కొంతమంది చేతికి మంచి జీతం వచ్చినా… నెలాఖరుకి ఖాతాలో నిల్వ మాత్రం శూన్యం! “ఎక్కడ ఖర్చైందో అర్థం కావడం లేదు” అని చాలా మంది విలపిస్తుంటారు. ఆర్ధిక నిపుణుల చెబుతున్న దాని ప్రకారం.. ఉపాధి కాదు… అలవాట్లే మన సంపదను నిర్ణయిస్తాయి. చాలామంది తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు… డబ్బు నిలవకుండా చేస్తాయని హెచ్చరిస్తున్నారు. “జీతం పెంచుకోవడం కంటే… ఖర్చులపై నియంత్రణ, పెట్టుబడులపై క్రమశిక్షణ ముఖ్యం. నెలాఖరున ఖాతాలో డబ్బు నిలవాలంటే ఈ తప్పులను తప్పకుండా దిద్దుకోవాలి” అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
బడ్జెట్ లేకుండా ఖర్చులు.. Expenses Without a Budget
రోజువారీ ఖర్చులకు స్పష్టమైన బడ్జెట్ ఉండకపోతే ఎంత వచ్చినా పోతూనే ఉంటుంది. జీతం వచ్చిన రోజే ఆన్లైన్ షాపింగ్ చేయకూడదు. “ఆఫర్… లిమిటెడ్ టైమ్ డీల్!” అంటూ యాప్‌లు చూపించే మాయలో పడితే బ్యాలెన్స్ ఆవిరైపోవడం ఖాయం. ఓటీటీ, క్లౌడ్, యాప్ ప్రీమియంలు .. ఇవి నెలకు ₹99, ₹149 అనిపించినా… ఏడాదికల్లా వేల రూపాయలే! EMIలు, రివార్డ్ పాయింట్ల పేరుతో అధికంగా swipe చేస్తే… వచ్చే బిల్లు చూసి షాక్ గ్యారెంటీ. అత్యవసర నిధి లేకపోవడం వల్ల అనుకోని ఖర్చుల సమయంలో సేవింగ్స్‌ను వాడాల్సి వస్తుంది. ఫలితంగా ప్లాన్ చేసిన పెట్టుబడులు అంతరించిపోతాయి. “ఈ నెల వదిలేయండి… వచ్చే నెల మొదలు పెడదాం” అన్నా… ఆ ‘వచ్చే నెల’ రాదు. కంపౌండింగ్ మ్యాజిక్ కోల్పోతారు. స్నేహితుడికి ఉన్న ఫోన్, బైక్… ఇవన్నీ కొనాలనుకుంటే తప్పే. మీ డబ్బును దారి తప్పించే ప్రధాన కారణాలు అవే అవుతాయి. ఇన్సూరెన్స్ అంటే చాలామంది ‘అదనపు ఖర్చు’ అని భావిస్తారు. కానీ అది లేకపోతే ఒక్క ప్రమాదం చాలు… మొత్తం సేవింగ్స్ మాయమవుతాయి. ఎక్కడ ఎంత ఖర్చు చేసారో నోట్ చేయకపోతే… డబ్బు ఎక్కడ పోతుందో అసలు కనిపించదు.
ఇన్సూరెన్స్–ఇన్వెస్ట్మెంట్ మిక్స్ చేస్తే నష్టమే! Mixing Insurance and Investment Leads to Loss!
“సేఫ్టీ … రాబడులు!” అంటూ ఇన్సూరెన్స్ కంపెనీలు విక్రయించే ఎండోమెంట్, హోల్ లైఫ్ వంటి ప్లాన్లకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. కానీ ఆర్థిక నిపుణుల దృష్టిలో ఇవి రెండు పనిచేయని ఉత్పత్తులు. ఎందుకంటే భద్రతను ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్, వేగంగా పెరగాల్సిన ఇన్వెస్ట్మెంట్… ఒకే కవర్లో పెట్టాలని ప్రయత్నించడమే అసలు తప్పు అంటున్నారు. ఇన్సూరెన్స్ అంటే కుటుంబానికి ఆర్థిక భద్రత. అదే పనిని సరిగ్గా చేసే ప్యూర్ టర్మ్ పాలసీలు తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తాన్ని అందిస్తాయి. “ఆర్థికంగా కుటుంబాన్ని రక్షించాలంటే టర్మ్ కంటే మంచి ప్రత్యామ్నాయం లేదు” అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా పెట్టుబడులను పెంచుకోవాలంటే ఎండోమెంట్లాంటి తక్కువ రాబడుల ప్లాన్లు ప్రయోజనం ఇవ్వవు. మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమశిక్షణగా ఇన్వెస్ట్ చేస్తేనే సంపద పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. “భద్రత కావాలంటే టర్మ్ ప్లాన్… సంపద కావాలంటే మ్యూచువల్ ఫండ్స్. ఈ రెండింటినీ కలపకూడదు. వేరువేరుగా తీసుకోవడమే నిజమైన ప్లానింగ్” అని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
ఇతరుల లోన్‌కు కో-సైన్ చేస్తే ప్రమాదమే! Co-Signing Someone Else’s Loan Is Risky!
“పరిచయం ఉంది కదా… కొంచెం సహాయం చేద్దాం” అనుకుని చాలామంది ఇతరుల లోన్‌కు కో-సైన్ చేస్తారు. కానీ ఇదే మంచితనం… చాలాసార్లు పెద్ద ఆర్థిక బారంగా మారుతుంది. రుణం తీసుకున్న వ్యక్తి EMIలను సమయానికి చెల్లించకపోతే… బ్యాంకుల రికార్డుల్లో మీరు కూడా బాధ్యతగానే కనిపిస్తారు. ఫలితం మీ క్రెడిట్ స్కోర్ క్షణాల్లో పడిపోతుంది. బ్యాంకుల దృష్టిలో కో-అప్లికెంట్, గ్యారంటర్ ఇద్దరూ రుణం బరువును మోసేవారే. అందుకే ఎవరైనా EMI మిస్ చేసినా… రుణ బాధ్యత మీ పై కూడా పడుతుంది. క్రెడిట్ స్కోర్ 50–100 పాయింట్లు పడిపోవచ్చు భవిష్యత్తులో లోన్ అప్రూవల్ కష్టమవుతుంది. డిఫాల్ట్ అయితే బ్యాంకు లీగల్ నోటీసు మీకూ వస్తుంది. “మంచి మనసుతో ఇచ్చిన సంతకం… జీవితంలో రుణాలన్నీ దూరం చేసే ప్రమాదం ఉంది” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బు సహాయం చేయండి… కానీ లీగల్‌గా గ్యారంటీగా నిలబడకండి. మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే ఇతరుల లోన్‌కు కో-సైన్ చేయడం పూర్తిగా నివారించాలి.
మినిమమ్ డ్యూ .. Minimum Due
ఈఎంఐ లేదా క్రెడిట్ కార్డు బిల్లులో మినిమమ్ డ్యూ మాత్రమే చెల్లిస్తే.. పెండింగ్ మొత్తం అలాగే ఉండిపోతుంది. దానిపై 30% వరకు అధిక వడ్డీ పడుతుంది. మీరు అర్థం చేసుకునేలోపే బిల్లు ‘స్నోబాల్’లా పెరుగుతుంది. చెల్లింపులు లేట్ అయితే క్రెడిట్ స్కోర్ నేరుగా పడిపోతుంది. “మినిమమ్ డ్యూ చెల్లించడం అనేది అప్పు నిలిపే బ్రేక్ కాదు… అప్పు వేగం పెంచే యాక్సిలేటర్” అని ఆర్థిక నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. కనీసం బిల్లు మొత్తం చెల్లించలేకపోయినా, పెండింగ్‌ను వీలైనంత ఎక్కువగా క్లియర్ చేయాలని వారు సూచిస్తున్నారు. అవసరం లేనివి స్వైప్ చేయకుండా ఖర్చులను కట్టడి చేయడమే ఉత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు.
తెలియని వాటిలో ఇన్వెస్ట్ చేస్తే… If You Invest in What You Don’t Know…
పెట్టుబడి అంటే చాలామందికి ఇంకా స్పష్టమైన అవగాహన లేదు. “ఫ్రెండ్ చెప్పాడు”, “వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది”, “అమ్మాయి యూట్యూబ్‌లో చెప్పింది” అంటూ తెలియని స్కీముల్లో డబ్బు పెట్టే వారే ఎక్కువ. ఇలాంటివి ఎక్కువగా రాబడుల వాగ్దానంతో మెరిసిపోతున్నా… చివరికి పెట్టిన పెట్టుబడే మాయం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలియని ఇన్వెస్ట్మెంట్ అంటే… రిస్క్‌కు నేరుగా ఆహ్వానం పలికినట్టే. పెట్టుబడి ఉత్పత్తి ఏమిటో, అది ఎలా పనిచేస్తుందో, రిటర్న్స్ ఎలా వస్తాయో… కనీస అవగాహన లేకుండానే ఖరీదైన డబ్బు పెట్టడం పెద్ద తప్పిదమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
సంపాదన పెరిగినంత స్థాయిలో ఖర్చు పెంచేస్తే? If Your Spending Rises with Your Income?
కొంతమందికి జీతం పెరిగిన ప్రతీసారి… జీవనశైలి వెంటనే అప్‌గ్రేడ్ అవుతుంది. కొత్త మొబైల్, కొత్త బైక్, కొత్త సబ్స్క్రిప్షన్లు, ఖరీదైన అవుటింగ్స్ .. ఇలా ఆదాయం పెరిగిన కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతుండటాన్ని నిపుణులు “లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్” అంటున్నారు. ఇదే అలవాటు సంపాదించిన డబ్బు నిల్వ లేకుండా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. జీవనశైలిలో చిన్న మార్పులు మొదట పెద్దగా కనిపించకపోయినా… ఏడాదికల్లా భారీ ఖర్చులుగా మారుతాయి. ఫలితం ఎంత జీతం వచ్చినా నెలాఖరున ఖాతా ఖాళీ.“ఆదాయం పెరగడం మంచి విషయం… కానీ ఖర్చులు అదే స్థాయిలో పరుగులు పెడితే ప్రయోజనం శూన్యం” అని నిపుణులు చెబుతున్నారు. అందుకే జీతం పెరుగుదలలో కనీసం 30–40% సేవింగ్స్కి మార్చాలి. కొత్త ఖర్చు చేసేముందు ‘అవసరమా?’ అని ప్రశ్నించుకోవాలి. లైఫ్‌స్టైల్ ఖర్చులను బడ్జెట్లో పెట్టాలి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లను ముందే ఆటో డెబిట్లో పెట్టుకోవాలి.
లోన్‌లో కొత్త కారు కొంటే? Buying a New Car on Loan?
“జీతం బాగానే వస్తోంది… ఒక కొత్త కారు తీసుకుందాం” అనుకునే వారిలో చాలా మంది లోన్‌ను ప్రధాన మార్గంగా చూస్తున్నారు. అయితే ఇలాంటి ఆటో లోన్లు… కుటుంబ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలంలో భారీ ఒత్తిడిని తీసుకువస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.కొత్త కారు కొనగానే 20–25% వరకు విలువ పడిపోతుందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కానీ తీసుకున్న లోన్ మాత్రం పరిపూర్ణంగా EMIల రూపంలో వస్తూనే ఉంటుంది. “డిప్రెషియేషన్ ఎక్కువ… రాబడి శూన్యం — ఇలాంటి ఆస్తికి భారీ లోన్ తీసుకోవడం తెలివైన నిర్ణయం కాదు” అంటున్నారు విశ్లేషకులు. మొత్తం ధరలో 50% పైగా ముందుగానే చెల్లించగలిగితేనే కారు కొనడం ఉత్తమం. EMI మొత్తం నెల జీతంలో 10% లోపే ఉండాలి.
ఒక్కచోటే ఇన్వెస్ట్మెంట్… Investing in Only One Place…
ఒక్క పెట్టుబడి ఉత్పత్తిలోనే డబ్బంతా పెట్టే వారు చాలామంది ఉన్నారు. భూమి అయినా, బంగారం అయినా, బ్యాంక్ FD అయినా ఒకే రకాన్ని మాత్రమే నమ్ముకోవడం… పెట్టుబడుల్లో చేసే పెద్ద తప్పిదాల్లో ఇదొకటి అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకే ఇన్వెస్ట్మెంట్ పై ఆధారపడితే, ఆ మార్కెట్ పడిపోయినప్పుడు మొత్తం సంపద ప్రమాదంలో పడుతుంది. అందుకే పెట్టుబడులను విభజించాలి. సంపద నిర్మాణంలో డైవర్సిఫికేషన్నే ప్రధానాయుధం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
హోమ్ లోన్ EMI… Home Loan EMI…
చాలామందికి స్వగృహం అంటే కల. ఆ కలను నెరవేర్చడానికి హోమ్ లోన్ తీసుకోవడం సర్వసాధారణమైంది. అయితే EMIను సరిగా ప్లాన్ చేయకపోతే… ఆ కలే ఆర్థిక భారంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. EMI ‘కంపర్ట్ జోన్’లో లేకపోతే సమస్యలు మొదలవుతాయి హోమ్ లోన్ EMI నెల ఆదాయంలో 30–35% దాటితే కుటుంబ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంట్రెస్ట్ రేటు పెరిగితే EMI కూడా పెరుగుతుంది. దీంతో ఇతర లక్ష్యాలకు (పిల్లల చదువు, రిటైర్మెంట్) డబ్బు కేటాయించలేరు. హఠాత్తుగా ఆదాయం తగ్గితే పోస్ట్డ్యూ ఛార్జీలు, పెనాల్టీలు పడతాయి. అధిక కాలపరిమితి అంటే మొత్తం వడ్డీ పెద్ద మొత్తంలో చెల్లించాల్సిందే. 20–25 ఏళ్ల హోమ్ లోన్ తీసుకోడం EMIను తగ్గించినా… మొత్తం వడ్డీ మాత్రం ప్రిన్సిపల్‌తో పోలిస్తే రెండింతలదాకా పెరుగుతుందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. హోమ్ లోన్ EMI ఎప్పుడూ జీతంలో 30% లోపే ఉండాలి. కనీసం 20–30% డౌన్ పేమెంట్ చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ ఫ్లోటింగ్/ఫిక్స్డ్ ఎంపికలు అర్థం చేసుకోవాలి. లోన్ టెన్యూర్‌ను వీలైనంత తగ్గించి, ఆపై ప్రీపేమెంట్ చేయాలి అత్యవసర నిధిని వేరుగా ఉంచాలి (6 నెలల EMI).
ఇన్స్టంట్ లోన్స్… Instant Loans…
అవసరం వస్తే వెంటనే డబ్బు! ఇన్స్టంట్ లోన్స్ ఇస్తామంటూ వందలు, వేల మొబైల్ యాప్‌లు యువతను ఆకర్షిస్తున్నాయి. KYC పూర్తి చేస్తే కొన్ని నిమిషాల్లోనే డబ్బు అకౌంట్లోకి జమ అవుతోంది. అయితే ఈ సులువు సౌకర్యం… తర్వాత పెద్ద ఆర్థిక ప్రమాదంగా మారుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అధిక వడ్డీ, ఛార్జీలు, లేట్ ఫీజులు ఇన్స్టంట్ లోన్స్ లో సహజమే. కొన్ని యాప్‌లు వార్షికంగా 50–100% వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. అనధికారిక యాప్‌లు వ్యక్తిగత డేటా సేకరిస్తున్నాయి. చెల్లింపులు ఆలస్యం అయితే బెదిరింపులకు దిగుతాయి. ఫోటోలు, కాంటాక్టులు లీక్ చేస్తామని హరాస్మెంట్ చేస్తారు. క్రెడిట్ స్కోర్ ఒక్కసారిగా పడిపోతుంది. అదనపు ఛార్జీలు పెట్టి మొత్తం బకాయిని రెట్టింపు చేస్తాయి. ఇన్స్టంట్ లోన్ తీసుకునే ముందు వడ్డీ–ఫీజులు స్పష్టంగా చూడాలి .15–30 రోజుల చిన్న టెన్యూర్లను జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. వ్యక్తిగత ఫోటోలు, కాంటాక్టులు యాక్సెస్ కోరే యాప్‌లను పూర్తిగా తప్పించాలి EMI లను సమయానికి చెల్లించాలి.
సంపద పెంచుకోవడానికి మంచి అలవాట్లు Habits to Build Wealth
ఈ రోజుల్లో జీతాలు పెరుగుతున్నా… చేతిలో డబ్బు ఉండడం మాత్రం అరుదైపోతోంది. అవసరాలు–ఖర్చులు కంటే ఆర్థిక పట్టు సాధించాలంటే కొన్ని మంచి అలవాట్లు తప్పనిసరి. సంపద ఒక్కరోజులో ఏర్పడదు. చిన్న చిన్న ఆచరణీయ అలవాట్లు… క్రమశిక్షణ… దీర్ఘకాల ఆలోచన.. ఇవే నిజమైన ఆర్థిక భద్రతకు బలమైన పునాది.నిపుణుల సూచనలతో మీ ఆదాయాన్ని, భవిష్యత్ సంపదను పెంచే గోల్డెన్ హ్యాబిట్స్ ఇవే…
1) ముందే సేవింగ్స్… తర్వాతే ఖర్చులు! Save First… Spend Later!
జీతం వచ్చిన వెంటనే 20–30% సేవింగ్స్ అకౌంట్, RD/Mutual Fundsకి ఆటో డెబిట్ పెట్టేస్తే… మిగతా డబ్బుతో మనం మేనేజ్ చేసుకోవడం అలవాటు అవుతుంది. ఇది దీర్ఘకాలంలో మంచి సంపదను తీసుకొస్తుంది.
2) బడ్జెట్ తప్పనిసరి.. Budget Is a Must
మొబైల్లో చిన్న యాప్ లో నెల ఖర్చులను రికార్డ్ చేయండి. ఎక్కడ ఎక్కువ వెళ్తుందో తెలిస్తే డబ్బు వృథా కావడాన్ని ఆపేయొచ్చు.
3) అత్యవసర నిధి సిద్ధం.. Emergency Fund Ready
ఏ సమయంలోనైనా అనుకోని ఖర్చులు వస్తాయి. అందుకే కనీసం 3–6 నెలల ఖర్చులు ఎమర్జెన్సీ ఫండ్‌గా FD/లిక్విడ్ ఫండ్స్‌లో ఉంచుకోవాలి. ఇది లోన్లకు దూరంగా ఉంచుతుంది.
4) అప్పులు తగ్గించుకోవడం..Reduce Your Debts
క్రెడిట్ కార్డ్ బిల్లు, పర్సనల్ లోన్, చిన్న ఈమ్ఐలు… ఇవన్నీ క్రమంగా తగ్గిస్తేనే నిజమైన సేవింగ్స్ మొదలవుతాయి. హై ఇంటరెస్ట్ ఉన్న అప్పులను ముందుగా క్లీన్ చేయడం మంచిది.
5) ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైవర్సిఫై చేయండి.. Diversify Your Investments
ఒకే చోట పెట్టుబడి పెట్టడం ప్రమాదం. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, FD… ఇలా వివిధ ఆప్షన్లలో కొంచెంమొత్తంలో పెట్టడం బెటర్.
6) జీవిత, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి..Life and Health Insurance Are a Must
ఎంత సేవ్ చేసినా… ఒక్క అనుకోని సంఘటనతో పెద్ద ఖర్చులు వస్తే మొత్తం ప్లాన్ గాలికొదిలినట్టే. అందుకే సరైన టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ పాలసీ తప్పక ఉండాలి.
7) రెగ్యులర్‌గా ఆర్థిక సమీక్ష..Regular Financial Review
మీ ఖర్చులు, మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ లక్ష్యాలు… ప్రతి 6 నెలలకొకసారి చెక్ చేసుకోవాలి. అవసరమైతే ప్లాన్‌ను మార్చాలి. ఇది ఫైనాన్షియల్ గ్రోత్‌కు చాలా ముఖ్యం. మీ సంపాదనలో 50 శాతం అవసరాల కోసం, 30 శాతం మీ కోరికల కోసం, 20 శాతం సేవింగ్స్ కోసం కేటాయించాలి. హోమ్ లోన్ EMI 30-35 శాతం కంటే తక్కువ ఉండేలా చుసుకోవాలి. SIPలు, అడ్వైజర్ సహాయంతో మీ ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకోండి.
