హైదరాబాద్ః నెలకు లక్షల్లో జీతం వస్తేనే జీవితంలో సెటిల్ అయినట్టా? చేతినిండా డబ్బులు ఉంటేనే ఆర్థిక భరోసా దక్కుతుందా? చాలామంది నిజమే అనుకుంటారు. కానీ ఆర్థిక రంగ నిపుణులు చెప్పే సత్యం వేరుగా ఉంది. నెలకు భారీగా ప్యాకేజీలు అందుకుంటూ కూడా నెలాఖరు వచ్చేసరికి చేతులు ఎత్తేసే వాళ్లు, అప్పుల ఊబిలో కూరుకుపోయే మహిళలు, ఉద్యోగులు ఎంతోమంది మన చుట్టూ కనిపిస్తుంటారు. అందుకే ఇక్కడ ఎంత మొత్తం సంపాదిస్తున్నారనేది ముఖ్యం కాదు, వచ్చిన డబ్బును ఎలా నిర్వహిస్తున్నారు, ఎలా వాడుతున్నారు అన్నదే కీలకం. సరైన ప్రణాళిక ఉంటే చిన్న జీతంతో కూడా ధనవంతులుగా మారవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ సూత్రాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
ఖర్చులు ఎక్కడికి పోతున్నాయి? (Expense Tracking)
నెల తిరిగేసరికి డబ్బులన్నీ ఎటు మాయమవుతున్నాయో తెలీక చాలామంది తలపట్టుకుంటారు. జీతం ఎంత, ఇంటి ఖర్చులు ఎంత, ఈఎంఐలు ఎంత కడుతున్నారు, చేతిలో మిగిలేది ఎంత… వీటిపై పూర్తి స్థాయి స్పష్టత మీ దగ్గర ఉందా? లేకపోతే వెంటనే లెక్కలు రాయడం మొదలుపెట్టండి (Budgeting Plan). ప్రతి పైసా ఎక్కడికి వెళ్తోందో గమనిస్తే తప్ప అనవసర ఖర్చులు బయటపడవు. బయట తినే తిండి, ఆన్లైన్ ఆర్డర్లు, అనవసరపు చందాలు లాంటి చిన్న చిన్న ఖర్చులే చివరకు కొండంత భారంగా మారతాయి. ఆ లీకేజీలను గుర్తించి అడ్డుకట్ట వేస్తేనే పొదుపు సాధ్యమవుతుంది.
ముందు పొదుపు.. తర్వాతే ఖర్చు (Pay Yourself First)
సాధారణంగా అందరూ చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే.. జీతం రాగానే విచ్చలవిడిగా ఖర్చు చేసి, నెలాఖరులో ఏమైనా మిగిలితే దాచుకుందాం అనుకోవడం. ఇలా చేస్తే జీవితంలో ఒక్క రూపాయి కూడా వెనకేయలేరు. జీతం అకౌంట్లో పడగానే ముందుగా కొంత మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులు, ఆరోగ్య బీమా కోసం పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మాత్రమే చేతిలో ఉన్న సొమ్ముతో నెల గడపడానికి ప్రణాళిక వేసుకోవాలి. ఈ ఒక్క చిన్న అలవాటు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది.
అత్యవసర నిధి మీ రక్షణ కవచం (Emergency Fund)
జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అనుకోని అనారోగ్యం, ఉద్యోగంలో సమస్యలు, కుటుంబ అవసరాలు, ఇంటి మరమ్మతులు… ఇలాంటివి అకస్మాత్తుగా ఎదురవుతుంటాయి. చిన్న చిన్న ఖర్చులను ఎలాగోలా నెట్టుకొచ్చినా, పెద్ద సమస్యలు వస్తే మాత్రం చేతుల్లో డబ్బుల్లేక అప్పుల పాలవుతారు. క్రెడిట్ కార్డులు స్వైప్ చేయడం లేదా అధిక వడ్డీలకు అప్పులు తేవడం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కనీసం ఆరు నెలల కుటుంబ ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని బ్యాంకులో సిద్ధంగా ఉంచుకోవాలి.
జీతం పెరిగినప్పుడల్లా లైఫ్‌స్టైల్ పెంచొద్దు (Lifestyle Inflation)
ఏటా ఇంక్రిమెంట్లు రావడం, ప్రమోషన్లతో జీతం పెరగడం సహజం. జీతం పెరిగింది కదా అని వెంటనే ఖరీదైన ఫోన్లు కొనడం, బ్రాండెడ్ బట్టలు, పెద్ద ఇల్లు, కొత్త కార్లు అంటూ జీవనశైలి ఖర్చులను పెంచేస్తుంటారు. దీన్నే ఆర్థిక పరిభాషలో జీవనశైలి ద్రవ్యోల్బణం అంటారు. ఒకట్రెండు సార్లు మనసుకు నచ్చినవి కొనడం తప్పు కాదు. కానీ అదే అలవాటుగా మారితే పెరిగిన జీతం కూడా సరిపోదు. జీతం ఎంత శాతం పెరిగిందో, దానికి తగ్గట్టుగా పొదుపు శాతాన్ని కూడా పెంచాలి. అది భవిష్యత్తులో స్థిరమైన సంపదను సృష్టిస్తుంది.
అధిక వడ్డీ అప్పుల నుంచి విముక్తి (Debt Free Strategy)
ఉద్యోగంలో చేరగానే క్రెడిట్ కార్డు తీసుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారింది. చేతిలో కార్డు ఉంది కదా అని ఇష్టానుసారం స్వైప్ చేయడం, జీతం రాగానే బిల్లులు కట్టడం… ఇదొక విషవలయంగా మారుతోంది. పొరపాటున ఎప్పుడైనా అప్పులు చేసినా, ముందుగా అధిక వడ్డీ ఉండే వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు బాకీలను పూర్తిగా తీర్చేయడంపై దృష్టి పెట్టాలి. అప్పుల్లో ఉంటూ చేసే పెట్టుబడులు ఎలాంటి లాభాన్ని ఇవ్వవు. అప్పులు లేని ప్రశాంతమైన జీవితమే నిజమైన ఆస్తి.
ఆటోమేటిక్ చెల్లింపుల మాయాజాలం (Automated Payments)
ప్రణాళికలు బాగానే వేసినా తీరికలేని పనుల వల్ల బిల్లులు చెల్లించాల్సిన గడువు తేదీలు మర్చిపోతుంటారు. కరెంట్ బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు, పాలసీ ప్రీమియంలు ఆలస్యంగా కట్టడం వల్ల పెనాల్టీలు, లేట్ ఫీజులు తడిసి మోపెడవుతాయి. క్రెడిట్ స్కోరు కూడా దెబ్బతింటుంది. ఈ తలనొప్పి లేకుండా ఉండాలంటే అన్ని చెల్లింపులను ఆటో డెబిట్ చేసుకోవడం ఉత్తమం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (SIPs), ఆర్డీలు కూడా జీతం పడిన మరుసటి రోజే ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా చూసుకోవాలి. దీనివల్ల క్రమశిక్షణతో కూడిన పొదుపు సాధ్యమవుతుంది.
సంపాదించడం కంటే నిలబెట్టుకోవడమే ముఖ్యం (Wealth Protection)
చాలామంది రాబడి ఎక్కడ ఎక్కువ వస్తుందా అని మాత్రమే ఆలోచిస్తారు. రిస్క్ ఎక్కువగా ఉండే చోట డబ్బులు పెట్టి చేతులు కాల్చుకుంటారు. అలాగే జీవితంలో ఒక్క అనుకోని ప్రమాదం ఎదురైనా, ఆస్పత్రి పాలైనా దాచుకున్న డబ్బులన్నీ క్షణాల్లో కరిగిపోతాయి. అందుకే రాబడిని పెంచుకోవడమే కాదు, సంపాదించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా నేర్చుకోవాలి. సరైన టర్మ్ ఇన్సూరెన్స్, కుటుంబ సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం అత్యంత ముఖ్యం. ఇది మీ ఆస్తులకు రక్షణ గోడలా నిలుస్తుంది.
బోనస్‌లు, అదనపు ఆదాయంపై పట్టు (Windfall Money Management)
కంపెనీ ఇచ్చే బోనస్‌లు, పండుగ అలవెన్సులు, పన్ను రీఫండ్లు లాంటి అదనపు సొమ్ము చేతికి వచ్చినప్పుడు చాలామంది ఆనందంతో వెంటనే విలాసాలకు ఖర్చు చేసేస్తుంటారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయని బాధపడుతుంటారు. అదనపు ఆదాయం వచ్చినప్పుడు ముందుగా అందులో కొంత భాగాన్ని పాత అప్పులు తీర్చడానికి, మిగిలిన భాగాన్ని దీర్ఘకాలిక పెట్టుబడులకు కేటాయించాలి. చిన్న భాగాన్ని మాత్రమే వ్యక్తిగత సరదాల కోసం వాడుకోవాలి.
ఆర్థిక భరోసా అంటే సమాజంలో ఆడంబరంగా కనిపించడం కాదు. సంపాదించిన ప్రతి రూపాయిని లెక్కలేకుండా ఖర్చు పెట్టడమూ కాదు. వచ్చే ఆదాయంపై పూర్తి పట్టు సాధించడం, రేపటి రోజున ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఆర్థికంగా తట్టుకోగల ధైర్యం ఉండటం. సంపాదన తక్కువైనా సరే క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక ఉంటే జీవితంలో ఎలాంటి ఆటుపోట్లనైనా సులువుగా దాటవచ్చు. అదనపు జీతం కంటే కూడా సరైన ఆర్థిక ఆలోచనే మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది.
