ఉద్యోగం.. ప్రతి కుటుంబానికి కేవలం నెల జీతం అందించే మార్గం మాత్రమే కాదు. ఇంటి అద్దె నుంచి పిల్లల చదువులు, కిరాణా సరుకుల నుంచి వైద్య ఖర్చులు, బ్యాంకు రుణాల ఈఎంఐల నుంచి భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడుల వరకు అన్నింటికీ అదే ఆధారం. అందుకే ఉన్నట్టుండి ఉద్యోగం పోతే (Lost Your Job? Don’t Panic) కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదుపునకు గురవుతుంది. నెలనెలా ఖాతాలోకి వచ్చే జీతం ఆగిపోతుంది. కానీ ఖర్చులు మాత్రం ఆగవు. పైగా ఉద్యోగంతో పాటు సంస్థ అందించే ఆరోగ్య బీమా వంటి సదుపాయాలూ నిలిచిపోవచ్చు. దీంతో ఆందోళన పెరగడం సహజమే. ప్రస్తుతం వివిధ రంగాల్లో ఉద్యోగాల కోతల వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఏదో ఒక సంస్థలో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నారన్న సమాచారం వస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేం. ఉద్యోగం కోల్పోవడం తీవ్రమైన ఆర్థిక సమస్యే అయినా.. దానిని ఎదుర్కొనే విధానం మరింత కీలకం. ఆదాయం తాత్కాలికంగా ఆగిపోయినంత మాత్రాన భవిష్యత్తు మొత్తం చీకటిగా మారిపోదు. సరైన ప్రణాళికతో ఖర్చులను నియంత్రించుకుంటూ, చేతిలో ఉన్న సొమ్మును జాగ్రత్తగా వినియోగిస్తూ, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఈ దశను అధిగమించవచ్చు.
ముందుగా.. ఖర్చెంతో తెలుసుకోవాలి.. First Step: Know Your Essential Expenses
ఉద్యోగం పోయిన వెంటనే చేయాల్సిన మొదటి పని.. కుటుంబానికి నెలకు కనీసం ఎంత డబ్బు (Lost Your Job? Don’t Panic) అవసరమో లెక్కగట్టడం. సాధారణంగా జీతం వస్తున్నప్పుడు మన ఖర్చులపై పెద్దగా దృష్టి పెట్టం. ఆదాయం వస్తూనే ఉంటుందనే ధైర్యంతో అవసరమైనవి, అవసరం లేనివి అన్న తేడా లేకుండా ఖర్చు చేస్తుంటాం. కానీ ఆదాయం ఆగిపోయినప్పుడు ప్రతి రూపాయినీ లెక్కపెట్టాల్సి వస్తుంది. ఇంటి అద్దె, కిరాణా సరుకులు, విద్యుత్తు, నీటి బిల్లులు, పిల్లల పాఠశాల ఫీజులు, వైద్య ఖర్చులు, ప్రయాణం, రుణాల ఈఎంఐలు వంటి తప్పనిసరి ఖర్చులను ముందుగా గుర్తించాలి. వీటికి అదనంగా రాబోయే ఆరు నెలల్లో చెల్లించాల్సిన వార్షిక లేదా అర్ధవార్షిక ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పిల్లల పాఠశాల ఫీజులు, బీమా ప్రీమియం, ఇంటి అద్దె అడ్వాన్స్ వంటి ముందస్తు చెల్లింపులు ఉంటే వాటినీ లెక్కలోకి తీసుకోవాలి. ఈ మొత్తం లెక్క పూర్తయిన తర్వాతే అసలు పరిస్థితి అర్థమవుతుంది. ఉదాహరణకు కుటుంబానికి నెలకు కనీసం రూ.60 వేల అవసరం ఉంటే.. చేతిలో ఉన్న సొమ్ము రూ.6 లక్షలైతే అది దాదాపు పది నెలల ప్రాథమిక ఖర్చులకు సరిపోవచ్చు. అయితే ఇందులో పెట్టుబడుల విలువ తగ్గే అవకాశం, అత్యవసర వైద్య ఖర్చులు, రుణ చెల్లింపులు వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.
చేతిలో ఉన్న సొమ్మెంత? Calculate Your Financial Runway
నెలవారీ ఖర్చు ఎంత అన్నది (Lost Your Job? Don’t Panic) తెలుసుకున్న తర్వాత.. ప్రస్తుతం మన వద్ద అందుబాటులో ఉన్న ఆస్తుల విలువను లెక్కించాలి. బ్యాంకు ఖాతాల్లోని నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సులభంగా నగదుగా మార్చుకోగల పెట్టుబడులు, లిక్విడ్ ఫండ్లు, డెట్ మ్యూచువల్ ఫండ్లలోని సొమ్ము వంటి వాటిని ఒకసారి పరిశీలించాలి. ఇక్కడ మొత్తం పెట్టుబడుల విలువను లెక్కించడం మాత్రమే కాకుండా.. అవసరమైనప్పుడు ఎంత త్వరగా ఆ సొమ్మును తీసుకోగలమన్నదీ ముఖ్యం. ఉదాహరణకు కొంత పెట్టుబడి దీర్ఘకాలానికి లాక్ అయి ఉంటే దాన్ని వెంటనే ఉపయోగించలేం. కాబట్టి అందుబాటులో ఉన్న నగదు, సులభంగా ఉపసంహరించుకోగల పెట్టుబడులు ఎంత ఉన్నాయో ప్రత్యేకంగా గుర్తించాలి. ఈ సొమ్మును నెలవారీ కనీస ఖర్చుతో పోల్చితే.. ఉద్యోగం లేకపోయినా ఎన్ని నెలలు కుటుంబాన్ని నడిపించగలమో తెలుస్తుంది. ఇదే ఆర్థికంగా మనకు ఉన్న ‘రన్‌వే’. ఈ వ్యవధి ఎంత ఎక్కువగా ఉంటే కొత్త ఉద్యోగం కోసం అంత ప్రశాంతంగా ప్రయత్నించగలుగుతాం.
విలాసాలకు తాత్కాలిక విరామం.. Cut Non-Essential Spending
ఆదాయం ఆగిపోయినప్పుడు (Lost Your Job? Don’t Panic) మొదట తగ్గించాల్సింది అనవసర ఖర్చులే. ఖరీదైన కొనుగోళ్లు, కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంటి అలంకరణ, అత్యవసరం కాని మరమ్మతులు, పెద్ద ప్రయాణాలు వంటి వాటిని కొంతకాలం వాయిదా వేయడం మంచిది. బయట భోజనాలు, ఆన్లైన్ షాపింగ్, వినోద సబ్స్క్రిప్షన్లు వంటి ఖర్చులను కూడా సమీక్షించాలి. అయితే ప్రతి ఖర్చునూ పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగం కోల్పోవడం వల్ల ఇప్పటికే మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబంతో కొంత సమయం గడపడం, చిన్నపాటి వినోదం, పిల్లలతో బయటకు వెళ్లడం వంటి వాటిని పూర్తిగా మానేస్తే ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే అవసరమైన ఖర్చులు, మానసిక ప్రశాంతతకు ఉపయోగపడే పరిమిత ఖర్చులు, పూర్తిగా వాయిదా వేయగల ఖర్చులు.. ఇలా మనసులోనే మూడు భాగాలుగా విభజించుకోవాలి.
అత్యవసర నిధే మొదటి రక్షణ.. Emergency Fund Comes First
ఉద్యోగం కోల్పోయిన సమయంలో (Lost Your Job? Don’t Panic) అత్యవసర నిధి విలువ తెలుస్తుంది. ఆదాయం ఉన్న సమయంలో కనీసం కొన్ని నెలల కుటుంబ ఖర్చులకు సరిపడే మొత్తాన్ని ప్రత్యేకంగా ఉంచుకోవడం అందుకే ముఖ్యం. ఉద్యోగం పోయిన తర్వాత అవసరమైన ఖర్చుల కోసం ముందుగా ఈ నిధినే ఉపయోగించడం సమంజసం. అత్యవసర నిధి పూర్తయిన తర్వాతే ఇతర సులభంగా ఉపసంహరించుకోగల పెట్టుబడుల వైపు చూడాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్లు వంటి వాటిలోని సొమ్మును అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవచ్చు. అయితే ఒక్కసారిగా మొత్తం పెట్టుబడులను ఖాళీ చేయకుండా.. ముందుగా ఎంత కాలం ఉద్యోగం లేకపోవచ్చో అంచనా వేసుకుని దశలవారీగా డబ్బును వినియోగించడం మంచిది.
ఈ సమయంలో ఈక్విటీలకు దూరంగా? Protect Your Portfolio During Uncertainty
ఉద్యోగం ఉన్నప్పుడు మన రిస్క్ తీసుకునే (Lost Your Job? Don’t Panic) సామర్థ్యం ఒకలా ఉంటుంది. ఆదాయం ఆగిపోయిన తర్వాత అదే రిస్క్ సామర్థ్యం ఉండదు. అందుకే ఉద్యోగం కోల్పోయిన సమయంలో పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను ఒకసారి సమీక్షించుకోవాలి. మార్కెట్లలో హెచ్చుతగ్గులు సాధారణమే. ఇలాంటి సమయంలో అత్యవసర అవసరాల కోసం ఈక్విటీ పెట్టుబడులను అమ్మాల్సి వస్తే.. మార్కెట్ పడిపోయిన సమయంలో నష్టంతో విక్రయించే పరిస్థితి రావచ్చు. అందువల్ల అత్యవసర ఖర్చులకు అవసరమైన డబ్బును మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో ఉంచకుండా.. సులభంగా అందుబాటులో ఉండే, తక్కువ రిస్క్ ఉన్న మార్గాల్లో ఉంచుకోవడం మంచిది. ప్రస్తుతం కొనసాగుతున్న సిప్‌లను కూడా పరిస్థితిని బట్టి తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. ఉద్యోగం తిరిగి వచ్చిన తర్వాత ఆదాయం స్థిరపడినప్పుడు వాటిని మళ్లీ ప్రారంభించవచ్చు. ఉద్యోగం పోయిన సమయంలో పెట్టుబడిని ఎలాగైనా కొనసాగించాలనే పట్టుదల కంటే.. ముందుగా కుటుంబ ఆర్థిక భద్రతను కాపాడుకోవడమే ముఖ్యం.
రుణాల విషయంలో అప్రమత్తంగా.. Manage EMIs Before Debt Becomes a Burden
ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి రుణాల నిర్వహణ (Lost Your Job? Don’t Panic) అత్యంత కీలకమైన అంశం. ఇంటి రుణం, వాహన రుణం వంటి వాటి ఈఎంఐలు ఆగిపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల రుణాలకు ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు బాకీల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. వీటిపై వడ్డీ సాధారణంగా ఇతర రుణాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. బాకీ పెరిగేకొద్దీ వడ్డీ భారం కూడా పెరుగుతుంది. అందువల్ల వీలైనంత త్వరగా క్రెడిట్ కార్డు బాకీలను నియంత్రించాలి. కనీస చెల్లింపు చేయడం వల్ల తక్షణ డిఫాల్ట్ పరిస్థితిని తప్పించుకోవచ్చు కానీ.. దీర్ఘకాలంలో బాకీపై వడ్డీ భారాన్ని తగ్గించడానికి పూర్తి పరిష్కారం కోసం ప్రయత్నించాలి. చెల్లింపులు కష్టమవుతున్నాయని ముందే అర్థమైతే బ్యాంకును సంప్రదించడం మంచిది. సమస్య తీవ్రమయ్యే వరకు వేచి ఉండకుండా.. ఆదాయం ఆగిపోయిన విషయాన్ని వివరించి రుణ పునర్వ్యవస్థీకరణ, కాలపరిమితి పొడిగింపు లేదా అందుబాటులో ఉన్న ఇతర సౌకర్యాల గురించి తెలుసుకోవాలి. ఆలస్యంగా స్పందించడం కంటే ముందుగానే రుణదాతను సంప్రదించడం సాధారణంగా మెరుగైన మార్గం.
ఆరోగ్య బీమా.. నిర్లక్ష్యం వద్దు.. Don’t Let Health Insurance Lapse
ఉద్యోగం పోయినప్పుడు జీతం ఆగిపోవడంతోపాటు(Lost Your Job? Don’t Panic) మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా కోల్పోయే అవకాశం ఉంది. అదే సంస్థ అందించే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. ఉద్యోగి, అతని కుటుంబ సభ్యులకు సంస్థ తరఫున ఆరోగ్య బీమా ఉంటే.. ఉద్యోగ సంబంధం ముగిసిన తర్వాత ఆ రక్షణ కొనసాగుతుందా లేదా అన్నది వెంటనే తెలుసుకోవాలి. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆదాయం లేకపోవడం ఒక ఇబ్బంది అయితే.. బీమా లేకపోవడం మరో పెద్ద ఆర్థిక భారం. ఆసుపత్రి ఖర్చులు ఒక్కసారిగా లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే ఉద్యోగం ఉన్నప్పుడే సొంత ఆరోగ్య బీమా పాలసీ ఉండటం మంచిది. గ్రూప్ పాలసీ నుంచి వ్యక్తిగత పాలసీకి మారే అవకాశం ఉందా? దానికి సంబంధించిన నిబంధనలు ఏమిటి? ప్రీమియం ఎంత ఉంటుంది? ఎంత బీమా రక్షణ లభిస్తుంది? వెయిటింగ్ పీరియడ్ వంటి నిబంధనలు ఎలా ఉంటాయి? అన్నది సంబంధిత బీమా సంస్థతో స్పష్టంగా తెలుసుకోవాలి. ఉద్యోగం పోయిన తర్వాత మాత్రమే బీమా గురించి ఆలోచించడం కంటే.. ఉద్యోగం ఉన్నప్పుడే ప్రత్యామ్నాయ రక్షణ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
పెట్టుబడుల కంటే.. ఇప్పుడు భద్రత ముఖ్యం.. Financial Stability Over Aggressive Investing
ఉద్యోగం కోల్పోయిన సమయంలో కొత్త పెట్టుబడుల(Lost Your Job? Don’t Panic) కోసం పరుగులు తీయడం కంటే.. ఉన్న ఆస్తులను ఎలా కాపాడుకోవాలన్నదే ముఖ్యం. అధిక రాబడుల కోసం రిస్క్ ఉన్న పెట్టుబడుల్లోకి వెళ్లడం, త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఊహాజనిత పెట్టుబడులు చేయడం ప్రమాదకరం. ఆదాయం లేని సమయంలో మనోధైర్యం తగ్గిపోవచ్చు. అదే సమయంలో మార్కెట్లో ఏదైనా మంచి అవకాశం కనిపిస్తే నష్టాన్ని పూడ్చుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి భావోద్వేగ నిర్ణయాలు పరిస్థితిని మరింత క్లిష్టం చేయవచ్చు. అందుకే ఈ దశలో ప్రధాన లక్ష్యం ‘ఎంత సంపాదించాలి?’ కాకుండా ‘ఎంతకాలం ఆర్థికంగా నిలబడగలం?’ అన్నదై ఉండాలి.
కొత్త ఉద్యోగం కోసం.. సమయం పెట్టుబడిగా.. Turn the Break Into an Opportunity
ఉద్యోగం పోయిన తర్వాత(Lost Your Job? Don’t Panic) ఆర్థిక నిర్వహణతోపాటు మరో ముఖ్యమైన పని కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడం. ఈ సమయంలో ఉన్న సమయాన్ని కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. గత ఉద్యోగంలో ఉన్న అనుభవాన్ని బట్టి కొత్త రంగాల్లో అవకాశాలను పరిశీలించాలి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఖర్చులు తగ్గించుకోవడం అవసరమే అయినా.. ఆదాయాన్ని పెంచే మార్గాలపైనా దృష్టి పెట్టాలి. ఫ్రీలాన్స్ పని, కన్సల్టింగ్, పార్ట్‌టైమ్ అవకాశాలు లేదా తెలిసిన నైపుణ్యాలతో తాత్కాలికంగా ఆదాయం పొందే మార్గాలను పరిశీలించవచ్చు. చిన్న ఆదాయం వచ్చినా అది పొదుపును ఎక్కువ కాలం నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది.
ఆందోళన కాదు.. ఆర్థిక క్రమశిక్షణ.. Discipline Can Help You Bounce Back
ఉద్యోగం కోల్పోవడం జీవితానికి (Lost Your Job? Don’t Panic) ముగింపు కాదు. అది ఒక తాత్కాలిక ఆర్థిక సంక్షోభం మాత్రమే కావచ్చు. అయితే ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. అందుకే తొలుత ఆందోళనను పక్కనపెట్టి కుటుంబంతో కలిసి వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలి. నెలవారీ కనీస ఖర్చును గుర్తించాలి. చేతిలో ఉన్న నగదు, సులభంగా ఉపసంహరించుకోగల పెట్టుబడులను లెక్కించాలి. అనవసర ఖర్చులకు కోత పెట్టాలి. అత్యవసర నిధిని జాగ్రత్తగా వినియోగించాలి. రుణాల విషయంలో ముందుగానే బ్యాంకులతో మాట్లాడాలి. ఆరోగ్య బీమా రక్షణకు ప్రత్యామ్నాయం చూసుకోవాలి. అవసరమైతే సిప్‌లను తాత్కాలికంగా నిలిపివేసి పోర్ట్‌ఫోలియో రిస్కును తగ్గించుకోవాలి. ముఖ్యంగా.. ఉద్యోగం కోల్పోయిన పరిస్థితిలో తొందరపడి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక్కసారిగా అన్ని పెట్టుబడులను విక్రయించడం, భారీ రుణం తీసుకోవడం, అధిక రాబడుల పేరుతో తెలియని మార్గాల్లో డబ్బు పెట్టడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి. ఆదాయం ఆగిపోవచ్చు.. కానీ ఆర్థిక ప్రణాళిక ఆగిపోకూడదు. ఉద్యోగం తిరిగి వచ్చే వరకు కుటుంబ అవసరాలను ఎలా నిర్వహించాలో ముందే ప్రణాళిక వేసుకుంటే ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఈ దశలో సహనం, ఖర్చుల నియంత్రణ, రుణాల నిర్వహణ, బీమా రక్షణ, సరైన పెట్టుబడి నిర్ణయాలు.. ఇవే కుటుంబ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తాయి. ఉద్యోగం పోయిందనే వార్త ఒక్కసారిగా షాక్ ఇవ్వొచ్చు. కానీ అదే సమయంలో జీవితంలో మరో అవకాశం కోసం తలుపులు తెరుచుకోవచ్చు. ఆర్థికంగా కొంత కష్టకాలం ఎదురైనా.. క్రమశిక్షణతో వ్యవహరిస్తే దాన్ని దాటడం సాధ్యమే. జీతం ఆగింది కాబట్టి జీవితం ఆగిపోలేదు.. కొత్త ఉద్యోగం వచ్చే వరకు ఆర్థికంగా నిలబడటమే ఇప్పుడు అసలు లక్ష్యం.
