ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఈ ఏడాది గడువు పెంచారు. సాధారణంగా జులై 31 వరకే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి ఐటీఆర్ ఫారాలు, యుటిలిటీల విడుదలలో జాప్యం కారణంగా సెప్టెంబర్ 15, 2025 వరకు గడువు (Changes in ITR Filing 2025-26) పెంచారు. ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లు, ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ గడువు వర్తిస్తుంది. ఇతర ట్యాక్స్ పేయర్లకు మాత్రం గడువు పెంచలేదు. ఐటీఆర్ ఫైలింగ్‌కు గడువు పెంచినప్పటికీ ట్యాక్స్ రిటర్న్స్ సమయానికి అన్ని డాక్యుమెంట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఐటీఆర్ దాఖలు ప్రాసెస్‌లో డాక్యుమెంట్లు సేకరించడం అనేది చాలా కీలకం.
what is form 16
పన్ను చెల్లించే ఉద్యోగులకు మాత్రమే కంపెనీలు ఫారం 16 ను అందిస్తాయి. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి సంపాదించిన జీతం, టీడీఎస్ (TDS) వివరాలు, పన్ను మినహాయింపులు ఉంటాయి. ఈ సర్టిఫికేట్ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఉద్యోగుల ఆదాయం, పన్నులకు సంబంధించిన కచ్చితమైన నివేదికే ఫారం-16. అయితే పన్ను చెల్లించే ఉద్యోగులకు ఫారం 16 అనేది చాలా ముఖ్యమైనది. కంపెనీ యాజమాన్యాలు ట్యాక్స్ డిడక్ట్ చేసిన తర్వాతే జీతాలు ఇస్తాయి. ఈ వివరాలతో ఫారం 16ను ఏటా జూన్ 15 తర్వాత కంపెనీలు జారీ చేస్తాయి. ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న వివరాలను చెక్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఫారం 16ఏ, 16బీ, 16సీ, 16డీ
ఫారం 16తో పాటు ట్యాక్స్ పేయర్లు ఇతర టీడీఎస్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, అది ఆదాయ మార్గాలను బట్టి ఉంటుంది.
* ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వంటివి ఉన్నప్పుడు ట్యాక్స్ డిడక్ట్ చేసిన వారి వద్ద నుంచి ఫారం 16ఏ తీసుకోవాలి.
* రూ.50 లక్షలకు మించి ఆస్తి కొనుగోలు చేసినప్పుడు ఫారం 16బి తీసుకోవాలి.
* ఇక నెలవారీ అద్దె రూ.50 వేలు దాటి వసూలు చేసినప్పుడు అద్దెకు ఉండే వారు ఫారం 16సీ జారీ చేస్తారు. సెక్షన్ 194ఎం కింద టీడీఎస్ కట్ చేస్తే ఫారం 16డీ తీసుకోవాల్సి ఉంటుంది.
ఫారం 16లో రెండు ప్రధాన భాగాలు
Two Main Parts in Form 16
PART A: యజమాని, ఉద్యోగి సమాచారం, PAN, TAN, TDS తగ్గింపులు వంటి వివరాలను కలిగి ఉంటుంది.
PART B: ఉద్యోగి జీతం, పన్ను, సెక్షన్లు 80C, 80D కింద ఉన్న తగ్గింపు వివరాలను చూపిస్తుంది. ఎంత ఆదాయానికి పన్ను విధించాలో లెక్కించేందుకు సహాయపడుతుంది.

ఫారం 16 ఎందుకు ముఖ్యం
Why is Form 16 Important
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు ప్రక్రియను ఫారం 16 సులభతరం చేస్తుంది. ఆదాయం, పన్ను వివరాలను ఒకే చోట అందిస్తుంది. బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఫారం 16ను సమర్పించవచ్చు. ఒకవేళ మీ జీతం నుంచి ఎక్స్ ట్రా TDS కట్ అయితే ఫారం 16 పన్ను వాపసును క్లెయిమ్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.
క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్ Capital Gains Statement
మీరు ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ అసెట్స్ విక్రయించినప్పుడు మూలధన లాభాల గురించి ఆదాయపు పన్ను రిటర్నుల్లో పేర్కొనాలి. అందుకోసం మ్యూచువల్ ఫండ్ హౌస్ లేదా స్టాక్ బ్రోకర్ నుంచి క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్ తీసుకోవాలి.
ఏఐఎస్, ఫారం 26ఏఎస్
AIS and Form 26AS
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ నుంచి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS), ట్యాక్స్‌పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరి, ఫారం 26ఏఎస్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ లావాదేవీలు, టీడీఎస్, టీసీఎస్ వంటి పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి.
విదేశీ ఆదాయం, అన్‌లిస్టెడ్ షేర్లు
Foreign Income, Unlisted Shares
విదేశీ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే ఆ వివరాలు, ఆదాయాలను కూడా ఐటీఆర్‌లో చూపించాలి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకోవాలి. ట్యాక్స్ పేయర్ అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఐటీఆర్-2 ఫైల్ చేయాలి. అన్‌లిస్టెడ్ షేర్లకు సంబంధించిన డాక్యుమెంట్లు అవసరమవుతాయి.
వడ్డీ సర్టిఫికెట్, బ్యాంక్ స్టేట్మెంట్
Interest Certificate, Bank Statement
బ్యాంకులు, పోస్టాఫీసుల వంటి వాటిల్లో డిపాజిట్లపై వచ్చే వడ్డీలకు తప్పనిసరిగా సర్టిఫికెట్ తీసుకోవాలి. 2024-25కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ సైతం తీసుకోవాలి.
ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడులు, వ్యయ ధ్రువీకరణలు
ఐటీఆర్ ఫైలింగ్ కోసం పాత పన్ను విధానం ఎంచుకుంటే ట్యాక్స్ సేవింగ్స్ పెట్టుబడులు, ఖర్చులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి.
* సెక్షన్ 80సీ, 80సీసీడీ, 80డీ, 80డీడీ, 80టీటీఏ వంటి సెక్షన్ ద్వారా పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేస్తారు. వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఐటీ శాఖకు సమర్పించాలి.
పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్లు
పన్ను చెల్లించే వారి పత్రాల్లో పాన్, ఆధార్ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఉండాలి. వాటిల్లో వివరాలు అన్నీ ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు.
పన్ను చెల్లంపులలో పారదర్శకత
ఆదాయపు పన్ను చెల్లింపుల్లో పారదర్శకత పెంచడం, తప్పుడు క్లెయిమ్స్ నివారించడం లక్ష్యంగా ఐటీ శాఖ కొత్త రూల్స్ తెచ్చింది (Changes in ITR Filing 2025-26). ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ప్రతి మినహాయింపు రుజువులతో వివరంగా తెలియజేయాలి. అయితే, ఇది పాత పన్ను విధానం ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేసే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవు . కాబట్టి రుజువులు అవసరం లేదు. ఫారం 16 ఆధారంగా ఐటీఆర్ 1 లేదా 2 ఫైల్ చేయాలి. సెక్షన్ 80సీ, 80డీ, 80డీడీ, 80యూ, హౌస్ రెంట్ అలవెన్స్ వంటివి క్లెయిమ్ చేసి ఉంటే వాటి ఆధారాలను ఐటీ శాఖకు చూపించాలి. లేకుంటే క్లెయిమ్స్ ను తిరస్కరించవచ్చు. దీంతో ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది. ఒకవేళ తప్పుడు డాక్యుమెంట్లు సమర్పిస్తే ట్యాక్స్ రిటర్న్స్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.
హోమ్ లోన్ ఉంటే
If You Have a Home Loan..
ఇక హోమ్ లోన్ ఉంటే ఐటీ చట్టంలోని సెక్షన్ 24 (బీ) ప్రకారం రూ.2 లక్షల వరకు వడ్డీకి మినహాయింపు క్లెయిమ్ చేయొచ్చు. గతంలో వడ్డీ ఎంత అనేది తెలిపితే సరిపోయేది. కానీ, ఇప్పుడు లోన్ ఎక్కడ తీసుకున్నారు.. ఎంత లోన్ , అకౌంట్ నంబర్, లోన్ తీసుకున్న తేదీ తదితర వివరాలు తెలియజేయాలి. ఈ వివరాలన్నీ ఇస్తేనే మినహాయింపు వస్తుంది.
* సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియానికి రూ.25 వేల వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
* తల్లిదండ్రుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియానికీ క్లెయిమ్ చేయవచ్చు. అయితే ఇకపై పాలసీ ఎక్కడి నుంచి తీసుకున్నారు? పాలసీ నంబర్ వంటి వివరాలు తప్పకుండా ఇవ్వాలి.
దివ్యాంగుల పోషణ, వైద్య ఖర్చుల కోసం..
For Maintenance and Medical Expenses of Disabled Dependents
దివ్యాంగుల పోషణ, వైద్య ఖర్చుల కోసం వెచ్చించిన వాటిపై సెక్షన్ 80డీడీ ద్వారా మినహాయింపు పొందవచ్చు. స్వల్ప వైకల్యం ఉంటే రూ.75 వేలు, పూర్తి వైకల్యం ఉంటే రూ.1,25,000 వరకు మినహాయింపు వస్తుంది. ఇకపై దివ్యాంగుల పాన్, ఆధార్ వివరాలు ఇవ్వాలి. 10ఏఐ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఉన్నత విద్య కోసం తీసుకున్న లోన్ వడ్డీపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు పొందొచ్చు. లోన్ ఎక్కడ తీసుకున్నారు? ఎంత, ఇంకా ఎంత కట్టాలి? వడ్డీ ఎంతుంది? అనే వివరాలను తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది.
ఎలక్ట్రికల్ వాహనాలకు.. If You Purchase an Electric Vehicle
2019, ఏప్రిల్ 1 నుంచి మార్చి 31, 2023 మధ్య ఎలక్ట్రికల్ వెహికల్స్ ను మీరు కొంటే.. లోన్ వడ్డీపై సెక్షన్ 80ఈఈబీ కింద మినహాయింపు పొందవచ్చు. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. వెహికల్ సంబంధించిన పూర్తి వివరాలను ఐటీ శాఖకు వెల్లడించాలి. సెక్షన్ 80సీ ద్వారా ఈపీఎఫ్, పీపీఎఫ్, జీవిత బీమా, హోమ్ లోన్, పిల్లల ట్యూషన్ ఫీజుల వంటి వాటికి క్లెయిమ్ చేయవచ్చు. అయితే, వాటికి కూడా తగిన ఆధారాలు చూపించాలి.
How to File ITR Without Form 16
* అన్ని నెలల శాలరీ స్లిప్‌లను మీ దగ్గర ఉంచుకోవాలి.
* జీతం, అలవెన్సులు (HRA, LTA, ప్రత్యేక అలవెన్స్), బోనస్‌లను జోడించాలి. HRA, వృత్తిపరమైన పన్ను వంటి తగ్గింపులను తీసివేయాలి. పాత పన్ను విధానానికే ఈ తగ్గింపులు వర్తిస్తాయి. కొత్త పన్ను విధానం రూ. 75,000 ప్రామాణిక మినహాయింపు పొందవచ్చు.
* వడ్డీ లేదా డివిడెండ్ వంటి ఏదైనా అదనపు ఆదాయం కోసం బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను తనిఖీ చేయాలి. వాటిని మీ మొత్తం ఆదాయానికి కలపాలి.
* ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ నుంచి ఫారం 26AS ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇవి మీ ఆదాయం, TDS వివరాలతో సరిపోలుతున్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఏవైనా లోపాలు ఉంటే మీ యాజమాన్య కంపెనీ లేదా బ్యాంకును సంప్రదించాలి.

