సొంతంగా బిజినెస్ చేసుకోవాలని, ఎవరి మీదా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని చాలామందికి ఉంటుంది. కానీ ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరిమితులు, వైఫల్య భయం.. ఇలా ఎన్నో అంశాలు అడ్డు వస్తాయి. ఒకవేళ అన్నింటినీ అధిగమించి వ్యాపారం మొదలుపెట్టినా.. దాన్ని విజయవంతంగా నడపడం మరో పెద్ద సవాలు. అసలు విజయవంతమైన స్టార్టప్ ఎలా ఉండాలి? కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఏ విషయాలను ఆలోచించాలి? పోటీని ఎలా ఎదుర్కోవాలి? కస్టమర్లను ఎలా సంపాదించాలి? భవిష్యత్తులో నిలబడే కంపెనీని ఎలా నిర్మించాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను ‘ZERO TO ONE’ పుస్తకంలో రచయిత పీటర్ థీల్ వివరించారు. పీటర్ థీల్ ప్రముఖ వ్యాపారవేత్త, పెట్టుబడిదారు. పేపాల్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన ఫేస్బుక్లో తొలి బయటి పెట్టుబడిదారుల్లో ఒకరు. స్టార్టప్ ప్రపంచంపై తన అనుభవాలను, వ్యాపారం గురించి తన ఆలోచనా విధానాన్ని ఈ పుస్తకంలో వివరించారు. కొత్తగా ఏదైనా సృష్టించడం ద్వారా ప్రపంచాన్ని మార్చవచ్చన్నది ఈ పుస్తకంలోని ప్రధాన భావన.
భవిష్యత్తు అంటే కొత్తదనం.. The Challenge of the Future
భవిష్యత్తు అంటే ప్రస్తుతం ఉన్నదానికి కొంచెం మెరుగైన రూపం మాత్రమే కాదు. ఇప్పటివరకు లేనిదాన్ని సృష్టించే సామర్థ్యమే నిజమైన పురోగతి అని పీటర్ థీల్ (Zero to One.. ) చెబుతారు. ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరో ప్రాంతానికి తీసుకెళ్లడం ఒక రకమైన విస్తరణ. కానీ ఇంతవరకు ఎవరూ చేయని పనిని కొత్తగా చేయడం అసలు ఆవిష్కరణ. ఇక్కడ ఆయన మార్పును రెండు విధాలుగా వివరిస్తారు. ఒకటి హారిజాంటల్ ప్రోగ్రెస్. అంటే ఇప్పటికే ఉన్న ఆలోచనలను మరింత విస్తరించడం. మరోటి వర్టికల్ ప్రోగ్రెస్. అంటే పూర్తిగా కొత్త ఆలోచన, కొత్త టెక్నాలజీ లేదా కొత్త పరిష్కారాన్ని సృష్టించడం. స్టార్టప్ అంటే రెండో రకమైన ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇతరులు చేస్తున్నదానినే మరో రూపంలో చేయడం కాకుండా.. ఇంతవరకు ఎవరూ గుర్తించని సమస్యకు పరిష్కారం చూపాలి.
డాట్‌కామ్ బుడగ ఇచ్చిన పాఠం.. Lessons from the Dot-Com Bubble
2000లో అమెరికా మార్కెట్లలో చోటుచేసుకున్న డాట్‌కామ్ బబుల్ పతనం స్టార్టప్ ప్రపంచానికి పెద్ద గుణపాఠంగా నిలిచింది. ఇంటర్నెట్ ఆధారిత కంపెనీలపై విపరీతమైన అంచనాలు ఏర్పడటంతో అనేక సంస్థలు మార్కెట్లోకి వచ్చాయి. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున డబ్బు పెట్టారు. కానీ వాస్తవ వ్యాపార నమూనా, ఆదాయం, లాభాలపై సరైన దృష్టి లేకపోవడంతో చివరకు ఆ బుడగ పేలిపోయింది. ఈ పరిణామం (Zero to One.. )తర్వాత వ్యాపారవేత్తలు కొన్ని విషయాలను నేర్చుకున్నారు. రిస్క్ తీసుకోకుండా కేవలం మెల్లగా ముందుకు వెళ్లడం సరిపోదు. అదే సమయంలో ప్రణాళిక లేకుండా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం కూడా ప్రమాదకరం. మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఉత్పత్తినే తయారు చేస్తే పోటీ తప్పదు. మంచి ఉత్పత్తితో పాటు దాన్ని ఎలా అమ్మాలి అన్నదీ అంతే ముఖ్యమని థీల్ చెబుతారు.
పోటీ కంటే ప్రత్యేకత ముఖ్యం.. Monopoly vs Perfect Competition
వ్యాపార ప్రపంచంలో (Zero to One.. ) పోటీ అనేది సహజం. అయితే ప్రతి కంపెనీ ఎప్పటికీ పోటీలోనే ఉండాలని ప్రయత్నిస్తే లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే పీటర్ థీల్ మోనోపొలీ భావనకు ప్రాధాన్యం ఇస్తారు. ఒక నిర్దిష్ట మార్కెట్లో ప్రత్యేకమైన ఉత్పత్తి లేదా సేవను అందిస్తూ, ఇతరులు సులభంగా అనుకరించలేని స్థాయికి ఎదిగిన సంస్థకు బలమైన స్థానం ఏర్పడుతుంది. దీనికి విరుద్ధంగా, ఒకే ఉత్పత్తిని అనేక కంపెనీలు ఒకే విధంగా విక్రయించే పరిస్థితిని పర్ఫెక్ట్ కాంపిటీషన్‌గా చూడవచ్చు. అందుకే కొత్త కంపెనీ ప్రారంభించే ముందు ‘మార్కెట్లో మనం ఎవరికీ లేని ఏ ప్రత్యేకతను అందించగలం?’ అని ప్రశ్నించుకోవాలి. కస్టమర్ సమస్యను గుర్తించి, దానికి ఇతరుల కంటే మెరుగైన పరిష్కారం అందించగలిగితే అక్కడే విజయానికి పునాది పడుతుంది.
చిన్న మార్కెట్‌తో పెద్ద ప్రయాణం.. Start Small, Think Big
ప్రపంచ మార్కెట్‌ను (Zero to One.. ) ఒకేసారి లక్ష్యంగా పెట్టుకోవడం కంటే ముందుగా చిన్న మార్కెట్‌ను ఎంచుకోవడం మంచిదని ఈ పుస్తకం చెబుతుంది. ఒక చిన్న కస్టమర్ సమూహం సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని, వారికి అత్యుత్తమ పరిష్కారం అందించాలి. అక్కడ విజయం సాధించిన తర్వాత అదే మోడల్‌ను పెద్ద మార్కెట్‌కు విస్తరించాలి. ఇలా ఒక చిన్న మార్కెట్ క్రమంగా పెద్ద నెట్‌వర్క్‌గా మారుతుంది. కంపెనీ ఎదుగుతున్న కొద్దీ ఖర్చులు తగ్గడం, కస్టమర్ల సంఖ్య పెరగడం, బ్రాండ్ విలువ పెరగడం జరుగుతుంది. అయితే దీనికి స్పష్టమైన విజన్, దీర్ఘకాలిక ఆలోచన తప్పనిసరి.
అదృష్టం కాదు.. స్పష్టమైన ఆలోచన.. Definite Thinking Matters
వ్యాపారంలో (Zero to One.. )అదృష్టం పాత్ర ఉన్నప్పటికీ.. దానిపైనే ఆధారపడటం సరైన విధానం కాదని పీటర్ థీల్ అభిప్రాయపడతారు. భవిష్యత్తు గురించి మనుషులు వేర్వేరు రకాలుగా ఆలోచిస్తారు. కొందరు భవిష్యత్తు బాగుంటుందని నమ్ముతారు. మరికొందరు ఏం జరుగుతుందో తెలియకపోయినా అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. ఇంకొందరు భవిష్యత్తు గురించి పూర్తిగా ప్రతికూలంగా ఆలోచిస్తారు. కానీ వ్యాపారవేత్తకు స్పష్టమైన లక్ష్యం అవసరం. ‘ఏం జరగాలి?’ అనే ప్రశ్నకు సమాధానం తెలిసి ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏం చేయాలి? ఏ రిస్క్ తీసుకోవాలి? ఏ సమస్యను పరిష్కరించాలి? అనే దానిపై ముందుగానే ఆలోచించాలి. స్పష్టమైన ప్రణాళికతో పనిచేయడం విజయానికి కీలకం.
స్టార్టప్ పునాది బలంగా ఉండాలి.. Strong Foundations Matter
కంపెనీ ప్రారంభంలో (Zero to One.. ) చేసే కొన్ని తప్పులు భవిష్యత్తులో భారీ నష్టాలకు దారితీయవచ్చు. అందులో ముఖ్యమైనది సరైన కో-ఫౌండర్‌ను ఎంచుకోవడం. కంపెనీ లక్ష్యాలు, విలువలు, పని విధానం విషయంలో సహ వ్యవస్థాపకుల మధ్య స్పష్టమైన అవగాహన ఉండాలి. కంపెనీలో ఎవరు యజమానులు? ఎవరు రోజువారీ వ్యవహారాలు చూస్తారు? కంపెనీ నియంత్రణ ఎవరి వద్ద ఉంటుంది? అనే విషయాలు కూడా ప్రారంభంలోనే స్పష్టంగా ఉండాలి. సంస్థ నిర్మాణం సరిగ్గా ఉంటే ఉద్యోగులు, మేనేజ్మెంట్ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరు.
మంచి ఉద్యోగులు.. గొప్ప సంస్థ.. The Mechanics of Mafia
పేపాల్‌లో పనిచేసిన కొంతమంది ఉద్యోగులు ఆ సంస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అనేక విజయవంతమైన టెక్నాలజీ సంస్థలను నిర్మించడంలో కీలక పాత్ర (Zero to One.. ) పోషించారు. ఈ సమూహాన్ని ‘పేపాల్ మాఫియా’గా పిలిచేవారు. ఇక్కడి పాఠం ఏమిటంటే.. ఉద్యోగిని తీసుకునేటప్పుడు కేవలం అతని నైపుణ్యాన్ని మాత్రమే చూడకూడదు. కంపెనీ లక్ష్యంపై అతనికి నమ్మకం ఉందా? సంస్థ ఎదుగుదల కోసం కష్టపడే తత్వం ఉందా? అనే విషయాలు కూడా చూడాలి. ఒకే లక్ష్యంతో పనిచేసే బృందం స్టార్టప్‌కు అతిపెద్ద బలంగా మారుతుంది.
అమ్మకం లేకపోతే ఉత్పత్తికి విలువ లేదు.. Sales Matter as Much as the Product
ఎంత గొప్ప ఉత్పత్తిని (Zero to One.. )తయారు చేసినా అది కస్టమర్ వరకు చేరకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే ప్రొడక్ట్ డెవలప్మెంట్తో పాటు సేల్స్, మార్కెటింగ్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక కస్టమర్‌ను సంపాదించడానికి కంపెనీకి ఎంత ఖర్చవుతోంది? ఆ కస్టమర్ ద్వారా కంపెనీకి ఎంత ఆదాయం వస్తోంది? అనే రెండు అంశాలను వ్యాపారవేత్తలు నిరంతరం పరిశీలించాలి. కస్టమర్‌ను సంపాదించడానికి అయ్యే ఖర్చు కంటే అతని నుంచి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండాలి. అప్పుడే వ్యాపార నమూనా ఆర్థికంగా నిలబడుతుంది.
పది.. ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఉంటుందా? Think Long Term
స్టార్టప్ (Zero to One.. ) ప్రారంభించేటప్పుడు ‘ఇది ఇప్పుడే ఎంత లాభం ఇస్తుంది?’ అనే ప్రశ్నకంటే ‘పది, ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఈ కంపెనీకి విలువ ఉంటుందా?’ అని ఆలోచించాలని పుస్తకం సూచిస్తుంది. మన టెక్నాలజీ ఇతరుల కంటే ప్రత్యేకంగా ఉందా? సరైన సమయంలో మార్కెట్లోకి వస్తున్నామా? మనకు బలమైన టీమ్ ఉందా? ఉత్పత్తిని కస్టమర్లకు చేరవేసే సరైన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉందా? భవిష్యత్తులోనూ కొనసాగగలమా? ఇతరులు గుర్తించని అవకాశాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి.
కొత్తదనం ఉన్న చోటే ‘జీరో టు వన్’.. From Zero to One
ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలు జరిగాయని భావించి ‘ఇక కొత్తగా ఏమీ కనిపెట్టడానికి లేదు’ అనుకోవడం పెద్ద పొరపాటు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు (Zero to One.. )ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటికి పరిష్కారాలు కనుగొనాల్సి ఉంది. అదే స్టార్టప్‌లకు అవకాశం. పీటర్ థీల్ చెప్పే ‘జీరో టు వన్’ అంటే.. ఉన్నదాన్ని మరింత ఎక్కువగా తయారు చేయడం కాదు. అసలు లేనిదాన్ని సృష్టించడం. ఒక కొత్త ఉత్పత్తి, కొత్త సేవ, కొత్త టెక్నాలజీ లేదా కొత్త వ్యాపార విధానం.. ఏదైనా కావచ్చు. కానీ దానిలో ప్రత్యేకత ఉండాలి. చివరగా.. ఒక కంపెనీకి దాని వ్యవస్థాపకుడి వ్యక్తిత్వం కూడా కీలకమే. ఇతరులు ఏం అనుకుంటున్నారన్నదానికంటే, తాను నమ్మిన ఆలోచనపై ఎంత దృఢంగా నిలబడగలడన్నది ముఖ్యం. మంచి టీమ్‌ను నిర్మించడం, కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడం, ప్రత్యేకమైన ఉత్పత్తిని రూపొందించడం, అమ్మకాలపై దృష్టి పెట్టడం, దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకు సాగడం.. ఇవన్నీ కలిసినప్పుడే ఒక చిన్న ఆలోచన పెద్ద వ్యాపారంగా మారుతుంది. అందుకే ‘ZERO TO ONE’ పుస్తకం చెప్పే ప్రధాన సందేశం ఒక్కటే.. ఇతరులు చేస్తున్నదాన్ని అనుసరించడం కాదు.. ఇంతవరకు ఎవరూ చేయని దాన్ని సృష్టించగలిగితేనే అసలైన వ్యాపార విజయం సాధ్యమవుతుంది.
