బంగారంతో పోటీపడుతూ వెండి ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో కొంతమంది ఇంట్లో నిల్వ పెట్టుకున్న వెండి పాత్రలు, దిమ్మెలు, వినియోగం లేని వెండి ఆభరణాలను అమ్మకానికి తీసుకొస్తున్నారు. ‘పేదవారి బంగారం’గా చెప్పుకునే వెండి కిలో ధర ఇప్పుడు రూ.1,83,000 వరకు చేరింది. ధరలు నింగినంటడడంతో తక్కువ రేట్లలో కిలోల లెక్కన కొనుగోలు చేసిన వారు ఇప్పుడు భారీగా విక్రయాలకు మొగ్గుచూపుతున్నారు.
మూడేళ్లలో మూడింతలపైగా పెరిగిన ధరలు..Prices Triple in Just Three Years
వెండి ధరల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2010 ముందు కిలో వెండి రూ.30,000 లోపే ఉండేది. 2020 నాటికి ధరలు దూసుకెళ్లి రూ.70,000 చేరింది. అయితే అదే ఏడాది భారీ దిద్దుబాటు రావడంతో ధర రూ.40,000 లోపునకు పడిపోయింది. 2022 వరకు వెండి రూ.55,000 సమీపంలోనే ఉండేది. 2023లో మళ్లీ ఎగబాకి రూ.80,000కు చేరింది.
2024లో రూ.95,000 దాటింది. ఈ ఏడాది జనవరిలో తొలిసారి కిలో రూ.1 లక్ష మించగా… ప్రస్తుతం రూ.1.80 లక్షలను దాటింది. దీపావళి సమయంలో తాత్కాలికంగా ఈ స్థాయికి చేరినా నిలబడలేకపోయింది. గత నెలలో రూ.1.50 లక్షలకు తగ్గినా మళ్లీ పుంజుకుని ఇప్పుడు కొత్త గరిష్ఠాలను తాకింది.
ఒక వారం లోపే 100 టన్నుల వెండి విక్రయం .. 100 Tonnes of Silver Sold in Just One Week
ధరలు అమాంతం పెరగడంతో లాభాల స్వీకరణకు ఎక్కువమంది ముందుకొస్తున్నారు. సాధారణంగా ప్రతినెలా 10–15 టన్నుల పాత వెండే మార్కెట్లోకి వచ్చేది. కానీ ఈసారి మాత్రం ఒక వారంలోనే 100 టన్నుల వెండి అమ్మకానికి రావడంతో బులియన్ వ్యాపారులు ఆశ్చర్యపోతున్నారు. ది ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెల్లడించిన వివరాల ప్రకారం
పెళ్లిళ్ల సీజన్, శీతాకాలం ట్రావెల్ ప్లాన్స్, అత్యవసర ఖర్చుల కోసం నగదు అవసరం. దీంతో గతంలో తక్కువ రేటుకు కొనుగోలు చేసిన దిమ్మెలు, ఆభరణాలను పెద్దమొత్తంలో అమ్మేస్తున్నారు. కిలో వెండి రూ.2 లక్షలకు చేరుతుందనే అంచనాలతో పెట్టుబడులు పెట్టినవారు కూడా, ఇటీవల వచ్చిన దిద్దుబాట్ల నేపథ్యంలో “వచ్చిన లాభం తీసుకుందాం… తగ్గితే మళ్లీ ఎదురు చూడాల్సిందే” అన్న భావనతో విక్రయాలు చేస్తున్నారు.
వెండి ధరలను ప్రభావితం చేసే అంశాలు..Factors Influencing Silver Prices
వెండి ఉత్పత్తి పసిడి, సీసం, జింక్ తవ్వకాలపై ఆధారపడి ఉంటుంది. నేరుగా వెండి తవ్వకాలు చాలా తక్కువ. 2025 గణాంకాల ప్రకారం.. గనుల నుంచి వెలికితీసిన మొత్తం వెండి 813 మిలియన్ ఔన్సులు. అంతర్జాతీయంగా పాత వెండితో కలిపి అందుబాటులో ఉండే మొత్తం 1.022 బిలియన్ ఔన్సులు. అంచనా గిరాకీ 1.117 బిలియన్ ఔన్సులు. మెక్సికో, రష్యా నుంచి సరఫరా పెరిగినా.. పెరూ, ఇండోనేసియాల్లో ఉత్పత్తి తగ్గడం, పరిశ్రమల (ఎలక్ట్రానిక్స్, సోలార్) డిమాండ్ పెరగడం… ఇవన్నీ వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
కొనసాగుతున్న ర్యాలీ.. Rally Continues…
వెండి ధరల ర్యాలీ కొనసాగుతుండటంతో పాత వెండిని విక్రయించేందుకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఒక్క వారం వ్యవధిలో 100 టన్నుల వెండి మార్కెట్లోకి రావడం ఇదే మొదటిసారి. మరోవైపు గిరాకీ–సరఫరా అసమతౌల్యం ధరల పెరుగుదలకి మద్ధతు ఇస్తోంది. రాబోయే రోజుల్లోనూ వెండి మార్కెట్ చురుగ్గా కొనసాగే అవకాశం ఉందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో వెండిని కొనచ్చా? Should You Buy Silver in the Current Market?
ప్రస్తుతం వెండి ధరలు గత మూడు సంవత్సరాల్లో మూడింతలకు పైగా పెరిగి ఆల్‌టైమ్ హై వద్ద ఉన్నాయి. ఇలాంటి సమయంలో భారీగా వెండిని కొనుగోలు చేయడం జాగ్రత్తగా ఆలోచించాల్సిన నిర్ణయం అని బులియన్ వర్గాలు సూచిస్తున్నాయి. విపణిలో ఇప్పటికే లాభాలు స్వీకరించాలనే ఉద్దేశంతో పెద్దమొత్తంలో పాత వెండి అమ్మకానికి వస్తోంది. అంటే సప్లై పెరిగిన సందర్భంలో అకస్మాత్తుగా దిద్దుబాటు వచ్చే అవకాశం ఉందని సూచనలు ఉన్నాయి.
పెట్టుబడులు ఎంతవరకు సురక్షితం? How Safe Are These Investments?
వెండి బంగారంలా స్థిరంగా కదిలే లోహం కాదు. అధిక వోలాటిలిటీ . ఒక్క నెలలోనే 10–25% మార్పులు రావచ్చు. ఇండస్ట్రీ డిమాండ్‌పై ఆధారపడటం , సౌరశక్తి, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో డిమాండ్ పెరగడమే ధరల్లో ప్రధాన ప్రభావం. సప్లై షాక్స్ , గనుల ఉత్పత్తి, భౌగోళిక ఉద్రిక్తతలు ధరలను వేగంగా మార్చేస్తాయి. కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడికి వెండి మంచిదైనా… తక్షణ లాభాల కోసం పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం.
పెట్టుబడిదారులు ఏం చేయాలంటే.. What Should Investors Do Now?
✓ దశలవారీగా వెండిని కొనాలి..
✓ అధిక రేట్ల సమయంలో lump-sum పెట్టుబడి చేయడం మంచిది కాదు.
✓ 10–20% ధర దిద్దుబాటుకు సిద్ధంగా ఉండాలి.
✓ భౌతిక వెండికంటే ETFలు, ఎక్స్చేంజ్-ట్రేడెడ్ సిల్వర్ ఉత్పత్తులను కొనాలి. వాటి భద్రత సమస్యలు ఉండవు.
✓ 3–7 ఏళ్ల దీర్ఘకాల దృష్టితో పెట్టుబడి చేయాలి.
ఇవీ లాభాలు ..These Are the Benefits
1. వెండికి పరిశ్రమల నుంచి డిమాండ్ పెరుగుతోంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ తయారీ రంగాల్లో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. ఇది దీర్ఘకాలంలో ధరలకు మద్దతు ఇస్తుంది.
2. బంగారంతో పోల్చితే వెండి చౌక, ప్రస్తుత ర్యాలీ ఉన్నా… బంగారంతో పోలిస్తే వెండి ఇప్పటికీ తక్కువ రేటులో లభిస్తుంది. ధరలు తిరిగి దిగితే పెట్టుబడి అవకాశాలు మరింత మెరుగ్గా కనిపిస్తాయి.
3. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం, డాలర్ బలహీనత, గ్లోబల్ రిస్క్‌ల సమయంలో వెండి కూడా బంగారంలా రక్షణాత్మక ఆస్తిగా పనిచేస్తుంది.
ఇవీ నష్టాలు ..These Are the Drawbacks
1. ధరల్లో భారీ హెచ్చుతగ్గులుంటాయి. చిన్న వార్తలకే, డిమాండ్ అంచనాలకే వెండి ధరలు భారీగా మారుతుంటాయి. తక్కువ సమయంలో 20–30% వరకు పడిపోవడం కూడా అసాధారణం కాదు.
2. భౌతిక వెండి అమ్మినప్పుడు మార్కెట్ ధర కంటే 5–12% వరకు తక్కువే దొరుకుతుంది.
3. పెద్ద పరిమాణంలో భౌతిక వెండిని సులువుగా అమ్మడం అంత తేలిక కాదు. బంగారంలా రెడీమేడ్ లిక్విడిటీ ఉండదు.
4. వెండిని భద్రపరచడానికి స్థలం కావాలి. భద్రమైన లాకర్లు లేకపోతే రిస్క్ ఎక్కువ.
భవిష్యత్‌లో వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి? What Lies Ahead for Silver Prices?
అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఉత్పత్తి క్షీణిస్తోంది. గనుల నుంచి వచ్చే వార్షిక ఉత్పత్తి 800–820 మిలియన్ ఔన్సుల వరకు మాత్రమే. అయితే వినియోగం 1.1 బిలియన్ ఔన్సులను దాటే అవకాశముందనే అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం డిమాండ్ , సరఫరా పరిస్థితుల నేపథ్యంలో రానున్న కాలంలో వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం సౌర విద్యుత్ రంగంలో వెండి వినియోగం గత ఐదేళ్లలో 50% పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్, మెడికల్ టెక్నాలజీలో కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ రంగాల విస్తరణ రాబోయే దశాబ్దంలో మరింత వేగంగా ఉండనుండటంతో, వెండి వినియోగం,ధర తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. వెండిపై దీర్ఘకాలిక దృష్టిలో మాత్రం నిపుణులు ఆశావహంగానే ఉన్నారు. గ్లోబల్ ద్రవ్యోల్బణం, డాలర్ బలహీనత, టెక్నాలజీ రంగాల్లో పెరుగుతున్న వినియోగం, గనుల ఉత్పత్తి తగ్గుదల.. అంశాలు వెండి రేట్లను నిలకడగా పైపైకి నెడతాయని అంచనాలు వేస్తున్నారు. 2030 నాటికి వెండి ధరలు ప్రస్తుత రేట్ల కంటే 30–40% పైగా ఉండొచ్చన్నది అంతర్జాతీయ బులియన్ బోర్డ్ అంచనా.

