ఎఫ్‌డీలకు మించి వడ్డీ..! ఆర్‌బీఐ భరోసాతో 8.05% ఇచ్చే ఈ బాండ్లు గురించి తెలుసా? Higher Returns than FDs! Do You Know About These RBI-Backed Bonds Offering 8.05% Interest?

ఆర్‌బీఐ ఇటీవల రెపో రేటును తగ్గించడంతో దాదాపు అన్ని కమర్షియల్‌ బ్యాంకులూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (FDs) వడ్డీ రేట్లను తగ్గించేశాయి. ప్రస్తుతం ఏ బ్యాంక్‌ చూసినా 6 నుంచి 6.50 శాతం మించి వడ్డీ ఇవ్వడం లేదు. దీంతో అధిక వడ్డీతో పాటు భద్రత కూడా కావాలనుకునే పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్‌ వద్దనుకునేవారికి ఓ సురక్షిత పెట్టుబడి సాధనం అందుబాటులో ఉంది. అదే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్స్‌- 2020.

ఏమిటి ఈ ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్లు?What Are These Floating Rate Bonds?
ఈ ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్లు (Floating Rate Bonds)అనేవి భారత ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ జారీ చేసే సేవింగ్స్‌ బాండ్లు. ప్రభుత్వ హామీ ఉండటంతో వీటిపై పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. మార్కెట్‌ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిర ఆదాయం అందించడం వీటి ప్రధాన లక్ష్యం.

ఎంత వడ్డీ ఇస్తున్నాయి? How Much Interest Do They Offer?
ప్రస్తుతం ఈ బాండ్లపై (Floating Rate Bonds)ఏటా 8.05 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. వడ్డీ రేటు ఫ్లోటింగ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ రేటును పునఃసమీక్షిస్తారు. వడ్డీ మొత్తం ఆరు నెలలకు ఒకసారి నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

కాలపరిమితి ఎంత? What Is the Tenure?
ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్లు (Floating Rate Bonds)మెచ్యూరిటీ కాలం 7 సంవత్సరాలు. సాధారణ పెట్టుబడిదారులకు మధ్యలో ఉపసంహరణ అవకాశం లేదు. అయితే సీనియర్‌ సిటిజన్లకు కొంతకాలం తర్వాత ముందస్తు ఉపసంహరణకు వెసులుబాటు ఉంది (పెనాల్టీతో).

ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు? Who Can Invest?
వ్యక్తిగత పెట్టుబడిదారులు, సంయుక్త ఖాతాదారులు, మైనర్‌ పేరు మీద గార్డియన్‌ ద్వారా కూడా ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్లు(Floating Rate Bonds)లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్ఠ పరిమితి లేదు.

పన్ను వర్తిస్తుందా? Is Tax Applicable?
ఫ్లోటింగ్‌ రేట్ బాండ్ల (Floating Rate Bonds)పై వచ్చే వడ్డీకి ఆదాయపన్ను వర్తిస్తుంది. టిడిఎస్‌ కూడా కట్‌ అవుతుంది. సెక్షన్‌ 80C కింద పన్ను మినహాయింపు ఉండదు.

ఫ్లోటింగ్‌ రేట్ బాండ్లు ఎందుకంటే? Why Are They Called Floating Rate Bonds?
ఫ్లోటింగ్‌ రేట్ బాండ్లు (Floating Rate Bonds)బ్యాంకు ఎఫ్‌డీలకంటే ఎక్కువ వడ్డీ ఇస్తాయి. ఆర్‌బీఐ – ప్రభుత్వ హామీతో పూర్తి భద్రతతో కూడిన‌వి. అదేవిధంగా పెట్టుబ‌డిదారుల‌కు మార్కెట్‌ రిస్క్‌ లేదు. వాటి ద్వారా స్థిర ఆదాయం వ‌స్తుంది. మొత్తంగా బ్యాంకు ఎఫ్‌డీలపై వడ్డీ తగ్గిన ఈ సమయంలో, రిస్క్‌ వద్దనుకునే వారికి ఆర్‌బీఐ ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్స్‌ ఆకర్షణీయమైన ఎంపికగా మారాయి. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ అవసరాలు, పన్ను భారం అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఆరు నెలలకోసారి వడ్డీ మారుతుంది..! Interest Changes Every Six Months!
ఎన్‌ఎస్‌సీకి లింక్‌ అయిన ఆర్‌బీఐ ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్లులో (RBI Floating Rate Savings Bonds – 2020) వడ్డీ రేటు ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఆరు నెలలకోసారి మారుతూ ఉంటుంది. ఈ బాండ్ల వడ్డీ రేట్లు దేశంలోని చిన్న మొత్తాల పొదుపు పథకాలలో ఒకటైన నేషనల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (NSC) వడ్డీ రేటుతో ముడిపడి ఉంటాయి. ప్రభుత్వం ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేటును పెంచితే.. ఆర్‌బీఐ ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్ల వడ్డీ కూడా పెరుగుతుంది. ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేటును తగ్గిస్తే.. ఈ బాండ్లపై వడ్డీ కూడా తగ్గుతుంది. ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేటుకంటే 0.35 శాతం ఎక్కువ వడ్డీ ఈ బాండ్లపై చెల్లిస్తారు. 2026 జనవరి జూన్‌ అర్ధవార్షిక కాలానికి ఆర్‌బీఐ ఈ బాండ్లపై వడ్డీ రేటును 8.05 శాతంగా ఉంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేటు 7.7 శాతంగా ఉండగా, ఆర్‌బీఐ ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్లపై 8.05 శాతం వడ్డీ లభిస్తోంది. వాటిపై ఏడాదికి రెండు సార్లు వడ్డీ చెల్లిస్తారు. ఏటా జనవరి 1, జులై 1 తేదీల్లో వడ్డీ మొత్తం నేరుగా పెట్టుబడిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

ఏడేళ్ల లాక్‌–ఇన్‌..! Seven-Year Lock-In!
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్స్‌ – 2020 (Floating Rate Bonds)దీర్ఘకాలిక పెట్టుబడి సాధనం. ఈ బాండ్ల కాల వ్యవధి మొత్తం ఏడేళ్లు. భద్రతతో పాటు స్థిర ఆదాయం లక్ష్యంగా రూపొందించిన ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తం మెచ్యూరిటీ వరకు కొనసాగాల్సి ఉంటుంది. ఈ బాండ్లలో సాధారణ పెట్టుబడిదారులకు ముందస్తు ఉపసంహరణకు అవకాశం లేదు. ఒకసారి పెట్టుబడి పెడితే, ఏడేళ్ల పాటు డబ్బు లాక్‌–ఇన్‌లోనే ఉంటుంది. అందుకే తక్షణ అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవడం సాధ్యం కాదు. దీర్ఘకాలికంగా పెట్టుబడి కొనసాగితేనే ప్రభుత్వానికి నిధుల స్థిరత్వం ఉంటుంది. పెట్టుబడిదారులకు కూడా మధ్యలో రిస్క్‌ లేకుండా స్థిర వడ్డీ ఆదాయం అందించడమే లక్ష్యం.

సీనియర్‌ సిటిజన్లకు వెసులుబాటు..! Facility for Senior Citizens!
ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్స్(Floating Rate Bonds) .. ముందస్తు ఉపసంహరణ విష‌యంలో సీనియర్‌ సిటిజన్లకు మాత్రం ప్రత్యేక మినహాయింపు కల్పించారు. కనీస లాక్‌–ఇన్‌ పీరియడ్‌ పూర్తయ్యాక, పెనాల్టీతో ముందుగానే డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం సీనియర్‌ సిటిజన్లకు లాక్‌–ఇన్‌ కాలం వయసును బట్టి మారుతుంది. 60 – 70 ఏళ్ల వయసున్న వారికి కనీసం 6 సంవత్సరాలు, 70 – 80 ఏళ్ల వయసున్న వారికి కనీసం 5 సంవత్సరాలు, 80 ఏళ్లు దాటిన వారికి కనీసం 4 సంవత్సరాలు పూర్తయ్యాక మాత్రమే ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ముందస్తుగా డబ్బు తీసుకుంటే, చివరి ఆరు నెలల వడ్డీపై పెనాల్టీగా కొంత మొత్తాన్ని కట్‌ చేస్తారు. మిగిలిన మూలధనం పెట్టుబడిదారుడి ఖాతాలో జమ అవుతుంది. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీనియర్‌ సిటిజన్లకు ఈ ప్రత్యేక సడలింపు ఇచ్చారు.

రూ.1,000తోనే పెట్టుబడి..! Investment Starts from Just ₹1,000!
ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్స్‌ – 2020(Floating Rate Bonds)లో చిన్న మొత్తంతోనే పెట్టుబడి ప్రారంభించొచ్చు. భద్రతతో పాటు మంచి వడ్డీ లభిస్తున్నప్పటికీ, వడ్డీ రేట్లలో వచ్చే మార్పులను కూడా గమనించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బాండ్లను కనిష్ఠంగా రూ.1,000తోనే కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడికి గరిష్ఠ పరిమితి లేదు. అందువల్ల చిన్న పొదుపుదారుల నుంచి పెద్ద పెట్టుబడిదారుల వరకూ అందరికీ ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. ఈ బాండ్ల వడ్డీ రేటు ఫ్లోటింగ్‌ విధానంలో ఉంటుంది. ఆరు నెలలకోసారి వడ్డీ రేటు మారే అవకాశం ఉంది. భవిష్యత్‌లో వడ్డీ రేట్లు తగ్గితే, పొందే రాబడిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ బాండ్లపై రుణం తీసుకునే అవకాశం లేదు. బ్యాంకుల్లో ఎఫ్‌డీల మాదిరిగా వీటిని త‌న‌ఖా పెట్టి లోన్‌ పొందడం కుదరదు. ఈ బాండ్లను ఇతరులకు బదిలీ చేయడం సాధ్యం కాదు. ఒకరి పేరుతో కొనుగోలు చేసిన బాండ్లు, అదే వ్యక్తి ఖాతాలోనే కొనసాగాలి. ఈ బాండ్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై పూర్తిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఏ బ్యాంక్‌ బ్రాంచ్‌లోనైనా కొనుగోలు..! Can Be Purchased at Any Bank Branch!

– ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్స్‌ – 2020(Floating Rate Bonds)ను కొనుగోలు చేయడం చాలా సులభం. ఇందుకోసం ప్రత్యేక ప్రక్రియలు అవసరం లేకుండా, ఆర్‌బీఐ ఆథరైజేషన్‌ పొందిన ఏదైనా బ్యాంక్‌ శాఖలోనే ఈ బాండ్లను తీసుకోవచ్చు. ఆర్‌బీఐ అనుమతి పొందిన బ్యాంక్‌ బ్రాంచ్‌ను సందర్శించాలి. అక్కడ ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్‌ అప్లికేషన్‌ నింపాలి. పెట్టుబడి మొత్తాన్ని బ్యాంక్‌ ఖాతా ద్వారా చెల్లించాలి. బాండ్లు కొనుగోలు చేయాలంటే కేవైసీ పత్రాలు తప్పనిసరి. ఆధార్‌, పాన్‌ కార్డు, చిరునామా రుజువు వంటి డాక్యుమెంట్లు సమర్పించాలి. కేవైసీ పూర్తయిన తర్వాతే బాండ్ల జారీ జరుగుతుంది. బ్యాంక్‌ ఖాతా ఉన్నవారికి, ఆన్‌లైన్‌ కంటే బ్రాంచ్‌ ద్వారా పెట్టుబడి పెట్టాలనుకునేవారికి, సులభమైన, భద్రమైన ప్రక్రియ కోరుకునేవారికి ఈ బాండ్లు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఆర్‌బీఐ ఆథరైజ్డ్‌ బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లు (RBI Retail Direct Portal) ద్వారా కూడాఅవసరమైన కేవైసీ పూర్తి చేసి ఆన్‌లైన్‌లోనే పెట్టుబడి చేయవచ్చు. ఈ బాండ్లపై వచ్చే వడ్డీకి కాంపౌండింగ్‌ ప్రయోజనం ఉండదు. అంటే వడ్డీపై మళ్లీ వడ్డీ వచ్చే అవకాశం లేదు. భారత నివాసితులు (Resident Indians), హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUFs) కు చెందినవారు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎన్నారైలు (NRIs), విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఈ బాండ్లను కొనుగోలు చేయడానికి అర్హులు కారు.
– ఉదాహరణకు మీరు ఈ బాండ్లలో మీరు రూ.1 లక్ష పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ప్రస్తుతం అమలులో ఉన్న 8.05 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం ఆరు నెలల వడ్డీ సుమారు రూ.4,000కు పైగా ఉంటుంది. ఈ వడ్డీ మొత్తం ప్రతి ఆరు నెలలకు ఒకసారి నేరుగా మీ బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది. అంటే ఏడాదికి రెండు సార్లు వడ్డీ రూపంలో నగదు అందుతుండటంతో, స్థిర ఆదాయం కోరుకునే వారికి ఈ బాండ్లు ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *