ఇటీవల కాలంలో ప్రజలు ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరాలు పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నాయి. జీవన శైలి మరింత ఖరీదుగా మారింది. దీంతో ఆర్థిక భారం అధికంగా పెరుగుతోంది. దీనిని భరించలేని మధ్యతరగతి ప్రజలు ఖర్చులు చేసే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతో ఖర్చలు కొంచెం తగ్గుతున్నాయి. భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని అనవసర ఖర్చులను కూడా తగ్గించుకుంటున్నారు.
దేశంలో ప్రజలు తక్కువగా ఖర్చు చేయడానికి ప్రధాన కారణం పెరుగుతున్న ధరలు. నిత్యావసరాల ధరల పెరుగుదలతో పాటు జీఎస్టీ వంటి పన్నుల భారంతో ప్రజలు తమ ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు. సామాన్య , మధ్య తరగతి వర్గాల వారు ఆహారానికి ఎంత ఖర్చు చేయాలి.. నెలవారీ ఖర్చులకు ఎంత తీయాలి, ఇంకా ఎంత మిగిలి ఉందనేది చూసుకుంటూ ముందుకుసాగుతున్నారు.
ఆర్థిక భారం Financial Burden
ఇప్పుడు ధరలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. గత నలబై ఏళ్లలో ఇలాంటి పరస్థితి లేదు. కానీ దీనికి తగ్గట్టుగా ఆదాయం మాత్రం పెరగడం లేదు. ఇలా ఖర్చులు పెరుగుతుండడంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. దేశంలో వినియోగదారుల ఆహారం పై ఖర్చు వాటా తగ్గుతూ ఉండగా, ఆదాయాల్లో పెరుగుతున్న అసమానతలు ఆర్థిక సమాజంలో మార్పులను సూచిస్తున్నాయి.
జీఎస్టీ ప్రభావం Impact of GST
జీఎస్టీ (వస్తు మరియు సేవల పన్ను) పెరుగుదల మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పెంచుతోంది. ప్యాక్ చేయని ఆహార పదార్థాలపై కూడా పన్ను విధించడం, పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పెంచుతోంది. ఈ పరిస్థితులు మధ్యతరగతి వ్యక్తుల జీవన ఖర్చులను పెంచి, వారి జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తున్నాయి.
పెరగని ఆదాయం Stagnant Income
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆదాయాలు పెరగడం లేదు. అందుకే భారతీయుల మొత్తం ఖర్చుల్లో ఆహారం వాటా తగ్గింది. 2011-2012లో ఆహారంపై గ్రామీణులు తమ ఆదాయంలో 52.9 శాతం మాత్రమే ఖర్చు చేసే వారు. ప్రస్తుతం ఇది 46.4 శాతానికి పడిపోయింది. నగరవాసుల్లో కూడా ఇదే ధోరణి కనిపించింది. ఒకప్పుడు 48.1 శాతం ఉన్న ఆహార ఖర్చులు ప్రస్తుతం 39.2 శాతానికి పడిపోయాయి. భారతీయుల ఆదాయాలు పెరగకపోవడమే ఈ ధోరణికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు భారతీయుల ఆహారంలో పప్పులు, తృణధాన్యాలు అధికంగా ఉండేవి. 2011-12లో గ్రామీణ భారతీయుల ఆహారంలో పప్పులు, తృణధాన్యాల వాటా 25.8 శాతం కాగా ప్రస్తుతం ఇది 14.92 శాతానికి తగ్గింది. నగరవాసుల్లోనూ ఈ మార్పు కనిపిస్తోంది. కొంతమంది వ్యక్తులు భవిష్యత్తు అవసరాల కోసం మరింత పొదుపు చేయడానికి తమ ఖర్చులను తగ్గిస్తున్నారు. లోన్ తీసుకోవడం, పెట్టుబడులు పెట్టడం వంటి ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం ద్వారా ఖర్చులను తగ్గించుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఆరోగ్య వ్యయాలు పెరగడంతో ప్రజలు అవసరమైతే మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అత్యవసరాలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇచ్చి మిగిలిన వాటికి ప్రాధాన్యం తగ్గించారు.
* కూలీ వేతనాలు తక్కువగా ఉండడం, ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉండడం, ఆరోగ్య సేవలు, విద్యా ఖర్చులు వంటివి ప్రజల ఖర్చులను నియంత్రించడానికి ప్రేరేపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు, పథకాలు, నిధుల కేటాయింపులు, ప్రజల ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తున్నాయి.
నెలవారీ ఖర్చులు ఇలా
Monthly Expenses Breakdown
తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో కుటుంబాలు నెలకు రూ.9,131 ఖర్చు పెడుతుంటే, ఏపీ పట్టణప్రాంతాల్లో ఈ లెక్క రూ.9,877గా ఉంది. తెలంగాణ పల్లెల్లోని కుటుంబాలు నెలకు రూ.5,675 చొప్పున ఖర్చు చేస్తుంటే.. ఏపీలోనైతే గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,107 ఖర్చు చేస్తున్నాయని గృహ వినియోగ వ్యయ సర్వే లో తేలింది. కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి నెలవారీ ఖర్చులు జాతీయ సగటు కంటే తక్కువగానే ఉన్నాయి.
* దేశ ఆర్థిక వ్యవస్థలో మధ్యతరగతి ప్రజలది కీలక పాత్ర. ఎందుకంటే వీళ్లే కన్జమ్షన్, ఇన్నోవేషన్ , గ్రోత్‌ను ముందుకు నడిపిస్తారు. 2024 లోనూ భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమయ్యారు. అయితే వీరు ఈ ఏడాదిలో అధిక ద్రవ్యోల్బణం కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఫుడ్, ఫ్యూయల్ ను ఎక్కువగా కొనుగోలు చేయలేకపోయారు. నిత్యవవసరాలను పొదుపుగా కొంటూ ఖర్చు తగ్గించుకున్నారు.
పెరుగుతున్న జీవన వ్యయం
Rising Cost of Living
ప్రజల జీవన వ్యయం పెరుగుతూనే ఉంది. మధ్యతరగతి ప్రజలు ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికే చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. ఇంక డబ్బు ఆదా చేయడం అనే మాటే ఉత్పన్నమవడం లేదు. గత మూడేళ్లుగా భారతదేశంలో సగటు ద్రవ్యోల్బణం రేటు 5% కంటే ఎక్కువగా ఉంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి ఆదాయం పెరగకపోవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యతరగతి ప్రజల ఆదాయం కంటే వైద్య ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి. పిల్లల చదువుల కోసం పాఠశాల నుంచి కళాశాల వరకు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. వైద్యం, విద్య కోసం చేస్తున్న ఖర్చు వారి ఆదాయానికి, అర్హతకు మించినది కావడంతో అది వారి జీవన చక్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకం
Job Security in Question
మధ్యతరగతి ప్రజలు స్థిరమైన, సాధారణ ఆదాయంపై ఆధారపడి ఉంటారు. అయితే ఆర్థిక వ్యవస్థ అనూహ్యమైనది. టెక్నాలజీ మరింత అడ్వాన్స్డ్గా మారుతున్న కొద్దీ నేచర్ అఫ్ వర్క్ కూడా మారుతుంది. అనేక సంప్రదాయ ఉద్యోగాలు ఆటోమేటెడ్ లేదా ఔట్‌సోర్స్ చేయడం వల్ల మధ్యతరగతి కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయోనన్న సందిగ్ధంలో వారంతా జాగ్రత్త పడుతూ ఖర్చులను తగ్గించుకుంటున్నారు.
పన్ను పోటు
Tax Burden
మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకే పన్ను పోటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సంపన్నులు, ఇండస్ట్రీయలిస్ట్లకు భారీ రాయితీలు ఉంటాయి. తీసుకున్న అప్పులు చెల్లించకపోయినా వాటిని రైట్ ఆఫ్ చేస్తున్నారు. ఇక పేద వర్గానికి అనేక రాయితీలు ఎలాగూ ఉండనే ఉంటాయి. అయితే వారి మధ్యలో నలిగిపోయేది మాత్రం మధ్యతరగతి వారే. మధ్యతరగతి ప్రజల్లో పొదుపు కూడా గణనీయంగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. ఆర్బీఐ డేటా ప్రకారం జీడీపీలో నికర గృహ పొదుపుల వాటా 50యేళ్ల కనిష్టానికి దిగజారింది.
క్షీణించిన కొనుగోలు శక్తి Declining Purchasing Power
మధ్యతరగతి ప్రజల్లో కొనుగోలు శక్తి దారుణంగా క్షీణించిందని రిపోర్టులు చెబుతున్నాయి. ఆహారం, పానీయాల కొనుగోలులో ఎక్కువ వాటా ఉన్న మధ్యతరగతి ప్రజల వినియోగం గణనీయంగా తగ్గిందని FMCG అమ్మకాలు చెబుతున్నాయి. FMCG అమ్మకాలలో మూడింట రెండు వంతుల వాటా పట్టణ మధ్యతరగతి చేత ప్రభావితమై ఉంటుంది.పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, ఆదాయం తగ్గిపోవడం వంటి కారణాలతో మధ్య తరగతి ప్రజలు గతంలో లాగా ఖర్చు చేయలేకపోతున్నారని చెబుతున్నాయి. అందుకే డబుల్ డిజిట్ పర్సెంటేజ్ ఉన్న సేల్స్ ఇప్పుడు కేవలం 1.5 శాతం నుంచి 2 శాతానికి పడిపోయాయని చెబుతున్నాయి. ఒకప్పుడు అభివృద్ధి పథంలో ముందున్న మిడిల్ క్లాస్ ప్రజల పరిస్థితి ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆర్థిక సమస్యలతో చితికిపోతున్నారు. ఉద్యోగ, ఉపాధి తగ్గింది. పొదుపు లేదు. ఇదంతా వారి ఆర్థిక స్థతిగతులపై, కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి.