సోషల్ మీడియా కాలంలో పెట్టుబడులపై అవగాహన పెరిగినట్టే కనిపిస్తున్నా.. అదే సమయంలో అర్థసత్యాలు, సులభమైన కలల కథనాలు కూడా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా “నెలకు ₹10,000 SIP చేయండి.. ప్రతి సంవత్సరం 15% పెంచుకుంటూ వెళ్తే 15 ఏళ్లలో కోటీశ్వరులు అవుతారు” అనే మాట చాలా మందికి ఆకర్షణీయంగా వినిపిస్తుంది. ఈ లెక్కలు గణితపరంగా నిజమే కావచ్చు. కానీ, జీవితం గణిత సూత్రాల్లా నడవదు. మధ్యలో వచ్చే అనుకోని సంఘటనలు, బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు.. ఇవన్నీ మన ఆర్థిక ప్రయాణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ నేపథ్యంలో నిపుణులు చెబుతున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. “సంపదను పెంచుకోవడం ముందు.. దాన్ని కాపాడుకోవడం నేర్చుకోవాలి.” ఇక్కడే ‘మినిమాక్స్’ (Minimax Principle )అనే వ్యూహం కీలకంగా నిలుస్తుంది.
మినిమ్యాక్స్ వ్యూహం అంటే? What is the Minimax Strategy?
చెస్ ఆటలో గెలవాలంటే కేవలం దాడి చేయడం సరిపోదు. ముందుగా ఓడిపోకుండా ఉండటం నేర్చుకోవాలి. అంటే ప్రత్యర్థి మీ రాజును పట్టుకోకుండా కాపాడుకోవడం ముఖ్యం. ఇదే మినిమ్యాక్స్ వ్యూహం(Minimax Principle ).. మన ఆర్థిక జీవితానికీ వర్తిస్తుంది. చాలా మంది పెట్టుబడిదారులు ఒక పెద్ద తప్పు చేస్తారు. వారు SIPలు చేస్తూ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతుంటారు. కానీ, అదే సమయంలో తమ కుటుంబానికి సరైన హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వంటి రిస్క్ మేనేజ్మెంట్ అంశాలను పూర్తిగా విస్మరిస్తారు. ఒక అనుకోని ప్రమాదం లేదా అనారోగ్యం వచ్చినప్పుడు.. లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ సమయంలో వారు తమ పెట్టుబడులను మధ్యలోనే ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. దీని వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం దెబ్బతింటుంది. అంటే వారు చేసిన ప్రధాన తప్పు పెట్టుబడిలో కాదు.. రక్షణలో ఉంది. అందుకే నిపుణులు చెబుతున్నది ఏమిటంటే.. ముందుగా మీకు, మీ కుటుంబానికి సరైన బీమా కవరేజ్ ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధంగా ఉండాలి. అప్పుడే మీ పెట్టుబడులు సురక్షితంగా పెరుగుతాయి.
లక్ష్యం తెలుసుకుని .. Know Your Goal First..
పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలామంది చేసే మరో తప్పు.. లక్ష్యం లేకుండా ప్రారంభించడం. “మార్కెట్ బాగుంది కాబట్టి SIP మొదలుపెట్టాలి” అనే భావనతో ముందుకు వెళ్లడం. కానీ, ప్రపంచ స్థాయి చెస్ క్రీడాకారులు చేసే పని వేరు. వారు ముందుగా ఎండ్ గేమ్‌ను ఊహిస్తారు. అంటే చివరికి గెలవడానికి అవసరమైన స్థితిని అంచనా వేస్తారు. అక్కడి నుండి వెనక్కి లెక్కలు వేస్తూ ప్రతి కదలికను నిర్ణయిస్తారు. మన పెట్టుబడుల విషయంలో కూడా ఇదే పద్ధతి అవసరం. ఉదాహరణకు, మీరు 3 ఏళ్లలో ఒక ట్రిప్‌కు వెళ్లాలని అనుకుంటే.. ఈక్విటీలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే మార్కెట్లో తాత్కాలిక ఒడిదుడుకులు ఉండవచ్చు. ఆ సమయంలో నష్టాలు రావచ్చు. అదే 10-15 ఏళ్ల లక్ష్యాలకు మాత్రం ఈక్విటీ మంచి ఎంపిక అవుతుంది. కాబట్టి మీ లక్ష్యం, కాలవ్యవధి, రిస్క్ సామర్థ్యం ఆధారంగా అసెట్ అలొకేషన్ చేయడం అత్యంత కీలకం.
మారుతున్న నియమాలకు అనుగుణంగా.. Adapt to Changing Rules..
ఆర్థిక ప్రపంచం స్థిరంగా ఉండదు. ప్రభుత్వ విధానాలు, వడ్డీ రేట్లు, పన్ను నిబంధనలు.. ఇవన్నీ కాలానుగుణంగా మారుతుంటాయి. ఇలాంటి మార్పులను గమనించకుండా ఒకే రకమైన పెట్టుబడిలో కొనసాగితే అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకప్పుడు బ్యాంకు ఎఫ్డీలపై 10-12% వడ్డీ వచ్చేది. అందుకే చాలా మంది డబ్బును అక్కడే ఉంచేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. అదే సమయంలో బంగారం మీద ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ‘సోవరీన్ గోల్డ్ బాండ్స్’ వంటి కొత్త మార్గాలను తీసుకువచ్చింది. అందువల్ల పెట్టుబడిదారులు కూడా తమ వ్యూహాలను మారుస్తూ ఉండాలి. కొత్త అవకాశాలను అంచనా వేసి, వాటిని వినియోగించుకోవాలి. దీన్నే మెకానిజం డిజైన్ అంటారు.
వినయం అవసరం.. Humility is Essential..
జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకు అనుకోకుండా మంచి అవకాశాలు వస్తాయి. కొంతమంది పెద్ద మొత్తంలో సంపాదిస్తారు. కానీ, ఆ విజయాన్ని పూర్తిగా తమ ప్రతిభకు మాత్రమే ఆపాదిస్తారు. ఇది ‘రిగ్డ్ మోనోపోలీ’ అనే ప్రయోగం ద్వారా స్పష్టమవుతుంది. కొంతమందికి ముందే ఎక్కువ డబ్బు ఇచ్చి ఆట ఆడిస్తే.. వారు గెలిచిన తర్వాత తమ తెలివితేటల వల్లే గెలిచామని భావిస్తారు. కానీ, అసలు కారణం వారికి లభించిన ప్రారంభ ఆధిక్యం. అందుకే సంపద వచ్చినప్పుడు వినయం అవసరం. అదృష్టం కూడా ఒక పాత్ర పోషిస్తుందని గుర్తించాలి.
జీవితం అంటే నాలుగు బర్నర్లు.. The Four Burners Theory: Balance Matters
మన జీవితాన్ని ఒక స్టవ్‌లా ఊహిస్తే.. దానిపై నాలుగు బర్నర్లు ఉంటాయి. అవే డబ్బు (కెరీర్), మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, బంధుత్వాలు. చాలామంది సంపద కోసం పరుగెత్తుతూ మిగతా మూడు బర్నర్లను ఆర్పేస్తారు. ఆరోగ్యాన్ని పట్టించుకోరు. కుటుంబానికి సమయం కేటాయించరు. మానసిక ప్రశాంతత కోల్పోతారు. అయితే చివరికి వారు ఎదుర్కొనేది ‘అరైవల్ ఫాలసీ’. అంటే లక్ష్యం చేరుకున్నాక కూడా ఆనందం లభించకపోవడం. కోట్లు ఉన్నా.. ఆరోగ్యం లేకపోవడం, తోడుగా ఎవరూ లేకపోవడం వల్ల జీవితం అసంపూర్ణంగా అనిపిస్తుంది.
నిజమైన ఆర్థిక విజయం ఏది? What True Financial Success Means?
కోటీశ్వరుడు కావడం అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం కాదు. అది ఒక సమతుల్య ప్రయాణం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, కుటుంబంతో ఆనందంగా జీవిస్తూ, తెలివైన పెట్టుబడులతో ముందుకు సాగడం. SIP ఒక మంచి సాధనం. కానీ, అది ఒక్కటే సరిపోదు. దానికి తోడు రిస్క్ మేనేజ్మెంట్, స్పష్టమైన లక్ష్యాలు, మార్పులకు సరిపోయే వ్యూహం అవసరం. చివరగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. డబ్బు మన జీవితాన్ని మెరుగుపరచడానికి ఒక సాధనం మాత్రమే. అది జీవితం కాదు. సంపదను పెంచుకోవడం కంటే.. దాన్ని కాపాడుకోవడం, సమతుల్యంగా ఉపయోగించుకోవడమే అసలైన విజయం.
