దేశంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సామాజిక భద్రతలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెలా పెన్షన్లు అందిస్తున్నాయి. రాష్ట్రాన్ని బట్టి ఈ మొత్తం రూ.2 వేల నుంచి రూ.6 వేల వరకు ఉంది. అయితే దేశ అభివృద్ధికి దశాబ్దాల పాటు ప్రైవేట్ రంగంలో (Private Employees’ Pension) సేవలందించి పదవీ విరమణ పొందిన లక్షలాది మంది ఉద్యోగులు మాత్రం ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) కింద ఇప్పటికీ కనీసంగా రూ.1,000 మాత్రమే పొందుతున్నారు. పెరుగుతున్న జీవన వ్యయం, వైద్య ఖర్చులు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఈ మొత్తం ఏ మాత్రం సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని దాదాపు రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా సుమారు 86 లక్షల మంది పెన్షనర్లు ఆందోళన చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. ఈ అంశంపై నిపుణులవిశ్లేషణ ప్రస్తుతం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సరైన గణాంకాలు, పారదర్శక లెక్కలు ప్రభుత్వానికి సమర్పిస్తే కనీస పెన్షన్ పెంపు సాధ్యమేనని అభిప్రాయపడుతున్నారు.
ఈపీఎస్-95 ఎందుకు వచ్చింది? Why Was EPS-95 Introduced?
ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) 1995 నవంబర్ 16న అమల్లోకి వచ్చింది. అంతకుముందు అమలులో ఉన్న ఉద్యోగుల కుటుంబ పెన్షన్ పథకం-1971లో ఉద్యోగంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమిత ప్రయోజనాలు ఉండేవి. ఉద్యోగులకూ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పదవీ విరమణ అనంతరం నెలవారీ పెన్షన్ అందించాలని కార్మిక సంఘాలు చేసిన డిమాండ్ల నేపథ్యంలో ఈపీఎస్-95 రూపుదిద్దుకుంది. ఈ పథకం (Private Employees’ Pension)ప్రకారం ఉద్యోగి పీఎఫ్‌కు యాజమాన్యం చెల్లించే వాటాలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ నిధికి మళ్లించబడుతుంది. ఆ నిధుల ఆధారంగానే పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు నెలవారీ పెన్షన్ చెల్లిస్తారు. ఉద్యోగి సేవా కాలం, చివరి వేతనం ఆధారంగా పెన్షన్‌ను నిర్ణయించే విధానాన్ని ఇందులో అమలు చేశారు.
పథకం ఉద్దేశం నెరవేరిందా? Has the Scheme Achieved Its Objective?
పథకం ప్రారంభమైనప్పుడు రూపొందించిన సూత్రం ప్రకారం 35 సంవత్సరాల సేవ చేసిన ఉద్యోగికి చివరి వేతనంలో సగం మేర పెన్షన్ అందేలా లెక్కలు రూపొందించారు. ఉదాహరణకు రూ.15 వేల వేతనంతో పదవీ విరమణ చేసిన ఉద్యోగికి సుమారు రూ.7,500 పెన్షన్ రావాల్సి ఉంటుంది. అయితే వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈపీఎస్-95 కింద పెన్షన్ పొందుతున్న వారిలో దాదాపు 36 లక్షల మంది కేవలం రూ.1,000 మాత్రమే పొందుతున్నారు. మరోవైపు రూ.5 వేలకుపైగా పెన్షన్ (Private Employees’ Pension)పొందుతున్న వారి సంఖ్య ఒక శాతం కూడా లేదని గణాంకాలు సూచిస్తున్నాయి. సగటున సభ్యుడికి అందుతున్న పెన్షన్ రూ.1,600 పరిధిలోనే ఉండగా, వితంతు పెన్షన్ సుమారు రూ.1,900 మాత్రమే ఉంది. దీంతో ఈ పథకం అసలు లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోలేదన్న అభిప్రాయం బలపడుతోంది.
పెన్షన్ పెంపు ఎందుకు నిలిచిపోయింది? Why Has the Pension Hike Stalled?
ప్రతి సారి కనీస పెన్షన్ పెంపు (Private Employees’ Pension)అంశం చర్చకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భారం పెరుగుతుందని పేర్కొంటోంది. కార్మిక శాఖకు అందుతున్న యాక్చువేరియల్ నివేదికలు పెన్షన్ నిధిలో భారీ లోటు ఉన్నట్లు సూచిస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ లెక్కలే పూర్తిగా ఖచ్చితమైనవి కావని జలిగం శ్రీనివాస్ అభిప్రాయపడుతున్నారు. గత మూడున్నర దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే పెన్షన్ నిధిలో పెద్ద మొత్తంలో వడ్డీ రూపంలో ఆదాయం సమకూరిందని ఆయన చెబుతున్నారు. మొత్తం నిధిలో వడ్డీ ద్వారానే లక్షల కోట్ల రూపాయల కార్పస్ ఏర్పడిందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఈపీఎఫ్ఓ సరైన గణాంకాలు, వాస్తవ లెక్కలు కేంద్రానికి సమర్పించలేకపోవడం వల్లే పెన్షన్ పెంపుపై ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
వేతన పరిమితి మార్పులు ప్రభావం చూపాయా? Impact of Salary Ceiling Revisions
1995లో ఈ పథకం (Private Employees’ Pension) ప్రారంభమైనప్పుడు పెన్షన్‌కు గరిష్ఠ వేతన పరిమితి రూ.5 వేలుగా ఉండేది. అనంతరం 2001లో దానిని రూ.6,500కు పెంచారు. 2014 సెప్టెంబర్‌లో ఈ పరిమితిని రూ.15 వేలుగా నిర్ణయించారు. అయితే అదే సమయంలో రూ.15 వేలకుపైగా వేతనం పొందుతున్న కొత్త ఉద్యోగులను ఈపీఎస్-95లో చేర్చకుండా నిబంధన తీసుకురావడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్ పథకానికి దూరమయ్యారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌లో సభ్యులుగా ఉన్న వారిలో గణనీయమైన వర్గం ఈపీఎస్ పరిధిలో లేకపోవడం కూడా పథకం భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది.
సామాజిక పెన్షన్ కంటే తక్కువే ఎందుకు? Why Is It Lower Than Social Security Pensions?
రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి వ్యక్తిగత చందా లేకుండానే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు సామాజిక పెన్షన్లు అందిస్తున్నాయి. అలాంటప్పుడు దశాబ్దాల పాటు ఉద్యోగం చేసి, యాజమాన్యం చందాలు చెల్లించిన ప్రైవేట్ ఉద్యోగులకు కేవలం రూ.1,000 మాత్రమే ఇవ్వడం (Private Employees’ Pension) న్యాయం కాదని పెన్షనర్లు వాదిస్తున్నారు. తాము దాతృత్వం కోరడం లేదని, ఉద్యోగ జీవితంలో చెల్లించిన చందాలకు తగిన ప్రయోజనం మాత్రమే కోరుతున్నామని వారు చెబుతున్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సామాజిక పెన్షన్ స్థాయిలో అయినా ఈపీఎస్ పెన్షన్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
పెన్షన్ పెంచేందుకు నిధులున్నాయా? Is There Enough Money to Raise the Pension?
పెన్షన్ పెంపు సాధ్యం (Private Employees’ Pension) కాదనే అభిప్రాయాన్ని నిపుణులు ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఈపీఎస్ నిధి విలువ సుమారు రూ.10 లక్షల కోట్లకు చేరుకుందని, ప్రతి ఏడాది వడ్డీ రూపంలోనే భారీ ఆదాయం వస్తోందని ఆయన చెబుతున్నారు. 2024-25లో వడ్డీ ద్వారా రూ.60 వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. పెన్షన్ చెల్లింపులకు దాదాపు రూ.28 వేల కోట్లే అవసరమవుతుండటంతో మిగిలిన వడ్డీ ఆదాయం గణనీయంగానే ఉంటుందని ఆయన విశ్లేషించారు. కనీస పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచినా సంవత్సరానికి సుమారు రూ.10 వేల కోట్ల అదనపు వ్యయం మాత్రమే అవసరమవుతుందని, రూ.54 లక్షల కోట్లకు పైగా ఉన్న కేంద్ర బడ్జెట్లో ఇది పెద్ద భారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
డేటా లోపాలే ప్రధాన అడ్డంకి? Are Data Gaps the Biggest Obstacle?
ఈపీఎఫ్ఓ (Private Employees’ Pension) వద్ద సభ్యుల పూర్తి సమాచారం ఖచ్చితంగా లేకపోవడమే ప్రధాన సమస్యగా ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. ఉద్యోగం మధ్యలో వదిలేసిన వారు, స్వల్పకాలం మాత్రమే సేవ చేసిన వారు, పెన్షన్ తీసుకోకుండా వెళ్లిపోయిన వారి వివరాలను సరిగా వేరు చేయకుండా లెక్కలు రూపొందించడం వల్ల యాక్చువేరియల్ నివేదికల్లో లోటు ఎక్కువగా కనిపిస్తోందని ఆయన చెబుతున్నారు. పెన్షన్ నిధిని మూడు విభాగాలుగా విభజించి—ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు, భవిష్యత్తులో పొందబోయే వారు, ఇప్పటికే నిధి నుంచి వైదొలిగిన వారి ఖాతాలను వేర్వేరుగా లెక్కిస్తే అసలు ఆర్థిక పరిస్థితి స్పష్టమవుతుందని ఆయన సూచిస్తున్నారు.
ప్రభుత్వానికి నిపుణుల సూచనలు.. Suggestions to the Government
పెన్షన్ పెంపు (Private Employees’ Pension) కోసం కేంద్ర ప్రభుత్వం మూడు ప్రధాన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొదటిగా, ఈపీఎఫ్ఓ వద్ద ఉన్న సభ్యుల డేటాను పూర్తిగా నవీకరించాలి. రెండవది, ఖచ్చితమైన యాక్చువేరియల్ నివేదికను రూపొందించి పెన్షన్ నిధి వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలి. మూడవది, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పరిమిత ఆర్థిక సహాయం అందించి కనీస పెన్షన్‌ను కనీస జీవన భద్రత కల్పించే స్థాయికి తీసుకురావాలి. ఇప్పటికే 2013లో భగత్‌సింగ్ కోషియారి కమిటీ కనీస పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచాలని సిఫారసు చేసినప్పటికీ అమలు కాలేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కనీసం ఆ స్థాయికి పెంచడం సాధ్యమేనని అభిప్రాయపడ్డారు.
కనీస జీవన భద్రత కోసం ఎదురుచూపు..Waiting for Basic Financial Security
దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రైవేట్ రంగ ఉద్యోగులు పదవీ విరమణ (Private Employees’ Pension) అనంతరం కనీస జీవన భద్రత కోసం ఎదురుచూస్తున్నారు. పెరుగుతున్న ధరలు, వైద్య ఖర్చులు, జీవన వ్యయం నేపథ్యంలో నెలకు రూ.1,000 పెన్షన్‌తో గౌరవప్రదమైన జీవితం గడపడం దాదాపు అసాధ్యంగా మారింది. అయితే పెన్షన్ పెంపు పూర్తిగా అసాధ్యమని చెప్పలేమని నిపుణుల విశ్లేషణ స్పష్టం చేస్తోంది. సరైన గణాంకాలు, పారదర్శక ఆర్థిక లెక్కలు, ప్రభుత్వ సంకల్పం కలిస్తే ఈపీఎస్-95 పెన్షనర్లకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందన్నదే ఇప్పుడు లక్షలాది మంది ప్రైవేట్ రంగ విశ్రాంత ఉద్యోగుల ఎదురుచూపుగా మారింది.
