జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా బీమాను మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. మనకు ఏదైనా అనుకోని ప్రమాదం, అనారోగ్యం లేదా అకాల మరణం సంభవించినప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేది జీవిత బీమానే. అందుకే బీమా పాలసీని కొనసాగించడం, సకాలంలో ప్రీమియంలు చెల్లించడం అత్యంత కీలకం. కానీ వాస్తవ జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. ఉద్యోగం పోవడం, వ్యాపారంలో నష్టం, అనారోగ్య ఖర్చులు, పిల్లల చదువు వ్యయాలు వంటి కారణాలతో ఒక్కసారిగా ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి సందర్భాల్లో బీమా ప్రీమియం చెల్లించడం కూడా భారంగా మారుతుంది. ఫలితంగా చాలా మంది తమ LIC పాలసీలను ల్యాప్స్ అయ్యే పరిస్థితికి నెట్టేస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఈపీఎఫ్‌ఓ (EPFO) ఒక కీలక వెసులుబాటు కల్పిస్తోంది. అదేంటంటే… పీఎఫ్ ఖాతా నుంచి నేరుగా LIC ప్రీమియంలు చెల్లించే అవకాశం!
బీమా ఎందుకు అవసరం? Why Life Insurance Is Crucial
జీవిత బీమా అనేది కేవలం ఒక పెట్టుబడి మాత్రమే కాదు… అది కుటుంబానికి ఇచ్చే భరోసా. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే, మిగిలినవారు ఆర్థికంగా కుదేలవకుండా ఉండేందుకు బీమా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలకు LIC వంటి బీమా పాలసీలు ఒక రక్షణ కవచంలాంటివి. పిల్లల చదువు, ఇల్లు, అప్పులు, రోజువారీ ఖర్చులు .. ఇవన్నీ కొనసాగాలంటే బీమా ద్వారా వచ్చే మొత్తం ఎంతో అవసరం. అయితే ప్రీమియం మిస్ అయితే పాలసీ ల్యాప్స్ అవుతుంది. ల్యాప్స్ అయితే కవరేజ్ తగ్గిపోతుంది తిరిగి రివైవల్ చేయాలంటే అదనపు పెనాల్టీలు చెల్లించాలి. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే EPFO ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చింది.
పీఎఫ్ ఖాతా నుంచి LIC ప్రీమియం – ఎలా సాధ్యం? LIC Premium Payment Through PF – How It Works
ఈపీఎఫ్ స్కీమ్ ప్రకారం, యాక్టివ్ పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులు తమ LIC జీవిత బీమా పాలసీ ప్రీమియంలను పీఎఫ్ నిల్వల నుంచి చెల్లించుకోవచ్చు. ఇది ముఖ్యంగా తాత్కాలిక ఆర్థిక కష్టాల్లో ఉన్నవారికి ఎంతో ఉపయోగకరమైన ఆప్షన్. ఉద్యోగం ఉన్న సమయంలోనే కాదు.. ఉద్యోగం మారినప్పుడు లేదా జీతం ఆలస్యమైనప్పుడు.. అత్యవసర ఖర్చులు పెరిగినప్పుడు ఈ ఆప్షన్ ద్వారా పాలసీ కొనసాగించే అవకాశం ఉంటుంది.
ఈ సదుపాయం ఎవరు వినియోగించుకోవచ్చు? Eligibility for LIC Premium Payment from PF
ఈ వెసులుబాటును అందరికీ అనుమతించరు. కొన్ని అర్హత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అర్హతలు ఏమిటంటే.. యాక్టివ్ పీఎఫ్ అకౌంట్ ఉండాలి. యూఏఎన్ (UAN) యాక్టివేట్ అయి ఉండాలి. కనీసం రెండు నెలల వేతనానికి సమానమైన పీఎఫ్ నిల్వలు ఉండాలి. బీమా పాలసీ చందాదారుడి పేరుమీదే ఉండాలి. పాలసీ LICదే అయి ఉండాలి. జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరుమీద ఉన్న పాలసీలకు ఈ సౌకర్యం వర్తించదు. ప్రైవేటు బీమా కంపెనీల పాలసీలకు ఈ ఆప్షన్ లేదు.
ఏ రకమైన ప్రీమియంలకు ఈ సౌకర్యం? Applicable Premium Payments
ఈ పీఎఫ్–LIC లింకింగ్ సౌకర్యం వార్షిక ప్రీమియం చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలల ప్రీమియంల చెల్లింపులకు ఈ సౌకర్యం లేదు. కేవలం Yearly Premium మాత్రమే పీఎఫ్ ఖాతా నుంచి డెబిట్ అవుతుంది.
ఫారం–14 అంటే ఏమిటి? What is EPF Form 14
పీఎఫ్ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించాలంటే ఫారం–14 కీలకం. ఫారం–14 ద్వారా LIC పాలసీ వివరాలు, పాలసీ నంబర్
, ప్రీమియం మొత్తం, పాలసీ కాలపరిమితి వంటి వివరాలను EPFOకి అందజేస్తారు. ఈ ఫారం అప్రూవ్ అయిన తర్వాతే పీఎఫ్ నుంచి డెబిట్ జరుగుతుంది.
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.. Step-by-Step Process to Pay LIC Premium from PF
పీఎఫ్ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించాలంటే ఈ క్రింది విధంగా చేయాలి:
స్టెప్–1: EPFO అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి ( https://www.epfindia.gov.in)
స్టెప్–2: UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి
స్టెప్–3: KYC సెక్షన్‌లోకి వెళ్లాలి
స్టెప్–4: అక్కడ LIC అనే ఆప్షన్‌ను ఎంపిక చేయాలి
స్టెప్–5: పాలసీ నంబర్, పాలసీ వివరాలు, ప్రీమియం మొత్తం వివరాలు సబ్మిట్ చేయాలి
స్టెప్–6: ఫారం–14ను డౌన్‌లోడ్ చేసి అవసరమైన చోట సబ్మిట్ చేయాలి. పాలసీ వివరాలు లింక్ అయిన తర్వాత… ప్రీమియం డ్యూ డేట్ వచ్చిన వెంటనే ఆటోమేటిక్‌గా పీఎఫ్ ఖాతా నుంచి డెబిట్ అవుతుంది
ఈ ఆప్షన్ వల్ల లాభాలు.. Advantages of LIC Premium from PF
పీఎఫ్ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లింపు సౌకర్యంతో ఉద్యోగులకు పలు ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా పాలసీ ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉండదు. ప్రీమియం తేదీ మిస్ అవదు. బయట రుణం తీసుకోవాల్సిన అవసరం లేదు. అత్యవసర సమయంలో కుటుంబ భద్రత కొనసాగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
కానీ… కొన్ని జాగ్రత్తలు అవసరం! Important Cautions to Note
పీఎఫ్ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లింపు ఆప్షన్ వినియోగించేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. పీఎఫ్ అనేది రిటైర్మెంట్ కోసం ఉద్దేశించిన సేవింగ్స్. తరచూ వాడితే భవిష్యత్ నిధులు తగ్గిపోతాయి. వడ్డీపై కూడబెట్టే లాభం తగ్గుతుంది. అందుకే “తాత్కాలిక ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు మాత్రమే ఈ ఆప్షన్‌ను వినియోగించాలి” అని..ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఎప్పుడు వాడితే మంచిది? When Should You Use This Option
ఉద్యోగం మారిన సమయంలో, జీతం ఆలస్యమైనప్పుడు, వైద్య ఖర్చులు ఎక్కువైనప్పుడు, తాత్కాలిక నగదు కొరత ఉన్నప్పుడు.. మాత్రమే పీఎఫ్–LIC ఆప్షన్ సరైన నిర్ణయంగా ఉంటుంది.మొత్తంగా పీఎఫ్ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించే వెసులుబాటు అనేది ఉద్యోగులకు ఇచ్చిన ఒక ఆర్థిక రక్షణ కవచం. ఇది బీమా కొనసాగింపును సులభతరం చేస్తుంది. అయితే దీన్ని అలవాటుగా మార్చుకోవద్దు. అవసరం ఉన్నప్పుడే వినియోగిస్తే భవిష్యత్ భద్రత కూడా కాపాడుకోవచ్చు, కుటుంబానికి బీమా భరోసా కూడా కొనసాగుతుంది. ఆర్థిక క్రమశిక్షణతో నిర్ణయాలు తీసుకుంటే… భవిష్యత్ మరింత భద్రమవుతుంది.

