వస్తువుల రవాణాకు సంబంధించిన వివరాలను స్పష్టంగా నమోదు చేయడంతో పాటు పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేసేందుకు వస్తు సేవల పన్ను (GST) వ్యవస్థలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ-వే బిల్ విధానంలో తాజాగా కీలక మార్పు వచ్చింది. నిర్ణీత విలువకు మించి వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో ఈ-వే బిల్ (New Change in E-Way Bill Rules) తీసుకోవడం తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. సాధారణ లావాదేవీల్లో ఎవరి పేరుతో ఇన్వాయిస్ జారీ చేస్తారో.. సాధారణంగా సరుకును కూడా వారికే పంపిస్తారు. అయితే వ్యాపార రంగంలో అన్ని లావాదేవీలు ఇలాగే ఉండవు. ఒక వ్యక్తి సరుకును కొనుగోలు చేసి, దాన్ని మరో వ్యక్తికి నేరుగా పంపించమని సరఫరాదారుని కోరే సందర్భాలు తరచుగా ఎదురవుతాయి. ముఖ్యంగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, పెద్ద సంస్థలు, తయారీ కంపెనీలు, ఈ-కామర్స్ వ్యాపారాల్లో ఇలాంటి విధానం విస్తృతంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇన్వాయిస్ ఒకరి పేరుతో ఉంటే.. సరుకు మాత్రం మరో వ్యక్తి చిరునామాకు చేరుతుంది. ఇలాంటి లావాదేవీల్లో సరుకు వాస్తవంగా ఎవరి వద్దకు వెళ్తోంది? అంతిమంగా ఎవరు దాన్ని స్వీకరిస్తున్నారు? అనే విషయాన్ని మరింత స్పష్టంగా నమోదు చేయడానికి ఈ-వే బిల్ వ్యవస్థలో కొత్త నిబంధనను తీసుకొచ్చారు. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పు ప్రకారం బిల్-టు/షిప్-టు లావాదేవీల్లో సరుకును అంతిమంగా స్వీకరించే వ్యక్తికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటే.. అతని జీఎస్టీ వివరాలను ఈ-వే బిల్లులో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఒకవేళ సరుకు అందుకునే వ్యక్తికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోతే ‘యూఆర్‌పీ’ (Unregistered Person)గా నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఈ మార్పు వల్ల వ్యాపారులు ఈ-వే బిల్ తయారు చేసేటప్పుడు లావాదేవీ స్వభావాన్ని సరిగ్గా గుర్తించడం మరింత కీలకంగా మారింది.
బిల్-టు/షిప్-టు అంటే ఏమిటి? What Is Bill-to/Ship-to?
బిల్-టు/షిప్-టు విధానం (New Change in E-Way Bill Rules) అంటే ఇన్వాయిస్ ఎవరి పేరుతో ఉంటుందో.. సరుకు మాత్రం మరొక వ్యక్తికి చేరే లావాదేవీ. ఇది వినడానికి కొంత క్లిష్టంగా అనిపించినా, ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుంటూరుకు చెందిన శ్రీకాంత్ అనే వ్యాపారి తనకు అవసరమైన సరుకును విశాఖలోని సురేష్ అనే వ్యాపారి వద్ద కొనుగోలు చేస్తున్నాడనుకుందాం. ఈసారి కూడా శ్రీకాంత్ తనకు అవసరమైన వస్తువుల జాబితాను సురేశ్‌కు పంపాడు. అయితే సురేశ్ వద్ద ఆ సమయంలో అవసరమైన సరుకు మొత్తం అందుబాటులో లేదు. అందుకే సురేశ్ ఆ ఆర్డర్‌ను విజయవాడలోని రాంబాబు అనే మరో వ్యాపారికి పంపాడు. సరుకు మొదట విశాఖకు వచ్చి.. అక్కడి నుంచి తిరిగి గుంటూరుకు వెళ్లడం వల్ల సమయం, రవాణా ఖర్చులు రెండూ పెరుగుతాయి. కాబట్టి రాంబాబు దగ్గర నుంచి సరుకును నేరుగా శ్రీకాంత్‌కు పంపించాలని సురేశ్ సూచించాడు. ఇక్కడ వ్యాపార సంబంధాలను పరిశీలిస్తే శ్రీకాంత్‌కు సురేశ్ సరఫరాదారు. సురేశ్‌కు రాంబాబు సరఫరాదారు. రాంబాబు తన ఇన్వాయిస్ను సురేశ్ పేరుతో జారీ చేస్తాడు. సురేశ్ శ్రీకాంత్‌కు మరో ఇన్వాయిస్ జారీ చేస్తాడు. అయితే సరుకు మాత్రం రాంబాబు దగ్గర నుంచి నేరుగా శ్రీకాంత్‌కు వెళుతుంది. ఇదే బిల్-టు/షిప్-టు లావాదేవీ.
ఇప్పుడు ఏం మారింది? What Has Changed Now?
బిల్-టు/షిప్-టు విధానం ఈ-వే బిల్ వ్యవస్థలో (New Change in E-Way Bill Rules) కొత్తది కాదు. ఇలాంటి లావాదేవీలకు గతంలోనూ ఈ-వే బిల్లులు రూపొందించేవారు. అయితే సరుకు అంతిమంగా ఎవరి వద్దకు చేరుతుందో వారి జీఎస్టీ వివరాలను నమోదు చేయడం తప్పనిసరి కాకపోవచ్చు. తాజా మార్పుతో ఈ విషయంలో స్పష్టత తీసుకొచ్చారు. పై ఉదాహరణలో రాంబాబు సరుకును సురేశ్ పేరుతో పంపుతున్నప్పటికీ.. సరుకు వాస్తవంగా శ్రీకాంత్‌కు చేరుతోంది. కాబట్టి ఈ-వే బిల్లులో సురేశ్‌కు సంబంధించిన వివరాలతో పాటు సరుకును అంతిమంగా స్వీకరించే శ్రీకాంత్ జీఎస్టీ వివరాలను కూడా నమోదు చేయాలి. శ్రీకాంత్‌కు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటే అతని జీఎస్టీ నంబర్‌ను నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ లేకుంటే ‘URP’గా నమోదు చేయవచ్చు. దీంతో సరుకు ప్రయాణం ప్రారంభమైన స్థలం నుంచి అంతిమంగా చేరిన వ్యక్తి వరకు లావాదేవీపై మరింత స్పష్టత లభిస్తుంది.
‘షిప్-టు’ వివరాలే కీలకం.. Importance of Ship-to Details
ఈ-వే బిల్లో ‘షిప్-టు’ వివరాలు (New Change in E-Way Bill Rules) ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇన్వాయిస్ ఎవరి పేరుతో ఉందన్నది మాత్రమే కాకుండా సరుకు ఎక్కడికి వెళుతోంది? ఎవరు స్వీకరిస్తున్నారు? అనే వివరాలు కూడా సరైన రీతిలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, ఆన్లైన్ విక్రయ సంస్థలకు వర్తించే అంశం. ఒక ఆర్డర్ ఒకరి నుంచి వచ్చి.. సరుకు మరో వ్యక్తి లేదా సంస్థ నుంచి నేరుగా కస్టమర్‌కు వెళ్తున్నప్పుడు ఈ-వే బిల్ రూపొందించే వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి.
‘బిల్ ఫ్రమ్.. షిప్ ఫ్రమ్’ అంటే? Bill From and Ship From
ఈ-వే బిల్ లావాదేవీల్లో ‘Bill From’ మరియు ‘Ship From’ అనే మరో విధానం (New Change in E-Way Bill Rules) కూడా ఉంటుంది. ఇందులో ఇన్వాయిస్ ఒక వ్యక్తి లేదా సంస్థ నుంచి వస్తున్నప్పటికీ.. సరుకు మాత్రం మరో ప్రదేశం నుంచి రవాణా కావచ్చు. ఉదాహరణకు ఒక కంపెనీ ప్రధాన కార్యాలయం ఒక నగరంలో ఉండి.. దాని గిడ్డంగి మరో నగరంలో ఉందనుకుందాం. కస్టమర్‌కు ఇన్వాయిస్ కంపెనీ పేరుతో జారీ అయినప్పటికీ, సరుకు వాస్తవంగా గిడ్డంగి నుంచి నేరుగా పంపించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో లావాదేవీ స్వభావాన్ని సరిగ్గా గుర్తించి ఈ-వే బిల్లో సంబంధిత వివరాలను నమోదు చేయాలి. అయితే ‘Bill From/Ship From’ లావాదేవీలో అంతిమ కొనుగోలుదారుడి జీఎస్టీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. బిల్-టు/షిప్-టు లావాదేవీకి ఇది భిన్నమైన అంశం.అందువల్ల ఈ రెండు విధానాలను వ్యాపారులు ఒకటిగా భావించకూడదు. ఈ-వే బిల్ ఎవరు తయారు చేస్తున్నారు? లావాదేవీలో ఇన్వాయిస్ ఎవరికి జారీ అవుతోంది? సరుకు ఎక్కడి నుంచి బయలుదేరుతోంది? ఎవరికి చేరుతోంది? అనే అంశాలను పరిశీలించి సరైన విధానాన్ని ఎంచుకోవాలి.
కాంబినేషన్ ట్రాన్సాక్షన్లోనూ.. Combination Transactions
కొన్ని వ్యాపార లావాదేవీలు (New Change in E-Way Bill Rules) ఇంకా క్లిష్టంగా ఉంటాయి. ఒక వ్యక్తి కస్టమర్ కోసం సరుకును మరొక వ్యక్తి ద్వారా పంపించాలని ఆదేశించవచ్చు. ఆ వ్యక్తి వద్ద సరుకు లేకపోతే మరో వ్యాపారికి సరుకు పంపే బాధ్యతను అప్పగించవచ్చు. దీంతో సరుకు పంపే వ్యక్తి, బిల్లు జారీ చేసే వ్యక్తి, కొనుగోలుదారు, అంతిమంగా సరుకు స్వీకరించే వ్యక్తి వేర్వేరుగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు ‘ఏ’ అనే వ్యక్తి తన కస్టమర్ అయిన ‘బీ’కి సరుకు పంపాలని ‘సీ’కి చెబుతాడు. సీ వద్ద సరుకు లేకపోవడంతో ‘డీ’ అనే మరో వ్యక్తిని సరుకు పంపాలని కోరతాడు. ఇక్కడ వాస్తవంగా సరుకు పంపేది డీ. కానీ అంతిమంగా సరుకు అందుకునేది బీ. డీకి బీతో ప్రత్యక్ష వ్యాపార సంబంధం లేకపోయినా.. ఈ-వే బిల్లో ‘Ship-to’ వివరాలు మాత్రం బీకి అనుగుణంగా నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే సరుకు ప్రయాణంలో పాల్గొనే ప్రతి వ్యక్తి మధ్య ప్రత్యక్ష కొనుగోలు, విక్రయ సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. కానీ సరుకు అంతిమంగా ఎక్కడికి వెళుతుందన్నది ఈ-వే బిల్లో స్పష్టంగా కనిపించాలి.
ప్రతి సరుకు పంపకాన్నీ బిల్-టు/షిప్-టుగా చూడొద్దు.. Not Every Delivery Is Bill-to/Ship-to
ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని (New Change in E-Way Bill Rules) వ్యాపారులు గుర్తుంచుకోవాలి. ఒక సరఫరాదారు ఎవరి పేరుతో ఇన్వాయిస్ జారీ చేస్తున్నాడో.. సరుకును కూడా అదే వ్యక్తికి పంపుతున్నట్లయితే అది బిల్-టు/షిప్-టు లావాదేవీ కాదు. అది సాధారణ సరుకు సరఫరా లావాదేవీగానే పరిగణించాలి. అలాగే కొనుగోలుదారుడికి చెందిన మరో గోడౌన్, అదనపు వ్యాపార ప్రదేశం లేదా ఇతర అనుమతించబడిన ప్రదేశానికి సరుకును పంపుతున్నంత మాత్రాన దాన్ని బిల్-టు/షిప్-టు లావాదేవీగా భావించకూడదు. కొనుగోలు చేసిన వ్యక్తి, సరుకు స్వీకరించే వ్యక్తి వేర్వేరు జీఎస్టీ గుర్తింపులతో ఉన్నప్పుడు మాత్రమే బిల్-టు/షిప్-టు అంశం ప్రాధాన్యం సంతరించుకుంటుంది.
వ్యాపారులు ఏం గమనించాలి? What Businesses Need to Check?
కొత్త మార్పుతో ఈ-వే బిల్ (New Change in E-Way Bill Rules) తయారు చేసే సమయంలో సరుకు వాస్తవంగా ఎవరికి చేరుతుందో తెలుసుకోవడం అత్యంత కీలకం. ఇన్వాయిస్లో ఉన్న పేరు, సరుకు స్వీకరించే వ్యక్తి పేరు ఒకటేనా? వేరే వ్యక్తా? సరుకు పంపే వ్యక్తి ఎవరు? మధ్యలో డీలర్, డిస్ట్రిబ్యూటర్ లేదా ఇతర సరఫరాదారు ఉన్నారా? అంతిమ గ్రహీతకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందా? వంటి అంశాలను పరిశీలించాలి. ప్రత్యేకంగా బిల్-టు/షిప్-టు లావాదేవీల్లో అంతిమ సరుకు స్వీకర్త జీఎస్టీ వివరాలు అవసరమైన చోట తప్పకుండా నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ లేని వ్యక్తి అయితే యూఆర్పీగా నమోదు చేసే అవకాశం ఉన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.
పారదర్శకతే లక్ష్యం.. Greater Transparency in Goods Movement
ఈ-వే బిల్ వ్యవస్థలో (New Change in E-Way Bill Rules) తీసుకొచ్చిన తాజా మార్పు ప్రధానంగా సరుకు రవాణాలో పారదర్శకతను పెంచే దిశగా ఉందని చెప్పొచ్చు. ఇన్వాయిస్ ఒకరి పేరుతో ఉండి.. సరుకు మరొకరి వద్దకు చేరే లావాదేవీల్లో అంతిమ గ్రహీత వివరాలు స్పష్టంగా ఉంటే, సరుకు ప్రయాణాన్ని పర్యవేక్షించడం సులభమవుతుంది. అదే సమయంలో వ్యాపారులు లావాదేవీ రకాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఈ-వే బిల్ రూపొందించడం అవసరం. సాధారణ సరుకు సరఫరాను బిల్-టు/షిప్-టుగా చూపడం, లేదా నిజమైన బిల్-టు/షిప్-టు లావాదేవీలో అంతిమ గ్రహీత వివరాలను నమోదు చేయకపోవడం వంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడాలి. మొత్తంగా చూస్తే ఈ-వే బిల్లో వచ్చిన తాజా మార్పు వ్యాపార లావాదేవీల్లో సరుకు వాస్తవంగా ఎవరి వద్దకు చేరుతుందనే విషయాన్ని మరింత స్పష్టంగా చూపించేలా ఉంది. బిల్లు ఒకరి పేరుతో.. సరుకు మరొకరి చిరునామాకు వెళ్లే లావాదేవీలు ఎక్కువగా చేసే డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, కంపెనీలు, ఆన్లైన్ వ్యాపార సంస్థలు ఈ మార్పును ప్రత్యేకంగా గమనించాలి. ఈ-వే బిల్ తయారీలో చిన్న పొరపాటు కూడా సమస్యలకు దారితీయకుండా, లావాదేవీ స్వభావాన్ని ముందుగానే స్పష్టంగా గుర్తించి సంబంధిత వివరాలను సరిగ్గా నమోదు చేయడం వ్యాపారులకు అత్యంత అవసరం.
