దేశీయ కరెన్సీ ఫారెక్స్ మార్కెట్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక దశలో 47 పైసలు క్షీణించి తొలిసారిగా రూ.90 మార్క్‌ను తాకింది. చివరికి 43 పైసల నష్టంతో రూ.89.96 వద్ద ముగిసి, ఇది రూపాయి చరిత్రలోనే ఆల్‌టైమ్ కనిష్ఠ ముగింపుగా నమోదు అయింది. ఫారెక్స్ వర్గాల ప్రకారం… అంతర్జాతీయంగా డాలర్ దూసుకుపోవడం, దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్ పెరగడం, ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు వరుసగా వెనకడుగు వేయడం, స్పెక్యులేటివ్ ట్రేడర్ల షార్ట్ కవరింగ్.. ఈ అంశాలన్నీ కలిసి రూపాయి విలువను మరింతగా దిగజార్చాయి. అమెరికా–భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం జాప్యం, పెరుగుతున్న వాణిజ్య లోటు కూడా పతనానికి కారణమని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ 5 శాతం మేర క్షీణించింది. ఆసియా దేశాల కరెన్సీలలో అత్యధికంగా నష్టపోయింది భారత రూపాయే.
కరెన్సీ ఒత్తిడికి మరిన్ని కారణాలు Additional Factors Behind the Currency Pressure
1) దిగుమతిదారుల డాలర్ డిమాండ్ పెరుగుదల (Rising Dollar Demand from Importers) : చమురు, బొగ్గు, పసిడి వంటి అవసరమైన దిగుమతులపై భారతదేశం ఆధారం పడడం వల్ల డాలర్ విలువ పెరుగుతోంది. దీంతో రూపాయిపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది.
2) విదేశీ పెట్టుబడుల (FPI) వెనక్కి వెళ్లిపోవడం (Foreign Portfolio Outflows Intensify): ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడిదారులు గత కొన్ని వారాలుగా భారీగా విక్రయాలు చేస్తున్నారు. ఎఫ్‌ఐలు అమ్మితే రూపాయిలోకి వస్తాయి. వాటిని తిరిగి డాలర్‌కి మార్చి బయటకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రాసెస్ కూడా రూపాయి పతనాన్ని వేగవంతం చేసింది.
3) స్పెక్యులేటివ్ ట్రేడర్ల షార్ట్ కవరింగ్ (Short Covering by Speculative Traders): రూపాయి మరింత బలహీనపడుతుందని ఊహించిన ట్రేడర్లు పెద్దఎత్తున షార్ట్ పొజిషన్లు తీసుకున్నారు. రూపాయి ఒక దశలో 90 దాకా చేరడంతో వారు షార్ట్ కవరింగ్ చేయడంతో మార్కెట్‌లో మరింత గందరగోళం ఏర్పడింది.
4) ఇండియా–అమెరికా వాణిజ్య ఒప్పందం జాప్యం (Delay in India–US Trade Agreement): ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు ఆశించిన మేర ముందుకు సాగకపోవడంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ జాప్యం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.
5) పెరుగుతున్న వాణిజ్య లోటు (Widening Trade Deficit): దేశంలోని దిగుమతులు వేగంగా పెరుగుతున్నప్పటికీ, ఎగుమతుల వృద్ధి అదే రీతిలో లేదు.దీంతో వాణిజ్య లోటు పెరిగి రూపాయిపై ఒత్తిడి పెరిగింది.
రూపాయి పతనం.. సాధారణ ప్రజలపై ప్రభావం Rupee Slump: Impact on the Common Man
• పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రత్యక్ష ప్రభావం (Direct Impact on Petrol and Diesel Prices)
• ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైళ్లు, మెడికల్ పరికరాలపై అదనపు భారం (Extra Burden on Electronics, Mobiles, and Medical Devices)
• ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం (Inflation Likely to Rise)
• విదేశీ విద్య, ప్రయాణాలు మరింత ఖరీదు (Foreign Education and Travel to Get Costlier)
• దిగుమతులపై ఆధారపడే పరిశ్రమలపై ఆర్థిక ఒత్తిడి (Economic Pressure on Import-Dependent Industries)
1)ఆర్‌బీఐ పాత్ర కీలకం ..(RBI’s Role Is Crucial): ద్రవ్యోల్బణం, కరెన్సీ స్థిరీకరణ.. ఇరువైపులా ఆర్‌బీఐ సమతుల్యత పాటించాల్సిన పరిస్థితి.అవసరమైతే ఫారెక్స్ నిల్వలను ఉపయోగించి మార్కెట్లో జోక్యం పెంచే అవకాశం ఉంది.
2) ఫెడ్ నిర్ణయాలు మార్గదర్శకం (Fed Decisions to Guide Markets): అమెరికా ఫెడ్ భవిష్యత్ వడ్డీ రేట్లపై స్పష్టత రాగానే గ్లోబల్ కరెన్సీ మార్కెట్లలో చలనం తగ్గుతుంది. వడ్డీ రేట్లు తగ్గుతాయనే సంకేతం రాగానే డాలర్ బలహీనపడి రూపాయికి మద్దతు లభించవచ్చు.
3) చమురు ధరలు కీలకం (Crude Oil Prices Are Key): అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 90–100 డాలర్లకు పైగా వెళ్లితే రూపాయి మరింత ఒత్తిడిలో పడుతుంది.ధరలు తగ్గితే రూపాయి మళ్లీ పుంజుకునే అవకాశముంది.
4) వాణిజ్య లోటు తగ్గితే ఉపశమనం (Relief If Trade Deficit Narrows): ఎగుమతులు పెరుగుతాయో, దిగుమతుల డిమాండ్ తగ్గుతాయో.. రెండింటిలో ఏదో ఒకటి జరిగితే రూపాయికి మద్దతు లభించవచ్చు. ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగానే ఉన్నప్పటికీ, ఆర్‌బీఐ జోక్యం, ఫెడ్ నిర్ణయాలు, చమురు ధరలు, వాణిజ్య లోటులో మార్పులను బట్టి రూపాయి భవిష్యత్తు నిర్ణయించబడనుంది.
రూ.3.30 నుండి రూ.90 వరకు ..From ₹3.30 to ₹90: Rupee’s Journey
స్వాతంత్య్రం వచ్చిన 1947లో డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ రూ.3.30.తర్వాతి దశాబ్దాల్లో క్రమంగా తగ్గుతూ 1991 నాటికి సుమారు రూ.17–18కి చేరింది. 1991లో పీవీ నర్సింహారావు తొలి తరం ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన తర్వాత, గ్లోబల్ మార్కెట్లకు ఇండియా మరింతగా అనుసంధానమైంది. దీంతో కరెన్సీ చలనం పెరిగి రూపాయి క్షీణత వేగవంతమైంది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రూపాయి రూ.62 ఉండగా, గత 11 ఏళ్లలో ముడి చమురు ధరలు, పెరుగుతున్న దిగుమతులు, పసిడి–చమురు ఆధారిత అవసరాలు, వాణిజ్య లోటు—ఇవన్నీ కలసి రూపాయిని 90 దాకా నెట్టి వచ్చాయి.
డాలర్ బలపడడానికి ప్రధాన కారణం.. Main Reason Behind Dollar Strength
గత కొన్ని వారాలుగా డాలర్ ఇండెక్స్ అనేక మలుపులు తిరుగుతోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నిలకడగా ఉన్న నేపథ్యంలో ఫెడ్ త్వరగా వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చని మార్కెట్లు భావిస్తున్నాయి. ఈ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా డాలర్‌కు డిమాండ్ పెరిగింది. డాలర్ బలపడితే, రూపాయి–యువాన్–యెన్ వంటి ఆసియా కరెన్సీలు సహజంగానే ఒత్తిడికి గురవుతాయి. అయితే ఈ ఒత్తిడిని పోలిస్తే భారత రూపాయి అత్యధికంగా నష్టపోయింది.
రుపాయి ఇంకా పతనమవుతుందా? Will the Rupee Fall Further?
‘‘రూ.90 వద్ద ప్రధాన నిరోధక స్థాయి ఉంది. ఈ స్థాయిని కూడా దాటితే ఎక్స్ఛేంజ్ రేటు 91 లేదా అంతకు పైకీ వెళ్లే అవకాశముంది’’ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫారెక్స్ మార్కెట్లో ఆర్‌బీఐ మరింత దూకుడుగా జోక్యం చేసుకోవాల్సిన అవసరముంది. ‘‘అలా చేయకపోతే రూపాయి విలువలో తీవ్ర హెచ్చుతగ్గులు సంభవించే అవకాశం ఉంది’’ అని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఫెడ్ రేట్ల తగ్గింపు అంచనాలు, ఆర్‌బీఐ మద్దతు కారణంగా రూపాయికి కొంత ఊరట దక్కవచ్చు. ముందస్తు సెషన్లలో రూపాయి మారకం విలువ రూ.89.60–90.20 శ్రేణిలో కదలాడే అవకాశం ఉంది.
ఎప్పుడు స్థిరపడుతుందంటే? When Will It Stabilize?
రూపాయి పడిపోవడంతో ఆర్బీఐ మార్కెట్లోకి జోక్యం చేసుకున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. విదేశీ మారక నిల్వలు గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టడం కూడా గమనార్హం. నిల్వలు తగ్గితే రూపాయిని కాపాడే ఆర్బీఐ సామర్థ్యం కూడా కాస్త క్షీణిస్తుందని నిపుణులు అంటున్నారు. గ్లోబల్ కారకాల్లో శాంతి నెలకొంటే, ముడి చమురు ధరలు తగ్గితే, FPIs నికర కొనుగోళ్లు పెరిగితే రూపాయి కొంత స్థిరపడే అవకాశం ఉన్నట్లు నిపుణుల అభిప్రాయం.

