నష్టాల బాటలో పయనిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ బడ్జెట్ (Budget)కు ముందు పుంజుకుంటుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2026-27 వార్షిక బడ్జెట్ మార్కెట్‌కు ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకొస్తుందన్న అంచనాలతో మదుపర్లు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది బడ్జెట్‌కు ముందు కొన్ని రోజుల పాటు మార్కెట్లో కొనుగోళ్లు పెరుగుతుంటాయి. దీనినే ‘ప్రీ-బడ్జెట్ ర్యాలీ’గా పిలుస్తారు. గత కొన్ని సంవత్సరాల అనుభవం చూస్తే… ఈసారి కూడా అదే ధోరణి కనిపించవచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
జనవరి నష్టాల నెలగా మారిందా? Has January turned into a month of losses?
– ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 4 శాతానికి పైగా నష్టపోయాయి. కొత్త ఏడాదికి ఉత్సాహంగా ప్రారంభమవుతాయని భావించిన మార్కెట్… వరుసగా ఒత్తిడికి లోనవుతూ దిగజారింది. విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐలు) భారీ అమ్మకాలు, రూపాయి బలహీనత, కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, సుంకాలపై ఆందోళనలు వంటి అంశాలు మార్కెట్‌ను వెనక్కి నెట్టాయి.
– ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత వాతావరణం నెలకొనడంతో మదుపర్లు రిస్క్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. దీని ప్రభావం భారత మార్కెట్లపైనా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్‌కు ముందు కనీసం స్వల్ప ర్యాలీ అయినా వస్తే… మదుపర్లకు కొంత ఊరట లభించనుంది.
గతంలోనూ ఇలాగే…It was the same in the past as well…
‘‘గతంలోనూ జనవరి నెలలో మార్కెట్లు నష్టాలను నమోదుచేశాయి. అయితే బడ్జెట్‌పై ఆశలతో, గణతంత్ర దినోత్సవం (జనవరి 26) తర్వాత మార్కెట్ పుంజుకునే సందర్భాలు ఉన్నాయి’’ అని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి… 2025 జనవరిలో బీఎస్ఈ సెన్సెక్స్ 638.44 పాయింట్లు (0.81%) నష్టపోయింది. 2024, 2023, 2022, 2021, 2020 జనవరి నెలల్లో కూడా ఇదే తరహా పరిస్థితి పునరావృతమైంది. అయితే ఆ తర్వాత బడ్జెట్ అంచనాలతో మార్కెట్లో క్రమంగా కొనుగోళ్లు పెరిగాయి. ఈసారి కూడా అదే చరిత్ర తిరిగి పునరావృతమవుతుందా? అన్నది మదుపర్లలో ఆసక్తిగా మారింది.
రూపాయిపై తీవ్ర ఒత్తిడి…Severe pressure on the rupee
ఈ నెలలో దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ముఖ్యంగా జనవరి 23తో ముగిసిన వారంలో అమ్మకాలు మరింతగా పెరిగాయి. ఈ పరిణామం మార్కెట్‌తో పాటు రూపాయిపై కూడా ఒత్తిడిని పెంచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రికార్డు కనిష్ఠాలకు చేరింది. జనవరి 23న డాలర్ విలువ రూ.92 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఈ నెలలో ఇప్పటివరకు రూపాయి విలువ సుమారు 2% తగ్గింది. రూపాయి బలహీనత దిగుమతుల ఖర్చును పెంచడంతో పాటు ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలహీనపరుస్తోంది.
బంగారం, వెండి వైపు మదుపర్లు..Investors turn towards gold and silver
అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, అమెరికా బాండ్ల ప్రతిఫలాలు (బాండ్ యీల్డ్స్) పెరగడం వల్ల మదుపర్లలో అప్రమత్తత పెరిగింది. దీంతో వారు రిస్క్ ఉన్న ఈక్విటీల నుంచి బయటకు వచ్చి… రక్షణాత్మక పెట్టుబడులైన పసిడి, వెండి వైపు మొగ్గుచూపుతున్నారు. దీని ప్రభావంతో ఈ లోహాల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. సంప్రదాయంగా అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం సురక్షిత ఆశ్రయంగా మారడం తెలిసిందే. ప్రస్తుతం అదే పరిస్థితి మళ్లీ కనిపిస్తోంది.
కార్పొరేట్ ఫలితాల ప్రభావం..Impact of corporate results
మరోవైపు… ఐటీ, బ్యాంకింగ్, వినియోగ ఆధారిత రంగాల్లోని కొన్ని కీలక కంపెనీల డిసెంబరు త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపర్చాయి. ఆదాయ వృద్ధి అంచనాలకు తగ్గట్టు లేకపోవడం, లాభ మార్జిన్లపై ఒత్తిడి వంటి అంశాలు మదుపర్లను నిరాశపరిచాయి. దీని ప్రభావం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూలంగా పడింది.
బడ్జెట్‌పై మార్కెట్ ఆశలు.. Market expectations from the Budget
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరి దృష్టి 2026-27 కేంద్ర బడ్జెట్‌పైనే ఉంది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఆర్థిక వృద్ధికి తోడ్పాటు.. అదే సమయంలో సూక్ష్మ ఆర్థిక స్థిరత్వం (ఫిస్కల్ డిసిప్లిన్) మధ్య సమతూకం పాటించేలా నిర్ణయాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మధ్యకాలానికి ద్రవ్యస్థిరీకరణ విషయంలో ప్రభుత్వం రాజీ పడకపోవచ్చని పేర్కొంటున్నారు. మార్కెట్లు కూడా ఈసారి బడ్జెట్ నుంచి అతిగా కాకుండా… స్థిరమైన, నమ్మకమైన విధాన నిర్ణయాలనే ఆశిస్తున్నాయి. ప్రత్యేకంగా మూలధన లాభాల పన్ను (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్)పై సానుకూల మార్పులు ఉంటాయన్న అంచనాలు మదుపర్లలో ఉన్నాయి. అలాంటి నిర్ణయాలు వస్తే… మార్కెట్‌కు తక్షణమే ఊతం లభించే అవకాశం ఉంది.
కోలుకునే అవకాశం ఉందా? Is there a chance of recovery?
మొత్తంగా… ప్రస్తుతం మార్కెట్ ఎదుర్కొంటున్న సవాళ్లు ఎన్నో. ఎఫ్ఐఐ అమ్మకాలు, బలహీన రూపాయి, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, కార్పొరేట్ ఫలితాల ఒత్తిడి… అన్నీ కలిసి సూచీలను వెనక్కి నెట్టాయి. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే… బడ్జెట్‌కు ముందు వచ్చే కొన్ని రోజులు కీలకంగా మారనున్నాయి. ప్రీ-బడ్జెట్ ర్యాలీ వస్తే… జనవరి నష్టాల నుంచి మార్కెట్ కొంతైనా కోలుకునే అవకాశం ఉంది. అదే సమయంలో బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలే రాబోయే నెలల్లో మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రీ-బడ్జెట్ ర్యాలీకి కారణాలేంటి? What are the reasons behind a pre-Budget rally?
బడ్జెట్ అంటేనే ప్రభుత్వ ఆర్థిక విధానాలకు అద్దం. పన్నులు, వ్యయాలు, అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాలపై ఖర్చు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతాయి. బడ్జెట్లో పన్ను రాయితీలు, మౌలిక రంగాలకు పెట్టుబడులు, కార్పొరేట్, స్టార్టప్‌లకు ఊతం, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వంటి అంశాలపై సానుకూల నిర్ణయాలు ఉంటాయన్న అంచనాలతో మదుపర్లు ముందుగానే కొనుగోళ్లు ప్రారంభిస్తారు. ఈ కొనుగోళ్ల ప్రభావంతో మార్కెట్ పైకి కదలడం మొదలవుతుంది. ఇదే ప్రీ-బడ్జెట్ ర్యాలీకి కారణం. ప్రీ-బడ్జెట్ ర్యాలీ అనేది బడ్జెట్‌పై ఉన్న ఆశలు, అంచనాల వల్ల మార్కెట్లో ఏర్పడే ముందస్తు ఉత్సాహం. ఇది మదుపర్ల నమ్మకం, మార్కెట్ సెంటిమెంట్‌కు ప్రతిబింబం. అయితే ఇది శాశ్వతం కాదు. బడ్జెట్ తర్వాత వాస్తవ పరిస్థితులే మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని మర్చిపోకూడదు.
మదుపర్ల నిర్ణయాలే కీలకం.. Investors’ decisions are crucial
ప్రీ-బడ్జెట్ ర్యాలీకి ప్రధాన కారణం అంచనాలు, ఆశలు. బడ్జెట్లో మంచి వార్తలు వస్తాయన్న భావనతో మదుపర్లు ‘ముందే కొనుక్కుందాం’ అన్న ధోరణి అవలంబిస్తారు. బడ్జెట్ తర్వాత ధరలు పెరిగితే లాభపడవచ్చన్న ఆలోచన ఇందుకు కారణం. ఇది పూర్తిగా మార్కెట్ సెంటిమెంట్‌పై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు బడ్జెట్ ముందు పెద్దగా ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా, అంచనాలే మార్కెట్‌ను నడిపిస్తాయి.
ఏ రంగాలకు ఎక్కువ ఊపు? Which sectors see more momentum?
సాధారణంగా ప్రీ-బడ్జెట్ ర్యాలీలో కొన్ని రంగాలు ముందంజలో ఉంటాయి. మౌలిక సదుపాయాలు (ఇన్ఫ్రా), బ్యాంకింగ్, ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్, వినియోగ ఆధారిత రంగాలు ఉంటాయి. బడ్జెట్లో ప్రభుత్వ వ్యయం పెరుగుతుందన్న అంచనాతో ఈ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరుగుతాయి.
ఎప్పుడూ ర్యాలీ వస్తుందా? Does a rally happen every time?
ప్రీ-బడ్జెట్ ర్యాలీ అన్నది తప్పనిసరి కాదు. అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితులు, దేశీయ ఆర్థిక పరిస్థితుల బలహీనత, భారీ ఎఫ్ఐఐ అమ్మకాలు వంటి పరిస్థితుల్లో ఈ ర్యాలీ కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు బడ్జెట్ ముందు మార్కెట్ స్థిరంగా ఉండిపోతుంది. మరికొన్నిసార్లు నష్టాలే నమోదవుతాయి.
బడ్జెట్ తర్వాత ఏమవుతుంది? What happens after the Budget?
బడ్జెట్ రోజు లేదా తర్వాత మార్కెట్ ప్రవర్తన పూర్తిగా బడ్జెట్ ప్రకటనలపై ఆధారపడి ఉంటుంది. అంచనాలకు మించిన సానుకూల నిర్ణయాలు ఉంటే మార్కెట్ మరింత పైకి వెళ్లొచ్చు. అంచనాలకు తగ్గట్టు లేకపోతే, లేదా ప్రతికూల నిర్ణయాలు ఉంటే మార్కెట్ దిగజారే అవకాశముంది. అందుకే అనుభవజ్ఞులైన మదుపర్లు ఏం చెబుతారంటే ‘వార్తపై కాదు… వాస్తవాలపై మార్కెట్ స్పందిస్తుంది’ అని. ప్రీ-బడ్జెట్ ర్యాలీ సమయంలో ఆకర్షణీయంగా కనిపించే ధరలతో షేర్లు కొనుగోలు చేయాలనే ఉత్సాహం సహజం. కానీ కేవలం అంచనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం. దీర్ఘకాల లక్ష్యాలు, కంపెనీ ఆర్థిక స్థితి, రంగ భవిష్యత్ అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
