ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగాన్ని ఏఐ ప్రభావం బలంగా తాకుతుండగా… అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు, వీసా ఆంక్షలతో సృష్టించిన అనిశ్చితి అక్కడి కంపెనీలను భారత్ వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రశ్రేణి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించాయి. ముఖ్యంగా ఏఐ, క్లౌడ్, డిజిటల్ ఇన్నోవేషన్ విభాగాల్లో బిలియన్ల డాలర్లతో కొత్త ప్రాజెక్టులు తెరపైకి వస్తుండటం తో దేశీయ ఐటీ రంగం మరోసారి కళకళ లాడనుంది.
చిగురిస్తున్న ఆశలు..Hope Blossoms
అమెరికాలో ఖర్చులు పెరగడం, నిపుణులను నియమించుకోవడంలో వీసా ఆంక్షలు తీవ్రతరమవడం వల్ల ఐటీ దిగ్గజాలు భారత్‌ను ‘సేఫ్ & స్కిల్-రిచ్ డెస్టినేషన్’గా భావిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ ఐటీ రంగంలో గత కొంతకాలంగా స్తబ్దత నెలకొన్నప్పటికీ… అంతర్జాతీయ కంపెనీల తాజా పెట్టుబడుల వార్తలతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
మైక్రోసాఫ్ట్.. రూ.1.58 లక్షల కోట్ల భారీ పెట్టుబడి..Microsoft Announces ₹1.58 Lakh-Crore Mega Investment
భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన మైక్రోసాఫ్ట్ .. వచ్చే అయిదేళ్లలో 17.5 బిలియన్ డాలర్లు (రూ.1.58 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనన్నట్లు ప్రకటించింది. క్లౌడ్ సర్వీసుల విస్తరణ, ఏఐ సామర్థ్యాల పెంపు, నైపుణ్యాభివృద్ధి, ప్రస్తుత కార్యకలాపాల బలోపేతం కోసం ఈ నిధులను వినియోగించనుంది. ఇది మైక్రోసాఫ్ట్ ఇప్పటివరకు భారత్‌లో ప్రకటించిన అత్యంత భారీ పెట్టుబడిగా చెప్పొచ్చు. దీనివల్ల 1.5 నుండి 2 లక్షల మంది వరకు ఉద్యోగావకాశాలు పొందే అవకాశం ఉంది.
అమెజాన్.. 2030 నాటికి రూ.3.15 లక్షల కోట్లు.. Amazon to Invest ₹3.15 Lakh Crore by 2030
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో 2030 నాటికి మొత్తం 35 బిలియన్ డాలర్ల (రూ.3.15 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఏఐ ఆధారిత డిజిటైజేషన్ కార్యక్రమాలు, భారత ఎగుమతుల పెంపు తదితర వాటికి ఈ నిధులు వినియోగించనుంది. ఇంతకుముందు తెలంగాణ, మహారాష్ట్రల్లో AWS విస్తరణ కోసం అమెజాన్ 12.7 బి.డాలర్లు (రూ.1.14 లక్షల కోట్లు) ప్రకటించింది.వాటితో పాటు ఇతర ప్రాజెక్టులు కలిపి మొత్తం పెట్టుబడులు 35 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. ప్రస్తుతం అమెజాన్ భారత్‌లో 1.20 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. రానున్న కాలంలో అదనంగా 80,000 నుంచి 1,00,000 కొత్త నియామకాలు చేపట్టే అవకాశముందని అమెజాన్ వర్గాలు తెలిపాయి.
గూగుల్.. విశాఖలో ఏఐ–డేటా సెంటర్ .. Google to Set Up AI Data Center in Visakhapatnam
గూగుల్ సంస్థ విశాఖపట్నాన్ని ప్రపంచ ఏఐ మ్యాప్‌లో నిలబెట్టబోతోంది.15 బిలియన్ డాలర్ల (రూ.1.35 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. అత్యాధునిక ఏఐ హబ్, గిగావాట్ స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్, సబ్‌సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ తదితర వాటికి నిధులు వెచ్చించనుంది. అమెరికా తర్వాత గూగుల్ ఏర్పాటు చేసే అతిపెద్ద ఏఐ/డేటా ఇన్‌ఫ్రా ఇది అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా 45,000 నుంచి 55,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది.
మెటా-100 మిలియన్ డాలర్లు..Meta to Invest $100 Million
ఫేస్‌బుక్–ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా… రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కలిసి 100 మిలియన్ డాలర్లకు పైగా (రూ.900 కోట్లకు పైగా) భారత్‌తో పెట్టుబడి పెట్టనుంది. అత్యాధునిక ఏఐ సేవల అభివృద్ధి, వ్యాపార సంస్థలకు డిజిటల్ సొల్యూషన్స్ అందించడమే దీని లక్ష్యం.అదేవిధంగా సిఫీ టెక్నాలజీస్‌తో కలిసి 500 మెగావాట్ల డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది.ఇటీవల ఇంటెల్ సీఈఓ భారత సెమీకండక్టర్ ప్రయాణానికి మద్దతుగా, కాగ్నిజెంట్ CEO సేవల విస్తరణ కోసం విశాఖలో కార్యక్రమాలను ప్రారంభించారు. ఏఐ ఇంజనీరింగ్, నెట్‌వర్క్ ఆపరేషన్స్, సెక్యూరిటీ ఆపరేషన్స్, టెక్ సపోర్ట్ విభాగాల్లో 10,000 నుంచి 15,000 వరకూ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జీసీసీ ల విస్తరణతో మరో 2–3 లక్షల ఉద్యోగాలకు మార్గం సుగమం అవుతుంది.
అమెరికా విధానాలు .. దేశీర ఐటీ రంగానికి ఊతం.. US Policies Giving a Boost to India’s IT Sector
ట్రంప్ సుంకాలు.. వర్క్ వీసాలపై కఠిన ఆంక్షలతో అమెరికాకు విదేశీ నిపుణులను తీసుకురావడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఐటీ సంస్థలు భారత్‌లోనే పెద్ద జీసీసీలు (Global Capability Centers) ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇవి కేవలం ఖర్చులను తగ్గించడానికే కాదు. పరిశోధన కేంద్రాలుగా.. ఏఐ అభివృద్ధి కేంద్రాలుగా.. ప్రపంచ కార్యకలాపాల నర్వ్ సెంటర్‌లుగా వాటిని రూపొందిస్తున్నాయి. ఏఐ ఆధారిత సేవల అభివృద్ధి అంతా ఇప్పుడు జీసీసీ కేంద్రాల్లోనే జరుగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా అమెరికా రాజకీయ–ఆర్థిక ఒత్తిళ్లు, ప్రపంచ ఏఐ మార్పులు కలిసొచ్చి… భారత్‌ను మళ్లీ అంతర్జాతీయ టెక్ దిగ్గజాల ప్రధాన గమ్యస్థానంగా మార్చుతున్నాయి. ఈ పెట్టుబడుల ప్రవాహం దేశీయ ఐటీ రంగానికి భారీ ఊతం ఇవ్వనుంది. ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్‌కు భారీ డిమాండ్ పెరగనుంది. స్టార్టప్‌లకు పెట్టుబడుల అవకాశాలు మెరుగుపడతాయి. డిజిటల్ ఎకానమీ వేగవంతం కానుంది. అగ్రశ్రేణి కంపెనీల పెట్టుబడులు , కొత్త జీసీసీల వల్ల వచ్చే 3–5 సంవత్సరాల్లో భారత్‌లో ఐటీ/టెక్ రంగంలో 5 లక్షలకు పైగా ఉద్యోగ నియామకాలు జరిగే వీలుంది.
దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఎంతవరకు లాభం? How Much Will the Indian Economy Benefit?
ప్రపంచ టెక్ రంగం ఏఐ ఆధారిత కొత్త దశలోకి అడుగుపెడుతున్న వేళ… మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి ఐటీ దిగ్గజాలు భారత్‌ను ప్రధాన పెట్టుబడి కేంద్రంగా ఎంచుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద లాభంగా మారనుంది. బిలియన్ల డాలర్ల పెట్టుబడులు కేవలం ఐటీ రంగానికే కాకుండా ఉద్యోగావకాశాలు, రాబడి, ఎగుమతులు, స్టార్టప్ రంగం, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి విభాగాలను అక్షరాలా మలిచే శక్తి కలిగి ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జీడీపీకి ప్రత్యక్ష ప్రోత్సాహం..Direct Boost to GDP
ఐటీ రంగం దేశ జీడీపీలో ప్రస్తుతం 7–8% వంతు అందిస్తోంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పూర్తి స్థాయిలో అమలైతే అదనంగా 1–1.5% వృద్ధి సాధ్యమని ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఏఐ–క్లౌడ్ ప్రాజెక్టుల అమలు, డేటా సెంటర్ల నిర్మాణం, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో చైతన్యం.. ఇవన్నీ జీడీపీ వృద్ధికి గణనీయమైన తోడ్పాటును అందించనున్నాయి.
ఉద్యోగాలు పెరిగితే.. If Jobs Increase…
ఐటీ దిగ్గజాల ఏర్పాట్లతో వచ్చే 5 లక్షలకుపైగా ఉద్యోగాలు ఆర్థిక వ్యవస్థ అంతటా డిమాండ్‌ను పెంచనున్నాయి. ఉద్యోగాలు పెరిగితే.. వినియోగం, పన్నుల ఆదాయం పెగుతుంది. గృహ నిర్మాణం, రవాణా, ఆరోగ్య రంగాల్లో వ్యయాలు పెరుగుతాయి. GST, ఆదాయ పన్నుల రూపంలో ప్రభుత్వానికి భారీ ఆదాయం రానుంది. ప్రతి టెక్ ఉద్యోగం కనీసం 2–3 పరోక్ష ఉద్యోగాలు సృష్టిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎగుమతుల్లో భారీ వృద్ధి .. Massive Growth in Exports
భారత్ ఐటీ/ఐటీఎస్ ఎగుమతులు ఇప్పటికే $250 బిలియన్లు దాటాయి. తాజా పెట్టుబడులతో ఏఐ ఆధారిత సేవల ఎగుమతి మరింత పెరగనుందని నాస్‌కామ్ అంచనా వేస్తోంది. గూగుల్–అమెజాన్ వంటి సంస్థలు ఏర్పాటు చేస్తున్న జీసీసీలు ప్రపంచ మార్కెట్‌కు సేవలు అందిస్తాయి. దీనివల్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు, క్లౌడ్ సేవలు, సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులు, డేటా ఇంజనీరింగ్ సేవలకు డిమాండ్ మరింతగా పెరుగుతుంది. స్టార్టప్‌లు–ఇన్నోవేషన్‌కు బలమైన మద్దతు లభిస్తుంది. ఏఐ రంగానికి సంబంధించి R&D సెంటర్లు, ఇన్నోవేషన్ ల్యాబ్స్, డెవలపర్ సపోర్ట్ ప్రోగ్రామ్‌లను ఐటీ దిగ్గజ కంపెనీలు ఏర్పాటు చేస్తుండటం స్టార్టప్‌లకు ఊతం ఇవ్వనుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ల ద్వారా లక్షలాది మంది ఏఐ–క్లౌడ్ శిక్షణ పొందే వీలుంది.
ఇన్‌ఫ్రా రంగానికి ఉత్సాహం..Boost to the Infrastructure Sector
డేటా సెంటర్ నిర్మాణం అంటే పెద్దఎత్తున విద్యుత్ వినియోగమవుతుంది. భూమి, నిర్మాణ సామగ్రి అవసరం. నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఈ రంగాల్లో వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయనున్న గిగావాట్ స్థాయి డేటా సెంటర్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు పెద్ద బలాన్నివ్వనుంది. భారత్ .. ప్రపంచ ఏఐ కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. ఐటీ దిగ్గజాల పెట్టుబడులు కేవలం కంపెనీల విస్తరణ ప్రణాళికలు మాత్రమే కాదు. వాటితో భారతలో ఉద్యోగాలు, జీడీపీ, ఎగుమతులు, స్టార్టప్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యాల పెంపు వంటి విభాగాల్లో బలమైన వృద్ధి నమోదు కానుంది. దేశ ఆర్థిక దశకు అవి కీలక దిక్సూచిగా మారనున్నాయి.

