హైదరాబాద్ః పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. ఉన్నత విద్య, వివాహం లాంటి భారీ ఖర్చుల కోసం వారు చిన్నగా ఉన్నప్పటి నుంచే పొదుపు చేయడం మొదలుపెడుతుంటారు. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నేటి తరం తల్లిదండ్రులు సంప్రదాయ పొదుపు మార్గాలను దాటి ఆధునిక పెట్టుబడి సాధనాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవల దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు ఆర్థిక రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఆర్య గోయల్ అనే కేవలం ఆరు రోజుల వయసున్న పసిపాప పేరుతో ఆమె తల్లిదండ్రులు డీమ్యాట్ ఖాతాను (Demat Account) ప్రారంభించారు.
దేశంలోనే అత్యంత పిన్న వయసులో డీమ్యాట్ ఖాతా పొందిన చిన్నారిగా ఆర్య నిలిచిందని ప్రముఖ బ్రోకింగ్ సంస్థ పాకెట్ఫుల్ (Pocketful) వెల్లడించింది. ఆ చిన్నారి పుట్టిన వెంటనే తల్లిదండ్రులు ఆధార్ కార్డు, మైనర్ పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా వంటి అవసరమైన పత్రాలన్నింటినీ సిద్ధం చేసి ఈ ఖాతాను తెరిచారు. గతంలో 12 రోజుల వయసున్న చిన్నారి పేరుతో డీమ్యాట్ ఖాతా తెరిచిన రికార్డు ఉండగా, ఇప్పుడు ఆరు రోజుల వయసులోనే ఆర్య ఆ రికార్డును అధిగమించింది. ఈ నేపథ్యంలో అసలు పిల్లల పేరుతో డీమ్యాట్ ఖాతా ఎలా పనిచేస్తుంది? నిబంధనలు ఏమిటి? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మైనర్ డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? (What is a Minor Demat Account?)
సాధారణంగా షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, ఇతర సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరుచుకోవడానికి డీమ్యాట్ ఖాతా ఉపయోగపడుతుంది. మైనర్ల పేరుతో అంటే 18 ఏళ్ల లోపు పిల్లల పేరుతో కూడా ఈ ఖాతాను ప్రారంభించేందుకు సెబీ (SEBI) నిబంధనలు అనుమతిస్తున్నాయి.
పిల్లల పేరుతో ఈ ఖాతా తెరవడం వల్ల భవిష్యత్తులో వారికి అందించాలనుకునే షేర్లను ముందు నుంచే వారి పేరుతోనే జమ చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే, కేవలం ఖాతా తెరిచినంత మాత్రాన పెట్టుబడి ప్రక్రియ పూర్తయినట్లు కాదు. అందులో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం, మార్కెట్ ఒడుదొడుకులకు అనుగుణంగా వాటి విలువను పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలు తల్లిదండ్రులపైనే ఉంటాయి. ఈ ఖాతాకు యాజమానిగా చిన్నారి పేరు ఉన్నప్పటికీ, 18 ఏళ్లు నిండే వరకు ఖాతా నిర్వహణ బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకుల (Guardians) ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది.
ఖాతా నిర్వహణ, అవసరమైన పత్రాలు (Account Management and Required Documents)
మైనర్ పేరుతో డీమ్యాట్ ఖాతా తెరవాలంటే కొన్ని నిర్దిష్టమైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఇందులో పిల్లలే ప్రధాన ఖాతాదారులుగా ఉంటారు. సంరక్షకులుగా తల్లిదండ్రుల్లో ఒకరు వ్యవహరిస్తారు.
పిల్లల పత్రాలు: చిన్నారి పేరుతో తీసుకున్న మైనర్ పాన్‌కార్డు (Minor PAN Card), జనన ధ్రువీకరణ పత్రం (Birth Certificate) లేదా ఆధార్ కార్డు అవసరం.
సంరక్షకుల పత్రాలు: తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు, పాన్‌కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు (Address Proof) సమర్పించాలి.
బ్యాంకు ఖాతా: మైనర్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు, చెక్ బుక్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ జతచేయాలి. సంరక్షకుడి పర్యవేక్షణలో ఈ బ్యాంకు ఖాతా పనిచేస్తుండాలి.
ఈ పత్రాలన్నింటినీ సిద్ధం చేసుకున్న తర్వాత, సంబంధిత స్టాక్ బ్రోకర్ లేదా డిపాజిటరీ పార్టిసిపెంట్ (DP) సూచించిన కేవైసీ (KYC) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
మైనర్ ఖాతాపై ఉండే పరిమితులు (Restrictions on Minor Demat Account)
పెద్దల డీమ్యాట్ ఖాతాతో పోలిస్తే మైనర్ ఖాతాకు కొన్ని కఠినమైన పరిమితులు ఉంటాయి. సాధారణ పెట్టుబడిదారుల మాదిరిగా ఇందులో అన్ని రకాల లావాదేవీలు నిర్వహించేందుకు వీలుండదు.
కొనుగోళ్లపై నియంత్రణ: మైనర్ తరఫున సంరక్షకులు నేరుగా స్టాక్ మార్కెట్లో కొత్త షేర్లను కొనుగోలు (Secondary Market Buying) చేయలేరు. ఇంట్రాడే ట్రేడింగ్ (Intraday Trading), ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) లాంటి రిస్క్ ఎక్కువగా ఉండే లావాదేవీలకు ఇందులో అస్సలు అనుమతి ఉండదు.
ఏవి జమ చేయొచ్చు?: తల్లిదండ్రులు లేదా బంధువుల నుంచి బహుమతిగా (Gift) వచ్చిన షేర్లు, వారసత్వంగా లభించిన సెక్యూరిటీలను ఈ ఖాతాలోకి బదిలీ చేయొచ్చు. అంతేకాకుండా, ఐపీఓ (IPO) ద్వారా దరఖాస్తు చేసి పొందిన షేర్లను కూడా మైనర్ ఖాతాలో జమ చేసుకునే వెసులుబాటు ఉంది.
విక్రయ నిబంధనలు: ఖాతాలో ఉన్న షేర్లను విక్రయించేందుకు అవకాశం ఉన్నప్పటికీ, ఆ ప్రక్రియ నిర్దిష్ట నిబంధనలకు లోబడి మాత్రమే జరుగుతుంది. పిల్లల అవసరాల నిమిత్తమే ఆ నిధులను వాడుతున్నామని సంరక్షకులు ధ్రువీకరించాల్సి ఉంటుంది.
మేజర్ అయిన తర్వాత: చిన్నారికి 18 ఏళ్లు నిండిన వెంటనే ఆ ఖాతా లావాదేవీలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. అప్పుడు ఖాతాదారు స్వయంగా కొత్త కేవైసీ (KYC) పత్రాలు, సంతకం సమర్పించి మైనర్ ఖాతాను సాధారణ డీమ్యాట్ ఖాతాగా (Individual Account) మార్చుకోవాల్సి ఉంటుంది.
ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలు (Alternative Investment Options)
పిల్లల భవిష్యత్తు కోసం కేవలం నేరుగా షేర్లలోనే పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. మార్కెట్ రిస్క్ తక్కువగా ఉంటూ, మంచి రాబడినిచ్చే ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds): మైనర్ పేరుతో నేరుగా మ్యూచువల్ ఫండ్ ఫోలియో తెరిచి సిప్ (SIP) ద్వారా నెలనెలా క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా డీమ్యాట్ ఖాతా ఉండాల్సిన అవసరం లేదు.
సుకన్య సమృద్ధి యోజన (SSY): పదేళ్ల లోపు ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యుత్తమ పథకం ఇది. ఇందులో పన్ను మినహాయింపులతో పాటు స్థిరమైన, అధిక వడ్డీ రేటు లభిస్తుంది.
ప్రజా భవిష్య నిధి (PPF): పిల్లల పేరుతో పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించడం ద్వారా దీర్ఘకాలంలో పన్ను రహిత నిధిని సమకూర్చుకోవచ్చు.
రికరింగ్ డిపాజిట్ (RD): బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో పిల్లల పేరుతో ఆర్డీ ఖాతాలను తెరిచి, సురక్షితమైన రాబడిని పొందవచ్చు.
లక్ష్యం ఆధారంగా ప్రణాళిక ముఖ్యం (Goal-Based Financial Planning)
పిల్లల ఉన్నత విద్యకు ఇంకా 15 నుంచి 18 ఏళ్ల సమయం అందుబాటులో ఉంటే, ఈక్విటీ ఆధారిత దీర్ఘకాలిక పెట్టుబడులను ఎంచుకోవడం ఉత్తమం. కాలక్రమేణా కాంపౌండింగ్ (Compounding) శక్తి వల్ల చిన్న మొత్తాలు కూడా పెద్ద నిధిగా మారతాయి. అయితే, పిల్లల చదువుల ఖర్చులు అవసరమయ్యే సమయం దగ్గరపడుతున్న కొద్దీ, ఈక్విటీ పెట్టుబడుల శాతాన్ని క్రమంగా తగ్గించుకుంటూ సురక్షితమైన డెట్ ఫండ్స్ (Debt Funds) లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలోకి నిధులను మార్చుకోవాలి.
పెట్టుబడి మొత్తాన్ని ఎప్పుడూ ఒకే సాధనంలో పెట్టకుండా, వివిధ మార్గాల్లో విభజించి (Diversification) పెట్టాలి. దీనివల్ల అత్యవసర సమయంలో ఎలాంటి నష్టం లేకుండా డబ్బు అందుబాటులో ఉంటుంది. కేవలం అందరూ చేస్తున్నారని పిల్లల పేరుతో డీమ్యాట్ ఖాతా ప్రారంభించడం కంటే, వారి భవిష్యత్తు అవసరాలకు సరిపోయే సరైన పెట్టుబడి విధానాన్ని ఎంచుకోవడమే ఎంతో ముఖ్యం. ఆర్థిక లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఆ పెట్టుబడులు పిల్లల పేరుపై ఉన్నా, తల్లిదండ్రుల పేరుపై ఉన్నా ఆశించిన ఫలితం తప్పకుండా దక్కుతుంది.
