హైదరాబాద్ఃపెరుగుతున్న వాయు కాలుష్యం నేడు కేవలం పర్యావరణ సమస్యగా మాత్రమే మిగిలిపోలేదు. ఇది సామాన్యుల ఆరోగ్యంతో పాటు వారి ఆర్థిక పరిస్థితిపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. నగరాలు, పట్టణాలనే తేడా లేకుండా కాలుష్య కారకాల వల్ల ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం, 2023 నుంచి 2026 మధ్య కాలంలో కాలుష్య సంబంధిత అనారోగ్యాలతో దాఖలైన ఆరోగ్య బీమా క్లెయిములు ఏకంగా 4.34 రెట్లు పెరిగాయి. ఇందులో కేవలం శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యల వాటానే 78 శాతంగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య బీమా పాలసీ ఉంటే వైద్య ఖర్చులన్నీ తిరిగి వస్తాయా? లేక కొన్ని ఖర్చులను మన జేబు నుంచే భరించాల్సి వస్తుందా? అనే విషయాలపై స్పష్టత ఉండటం చాలా అవసరం.
ఆసుపత్రిలో చేరితే బీమా వర్తిస్తుందా?
సాధారణంగా ఏ సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ అయినా వైద్యపరంగా తప్పనిసరి అయిన ఆసుపత్రి చికిత్స (ఇన్‌పేషెంట్ హాస్పిటలైజేషన్) ఖర్చులను భరిస్తుంది. కాలుష్యం వల్ల తీవ్రమైన ఆస్తమా దాడి జరగడం, న్యూమోనియా బారిన పడటం లేదా గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు తలెత్తడం వంటి సందర్భాల్లో రోగి కనీసం 24 గంటల పాటు ఆసుపత్రిలో చేరాల్సి వస్తే, పాలసీ నిబంధనల ప్రకారం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ చికిత్సలో భాగంగా అయ్యే గది అద్దె, ఐసీయూ ఛార్జీలు, వైద్యుల ఫీజులు, మందులు, వివిధ రకాల వైద్య పరీక్షల ఖర్చులు పాలసీ అర్హత మేరకు చెల్లిస్తారు. అయితే, చికిత్స ఆవశ్యకత, ఆసుపత్రిలో ఉన్న రోజులు, మొత్తం బీమా కవరేజీ, పాలసీలోని ఇతర పరిమితుల ఆధారంగానే ఈ చెల్లింపులు ఆధారపడి ఉంటాయి. కేవలం కాలుష్యం వల్ల జబ్బు వచ్చిందనే కారణంతో ఏ బీమా సంస్థ కూడా క్లెయిమ్‌ను తిరస్కరించదు. అదే సమయంలో ఆసుపత్రిలో అయిన ప్రతి రూపాయిని బీమా కంపెనీ చెల్లిస్తుందని కూడా ఆశించకూడదు.
ఓపీడీ (OPD) ఖర్చుల పరిస్థితి ఏమిటి?
కాలుష్యం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలన్నీ ఆసుపత్రిలో చేరేంత తీవ్రంగా ఉండవు. ముఖ్యంగా ఆస్తమా, అలర్జీలు లేదా దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు తరచూ వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఇన్హేలర్లు, నెబ్యులైజర్లు వాడటం, ఊపిరితిత్తుల పనితీరును అంచనా వేసే పరీక్షలు చేయించుకోవడం వీరికి నిత్యకృత్యం అవుతుంది.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సాధారణ ఆసుపత్రి చికిత్స ఆధారిత బీమా పాలసీల్లో ఇలాంటి ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) ఖర్చులకు కవరేజీ లభించదు. వీటికి పరిహారం పొందాలంటే పాలసీలో ప్రత్యేకంగా ఓపీడీ ప్రయోజనం ఉండాలి లేదా అదనపు రుసుము చెల్లించి ఓపీడీ యాడ్-ఆన్ కవర్ తీసుకోవాలి. ఒకవేళ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందితే, ఆ చికిత్సకు ముందు (ప్రీ-హాస్పిటలైజేషన్), ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత (పోస్ట్-హాస్పిటలైజేషన్) పాలసీలో నిర్దేశించిన నిర్దిష్ట కాలపరిమితిలో చేసిన పరీక్షలు, మందుల ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు, బిల్లులు, ఇతర వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.
ఇప్పటికే జబ్బు ఉంటే ఏం చేయాలి?
పాలసీ కొనుగోలు చేసే సమయానికే ఆస్తమా, బ్రాంకైటిస్, గుండె జబ్బులు లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు ఉంటే, దరఖాస్తు ఫారమ్‌లో ఆ వివరాలను ఎలాంటి దాపరికం లేకుండా వెల్లడించాలి. వీటిని బీమా సంస్థలు ముందస్తు వ్యాధులుగా (ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజెస్) పరిగణిస్తాయి. ఒకవేళ ఈ విషయాలను దాచిపెడితే, భవిష్యత్తులో క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఎదురవ్వడమే కాకుండా పాలసీ రద్దయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) నిబంధనల ప్రకారం, పాలసీ తీసుకునేటప్పుడు వెల్లడించిన ముందస్తు వ్యాధులకు వేచి ఉండే వ్యవధి (వెయిటింగ్ పీరియడ్) గరిష్ఠంగా 36 నెలలుగా ఉంది. కొన్ని బీమా సంస్థలు తమ పాలసీల్లో అంతకంటే తక్కువ వేచి ఉండే కాలాన్ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి, ఇప్పటికే శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు పాలసీ తీసుకునే ముందే ఈ వెయిటింగ్ పీరియడ్ నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించడం ఉత్తమం.
పాలసీ ఎంపికలో గమనించాల్సిన ముఖ్య అంశాలు
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు కేవలం కవరేజీ మొత్తం ఎక్కువగా ఉందని చూసి మోసపోకూడదు. పాలసీ లోపలి నిబంధనలను నిశితంగా పరిశీలించాలి:
పరిమితులు, సహ-చెల్లింపులు: గది అద్దెపై ఏమైనా పరిమితులు ఉన్నాయా? ఐసీయూ ఖర్చులకు రోజువారీ పరిమితి విధించారా? అనేది చూడాలి. అలాగే బిల్లులో కొంత శాతాన్ని మనమే భరించే సహ-చెల్లింపు (కో-పేమెంట్) నిబంధనలు, వ్యాధుల వారీగా ఉండే ఉప-పరిమితులు (సబ్-లిమిట్స్), అసలు వర్తించని మినహాయింపుల (ఎక్స్‌క్లూజన్స్) గురించి ముందే తెలుసుకోవాలి.
రీస్టోరేషన్, సూపర్ టాపప్: కాలుష్య ప్రభావం వల్ల కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఒకే ఏడాదిలో ఆసుపత్రి పాలయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు బీమా మొత్తం అయిపోతే తిరిగి భర్తీ చేసే రీస్టోరేషన్ ప్రయోజనం ఎంతగానో ఉపయోగపడుతుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ పొందడానికి సూపర్ టాపప్ పాలసీలు మంచి మార్గం. అయితే, సూపర్ టాపప్‌కు వర్తించే మినహాయింపు పరిమితిని (డిడక్టబుల్) సరిగ్గా అర్థం చేసుకోవాలి.
ముఖ్యంగా కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉండే నగరాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో నివసించేవారు కేవలం ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులనే కాకుండా, తరచూ వచ్చే చిన్నపాటి అనారోగ్య ఖర్చులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అందుకు అనుగుణంగా ఓపీడీ కవర్, తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న సమగ్ర పాలసీని ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. అత్యవసర సమయాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా క్లెయిమ్ పొందాలంటే, పాలసీ కొనుగోలు చేసే సమయంలోనే దాని నియమ నిబంధనలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం.
