డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే.. సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవడం, సక్రమంగా నిర్వహించుకోవడం మరో ఎత్తు. ఎక్కువ సంపాదిస్తేనే సంపద పెరుగుతుందనుకోవడం సరికాదు. డబ్బు విషయంలో మన ఆలోచనా విధానం, అలవాట్లు, నిర్ణయాలు కూడా మన ఆర్థిక జీవితంపై ప్రభావం చూపుతాయి. ఇదే విషయాన్ని ప్రముఖ రచయిత మోర్గాన్ హౌసెల్ తన ‘ది సైకాలజీ ఆఫ్ మనీ’ (The Psychology of Money..) పుస్తకంలో ఆసక్తికరమైన నిజ జీవిత ఉదాహరణలతో వివరించారు. సంపదను ఎలా సృష్టించాలి? దాన్ని ఎలా కాపాడుకోవాలి? పెట్టుబడుల్లో అదృష్టం, ప్రమాదం పాత్ర ఎంత? వంటి అంశాలను సులభంగా అర్థమయ్యేలా ఈ పుస్తకం వివరిస్తుంది.
చదువు కంటే అలవాట్లే ముఖ్యం.. Education Is Not Everything
మోర్గాన్ హౌసెల్ పుస్తకాన్ని రొనాల్డ్ జేమ్స్ రీడ్ కథతో (The Psychology of Money..)ప్రారంభిస్తారు. అమెరికాలో జన్మించిన రీడ్ తన కుటుంబంలో మొదటిసారి చదువుకున్న వ్యక్తి. చదువు పూర్తయ్యాక ఫ్లోర్ క్లీనర్‌గా, కార్లకు చిన్నచిన్న మరమ్మతులు చేసే వ్యక్తిగా పనిచేశారు. పెద్ద ఉద్యోగం చేయలేదు. భారీ జీతం కూడా అందుకోలేదు. అయితే ఆయనకు ఒక అలవాటు ఉంది. సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేసి, దీర్ఘకాలం పాటు స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేవారు. 38 ఏళ్ల వయసులో సుమారు 12 వేల డాలర్లతో ఇల్లు కొనుగోలు చేసిన ఆయన జీవితాంతం సాధారణంగానే జీవించారు. 2014లో 92 ఏళ్ల వయసులో మరణించే సమయానికి ఆయన సంపద సుమారు 8 మిలియన్ డాలర్లకు చేరింది. అందులో సుమారు 6 మిలియన్ డాలర్లను ఆసుపత్రులు, గ్రంథాలయాలకు విరాళంగా ఇచ్చారు. ఇదే సమయంలో రిచర్డ్ ఫస్కోన్ కథ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎంబీఏ చేసిన ఆయన మెరిల్ లించ్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 40 ఏళ్ల వయసులో ఉద్యోగానికి విరమణ చేసి, ఫిలాంత్రఫీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత భారీగా అప్పులు చేసి విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారు. 11 బెడ్రూమ్లు, రెండు స్విమ్మింగ్ పూల్స్, ఏడు గ్యారేజీలతో ఉన్న ఆ ఇంటి నిర్వహణకే నెలకు భారీగా ఖర్చయ్యేది. 2000 నుంచి 2008 వరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఆయన ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పులు, భారీ ఖర్చులు, పెట్టుబడులపై ఆధారపడిన జీవనశైలి సమస్యలకు దారితీసింది. ఈ రెండు కథలు చెప్పే విషయం ఒక్కటే. సంపదను సంపాదించడానికి పెద్ద చదువులు లేదా భారీ ఆదాయం మాత్రమే అవసరం లేదు. పొదుపు చేసే అలవాటు, ఖర్చులపై నియంత్రణ, క్రమశిక్షణ, దీర్ఘకాలిక ఆలోచన కూడా అంతే ముఖ్యమైనవి.
ఆస్తి సంపాదించడం కంటే నిలబెట్టుకోవడం ముఖ్యం.. Getting Rich vs Staying Rich
స్టాక్ మార్కెట్లో గొప్ప ట్రేడర్‌గా పేరొందిన జెస్సీ లివర్మోర్ (The Psychology of Money..)కథను కూడా హౌసెల్ ప్రస్తావిస్తారు. తన కాలంలోనే అత్యంత విజయవంతమైన ట్రేడర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన 30 ఏళ్ల వయసుకే భారీ సంపదను కూడబెట్టారు. 1929లో ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో మార్కెట్ పతనాన్ని ముందుగానే అంచనా వేసి షార్ట్ పొజిషన్ల ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించారు. అయితే సంపదను సంపాదించినంత సులభంగా దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అధిక మొత్తంలో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం, భారీ రిస్క్ తీసుకోవడం వంటి నిర్ణయాలు చివరకు ఆయన సంపదను దెబ్బతీశాయి. కొంతకాలానికి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరకు 1940లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఈ ఉదాహరణ ద్వారా హౌసెల్ చెప్పే ముఖ్యమైన విషయం.. సంపదను సృష్టించడం కంటే దాన్ని కాపాడుకోవడం మరింత ముఖ్యమని. ఎంత సంపాదించినా, రిస్క్‌ను నియంత్రించుకోకపోతే సంపద కరిగిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు.
అదృష్టాన్ని, ప్రమాదాన్ని గౌరవించాలి.. Respect the Power of Luck and Risk
డబ్బు విషయంలో (The Psychology of Money..)విజయం సాధించిన ప్రతి ఒక్కరి కథను మన జీవితానికి నేరుగా అన్వయించుకోవడం సరికాదని హౌసెల్ చెబుతారు. ఇందుకు బిల్ గేట్స్ ఉదాహరణను ప్రస్తావిస్తారు. బిల్ గేట్స్ చదువుకున్న లేక్‌సైడ్ స్కూల్లో అప్పట్లో కంప్యూటర్ను ఉపయోగించే అవకాశం ఉండేది. అది ఆయనకు లభించిన అరుదైన అవకాశాల్లో ఒకటి. అక్కడే ఆయనకు కంప్యూటర్‌పై ఆసక్తి పెరిగింది. తన స్నేహితుడు పాల్ అలెన్‌తో కలిసి అనేక ప్రాజెక్టులపై పనిచేశారు. ఇదే సమయంలో అదే పాఠశాలలో చదువుకున్న మరో విద్యార్థి కంప్యూటర్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అనుకోని ప్రమాదంలో మరణించాడు. ఇక్కడి నుంచి హౌసెల్ చెప్పే పాఠం ముఖ్యమైనది. ఒకే పరిస్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఒకే ఫలితం రావాల్సిన అవసరం లేదు. కొందరికి లభించిన అవకాశం అదృష్టం కావచ్చు. అదే అవకాశం మరొకరికి లభించకపోవచ్చు. అందుకే ఇతరుల విజయాన్ని చూసి అదే పద్ధతిని అనుసరిస్తే మనకూ అదే ఫలితం వస్తుందని భావించకూడదు. ‘Respect the power of luck and risk’ అన్నది పుస్తకంలోని ముఖ్యమైన సందేశాల్లో ఒకటి. విజయంలో అదృష్టం పాత్రను పూర్తిగా విస్మరించకూడదు. అలాగే ఎదురయ్యే ప్రమాదాలను తక్కువగా అంచనా వేయకూడదు.
ఎవరి డబ్బు ఆలోచనలు వారివే.. No One’s Crazy
డబ్బు విషయంలో (The Psychology of Money..)ప్రతి వ్యక్తి నిర్ణయాలు అతని అనుభవాలు, కుటుంబ పరిస్థితులు, ఆదాయం, భయాలు, లక్ష్యాల ఆధారంగా ఉంటాయి. అందుకే ఒకరికి సరైనదిగా కనిపించిన ఆర్థిక నిర్ణయం మరొకరికి సరిపోకపోవచ్చు. దీనినే హౌసెల్ ‘No One’s Crazy’ అనే భావనతో వివరిస్తారు. వారెన్ బఫెట్ ఉదాహరణను తీసుకుంటే.. ఆయన చాలా చిన్న వయసు నుంచే పెట్టుబడులపై ఆసక్తి పెంచుకున్నారు. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించడం ద్వారా సంపదను పెంచుకున్నారు. అయితే ఆయన సంపదలో పెద్ద భాగం జీవితంలోని తర్వాతి దశల్లోనే పెరిగింది. దీనికి ప్రధాన కారణం పెట్టుబడులకు లభించిన దీర్ఘకాలిక సమయం, చక్రవడ్డీ ప్రభావం. ఇదే సమయంలో జిమ్ సిమన్స్ వంటి పెట్టుబడిదారులు భిన్నమైన మార్గాన్ని అనుసరించారు. పెట్టుబడులు ప్రారంభించిన వయసు, పెట్టుబడి విధానం, రాబడులను పెంచుకున్న కాలం వంటివి వ్యక్తికి వ్యక్తికి మారుతాయి. కాబట్టి ఎవరి విజయాన్ని చూసి వారి ప్రయాణాన్ని పూర్తిగా అనుకరించడం కంటే.. మన ఆదాయం, లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అవసరం.
డబ్బు విషయంలో అసలు పాఠం ఇదే.. The Real Psychology of Money
‘సైకాలజీ ఆఫ్ మనీ’ పుస్తకం(The Psychology of Money..) ప్రధానంగా పెట్టుబడుల సూత్రాలను మాత్రమే చెప్పదు. డబ్బు విషయంలో మనుషులు ఎలా ఆలోచిస్తారు? ఎందుకు తప్పులు చేస్తారు? సంపద వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని కోల్పోతారు? ఇతరుల విజయాన్ని చూసి ఎందుకు అదే మార్గాన్ని అనుసరించాలనుకుంటారు? వంటి మానసిక అంశాలను కూడా వివరిస్తుంది. డబ్బు సంపాదించడం కోసం ఎక్కువగా పరుగెత్తడం కంటే.. సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేయడం, అనవసర అప్పులకు దూరంగా ఉండడం, పెట్టుబడుల్లో ఓపిక పాటించడం, రిస్క్‌ను అర్థం చేసుకోవడం, దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు సాగడం ముఖ్యమని ఈ పుస్తకం గుర్తుచేస్తుంది. మొత్తంగా చూస్తే.. డబ్బు మన జీవితాన్ని నడిపించకూడదు.. మనమే డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి. ఎక్కువ సంపాదించడం మాత్రమే సంపదకు కొలమానం కాదు. సంపాదించిన దాన్ని కాపాడుకోవడం, అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం, భవిష్యత్తు కోసం నిల్వ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ ఆలోచనా విధానాన్ని సరళమైన కథలతో, నిజ జీవిత ఉదాహరణలతో పరిచయం చేసే పుస్తకమే ‘ది సైకాలజీ ఆఫ్ మనీ’.
