ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. దానికి ఒక రోజు ముందే ప్రభుత్వం ఆర్థిక సమీక్ష (ఎకనామిక్ సర్వే)ను విడుదల చేయడం ఆనవాయితీ. గత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా నడిచింది? ఏ రంగాలు వృద్ధి సాధించాయి? ఎక్కడ లోపాలు కనిపించాయి? అనే అంశాలను సమీక్షించుకున్న తర్వాతే… కొత్త ఏడాది ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. దేశానికే ఇంత విస్తృతమైన ఆర్థిక సర్వే అవసరమైతే… మన ఇంటికీ అవసరం లేదా? ప్రతి కుటుంబం కూడా ఒక చిన్న దేశంలాంటిదే. ఆదాయం, ఖర్చులు, అప్పులు, ఆస్తులు, భవిష్యత్ లక్ష్యాలు… అన్నీ ఉంటాయి. కానీ మనలో చాలామంది రోజువారీ జీవనంలో మునిగిపోయి, తమ ఆర్థిక పరిస్థితిని (Financial Survey)ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఇవ్వరు. ఫలితంగా మనకు తెలియకుండానే ఖర్చులు పెరుగుతాయి, అప్పులు భారమవుతాయి. పొదుపు తగ్గిపోతుంది. అందుకే, ఈ ఒక గంట సమయం కేటాయించి…మీ వ్యక్తిగత ఆర్థిక సర్వే చేసుకోండి. ఈ సమీక్ష మీ భవిష్యత్తును సురక్షితంగా మార్చే తొలి అడుగు కావచ్చు.
ఖర్చులు అధికంగా ఉన్నాయా? ఆదాయాన్ని మించిపోయాయా? Are Your Expenses High? Exceeding Your Income?
ప్రభుత్వానికి ఆదాయాన్ని మించి ఖర్చులుంటే… దాన్ని ద్రవ్యలోటు అంటారు. అప్పుడు ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తుంది. మరి, మీ పరిస్థితి ఎలా ఉంది? ముందుగా గత ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంట్లు, క్రెడిట్ కార్డు బిల్లులు, యూపీఐ చెల్లింపుల వివరాలు ఒకచోట చేర్చండి. ఆ తర్వాత మీ ఖర్చులను రెండు విభాగాలుగా వేరు చేయండి.
1. తప్పనిసరి ఖర్చులు : ఇల్లు అద్దె లేదా హోం లోన్ ఈఎంఐ, విద్యుత్, నీటి బిల్లులు, పిల్లల ఫీజులు, నిత్యావసర సరుకులు, రవాణా ఖర్చులు
2. ఐచ్ఛిక / విలాస ఖర్చులు: బయట భోజనాలు, ఆన్లైన్ షాపింగ్, ఓటిటి, యాప్స్ సబ్స్క్రిప్షన్లు, ట్రావెల్, వినోదం.. ఇప్పుడు వాటిని ఒక్కసారి లెక్క వేసుకోండి. మీ ఆదాయంలో 50 శాతానికి మించి ఖర్చులకే వెళ్తుందా? అలా ఉంటే… మీరు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. అనవసరమైన ఖర్చులను తగ్గించడం తప్పనిసరి. ముఖ్యంగా ఆటో డెబిట్లను ఒకసారి పరిశీలించండి. అవసరం లేని సబ్స్క్రిప్షన్లను వెంటనే నిలిపివేయండి. “డిస్కౌంట్ ఉంది” అనే కారణంతో ఏడాదికి ఒకేసారి చెల్లింపులు చేయడం నిజంగా లాభమా? అనే ప్రశ్నను మీరే మీకు వేసుకోండి.
ఆదాయం… పెరిగిందా? తగ్గిందా? Income… Has It Increased or Decreased?
(Financial Survey)దేశం తన జీడీపీ లెక్కలు వేసుకున్నట్లే… మీరు కూడా మీ వార్షిక ఆదాయం లెక్కించుకోవాలి. గత ఏడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో మీ ఆదాయం ఎంత పెరిగింది? కనీసం 10 శాతం పెరిగిందా? ఎందుకంటే ప్రస్తుతం ద్రవ్యోల్బణం 6–7 శాతం చుట్టూ ఉంది. మీ ఆదాయం అంతకంటే ఎక్కువగా పెరగకపోతే… వాస్తవంగా మీ కొనుగోలు శక్తి తగ్గినట్టే. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆదాయం అంటే కేవలం జీతమే కాదు. పెట్టుబడులపై వచ్చే వడ్డీలు, డివిడెండ్లు, అద్దె ఆదాయం, ఇతర పాసివ్ ఆదాయ వనరులు.. ఇవన్నీ కూడా మీ ఆదాయంలో భాగమే. ఈ పాసివ్ ఆదాయం కాలక్రమేణా పెరుగుతుంటేనే… మనం ఆర్థికంగా ముందుకు సాగుతున్నామనుకోవచ్చు.
ఆస్తులు – అప్పులు .. Assets – Liabilities
(Financial Survey) ప్రభుత్వం తన ఆర్థిక సర్వేలో ఆస్తులు, అప్పులను లెక్క వేసుకున్నట్లే… మీరు కూడా మీ వ్యక్తిగత ఆర్థిక స్థితిని ఒకసారి స్పష్టంగా చూడాలి. ఒక కాగితంపై రెండు కాలమ్స్ వేసుకోవాలి.
ఆస్తులు (Assets): బ్యాంకు ఖాతాలో నిల్వలు, పీఎఫ్, ఈపీఎఫ్, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బంగారం, ఇల్లు, స్థలం
అప్పులు (Liabilities): గృహ రుణం, వాహన రుణం, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు బాకీలు.. ఇప్పుడు మొత్తం ఆస్తుల విలువ నుంచి మొత్తం అప్పులను తీసేయండి. మిగిలిందే మీ నికర విలువ (Net Worth). గత ఏడాదితో పోలిస్తే…మీ నికర విలువ పెరిగిందా? లేదా తగ్గిందా? తగ్గితే… అప్పులు పెరగడం వల్లనా? ఆస్తుల విలువ పడిపోవడం వల్లనా? అప్పుల కారణంగా తగ్గితే మాత్రం… మీరు తప్పకుండా జాగ్రత్త పడాలి. అధిక వడ్డీ ఉన్న రుణాలను ముందుగా తీర్చే ప్రణాళిక వేసుకోవాలి.
పెట్టుబడుల పనితీరు … Investment Performance
దేశ ఆర్థిక సర్వేలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల పనితీరును విశ్లేషిస్తారు. అలాగే… మీరు కూడా మీ పెట్టుబడుల పనితీరును (Financial Survey)ఒకసారి సమీక్షించుకోవాలి. స్టాక్ మార్కెట్ ఇటీవల బాగా పెరిగింది. ఈ కారణంగా మీ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ వాటా 80 శాతానికి మించి పెరిగిందా? అలా ఉంటే… రిస్క్ పెరిగినట్టే. నష్టభయాన్ని తగ్గించుకోవడానికి కొంత లాభాన్ని బుక్ చేయండి. ఆ డబ్బును డెట్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా బంగారంలోకి మార్చండి. ముఖ్యంగా లక్ష్యాల ఆధారంగా పెట్టుబడులు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఉదాహరణకు… అయిదేళ్లలో పిల్లల చదువుకు రూ.10 లక్షలు ఉంచుకోవాలి. పదేళ్లలో ఇల్లు కొనాలనే లక్ష్యాలకు అనుగుణంగా మీ పెట్టుబడుల పనితీరు ఉండేలా సమీక్షించుకోవడానికి ఇదే సరైన సమయం.
రక్షణ కవచం ఉందా? Do You Have a Safety Net?
(Financial Survey)అనుకోని ముప్పులను తట్టుకునే శక్తి ఉందా? అన్నది ఎకనామిక్ సర్వే చూస్తుంది. మరి, మీ కుటుంబానికి ఆసక్తి ఉందా? మొదటిది… అత్యవసర నిధి (Emergency Fund). కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా నిధి ఉండాలి ఉద్యోగం పోయినా, ఆరోగ్య సమస్య వచ్చినా కుటుంబం నిలబడగలగాలి. గత ఏడాది ఈ నిధిని వాడితే… తప్పకుండా మళ్లీ భర్తీ చేయాలి. రెండోది… ఆరోగ్య బీమా. వైద్య ఖర్చులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మీ ఆరోగ్య బీమా కవరేజీ సరిపోతుందా? కుటుంబంలో కొత్తగా చేరిన వారి పేర్లు పాలసీలో చేర్చారా? అన్నది పరిశీలించండి. మూడోది… జీవిత బీమా మీ ఆదాయంపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉంటే… తగినంత జీవిత బీమా ఉండటం తప్పనిసరి.
వ్యక్తిగత ఆర్థిక సర్వే ఎందుకు ముఖ్యమంటే? Why Is a Personal Financial Survey Important?
మీ ఆర్థిక పరిస్థితిని (Financial Survey)ఒకసారి కూడా చూసుకోకపోతే… రేపు మీరు వేసుకునే బడ్జెట్ కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది. ఈ వ్యక్తిగత ఆర్థిక సమీక్ష ద్వారా మీ బలాలు ఏంటో.. బలహీనతలు ఏంటో తెలుస్తాయి. ఎక్కడ సరిదిద్దుకోవాలో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఏదేమైనా దేశానికి బడ్జెట్ ఎంత ముఖ్యమో… మీ ఇంటికి మీ ఆర్థిక సర్వే అంతే ముఖ్యం. మీ ఆర్థిక జీవితాన్ని ఒకసారి నిశితంగా పరిశీలించండి. మీ ఇంటికి మీరే ఆర్థిక మంత్రిగా మారండి. ఆర్థిక ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి.
