అవసరం వచ్చినప్పుడు వెంటనే డబ్బు చేతికి అందాలి.. పెద్దగా పత్రాలు ఉండకూడదు.. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంట్లో నుంచే రుణం పొందాలి.. ఇదే ఇప్పుడు చాలామంది ఆలోచన. స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ రుణాలు (Online Loan) కూడా విస్తృతమయ్యాయి. కొన్ని నిమిషాల్లోనే రుణం మంజూరవుతుండటం, డిజిటల్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటం, తక్కువ మొత్తంలోనూ రుణాలు లభిస్తుండటంతో యువతతో పాటు ఇతర వినియోగదారులు కూడా వీటివైపు మొగ్గు చూపుతున్నారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో పాటు ఫిన్‌టెక్ సంస్థలు డిజిటల్ వేదికల ద్వారా రుణ సేవలను అందిస్తున్నాయి. వ్యక్తిగత రుణాలు, బంగారంపై రుణాలు, ఇతర అవసరాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సౌకర్యం పెరిగింది. అయితే సాంకేతికత ఎంత సౌకర్యాన్ని కల్పిస్తుందో.. అంతే స్థాయిలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రుణం తీసుకునే ముందు ఆ యాప్ లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్ వెనుక ఉన్న సంస్థ ఎవరు? అది చట్టబద్ధంగా పనిచేస్తోందా? వడ్డీ, ఇతర ఛార్జీలు ఎంత? తిరిగి చెల్లింపు నిబంధనలు ఏమిటి? వంటి విషయాలను పూర్తిగా తెలుసుకోవాలి.
యాప్ ఎవరిది? Check the Lender First
ఆన్లైన్లో రుణం (Online Loan) కోసం దరఖాస్తు చేసే ముందు మొదట పరిశీలించాల్సిన అంశం రుణదాత ఎవరు అనేదే. కేవలం మొబైల్ యాప్ ఉందని, కొన్ని నిమిషాల్లో డబ్బు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారని నమ్మి ముందుకు వెళ్లకూడదు. ఆ యాప్ ఏ బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీతో అనుసంధానమై ఉంది? ఆ సంస్థకు సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉన్నాయా? వంటి విషయాలను పరిశీలించాలి. రుణం అందించే సంస్థకు సంబంధించిన పూర్తి పేరు, చిరునామా, కస్టమర్ సేవా వివరాలు, రుణ ఒప్పందం వంటి సమాచారం అందుబాటులో ఉందా లేదా చూడాలి. అధికారిక సంస్థతో సంబంధం లేకుండా పనిచేసే అనుమానాస్పద యాప్‌ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకూడదు.
అవసరానికి తగ్గ రుణమే తీసుకోవాలి.. Borrow Only What You Need
రుణం (Online Loan)తీసుకునే ముందు మన అవసరం ఏమిటో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. అత్యవసర ఖర్చు కోసం స్వల్పకాలిక రుణం అవసరమా? లేక కొంతకాలం పాటు చెల్లించాల్సిన దీర్ఘకాలిక రుణమా? మనకు ఎంత మొత్తం అవసరం? దాన్ని ఎన్ని నెలల్లో తిరిగి చెల్లించగలం? నెలవారీ వాయిదా మన ఆదాయానికి సరిపోతుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేయడం మంచిది. అవసరానికి మించి రుణం తీసుకోవడం భవిష్యత్తులో ఆర్థిక భారాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఒక రుణాన్ని తీర్చడానికి మరో రుణం తీసుకునే పరిస్థితి రాకుండా జాగ్రత్తపడాలి. నెలవారీ ఆదాయం, ఇప్పటికే ఉన్న రుణాలు, ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కొత్త రుణం గురించి నిర్ణయం తీసుకోవాలి.
వడ్డీ ఎంత? ఛార్జీలు ఎన్నెన్ని? Compare Interest Rates and Charges
ఆన్లైన్ రుణాల్లో (Online Loan)అత్యంత కీలకమైన అంశం వడ్డీ రేటు. ఒక సంస్థ తక్కువ వడ్డీ అని ప్రకటన చేసినంత మాత్రాన అదే తక్కువ ఖర్చుతో కూడిన రుణమని భావించకూడదు. వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, ఆలస్య చెల్లింపు రుసుము, ఇతర సేవా ఛార్జీలు ఏమైనా ఉన్నాయా? వంటి అంశాలను పరిశీలించాలి. వేర్వేరు సంస్థలు అందిస్తున్న రుణాలను పోల్చి చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. నెలవారీ వాయిదా ఎంత? మొత్తం రుణ కాలంలో ఎంత చెల్లించాలి? వడ్డీతో కలిపి మొత్తం భారం ఎంత అవుతుంది? వంటి వివరాలను ముందుగానే లెక్కించుకోవాలి. కేవలం ‘తక్షణ రుణం’, ‘తక్కువ వడ్డీ’, ‘డాక్యుమెంట్లు అవసరం లేదు’ వంటి ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి నిర్ణయం తీసుకోవడం సరికాదు.
ఒప్పందం చదవకుండా సంతకం వద్దు.. Read the Loan Agreement Carefully
రుణం ఖరారు (Online Loan) చేసే ముందు సంబంధిత ఒప్పంద పత్రాన్ని పూర్తిగా చదవాలి. రుణం మొత్తం, వడ్డీ రేటు, రుణ కాలపరిమితి, నెలవారీ చెల్లింపు, ముందస్తు చెల్లింపు నిబంధనలు, ఆలస్య చెల్లింపులపై జరిమానాలు వంటి వివరాలు అందులో ఉంటాయి. ఏదైనా అంశం అర్థం కాకపోతే సంస్థను వివరణ అడిగిన తర్వాతే అంగీకరించాలి. చిన్న అక్షరాల్లో ఉన్న నిబంధనలను కూడా విస్మరించకూడదు. యాప్‌కు మన ఫోన్లోని కాంటాక్టులు, ఫొటోలు లేదా ఇతర సమాచారానికి అనవసరమైన అనుమతులు ఎందుకు అవసరమో కూడా గమనించాలి. అవసరానికి మించిన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వల్ల భవిష్యత్తులో గోప్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
చెల్లింపులు అధికారిక మార్గంలోనే.. Make Payments Through Official Channels
రుణం తీసుకున్న (Online Loan) తర్వాత తిరిగి చెల్లింపులు చేసే విషయంలోనూ జాగ్రత్త అవసరం. బ్యాంకు, ఎన్బీఎఫ్సీ లేదా సంబంధిత అధికారిక రుణదాత సూచించిన మార్గాల ద్వారానే చెల్లింపులు చేయాలి. వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు, అనుమానాస్పద లింకులకు లేదా గుర్తుతెలియని ఖాతాలకు డబ్బు పంపకూడదు. డిజిటల్ చెల్లింపులు చేయడం వల్ల ప్రతి లావాదేవీకి రికార్డు ఉంటుంది. రుణం చెల్లించిన తర్వాత రసీదులు, లావాదేవీ వివరాలు, ఈ-మెయిళ్లు, ఎస్ఎంఎస్లను భద్రపరచుకోవడం మంచిది. భవిష్యత్తులో ఏదైనా వివాదం తలెత్తితే ఇవి ఆధారాలుగా ఉపయోగపడతాయి.
గడువు మించితే భారం పెరుగుతుంది.. Never Miss Your Repayment Dates
రుణం (Online Loan) తీసుకోవడం ఎంత సులభమో.. తిరిగి చెల్లించడం అంతే బాధ్యతతో కూడుకున్నది. ప్రతి నెల చెల్లించాల్సిన తేదీని గుర్తుంచుకోవాలి. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లు సాధారణంగా ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ లేదా యాప్ నోటిఫికేషన్ల ద్వారా చెల్లింపు తేదీలను గుర్తు చేస్తుంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. వాయిదా గడువు దాటితే అదనపు రుసుములు పడే అవకాశం ఉండటంతో పాటు రుణ చెల్లింపు చరిత్రపైనా ప్రభావం పడవచ్చు. అందువల్ల ఆదాయానికి అనుగుణంగా నెలవారీ చెల్లింపులను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి.
సౌకర్యం సరే.. అప్రమత్తతే ముఖ్యం.. Convenience Must Come with Caution
ఆన్లైన్ రుణాలు (Online Loan) ఆర్థిక సేవలను మరింత సులభతరం చేశాయి. బ్యాంకుకు వెళ్లకుండా, డిజిటల్ ప్రక్రియ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం సామాన్య వినియోగదారుడికి ఉపయోగకరమే. అయితే వేగంగా రుణం లభిస్తుందనే కారణంతో తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రుణం తీసుకునే ముందు రుణదాత విశ్వసనీయతను పరిశీలించడం, అవసరమైన మొత్తానికే పరిమితం కావడం, వడ్డీ రేట్లు-ఛార్జీలను పోల్చడం, ఒప్పందంలోని నిబంధనలను చదవడం, అధికారిక మార్గాల్లోనే చెల్లింపులు చేయడం.. ఇవన్నీ పాటిస్తే డిజిటల్ రుణ సేవలను మరింత బాధ్యతాయుతంగా వినియోగించుకోవచ్చు. చేతిలోకి డబ్బు రావడం ఒక్కటే కాదు.. దాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా అన్నదే అసలు ప్రశ్న. ఆన్లైన్ రుణం విషయంలో ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
