ఐదేళ్ల దీర్ఘకాల దృష్టితో వెండి, బంగారంలో పెట్టుబడులు పెట్టడం మంచిది. బంగారం, వెండి ధరలు ఎగబాకినా భయపడకుండా.. ఆలోచించి కొనాలి. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగినా, ఆర్థిక అనిశ్చితి ఉన్నా… వాటి ధరలు మాత్రం తగ్గవు.
లాభాల వెనక పరిగెత్తొద్దు..Don’t Chase After Profits
మార్కెట్లో గ్యారంటీ అనే మాట ఉండదు. దీర్ఘకాల దృష్టి లేకుండా త్వరగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నం ఎప్పుడూ ప్రమాదకరం. ఏ రంగంలోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసేముందు ఆ రంగంపై స్పష్టమైన అవగాహన అవసరం. కంపెనీ రికార్డులు, మార్కెట్ ట్రెండ్, గత రాబడులను పరిశీలించాలి. బంగారం ధర బాగుంది కదా అని , షేర్ మార్కెట్ ఎగిసిందని మొత్తం డబ్బు వాటిల్లో పెట్టడం ప్రమాదకరం. పెట్టుబడిని విభజించడం అత్యంత అవసరం. లోన్ తీసుకుని షేర్ మార్కెట్లో, క్రిప్టోలో పెట్టుబడి పెట్టడం అత్యంత రిస్క్. మార్కెట్ క్షీణిస్తే నష్టాలు రెట్టింపు అవుతాయి. దీర్ఘకాలం దృష్టితో పెట్టుబడులు చేస్తేనే ఫలితం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలు, గోల్డ్ బాండ్స్ వంటి పెట్టుబడులు కాలంతో పాటు రాబడిని పెంచుతాయి. మార్కెట్ పడిపోతే భయంతో అమ్మేయడం, పెరిగితే ఉత్సాహంతో కొనడం… తప్పు. శాంతంగా, లాజిక్‌తో నిర్ణయం తీసుకోవాలి. సోషల్ మీడియా ద్వారా ‘మూడురోజుల్లో డబుల్ రిటర్న్’ అని ప్రచారం చేసే ఫ్రాడ్ స్కీమ్స్ నుంచి దూరంగా ఉండాలి. RBI లేదా SEBI అనుమతి లేని స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం ప్రమాదం.
