నెల మొదటి వారంలో జీతం చేతికి వస్తుంది.. పది, పదిహేను రోజులు గడిచేసరికి పర్సు ఖాళీ అవుతోంది. నెలాఖరుకు చేరుకునే కొద్దీ ఏ ఖర్చు తగ్గించాలి? ఏ అవసరాన్ని వాయిదా వేయాలి? అన్నది సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ప్రశ్నగా (Rising Prices ) మారుతోంది. ఒకవైపు ఆదాయం పరిమితంగానే ఉంటుండగా.. మరోవైపు నిత్యావసరాలు, ప్రయాణం, మొబైల్ రీచార్జ్, ఇంటి నిర్వహణ, పిల్లల చదువులు, అద్దెలు, వైద్యం వంటి ఖర్చులు వరుసగా పెరుగుతున్నాయి. దీంతో పొదుపు సంగతి పక్కనపెడితే.. అప్పు చేయకుండా నెల గడిస్తే చాలు అన్న పరిస్థితి అనేక కుటుంబాల్లో కనిపిస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ముడిచమురు, రవాణా, ముడిసరుకుల ధరల్లో చోటుచేసుకున్న మార్పులు వివిధ రంగాలపై ప్రభావం చూపుతున్నాయి. చమురు ధరల పెరుగుదల నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలకే పరిమితం కాకుండా రవాణా వ్యయాల ద్వారా ఇతర వస్తువులపైనా ప్రభావం చూపుతోంది. మార్కెట్లో ఒక వస్తువు ధర పెరిగితే దాని వెనుక మరో ఖర్చు కారణంగా మారుతోంది. చివరికి ఆ భారం వినియోగదారుడి జేబుపైనే పడుతోంది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు, తక్కువ వేతన ఉద్యోగులు కుటుంబ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. నగరంలో రెండు దశాబ్దాలుగా ఉంటున్న కుటుంబాలు సైతం జీవన వ్యయం పెరగడంతో స్వస్థలాలకు తిరిగి వెళ్లే ఆలోచన చేస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.
మూడు నెలల్లో మారిన మార్కెట్.. Sharp Rise in Prices Within Three Months
మూడు నెలల క్రితం మార్కెట్లో ఉన్న ధరలతో (Rising Prices )పోలిస్తే ప్రస్తుతం అనేక నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా బియ్యం, పంచదార, కూరగాయలు వంటి ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా అవసరమయ్యే వస్తువుల ధరలు పెరగడంతో నెలవారీ బడ్జెట్ తారుమారవుతోంది. సోనామసూరి బియ్యం ధర ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. మూడు నెలల క్రితం రిటైల్ మార్కెట్లో క్వింటా రూ.5,400 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.6,800కు చేరింది. హోల్‌సేల్ మార్కెట్లోనే క్వింటా ధర సుమారు రూ.6,500 పలుకుతోంది. బియ్యం ధరలో వచ్చిన ఈ వ్యత్యాసం నేరుగా వినియోగదారులపై పడుతోంది. కుటుంబంలో బియ్యం వినియోగం ఎక్కువగా ఉండటంతో నెలవారీ సరుకుల బిల్లులోనే గణనీయమైన తేడా కనిపిస్తోంది. దీంతో కొందరు కుటుంబాలు రేషన్ బియ్యంతోనే అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ధరలు ఇలాగే కొనసాగితే కుటుంబ బడ్జెట్లో ఆహారానికి కేటాయించే మొత్తాన్ని మరింత పెంచాల్సి వస్తుంది. దాని ప్రభావం ఇతర అవసరాలపై పడుతుంది. పిల్లల చదువు, దుస్తులు, వైద్యం, ప్రయాణం, పొదుపు వంటి అంశాలకు కేటాయించే మొత్తాన్ని తగ్గించుకోవాల్సి వస్తోంది.
పంచదార ధరకు ఇథనాల్ సెగ! Ethanol Demand Adds Pressure on Sugar Prices
పంచదార ధరలు (Rising Prices )కూడా ఇటీవల వేగంగా పెరుగుతున్నాయి. మూడు నెలల క్రితం కిలో రూ.48గా ఉన్న పంచదార.. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.65 వరకు పలుకుతోంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ధరల్లో మరింత వేగం కనిపించిందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా కిలో పంచదారను రూ.13కే అందించేవారు. అయితే మహారాష్ట్ర, కర్ణాటక నుంచి సరఫరా లేదనే కారణంతో ఈ ఏడాది మార్చి నుంచి పౌరసరఫరాల శాఖ పంపిణీని నిలిపివేసింది. దీంతో పంచదార అవసరమున్న కుటుంబాలు తప్పనిసరిగా బహిరంగ మార్కెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. మరోవైపు చెరకు ఉత్పత్తిలో కొంత భాగాన్ని ఇథనాల్ తయారీకి మళ్లించడం కూడా చక్కెర మార్కెట్‌పై ప్రభావం చూపుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్, సరఫరా మధ్య మార్పులతో ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. పంచదార ధర పెరగడంతో బెల్లం వినియోగం వైపు కొందరు కుటుంబాలు మొగ్గుచూపుతున్నా.. బెల్లం ధర కూడా కిలో రూ.70 వరకు ఉండటం వారికి మరో భారంగా మారింది.
ఉల్లి నుంచి కూరగాయల దాకా.. Vegetable Prices Add to Household Burden
వంటింట్లో తప్పనిసరిగా ఉపయోగించే ఉల్లి ధర (Rising Prices )కూడా వినియోగదారులను ఇబ్బంది పెడుతోంది. మూడు నెలల క్రితం నాణ్యమైన ఉల్లి కిలో రూ.25-30 మధ్య ఉండగా.. ఇప్పుడు రూ.40-45కు చేరింది. సాధారణ రకం సైతం కిలో రూ.35 వరకు పలుకుతోంది. ధరలు పెరగడంతో కొన్ని కుటుంబాలు ఉల్లి వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి. బీరకాయ, బెండకాయ వంటి కూరగాయల ధరల్లోనూ మార్కెట్ నుంచి ఇంటి దాకా గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. రైతుబజార్లలో కిలో రూ.35-50 మధ్య లభించే కూరగాయలు రిటైల్ దుకాణాల్లో రూ.60-80 వరకు విక్రయిస్తున్నారు. రవాణా, నిల్వ, మధ్యవర్తుల వ్యయం తదితర కారణాలతో వినియోగదారుడు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ధరలు పెరిగినప్పుడు సాధారణంగా కుటుంబాలు మొదట తగ్గించేది విలాస వస్తువుల కొనుగోలు. కానీ ఇప్పుడు నిత్యావసరాల విషయంలోనూ పరిమితులు విధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒకప్పుడు నెలకు ఒకసారి పెద్ద మొత్తంలో సరుకులు కొనుగోలు చేసే కుటుంబాలు ఇప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే కొద్దికొద్దిగా కొనుగోలు చేస్తున్నాయి.
మగ్గు.. బకెట్ కూడా భారమే! Even Household Essentials Become Costlier
ధరల పెరుగుదల(Rising Prices ) ఆహార పదార్థాలకే పరిమితం కాలేదు. బాత్రూమ్లలో ఉపయోగించే ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులు, ఇతర గృహోపకరణాల ధరలు కూడా పెరిగాయి. ఇవి చిన్న మొత్తాలే అనిపించినా.. నెలవారీగా వివిధ వస్తువుల ధరలు పెరిగినప్పుడు కుటుంబ బడ్జెట్‌పై మొత్తం ప్రభావం గణనీయంగా ఉంటుంది. సబ్బులు, శుభ్రపరిచే ఉత్పత్తులు, వంటింటి సామగ్రి వంటి వస్తువుల కొనుగోలులోనూ వినియోగదారులు చౌకైన ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. నాణ్యత కంటే ధరకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. దీంతో జీవన ప్రమాణాలను కొనసాగించడమే మధ్యతరగతి కుటుంబాలకు సవాలుగా మారుతోంది.
ఎలక్ట్రానిక్ వస్తువులకూ ధరాభారం.. Electronics Prices Climb Further
స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల ధరలు(Rising Prices ) కూడా గత మూడు నెలల్లో గణనీయంగా పెరిగినట్లు డీలర్లు చెబుతున్నారు. కనీసం 15 నుంచి 25 శాతం వరకు ధరలు పెరిగిన మోడళ్లు ఉన్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. చిప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ భాగాలు, ముడిసరుకుల ధరల పెరుగుదలతో పాటు రవాణా వ్యయాలు పెరగడం కూడా దీనికి కారణమని చెబుతున్నారు. ఏడాది క్రితం సుమారు రూ.54 వేలుగా ఉన్న ఒక ప్రముఖ సంస్థ ల్యాప్‌టాప్ ధర ప్రస్తుతం రూ.70 వేల వరకు చేరిన ఉదాహరణను డీలర్లు ప్రస్తావిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల ధరల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. గత దసరా, దీపావళి సమయంలో రూ.14 వేల వరకు లభించిన కొన్ని మోడళ్లు ఇప్పుడు రూ.23 వేల వరకు పలుకుతున్నాయి. 5జీ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత 4జీ ఫోన్లకు డిమాండ్ తగ్గింది. అయితే ధరలు పెరగడంతో ఇప్పుడు కొందరు వినియోగదారులు మళ్లీ 4జీ మోడళ్లను పరిశీలిస్తున్నారు. కొత్త ఫోన్ కొనుగోలు అవసరమైనా.. ధరలు ఎక్కువగా ఉండటంతో పాత ఫోన్‌ను మరికొంత కాలం ఉపయోగించుకోవడమే మేలని భావిస్తున్నవారూ ఉన్నారు.
అపార్ట్మెంట్ నిర్వహణా ఖర్చుల మోత.. Higher Maintenance Costs Hit Apartment Residents
హైదరాబాద్‌లో అపార్ట్మెంట్ జీవనం (Rising Prices )కూడా గతంతో పోలిస్తే ఖరీదవుతోంది. నీటి కొరత కారణంగా ట్యాంకర్లపై ఆధారపడాల్సి రావడం నిర్వహణ ఖర్చులను పెంచుతోంది. గతంలో సుమారు రూ.1,000తో వచ్చే ట్యాంకర్ ఖర్చు ప్రస్తుతం రూ.1,500 నుంచి రూ.1,800 వరకు చేరిన సందర్భాలు ఉన్నాయి. ట్యాంకర్ నీరు, లిఫ్ట్ నిర్వహణ, విద్యుత్తు, భద్రత, పారిశుద్ధ్యం వంటి వివిధ ఖర్చులు కలిపి అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ చార్జీలను పెంచుతున్నాయి. నిర్వహణ రుసుము పెంపుపై కొన్ని అపార్ట్మెంట్లలో నివాసితుల మధ్య విభేదాలు కూడా ఏర్పడుతున్నాయి. నెలవారీగా చిన్న మొత్తంగా కనిపించే ఈ పెంపు ఏడాది మొత్తానికి పెద్ద భారంగా మారుతోంది.
రీచార్జ్ నుంచి నిర్మాణం వరకు.. Rising Costs Beyond Daily Essentials
మొబైల్ రీచార్జ్ కూడా (Rising Prices )ఇప్పుడు కుటుంబ బడ్జెట్లో తప్పనిసరి ఖర్చుగా మారింది. ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ ధరలు మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 16 శాతం వరకు పెరిగాయి. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది మొబైల్ వినియోగిస్తే ఈ పెంపు నెలవారీ ఖర్చులో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక భవన నిర్మాణ రంగంలోనూ వ్యయాలు పెరిగాయి. ఏడాది ప్రారంభంలో చదరపు అడుగుకు సుమారు రూ.1,800-1,900గా ఉన్న నిర్మాణ వ్యయం ఇప్పుడు రూ.2,200 వరకు చేరింది. చదరపు అడుగుకు రూ.300 తేడా చిన్నదిగా కనిపించినా.. 1,000 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.3 లక్షల వరకు అదనపు భారం పడుతుంది. దీంతో సొంతింటి నిర్మాణం లేదా కొనుగోలు చేయాలనుకునే మధ్యతరగతి కుటుంబాలపై మరింత ఆర్థిక ఒత్తిడి పడుతోంది.
పొదుపు మాటే దూరం.. Savings Take a Back Seat
ఆదాయం పెరగకుండా ఖర్చులు (Rising Prices )పెరుగుతున్నప్పుడు కుటుంబాలు ముందుగా కోత పెట్టేది పొదుపులపైనే. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా కొంత మొత్తాన్ని దాచుకోవాలన్న ఆలోచన ఉన్నా.. నెలవారీ ఖర్చులు అందుకు అవకాశం ఇవ్వడం లేదు. జీతం వచ్చిన వెంటనే అద్దె, విద్యుత్తు బిల్లు, పిల్లల ఫీజులు, సరుకులు, ప్రయాణం, రీచార్జ్‌లు, నిర్వహణ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. మిగిలే మొత్తం అత్యవసర ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడుతోంది. మధ్యతరగతి కుటుంబాలకు మరో సమస్య ఏమిటంటే.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పరిమితంగానే అందుతుండటం. అదే సమయంలో ఖర్చులను పూర్తిగా తగ్గించుకునే వీలు కూడా ఉండదు. పిల్లల చదువు, వైద్యం, ఇంటి అద్దె వంటి వాటిని వాయిదా వేయలేరు. దీంతో ధరల పెరుగుదల నేరుగా వారి జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతోంది.
ధరాభారం ఎక్కడికి దారి? A Growing Challenge for Household Budgets
ధరలు(Rising Prices ) పెరగడం ఒక్కో వస్తువుకు సంబంధించిన సమస్యగా కనిపించినా.. అన్ని వస్తువుల ధరలు ఒకేసారి పెరిగినప్పుడు దాని ప్రభావం కుటుంబ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. బియ్యం, పంచదార, కూరగాయల నుంచి మొబైల్ రీచార్జ్, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, నిర్మాణ వ్యయాల వరకు ప్రతి విభాగంలో ఖర్చులు పెరుగుతున్నాయి. ఆదాయం మాత్రం అదే స్థాయిలో ఉంటే మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గడం సహజమే. మరోవైపు చమురు ధరలు, రవాణా ఖర్చులు, ముడిసరుకుల ధరలు వంటి అంశాలు పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఒక రంగంలో వ్యయం పెరిగితే దాని ప్రభావం మరొక రంగానికి చేరుతుంది. చివరికి వస్తువులు, సేవల ధరలు పెరిగి వినియోగదారుడి జేబుపై భారం పడుతుంది. అందుకే ధరల నియంత్రణకు సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేయడం, అవసరమైన వస్తువుల ధరలను పర్యవేక్షించడం, మధ్యవర్తుల అక్రమ లాభాలకు అడ్డుకట్ట వేయడం, ఉత్పత్తి-సరఫరా మధ్య సమతుల్యతను కొనసాగించడం కీలకంగా మారింది. ముఖ్యంగా తక్కువ, మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న ధరాభారాన్ని తగ్గించే చర్యలు అవసరం. ఒకప్పుడు జీతం వచ్చిన రోజున కుటుంబ బడ్జెట్ వేసుకుని నెలంతా నెట్టుకొచ్చేవారు. ఇప్పుడు జీతం వచ్చిన రోజునే ఏ బిల్లు ముందుగా చెల్లించాలి? ఏ ఖర్చును తగ్గించాలి? అన్న లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. ఆదాయం మూరెడుగా ఉండి.. ఖర్చు బారెడుగా మారితే సామాన్యుడి జీవితం ఎలా ఉంటుందో ప్రస్తుత పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే పొదుపులు మరింత కరిగిపోవడంతో పాటు అప్పులపై ఆధారపడే కుటుంబాల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం ఉంది. అందుకే పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయడమే కాకుండా.. ప్రజల ఆదాయ సామర్థ్యాన్ని పెంచే చర్యలూ సమాంతరంగా సాగాల్సిన అవసరం ఉంది.
