ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో కొన్ని వ్యాపారాలు, వృత్తులు, సంస్థలకు ట్యాక్స్ ఆడిట్ తప్పనిసరి (Get Ready for Tax Audit). నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని కేసుల్లో రిటర్నులు దాఖలు చేసుకునే గడువు ముగిసింది. ఇక ఆడిట్ పరిధిలోకి వచ్చే వ్యాపారులు, సంస్థలు తమ లెక్కలు, పుస్తకాలు, రికార్డులు, పన్ను చెల్లింపుల వివరాలను ఒకసారి పూర్తిగా పరిశీలించుకోవాల్సిన సమయం వచ్చింది. ట్యాక్స్ ఆడిట్ అంటే కేవలం లెక్కలు చూసి సంతకం చేయించుకోవడం కాదు. ఏడాది పొడవునా జరిగిన ప్రతి లావాదేవీకి సరైన ఆధారం ఉందా? ఆదాయం, ఖర్చులు, ఆస్తులు, అప్పులు, టీడీఎస్, టీసీఎస్, ఉద్యోగుల చెల్లింపులు, స్టాక్ వంటి అంశాలు పుస్తకాల్లో సరిగ్గా ప్రతిబింబిస్తున్నాయా? అన్నది ఆడిటర్ పరిశీలిస్తారు. అందుకే చివరి నిమిషంలో హడావుడి పడకుండా ముందుగానే ఖాతాలను పూర్తిచేసి, లోపాలు ఉంటే సరిచేసుకోవడం మంచిది.
బుక్స్ పూర్తి చేసి క్లోజ్ చేయండి.. Finalise and Close the Books
2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు జరిగిన వ్యాపార లావాదేవీలన్నీ (Get Ready for Tax Audit)అకౌంట్ బుక్స్‌లో సక్రమంగా నమోదు అయి ఉండాలి. నగదు చిట్టా, బ్యాంకు పుస్తకం, కొనుగోళ్లు, అమ్మకాలు, స్టాక్, డెబిట్ నోట్లు, క్రెడిట్ నోట్లు తదితర రికార్డులను మరోసారి పరిశీలించాలి. ముఖ్యంగా 2025 ఏప్రిల్ 1 నాటి ఓపెనింగ్ బ్యాలెన్స్‌లను ఒకసారి ధృవీకరించుకోవాలి. గత ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చిన ప్రతి ఖాతా బ్యాలెన్స్ సరిగ్గా క్యారీ ఫార్వర్డ్ అయిందా? బ్యాంకు ఖాతాల బ్యాలెన్స్, నగదు నిల్వ, రుణాలు, రుణగ్రహీతలు, రుణదాతల బకాయిలు సరైనవేనా? అన్నది చూడాలి. ఏదైనా ఖాతాలో తప్పు ఎంట్రీ కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆధారాలతో పరిశీలించి సరిచేయాలి. పుస్తకాలను ఒకసారి ఫైనలైజ్ చేసిన తర్వాత మార్పులు చేయాల్సిన పరిస్థితి రాకుండా ముందుగానే అన్ని వివరాలను సరిచూసుకోవడం మంచిది.
టీడీఎస్.. టీసీఎస్ వివరాలు సరిపోవాలి.. Reconcile TDS and TCS Records
ట్యాక్స్ ఆడిట్లో (Get Ready for Tax Audit) టీడీఎస్, టీసీఎస్ వివరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. మీకు చెల్లింపులు చేసిన సంస్థలు లేదా వ్యక్తులు టీడీఎస్ మినహాయించాల్సి ఉంటే.. వారు సరైన మొత్తాన్ని మినహాయించారా? దాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేశారా? సంబంధిత ఫారం 16 లేదా ఫారం 16ఏ ఇచ్చారా? అన్నది పరిశీలించాలి. అంతేకాదు.. టీడీఎస్ రిటర్నులు సకాలంలో దాఖలయ్యాయా? ఆ వివరాలు మీ 26ఏఎస్‌లో ప్రతిబింబిస్తున్నాయా? అన్నది కూడా చూసుకోవాలి. కొన్నిసార్లు మనం పొందిన ఆదాయంపై టీడీఎస్ మినహాయించబడినా.. సంబంధిత పార్టీ రిటర్నులో తప్పు వివరాలు నమోదు చేయడం లేదా టీడీఎస్ జమ చేయకపోవడం వల్ల 26ఏఎస్‌లో సమాచారం కనిపించకపోవచ్చు. అలాంటి తేడాలను ముందుగానే గుర్తించి సంబంధిత చెల్లింపుదారుతో మాట్లాడి సరిచేయించుకోవాలి. టీసీఎస్ విషయంలోనూ ఇదే జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన టీసీఎస్ వసూళ్లు, చెల్లింపులు, చలాన్లు, స్టేట్మెంట్లు అన్నీ ఒకదానితో ఒకటి సరిపోలేలా చూసుకోవాలి.
లెడ్జర్ ఖాతాల్లో తేడాలు ఉండకూడదు.. Match Ledger Balances
వ్యాపార లావాదేవీల్లో లెడ్జర్ ఖాతాలు (Get Ready for Tax Audit)అత్యంత కీలకం. మన బుక్స్‌లో ఒక కస్టమర్ నుంచి రావాల్సిన మొత్తం ఎంతగా ఉందో.. ఆ కస్టమర్ బుక్స్‌లో మనకు చెల్లించాల్సిన మొత్తం కూడా అంతే ఉండాలి. ఇరు పక్షాల ఖాతాల్లో తేడా ఉంటే ఆడిట్ సమయంలో వివరణ ఇవ్వాల్సి రావచ్చు. ముఖ్యంగా పెద్ద మొత్తాల్లో ఉన్న రుణదాతలు, రుణగ్రహీతల బ్యాలెన్స్‌లను ముందుగానే ధృవీకరించుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో ఆదాయపు పన్ను శాఖ అసెస్మెంట్లో భాగంగా నిర్దిష్ట లావాదేవీలకు సంబంధించిన లెడ్జర్ కాపీలు, ధృవీకరణ పత్రాలు కోరవచ్చు. అందుకే కస్టమర్లు, సరఫరాదారులు, రుణదాతలు, రుణగ్రహీతల ఖాతాలను ఒకసారి పూర్తిగా పరిశీలించాలి.
చెల్లించాల్సిన ఖర్చులు.. సరిగ్గా చూపాలి.. Account for Outstanding Expenses
జీతాలు, వేతనాలు, అద్దెలు, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, టెలిఫోన్ బిల్లులు వంటి ఖర్చులు వ్యాపారంలో తరచూ వస్తుంటాయి. కొన్ని ఖర్చులు వెంటనే చెల్లించవచ్చు. మరికొన్ని నెలాఖరులో లేదా నిర్దిష్ట గడువులో చెల్లిస్తారు. 2026 మార్చి 31 నాటికి చెల్లించాల్సిన (Get Ready for Tax Audit)ఖర్చులు ఏమైనా ఉంటే వాటి వివరాలను సరైన రీతిలో లెక్కల్లో నమోదు చేశారా? అన్నది పరిశీలించాలి. ఇప్పటికే చెల్లించిన ఖర్చులు సరైన ఖాతాలో నమోదయ్యాయా? ఒకే ఖర్చు రెండు చోట్ల నమోదు కాలేదా? చెల్లింపు జరిగినా సంబంధిత లెడ్జర్లో కనిపించకపోతే మరో ఖాతాలో తప్పుగా పోస్ట్ అయిందేమో చూడాలి. ఈ చిన్నచిన్న పొరపాట్లే తర్వాత లాభనష్టాల లెక్కల్లో తేడాలకు కారణమవుతాయి.
పీఎఫ్.. ఈఎస్ఐ చెల్లింపులు మర్చిపోవద్దు.. Verify PF and ESI Payments
ఉద్యోగులు ఉన్న సంస్థలు ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ వంటి చెల్లింపుల విషయంలో (Get Ready for Tax Audit)ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. సంబంధిత చట్టాల ప్రకారం నిర్ణయించిన గడువులోగా చెల్లింపులు జరిగాయా? చెల్లించిన మొత్తాలు అకౌంట్స్‌లో సరిగ్గా ప్రతిబింబిస్తున్నాయా? అన్నది పరిశీలించాలి. చెల్లింపులు ఆలస్యం అయితే వాటి పన్ను మినహాయింపు విషయంలోనూ ప్రభావం ఉండొచ్చు. అందుకే నెలనెలా చేసిన పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులను బ్యాంకు స్టేట్మెంట్లు, సంబంధిత చలాన్లు, రికార్డులతో సరిపోల్చుకోవాలి.
రుణాలు.. బకాయిలు స్పష్టంగా ఉండాలి.. Verify Loans and Outstanding Balances
వ్యాపార సంస్థలకు సాధారణంగా (Get Ready for Tax Audit)బ్యాంకు రుణాలు, ఇతర రుణాలు, సరఫరాదారుల బకాయిలు, కస్టమర్ల నుంచి రావాల్సిన మొత్తాలు ఉంటాయి. వీటన్నింటి వివరాలను మార్చి 31 నాటికి ఒకసారి సరిచూసుకోవాలి. ఎవరికి ఎంత చెల్లించాలి? ఎవరినుంచి ఎంత రావాలి? ఏ రుణంపై ఎంత అసలు ఉంది? ఎంత వడ్డీ చెల్లించారు? ఇంకా ఎంత చెల్లించాలి? అన్న వివరాలు స్పష్టంగా ఉండాలి. అలాగే ‘సస్పెన్స్ అకౌంట్’లో పెండింగ్‌లో ఉన్న లావాదేవీలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. లావాదేవీ జరిగినప్పుడు వెంటనే సరైన ఖాతాలో నమోదు చేయలేని సందర్భాల్లో తాత్కాలికంగా సస్పెన్స్ అకౌంట్లో నమోదు చేస్తారు. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీలైనంత వరకు అలాంటి ఎంట్రీలను పరిశీలించి సరైన ఖాతాలకు మార్చాలి.
భాగస్వామ్య సంస్థలైతే మరింత జాగ్రత్త.. Special Care for Partnership Firms
భాగస్వామ్య సంస్థల్లో భాగస్వాముల వ్యక్తిగత ఖాతాలు (Get Ready for Tax Audit) కూడా స్పష్టంగా ఉండాలి. భాగస్వాములకు చెల్లించిన పారితోషికం, వడ్డీ, కమీషన్, వారి సొంత వినియోగానికి తీసుకున్న మొత్తాలు వంటి అంశాలను సరిగ్గా నమోదు చేయాలి. భాగస్వాముల మూలధన ఖాతాలు, కరెంట్ ఖాతాలు, డ్రాయింగ్స్ వంటి వివరాలు ఒప్పందం, బుక్స్, బ్యాంకు లావాదేవీలతో సరిపోలుతున్నాయా? అన్నది పరిశీలించాలి. ఇక్కడ చిన్న తేడా వచ్చినా భాగస్వామ్య సంస్థ పన్ను లెక్కలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఆడిటర్‌కు పుస్తకాలు అప్పగించే ముందు భాగస్వాముల ఖాతాలను పూర్తిగా సరిచూసుకోవడం మంచిది.
స్థిరాస్తులు.. ఫిక్స్డ్ అసెట్స్ మర్చిపోవద్దు.. Check Fixed Assets and Depreciation
వ్యాపార సంస్థకు సంబంధించిన స్థిరాస్తుల వివరాలు (Get Ready for Tax Audit) కూడా ఆడిట్లో ముఖ్యమైనవే. ఏడాదిలో కొత్త యంత్రాలు, కంప్యూటర్లు, వాహనాలు లేదా ఇతర ఆస్తులు కొనుగోలు చేశారా? పాత ఆస్తులు ఏమైనా విక్రయించారా? వాటి విలువ ఎంత? విక్రయం ద్వారా లాభం లేదా నష్టం వచ్చిందా? అన్నది పరిశీలించాలి. స్థిరాస్తులపై వర్తించే తరుగుదల (Depreciation) సరిగ్గా లెక్కించారా? గత ఏడాది నుంచి వచ్చిన ఆస్తుల వివరాలు ఈ ఏడాది పుస్తకాల్లో సరిగ్గా ఉన్నాయా? అన్నది కూడా చూడాలి. ఆస్తుల కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, చెల్లింపు ఆధారాలు, ఒప్పందాలు వంటి పత్రాలను భద్రపరచాలి.
వడ్డీలు.. డివిడెండ్లు.. ఇతర ఆదాయాలు.. Review Other Sources of Income
వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు (Get Ready for Tax Audit)బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ, పొదుపు ఖాతాల వడ్డీ, డివిడెండ్లు, ఇతర ఆదాయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా లెక్కల్లో సరిగ్గా చూపాలి. కొన్నిసార్లు వ్యాపార సంస్థలు ప్రధాన కార్యకలాపాలపైనే దృష్టి పెట్టి బ్యాంకు వడ్డీ లేదా ఇతర చిన్న ఆదాయాలను మర్చిపోతుంటాయి. అయితే పన్ను లెక్కల్లో ప్రతి వర్తించే ఆదాయానికి ప్రాధాన్యం ఉంటుంది. అందుకే బ్యాంకు స్టేట్మెంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికెట్లు, వడ్డీ ధ్రువపత్రాలు, డివిడెండ్ వివరాలను అకౌంట్స్‌తో సరిపోల్చుకోవాలి.
స్టాక్ లెక్కల్లో తేడా వద్దు.. Reconcile Stock Records
వ్యాపారం చేసే సంస్థలకు స్టాక్ వివరాలు (Get Ready for Tax Audit) కీలకం. మార్చి 31 నాటికి ఉన్న స్టాక్ విలువ, బుక్స్‌లో ఉన్న స్టాక్ విలువతో సరిపోవాలి. కొనుగోళ్లు, అమ్మకాలు, రిటర్నులు, నష్టం, పాడైన సరుకు వంటి అంశాలన్నీ స్టాక్ రికార్డుల్లో సరిగ్గా నమోదయ్యాయా? అన్నది పరిశీలించాలి. భౌతికంగా ఉన్న స్టాక్‌కు, పుస్తకాల్లో ఉన్న స్టాక్‌కు భారీ తేడా ఉంటే కారణాన్ని గుర్తించాలి. అవసరమైన చోట సర్దుబాటు ఎంట్రీలు చేయాలి.
పత్రాలన్నీ ఒకచోట సిద్ధంగా ఉంచండి.. Keep All Supporting Documents Ready
ట్యాక్స్ ఆడిట్ సమయంలో (Get Ready for Tax Audit) కేవలం అకౌంట్స్ బుక్ చూపిస్తే సరిపోదు. వాటికి ఆధారంగా ఉన్న పత్రాలు కూడా అవసరం. బిల్లులు, ఇన్వాయిస్లు, వోచర్లు, బ్యాంకు స్టేట్మెంట్లు, పాస్‌బుక్‌లు, టీడీఎస్ చలాన్లు, ఫారం 16, ఫారం 16ఏ, డెబిట్ నోట్లు, క్రెడిట్ నోట్లు, ఒప్పందాలు వంటి పత్రాలను క్రమబద్ధంగా భద్రపరచాలి. డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో బ్యాంకు స్టేట్మెంట్లు, ఆన్లైన్ చెల్లింపుల ఆధారాలు, ఈ-ఇన్వాయిస్లు, ఇతర ఎలక్ట్రానిక్ రికార్డులను కూడా సురక్షితంగా ఉంచుకోవాలి.
ఆడిటర్‌కు అప్పగించే ముందు చివరి తనిఖీ.. Final Review Before Audit
అన్ని పుస్తకాలు పూర్తయ్యాయని భావించిన తర్వాత (Get Ready for Tax Audit)ఒకసారి స్వయంగా సమీక్ష చేసుకోవడం మంచిది. బ్యాంకు బ్యాలెన్స్‌లు, నగదు నిల్వ, రుణాలు, బకాయిలు, స్టాక్, స్థిరాస్తులు, ఆదాయాలు, ఖర్చులు, టీడీఎస్, టీసీఎస్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి అంశాలను పరస్పరం సరిపోల్చుకోవాలి. ఎక్కడైనా తేడా కనిపిస్తే కారణాన్ని గుర్తించి ఆధారాలతో సరిచేయాలి. సందేహాస్పదమైన లావాదేవీలను ఆడిటర్‌కు ముందుగానే తెలియజేస్తే అవసరమైన వివరణలు, పత్రాలను సిద్ధం చేసుకోవచ్చు. ట్యాక్స్ ఆడిట్ అనేది చివరి నిమిషంలో పూర్తి చేసే పని కాదు. ఏడాది పొడవునా నిర్వహించిన లెక్కలను సక్రమంగా ముగించి, ప్రతి లావాదేవీకి ఆధారం సిద్ధంగా ఉంచడమే అసలు సిద్ధత. బుక్స్ నీట్‌గా ఉంటే ఆడిటర్‌కు పరిశీలన సులువవుతుంది. వ్యాపార యజమానికీ భవిష్యత్తులో పన్ను సంబంధిత ప్రశ్నలు వచ్చినప్పుడు సమాధానం ఇవ్వడం సులభమవుతుంది. అందుకే ఇక ఆలస్యం చేయకుండా 2026 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖాతాలను పూర్తిగా క్లోజ్ చేసి, రికార్డులను సరిచూసి, అవసరమైన పత్రాలన్నింటినీ సిద్ధం చేసుకుని.. ఆ తర్వాతే ట్యాక్స్ ఆడిటర్‌కు అప్పగించడం ఉత్తమం.
