దేశవ్యాప్తంగా వేతన జీవులకు ప్రభావం చూపేలా కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ టాక్స్ రూల్స్, 2026ను మార్చి 20న అధికారికంగా నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనలు (Changes in New Income Tax Rules) 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పన్ను విధానంలో కొన్ని మార్పులు వచ్చినప్పటికీ, ఈసారి వచ్చిన మార్పులు ముఖ్యంగా ఉద్యోగులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. పాత మరియు కొత్త టాక్స్ రెజీమ్ల మధ్య ఎంపిక చేసే వారికి ఇవి కీలక నిర్ణయాలకు దారి తీస్తాయి. ఈ మార్పుల్లో ముఖ్యంగా కంపెనీ కారు వినియోగం, తక్కువ వడ్డీ లోన్లు, మీల్ వోచర్లు, పిల్లల విద్యా అలవెన్సులు, హౌస్ రెంట్ అలవెన్స్ వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. సాధారణంగా ఉద్యోగులు పెద్దగా పట్టించుకోని ఈ చిన్న చిన్న అంశాలే, చివరికి ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో పెద్ద మొత్తంలో పన్ను భారాన్ని ప్రభావితం చేస్తాయి.
ఉద్యోగులపై కొత్త నియమాల ప్రభావం.. Impact on Salaried Employees
ఇప్పటి వరకు ఉన్న పన్ను విధానంలో (Changes in New Income Tax Rules) ఉద్యోగులు కొన్ని సదుపాయాలను సులభంగా ఉపయోగించుకుని పన్ను తగ్గించుకునే అవకాశం ఉండేది. కానీ తాజా మార్పులతో కొన్ని సదుపాయాలపై పన్ను భారం పెరిగింది. మరోవైపు, కొన్ని అలవెన్సులపై లిమిట్లు పెరగడం వల్ల పన్ను ఆదా చేసే అవకాశాలు కూడా పెరిగాయి. ఇది ఒక విధంగా చూస్తే ‘ఒకచేతి ఇచ్చి మరోచేతి తీసుకున్నట్లు’ అనే పరిస్థితి. ఉద్యోగులు తమ జీత నిర్మాణాన్ని, ఎంప్లాయర్ అందించే ప్రయోజనాలను బట్టి సరైన టాక్స్ ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం మరింత పెరిగింది.
కంపెనీ కారు వినియోగంపై భారీ మార్పు.. Company Car Perquisite Changes
ఎంప్లాయర్ అందించే కంపెనీ కారును వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే ఉద్యోగులకు ఇప్పుడు ఎక్కువ పన్ను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు చాలా తక్కువగా ఉన్న ఈ పెర్క్విజిట్ విలువను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. ఇంతకుముందు, 1.6 లీటర్ల లోపు ఇంజిన్ కలిగిన కారును ఉపయోగిస్తే, మరియు ఫ్యూయల్, మెయింటెనెన్స్ ఖర్చులను ఉద్యోగి భరిస్తే, నెలకు కేవలం రూ. 600 మాత్రమే టాక్సబుల్గా పరిగణించేవారు. కానీ ఇప్పుడు అదే పరిస్థితిలో నెలకు రూ. 2,000గా లెక్కించనున్నారు. ఇది మూడు రెట్లు పైగా పెరిగినట్లే. అంటే సంవత్సరానికి అదనంగా వేల రూపాయల పన్ను భారం పడే అవకాశం ఉంది. ఎక్కువ సాలరీ ఉన్న ఉద్యోగులు, ముఖ్యంగా 30% టాక్స్ స్లాబ్‌లో ఉన్నవారికి ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది పాత , కొత్త రెండు టాక్స్ రెజీమ్లకు వర్తించడం గమనార్హం.
వడ్డీ రహిత లోన్లపై ఉపశమనం.. Relief on Interest-Free Loans
ఉద్యోగులకు ఒక మంచి వార్త కూడా ఉంది. ఎంప్లాయర్ నుంచి తీసుకునే వడ్డీ రహిత లేదా తక్కువ వడ్డీ లోన్లపై టాక్స్ ఫ్రీ లిమిట్‌ను ప్రభుత్వం పెంచింది. ఇంతకుముందు ఈ లిమిట్ తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు రూ. 2 లక్షల వరకు లోన్ తీసుకున్నా పన్ను ఉండదు. ముఖ్యంగా వైద్య చికిత్సల కోసం తీసుకునే లోన్లకు ఇది వర్తిస్తుంది. అంటే, ఒక ఉద్యోగి తన కుటుంబ సభ్యుల వైద్య అవసరాల కోసం రూ. 2 లక్షల లోపు లోన్ తీసుకుంటే, దానిపై ఎలాంటి అదనపు పన్ను ఉండదు. ఇది మధ్య తరగతి ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు.
మీల్ వోచర్లపై భారీ పెరుగుదల.. Meal Voucher Benefits Increased
పాత టాక్స్ రెజీమ్‌ను ఎంచుకునే ఉద్యోగులకు ఇది ఒక పెద్ద లాభం. ఎంప్లాయర్ ఇచ్చే మీల్ వోచర్లు లేదా ఫుడ్ కార్డులపై టాక్స్ ఫ్రీ లిమిట్‌ను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. ఇంతకుముందు ఒక్కో మీల్‌కు రూ. 50 మాత్రమే పన్ను మినహాయింపు ఉండేది. ఇప్పుడు ఈ పరిమితిని రూ. 200కు పెంచారు. రోజుకు రెండు మీల్స్, నెలకు సగటున 22 వర్కింగ్ డేస్ తీసుకుంటే, నెలకు రూ. 8,800 వరకు టాక్స్ ఫ్రీ అవుతుంది. సంవత్సరానికి ఇది రూ. 1,05,600 అవుతుంది. పాత నిబంధనల్లో ఈ లిమిట్ కేవలం రూ. 26,400 మాత్రమే ఉండేది. అంటే ఇప్పుడు అదనంగా రూ. 79,200 వరకు పన్ను ఆదా చేసే అవకాశం ఉంది. 30% టాక్స్ స్లాబ్‌లో ఉన్న ఉద్యోగులు ఈ మార్పు వల్ల సంవత్సరానికి సుమారు రూ. 24,000 నుండి రూ. 25,000 వరకు సేవ్ చేసుకోవచ్చు.
పిల్లల విద్యా అలవెన్సులపై భారీ పెంపు.. Children Education & Hostel Allowance
పిల్లల చదువు ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యా అలవెన్సులపై భారీ పెంపును ప్రకటించింది. ఇంతకుముందు పిల్లల విద్య కోసం నెలకు రూ. 100 మాత్రమే టాక్స్ ఫ్రీ ఉండేది. ఇప్పుడు దాన్ని రూ. 3,000కు పెంచారు. అలాగే హాస్టల్ ఖర్చుల కోసం ఉన్న లిమిట్ రూ. 300 నుంచి రూ. 9,000కు పెరిగింది. ఇది ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో చదివే పిల్లల తల్లిదండ్రులకు గణనీయమైన ఉపశమనం ఇస్తుంది.
హెచ్ఆర్ఏలో విస్తరణ .. HRA Expansion to More Cities
హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) విషయంలో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పాత టాక్స్ రెజీమ్‌లో ఉన్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఇప్పటి వరకు మెట్రో నగరాల్లో పనిచేసే వారికి మాత్రమే శాలరీలో 50% వరకు HRA బెనిఫిట్ ఉండేది. ఇప్పుడు ఈ జాబితాను విస్తరించారు. హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు వంటి నగరాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇతర నగరాల్లో పనిచేసే వారికి మాత్రం 40% లిమిట్ కొనసాగుతుంది.
పాత vs కొత్త టాక్స్ రెజీమ్.. Old vs New Tax Regime
ఈ మార్పుల నేపథ్యంలో ఉద్యోగులు ఏ టాక్స్ రెజీమ్‌ను ఎంచుకోవాలి అన్నది మరింత క్లిష్టమైన నిర్ణయంగా మారింది. పాత రెజీమ్‌లో అలవెన్సులు, డిడక్షన్లు ఎక్కువగా ఉండటం వల్ల సరైన ప్లానింగ్ చేస్తే పన్ను తగ్గించుకోవచ్చు. కొత్త రెజీమ్‌లో సింప్లిసిటీ ఉన్నప్పటికీ, ఈ కొత్త అలవెన్సులు అందుబాటులో ఉండవు. ప్రతి ఉద్యోగి తన జీత నిర్మాణం, ఖర్చులు, కుటుంబ పరిస్థితులను బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి.
ఐటీఆర్ ఫైలింగ్‌లో జాగ్రత్తలు.. Precautions While Filing ITR
ఈ కొత్త నియమాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో, ఉద్యోగులు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎంప్లాయర్ ఇచ్చే అన్ని అలవెన్సులు, పెర్క్విజిట్‌లు సరిగ్గా లెక్కలోకి తీసుకోవాలి. ముఖ్యంగా కంపెనీ కారు, లోన్లు, మీల్ వోచర్లు వంటి అంశాలను నిర్లక్ష్యం చేస్తే తర్వాత నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. టాక్స్ ప్లానింగ్ కోసం ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం కూడా మంచిదే. మొత్తంగా చూస్తే, ఇన్కమ్ టాక్స్ రూల్స్, 2026లో చేసిన ఈ మార్పులు (Changes in New Income Tax Rules)ఉద్యోగులపై మిశ్రమ ప్రభావం చూపనున్నాయి. కొన్ని చోట్ల పన్ను భారం పెరిగితే, మరికొన్ని చోట్ల ఉపశమనం లభిస్తుంది. సరైన అవగాహనతో ముందుగానే ప్లానింగ్ చేసుకుంటే, ఈ మార్పులను తమకు అనుకూలంగా మలచుకోవచ్చు. లేకపోతే అనవసరంగా ఎక్కువ పన్ను చెల్లించాల్సి వచ్చే ప్రమాదం ఉంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలు, ప్రతి ఉద్యోగి తన ఆర్థిక ప్రణాళికలో కీలకంగా పరిగణించాల్సిన అంశాలుగా మారనున్నాయి.
