వేతన జీవులు, చిన్న వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు… ఇలా లక్షలాది మంది ఆదాయపన్ను చెల్లింపుదారులకు రీఫండ్ ఎంతో కీలకం. ఏటా ఫైలింగ్ పూర్తయ్యాక వారి చూపులు రీఫండ్‌పై పడతాయి. గతంలో కంటే రీఫండ్ ప్రక్రియ వేగవంతమైనా… ఈ ఏడాది చాలామందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరికి రెండు నెలలు గడిచినా రాకపోవడం, మరికొందరికి ప్రాసెసింగ్ పక్కాగా పూర్తయినా ‘రీఫండ్ ఇనిషియేటెడ్ కాదు’ అని స్టేటస్ కనిపించడం ఆవేదనకు గురిచేస్తోంది. నిజంగా రీఫండ్ ఎందుకు ఆలస్యమవుతోంది? సాధారణంగా ఎప్పుడు వస్తుంది? ఏ సమస్యలు ఎక్కువగా అవరోధంగా మారుతున్నాయి? ఎలా చెక్ చేసుకోవాలి? అన్న వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
డేటా లోపాల వల్లే.. Due to Data Gaps…
ఆదాయపన్ను రీఫండ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న వారికి ఈసారి నిరాశ తప్పడంలేదు. సాధారణంగా ITR ఫైల్ చేసి e-Verify చేసిన తర్వాత 4–5 వారాల్లో రీఫండ్ ఖాతాలో పడిపోతుంది. కానీ ఈ ఏడాది పెద్ద ఎత్తున రిఫండ్లు 2–3 నెలల వరకు ఆలస్యమవుతున్నాయి. ఉద్యోగుల జీతాల్లో TDS కత్తిరించినా, అడ్వాన్స్ టాక్స్ చెల్లించినా… చివరి లెక్కలో ఎక్కువ పన్ను కట్టిన వారికి రీఫండ్ అందుతుంది. ఈసారి రీఫండ్ ఆలస్యం ఎక్కువగా కనిపిస్తున్నా… సమస్య ఎక్కువగా పన్ను చెల్లింపుదారుల డేటా లోపాల వల్లే వస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రీ-వాలిడేషన్, PAN–ఆధార్ లింక్, AIS–26AS మ్యాచ్ సరిగ్గా ఉంటే రీఫండ్ సాధారణంగా ఆలస్యం కాదు.
ITR ప్రాసెసింగ్ వేగం పెరిగినా… Even Though ITR Processing Has Become Faster…
ఆదాయపన్ను శాఖ ప్రస్తుతం CPC బెంగళూరు ద్వారా రిటర్నులను ఆటోమేటెడ్ సిస్టమ్‌తో ప్రాసెస్ చేస్తోంది. 24–48 గంటల్లోనే చాలాసార్లు ప్రాసెసింగ్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నా… రీఫండ్ మాత్రం అంత వేగంగా జరగడం లేదు.
రీఫండ్ ఆలస్యానికి ప్రధాన కారణాలు.. Major Reasons for Refund Delays
– బ్యాంక్ అకౌంట్ ప్రీ-వాలిడేట్ చేయకపోవడం
– PAN–Bank Account పేర్లు మ్యాచ్ కాకపోవడం
– IFSC కోడ్ తప్పుగా ఉండటం / పాత బ్రాంచ్ కోడ్
– బ్యాంక్ ఖాతా క్లోజ్ అయి ఉండటం / ఇన్‌యాక్టివ్‌గా ఉండటం
– PAN–ఆధార్ లింక్ కాకపోవడం
– ఫారం-16, 26AS, AIS డేటాలో తేడాలు
– TDS వివరాలు తప్పుగా ఉండటం
– డిడక్షన్లు రైటుగా చూపకపోవడం
– బ్యాంక్ ఇంటరెస్ట్ / స్టాక్ ట్రాన్సాక్షన్స్ AISలో ఉండి ITRలో లేకపోవడం
– ఈ కారణాల్లో ఏ ఒక్కటి ఉన్నా రీఫండ్ హోల్డ్‌లో పడిపోతుంది.
రీఫండ్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోవాలంటే.. How to Check Your Refund Status…
ఇన్కమ్ టాక్స్ అధికారిక వెబ్సైట్ incometax.gov.in లోకి వెళ్లి రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మొదట వెబ్సైట్లో మీ PAN, పాస్వర్డ్, OTPతో లాగిన్ అవ్వాలి. ఈ సంవత్సరానికి సంబంధించిన ITR పై క్లిక్ చేస్తే స్టేటస్ కనిపిస్తుంది. NSDL (Refund Banker) వెబ్సైట్ ద్వారా కూడా రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
సాధారణంగా రీఫండ్ రావడానికి ఎంత టైమ్ పడుతుంది? How Long Does It Usually Take to Get a Refund?
సాధారణంగా 4–5 వారాలు పడుతుంది. ప్రస్తుత ఆలస్య పరిస్థితులలో 30–45 రోజులు పడుతుంది. కొందరికి 60–75 రోజులు కూడా పడుతోంది. రిటర్న్ ప్రాసెస్ అయి ఉండి రీఫండ్ ఇనిషియేట్ కాకపోతే దీనికి కారణం 90% శాతం బ్యాంక్ ఖాతా / డేటా మిస్‌మ్యాచ్ అని చెప్పొచ్చు.
రీఫండ్ ఆలస్యం అయితే ఏమి చేయాలి? What to Do If Your Refund Is Delayed?
– PAN–ఆధార్ వెంటనే లింక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ప్రీ-వాలిడేట్ చేయాలి. బ్యాంక్ వివరాలు చెక్ చేయాలి.
IFSC కోడ్ సరైందా? లేదా అని చూడాలి. ఖాతా యాక్టివ్‌లో ఉందా? లేదా చెక్ చేయాలి. పేర్లు మ్యాచ్ అయ్యాయా? అనేది చూడాలి. ఏదైనా నోటీసు (143(1), 139(9)) వస్తే వెంటనే స్పందించాలి. నోటీసు ఉన్నంతవరకు రీఫండ్ ఆగిపోతుంది.
ఆదాయపన్ను శాఖ అధికారుల సూచనలు.. Suggestions from Income Tax Department Officials
ITR వేసే ముందు డేటా మెచ్చింగ్ సరిగా చేయాలి. బ్యాంక్ ఖాతా ప్రీ-వెరిఫికేషన్ అత్యవసరం. AISలో ఏవైనా తేడాలు ఉంటే ఫీడ్‌బ్యాక్ ఆప్షన్ ద్వారా సరిచేయాలి. రీఫండ్ ఆలస్యం అయితే “e-Nivaran” లో కంప్లైంట్ ఇవ్వచ్చు. “రిఫండ్ ఆలస్యం అవుతున్న ప్రతి కేసు వెనుక కారణం ఉంటుంది. సరైన డాక్యుమెంటేషన్, సరైన ITR ఫారం వాడితే పెద్దగా ఇబ్బంది ఉండదు” అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇన్కమ్ టాక్స్ రీఫండ్ అంటే ఏమిటి..? ఇది ఎవరికి వర్తిస్తుంది? What Is an Income Tax Refund, and Who Is Eligible for It?
ప్రతి సంవత్సరం ఆదాయపన్ను రిటర్నులు ఫైల్ చేసే వారికి “రీఫండ్” అనే పదం బాగా వినిపిస్తూనే ఉంటుంది. జీతం, వ్యాపారం, వడ్డీలు… ఇలా వివిధ వనరుల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం నియమాల ప్రకారం పన్ను వసూల్ చేస్తుంది. అయితే కొన్నిసార్లు పన్ను శాఖ లెక్కలు, వ్యక్తి చెల్లించిన పన్ను మధ్య తేడా రావచ్చు. అప్పుడు అదనంగా వసూలైన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. దీనినే ఇన్కమ్ టాక్స్ రీఫండ్ అంటారు.
ఇన్కమ్ టాక్స్ రీఫండ్ అంటే ఏమిటి? What Is an Income Tax Refund?
ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి తగిన పన్ను ఎంత ఉండాలో ఆదాయపన్ను చట్టం నిర్ణయిస్తుంది. కానీ జీతాలపై TDS ఎక్కువగా కత్తిరించినా, బ్యాంకులు వడ్డీలపై అధిక TDS కట్ చేసినా, వ్యక్తి అడ్వాన్స్ టాక్స్ / సెల్ఫ్–అసెస్మెంట్ టాక్స్ ఎక్కువ చెల్లించినా , చివరకు లెక్క వేసినప్పుడు కట్టాల్సింది కంటే ఎక్కువ టాక్స్ చెల్లించినట్లు తేలితే, ఆ అదనపు మొత్తాన్ని పన్ను శాఖ తిరిగి పంపుతుంది. ఇది రీఫండ్. ఇది పూర్తిగా సిస్టమ్ ద్వారా జరిగే ఆటోమేటెడ్ ప్రక్రియ.
రీఫండ్ ఎవరికీ వర్తిస్తుంది? Who Is Eligible for a Refund?
– ఉద్యోగులకు (సెలరీడ్ ఎమ్ప్లాయీస్): TDS ఎక్కువ కట్ చేసిన ఉద్యోగులకు రీఫండ్ రావడం చాలా సాధారణం.
ఉదాహరణకు HRA, 80C, 80D వంటి డిడక్షన్లు ఉద్యోగి చివర్లో చూపితే TDS లెక్కలు తప్పి ఉండవచ్చు.
– బ్యాంక్ FD / RD వడ్డీలపై మరీ ఎక్కువ TDS కట్ అయినవారికి, సీనియర్ సిటిజన్లకు ఇది ఎక్కువగా వర్తిస్తుంది.
– సెల్ఫ్-ఎంప్లాయిడ్ / బిజినెస్ వ్యక్తులు అడ్వాన్స్ టాక్స్ అధికంగా చెల్లించినప్పుడు రీఫండ్ వస్తుంది.
– స్టాక్ మార్కెట్ / ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లలో TDS కట్ అయినవారికి ప్రాపర్టీ అమ్మినప్పుడు 1% TDS కట్ అవుతుంది. చివరి లెక్కల్లో పన్ను అంత రాకపోతే మిగిలిన మొత్తాన్ని రీఫండ్‌గా ఇస్తారు.
– కంపెనీలు, స్టార్టప్‌లు అడ్వాన్స్ టాక్స్, TDS, మ్యాచింగ్ లోపాలు ఉంటే రీఫండ్ పొందవచ్చు.
– తప్పుగా చెల్లించిన టాక్స్ ఉన్న వారికీ ఒక్కసారి తప్పుగా అధికంగా పన్ను చెల్లించినా… రీఫండ్ తీసుకోవచ్చు.
రీఫండ్ రావడానికి ముఖ్యమైన అర్హతలు…Key Eligibility Requirements for Getting a Refund
ITR ఫైల్ చేయాలి, ITR e-Verification పూర్తవ్వాలి. బ్యాంక్ అకౌంట్ ప్రీ–వాలిడేట్ చేయాలి. PAN–ఆధార్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఇన్కమ్ టాక్స్ రీఫండ్ అనేది పన్ను శాఖ ఇచ్చే ప్రత్యేక సదుపాయం కాదు…పౌరుడు అధికంగా చెల్లించిన టాక్స్‌ని తిరిగి పొందే హక్కు. సరైన వివరాలతో ITR ఫైల్ చేస్తే రీఫండ్ సమస్యలు రాకుండా త్వరగా ఖాతాలో జమ అవుతుంది. 26AS, AIS, ఫారం-16, బ్యాంక్ వివరాలు సమగ్రంగా చెక్ చేసి రిటర్నులు ఫైల్ చేయడం తప్పనిసరి.
